సాక్షి, విశాఖపట్నం : ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. దీని కారణంగా రాష్ట్రంలో రానున్న 24 గంటల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. పై-లీన్ తుపాను ప్రభావం పూర్తిగా తొలగిపోయినట్టేనన్నారు. నైరుతి రుతుపవనాల నిష్ర్కమణ, ఈశాన్య రుతుపవనాల ఆగమనం కాలంలో ఉష్ణోగ్రతల నమోదులో వ్యత్యాసం ఉంటుందని వివరించారు. గురువారం సాయంత్రం లోపు కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది.