వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో గ్రేటర్ పరిధిలో పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం రాత్రి పొద్దుపోయే వరకు జడివాన కురిసింది.
సాక్షి,సిటీబ్యూరో: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో గ్రేటర్ పరిధిలో పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం రాత్రి పొద్దుపోయే వరకు జడివాన కురిసింది. సరూర్‌నగర్‌లో అత్యధికంగా 5.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ ప్రకటించింది. మహేశ్వరంలో 1.7 సెంటీమీటర్లు, శామీర్‌పేట్‌లో ఒక సెంటీమీటరు మేర వర్షపాతం నమోదైందని తెలిపింది. భారీ వర్షం కారణంగా సరూర్‌నగర్ పరిధిలోని పలు కాలనీలు,ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
కాగా సోమవారం మధ్యాహ్నం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు నగరంలో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. రాత్రి 8.30 గంటల వరకు 3.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. సాయంత్రం వేళ కురిసిన వర్షంతో రహదారులపై వరదనీరు పోటెత్తింది. పలు ప్రధాన రహదారులపై గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించడంతో ఉద్యోగులు,విద్యార్థులు,మహిళలు ట్రాఫిక్ రద్దీతో విలవిల్లాడారు. రాగల 24 గంటల్లో నగరంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది.