
గురువారం నుంచి గురుకులాలు, కేజీబీవీలకు సెలవులు
తమ తోటి పిల్లలను తల్లిదండ్రులు తీసుకెళ్తుంటే తల్లడిల్లిన విధివంచితులు..
కంటతడి పెడుతూ బాలసదన్‌లకు వెళ్లిన వైనం. పలుచోట్ల ఇవే దయనీయ దృశ్యాలు
వేసవి సెలవులొస్తున్నాయంటే విద్యార్థుల్లో ఉత్సాహం ఉరకలెత్తుతుంటుంది. ఆటలు ఆడుకోవచ్చని, అమ్మానాన్నలు, స్నేహితులతో సరదాగా గడపొచ్చని, బంధువుల ఇళ్లకు వెళ్లవచ్చనే ఉద్దేశంతో సెలవుల కోసం ఎదురుచూస్తుంటారు. కానీ అమ్మా నాన్నలు.. ఆదరించే వారు లేని విద్యార్థుల పరిస్థితి వేరు. గురుకులాలు, కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో (కేజీబీవీ) చదువుకుంటూ, హాస్టళ్లలో ఉండే వారికి వేసవి సెలవులు సమీపిస్తున్నాయంటే దిగులు మొదలవుతుంది. బుధవారం సాయంత్రం వీరికి ఇదే పరిస్థితి ఎదురయ్యింది. గురువారం నుంచి పాఠశాలలకు ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించడంతో ఇలాంటి బాలలంతా బాలసదన్‌లకు చేరుకున్నారు.
నల్లగొండ బాలసదన్‌కు ఇద్దరు బాలికలు
నల్లగొండ జిల్లా తిప్పర్తి మండల కేంద్రంలోని కేజీబీవీలో గోగుల మనీష 9వ తరగతి, ఆంబోతు లక్ష్మి8వ తరగతి చదువుతున్నారు. వారికి తల్లిదండ్రులు లేరు. వారిని తీసుకుపోయేందుకు ఇతరులెవరూ లేకపోవడంతో ఎప్పటిలాగే నల్లగొండలోని బాలసదన్ నిర్వాహకులు వారిని తీసుకెళ్లేందుకు వచ్చారు. బాలసదన్ ఎస్‌వో రాజేశ్వరికి పాఠశాల సిబ్బంది విద్యార్థినులను అప్పగించారు. తమకు అమ్మానాన్నలు లేకపోవడంతో తాము తమ ఇంటికి వెళ్లలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
నాకు తల్లిదండ్రులు లేరు..సంరక్షకులు లేరు: పూజ
నేను చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయా. తెలిసినవారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బాలసదన్‌లో చేర్పించారు. అక్కడే పూర్వ ప్రాథమిక విద్య పూర్తి చేశా. తర్వాత ఆర్మూర్‌మండలంలోని పెర్కిట్ కేజీబీవీలో గతసంవత్సరం ఏడో తరగతిలో చేరాను. ప్రస్తుతం పాఠశాలకు సెలవులు వచ్చాయి. నాకు తల్లిదండ్రులతో పాటు, సంరక్షకులు కూడా ఎవరూ లేక పోవడంతో తిరిగి బాలసదన్‌కే వెళ్తున్నా.
అక్కా, తమ్ముడు, చెల్లి.. తలోచోట...
నిర్మల్ జిల్లా భైంసాకు చెందిన ఓ మహిళ తన భర్తతో విడిపోయి కొన్నేళ్లుగా ఒంటరిగా ఉంటోంది. ఆమెకు ఇద్దరు కూతుళ్లతో పాటు ఓ కుమారుడు ఉన్నారు. ఆ మహిళ ఓ వ్యక్తితో సహజీవనం చేస్తుండగా కొద్దిరోజుల క్రితం వీరిద్దరు దొంగతనం కేసులో అరెస్టయ్యారు. దీంతో పిల్లలు దిక్కులేని వారయ్యారు. పెద్దకూతురు స్థానిక కేజీబీవీలో 8వ తరగతి చదువుతోంది. మరో కుమార్తె కుబీర్ ఆశ్రమ పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది. కుమారుడు వివేకానంద ఆవాసంలో 3వ తరగతి చదువుతున్నాడు. అయితే వేసవి సెలవులు వచ్చినా ఇంటికి వెళ్లలేని పరిస్థితి ఈ ముగ్గురు పిల్లలది. ఓ బాలిక నిర్మల్ బాలసదన్‌కు వెళ్లగా, మరో బాలిక కేజీబీవీ సమ్మర్ క్యాంపు ఉండటంతో అక్కడే ఉండిపోయింది. బాలుడు తాను చదువుతున్న వివేకానంద ఆవాసంలోనే ఉంటున్నాడు. ఇలా వీరు ముగ్గురూ సెలవుల్లోనూ వేర్వేరు చోట్లే ఉండాల్సి వచ్చింది.
అమ్మానాన్నలు లేక బంధువులు ఆదరించక..
అమ్మా నాన్నలు చిన్నతనంలోనే వివిధ కారణాలతో చనిపోవడంతో, బంధు వులు బాలసదన్‌లో చేర్పించడంతో వారి వయసుకు అనుగుణంగా బాలిక లనైతే కేజీబీవీల్లో, బాలురను సంక్షేమ గురుకులాల్లో ప్రభుత్వం చదివిస్తోంది. సెలవుల్లో వీరంతా తాము ఎక్కడ ఏ బాలసదన్‌లో ఉంటున్నారో అక్కడికే వెళ్లిపోవాల్సి ఉంటుంది. మళ్లీ స్కూళ్లు తెరిచాకే వారు హాస్టళ్లకు తిరిగి వచ్చేందుకు వీలవుతుంది. వేసవి సెలవులు ప్రారంభమైన నేపథ్యంలో బుధవారం రాష్ట్రంలో అలాంటి విద్యార్థులంతా తమ తమ బాలసదన్‌లకు చేరుకున్నారు.
ఇదీ చదవండి: ఉద్యోగం కోసం వెళ్లి, 42 ఏళ్లు అక్కడే మగ్గిపోయాడు...చివరికి
ఆవేదనలో అనాథ విద్యార్థులు
హాస్టళ్లలో ఉన్న ఇతర పిల్లలను వారి అమ్మానాన్నలు వచ్చి తీసుకెళుతుంటే దీనంగా చూడటం ఈ అనాథ పిల్లల వంతయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లోని గురుకులాలు, కేజీబీవీల్లో ఇలాంటి దృశ్యాలు కన్పించాయి. తమ కోసం ఎవరూ లేరనే ఆవేదన కొంచెం ఎదిగిన పిల్లల్లో స్పష్టంగా కన్పించింది. అప్పటివరకు స్కూల్లో చదువుకుంటూ, హాస్టళ్లలో తోటి విద్యార్థులతో సరదాగా గడిపిన వీరంతా బిక్క మొహాలు వేయడం ఇతర పిల్లల తలిదండ్రులను కదిలించింది. ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితి వారిని ఆవేదనకు గురి చేసింది. తమ పిల్లలు వారికి ఉత్సాహంగా బై బై చెబుతుంటే వారి గుండెలు బరువెక్కాయి. ఈ సందర్భంగా కొందరు అనాథ పిల్లలు కంట తడి పెట్టడంతో తోటి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అక్కడి సిబ్బంది, బాలసదన్‌ల నిర్వాహకులు కూడా కంట తడి పెట్టారు. నిర్మల్ జిల్లాలో బైంసా మండల కేంద్రంలో వేర్వేరు స్కూళ్లలో చదువుతున్న ముగ్గురు పిల్లలకు సెలవులు వచ్చినా.. అమ్మా నాన్నలు లేక, తీసుకెళ్లేవారు లేక సెలవుల్లోనూ వేర్వేరు ప్రాంతాల్లో ఉండి కలుసుకోలేని పరిస్థితి కదిలించింది. అయితే తల్లిదండ్రులు లేని కొందరు విద్యార్థులను వారి సంరక్షకులుగా ఉన్న బంధువులు తీసుకెళ్లడం కన్పించింది.
చదవండి: ఒక్కో బనానా రూ.565, బీర్ ధర రూ. 1,697, ఎక్కడో తెలుసా?
-సాక్షి ప్రతినిధి, నల్లగొండ