సాక్షి, విశాఖపట్నం: వాయవ్య బంగాళాఖాతంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్ మధ్య అల్పపీడనం ఏర్పడింది. అదే ప్రాంతంలో సముద్రమట్టానికి 7.6 కి.మీ. ఎత్తున ఉపరితల ఆవర్తనం నైరుతి దిశగా కొనసాగుతోంది. మరోవైపు ఒడిశా నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారాయి. రాగల 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు పేర్కొంది. ఆదివారంనాటికి అల్పపీడనం మరింత బలపడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.