వాయువ్య బంగాళాఖాతంలో సముద్రమట్టానికి 1.5 కి.మీ. నుంచి 5.8 కి.మీ. ఎత్తున ఉపరితల ఆవర్తన ద్రోణి ఆవరించి ఉంది
విశాఖపట్నం: వాయువ్య బంగాళాఖాతంలో సముద్రమట్టానికి 1.5 కి.మీ. నుంచి 5.8 కి.మీ. ఎత్తున ఉపరితల ఆవర్తన ద్రోణి ఆవరించి ఉంది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నట్టు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దీంతో నైరుతి రుతుపవనాలు మళ్లీ చురుగ్గా మారి ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు పేర్కొన్నారు.
ఒడిశా నుంచి కోస్తా, తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు, దక్షిణ కోస్తా, రాయలసీమ, తెలంగాణల్లో ఒకటి రెండు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. కోస్తాంధ్రపై గంటకు 45 నుంచి 50 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు.