సాక్షి, విశాఖపట్నం : వాయవ్య బంగాళాఖాతంలో ఒడిశా, పశ్చిమబెంగాల్‌ను ఆనుకుని రెండు రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనం స్థిరంగానే కొనసాగుతోంది. అదే సమయంలో ఒడిశా నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. వీటన్నింటి కారణంగా రాష్ట్రంలో రానున్న 24గంటల్లో ఉత్తర కోస్తాంధ్రలో కొన్ని చోట్ల భారీ వర్షాలు, దక్షిణ కొస్తాంధ్రలోని అక్కడక్కడ విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనాలు చురుకుగానే ఉన్నాయన్నారు. రాష్ట్రంలో ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు కళింగపట్నంలో 5సెం.మీ, సోంపేట, మందసలలో 4, కొమరాడ, నర్సాపురం, పాతపట్నం, టెక్కలి, వీరఘట్టం, బీమునిపట్నం, తెర్లాం ప్రాంతాల్లో 3సెం.మీ చొప్పున వర్షం పడింది.
తెలంగాణలో ఇల్లెందులో 7సెం.మీ, దమ్ముగూడెంలో 6, భద్రాచలంలో 4 సెం.మీ వాన పడింది. మంగళవారం సాయంత్రంలోపు కోస్తాంధ్రలో చాలాచోట్ల, తెలంగాణలో కొన్ని చోట్ల, రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల్లో రానున్న 48గంటల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ హెచ్చరించింది. ఆకాశం మేఘావృతమై ఉంటుంది. గరిష్ట/కనిష్ట ఉష్ణోగ్రతలు కొన్ని చోట్ల 32, 23డిగ్రీలుగా నమోదయ్యే అవకాశాలున్నాయని తెలిపింది.
స్థిరంగా కొనసాగుత్ను అల్పపీడన ద్రోణి
Published Mon, Sep 30 2013 11:13 PM | Last Updated on Fri, Sep 1 2017 11:12 PM
Advertisement
Advertisement