orphan children
-
ఫ్రీ హెయిర్ కటింగ్
సాక్షి, హైదరాబాద్: సాధారణంగా సెలూన్ అనగానే మంగళవారం సెలవు. ఆ రోజు ఎక్కడా షాప్ తెరవరు. ఆ రోజు సెలూన్ నిర్వాహకులందరికీ హాలీడే.. జాలీడే.. కానీ ఇబ్రహీంపటా్ననికి చెందిన రాకేశ్ చేరియాలకు మాత్రం ఆ రోజు అత్యంత బిజీడే.. ఆ రోజున పెద్దఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. అనాథ శరణాలయాల్లోని పిల్లలు, వృద్ధాశ్రమాల్లోని వృద్ధులకు ఉచితంగా కటింగ్ చేస్తున్నాడు. వారికి చేతనైనంత ఆహారం తయారుచేసి వారి కడుపు నింపుతున్నాడు. నలుగురికి సాయం చేయాలన్న ఆలోచన ఉంటే చాలు.. డబ్బుతో సంబంధం లేకుండా ఎంతోమందికి కళ్లలో ఆనందం చూడొచ్చు అని నిరూపిస్తున్నాడు. అతడు చేస్తున్న సేవా కార్యక్రమాలతో స్ఫూర్తి పొంది మరికొందరు ఆయన బాటలో నడుస్తున్నారు. దాదాపు 35 మంది ఆయనతో కలిసి సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నారు. ఆ సంఘటనతో కదిలి.. మనం ఎలాంటి పరిసరాల్లో ఉంటే అలాంటి అలవాట్లే వస్తాయంటారు పెద్దలు. ఇంటి ముందు ఓ పెద్దాయన తనకు వచ్చే రేషన్ బియ్యంలో మిగిలినవి సమీపంలోని అంధుల వసతి గృహంలో ఇచ్చేవాడట. ఈ విషయం గమనించిన రాకేశ్.. తాను కూడా ఏదో ఒకవిధంగా వారికి సేవ చేయాలనే ఆలోచన వచి్చంది. అలా ఒకరోజు ఆ పాఠశాలకు వెళ్లగా, అక్కడున్న పిల్లలు తమకు స్టైల్ హెయిర్ కటింగ్ చేయించాలని అడిగారట. అప్పటి నుంచి ప్రతి మంగళవారం ఆ వసతి గృహానికి వెళ్లి అవసరం ఉన్న వారికి కటింగ్ చేస్తున్నాడు.రాకేశ్‌ను చూసి మరో నలుగురు.. రాకేశ్ చేస్తున్న సేవలు చూసి ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు దుర్గాప్రసాద్, శ్రీకాంత్, అరుణ్, శ్రవణ్ అనే నలుగురు తోటి స్నేహితులు ముందుకొచ్చారు. కొంతకాలానికి ఇంకొందరు వీరితో జాయిన్ అయ్యారు. ఇలా ఇప్పుడు దాదాపు 35 మంది కలిసి పలు అనాథాశ్రమాల్లో పిల్లలకు, వృద్ధాశ్రమాల్లోని వారికి కటింగ్ చేయడంతో పాటు వారికి ఆహారం అందజేస్తున్నారు. ఫేస్బుక్, వాట్సాప్‌లలో గ్రూపులు ఏర్పాటు చేసుకుని అవసరమైన వాళ్ల సమాచారం షేర్ చేసుకుంటున్నారు. ఎవరు అందుబాటులో ఉంటే వాళ్లు అక్కడికి వెళ్లి కటింగ్ చేస్తున్నారు. ఇలా వీ ఫర్ ఆర్ఫన్స్ ఫౌండేషన్ పేరుతో రాకేశ్ సేవా కార్యక్రమాలు చేపడుతున్నాడు. అలాగే తలసేమియా బాధితులకు కూడా అప్పుడప్పుడూ క్యాంపు ఏర్పాటు చేసి రక్తదానం చేస్తూ పెద్ద మనసును చాటుకుంటున్నారు.ఉచితంగా హెయిర్ కటింగ్, చేతనైనంత ఆహారం వీ ఫర్ ఆర్ఫన్స్ పేరుతో సేవాభావం చాటుతూ.. -
మంచు మనోజ్ దంపతుల గొప్పమనసు.. ప్రెగ్నెన్సీ తర్వాత తొలిసారి!
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ గతేడాది వివాహాబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు చెందిన భూమా మౌనికను ఆయన పెళ్లాడారు. ఇటీవలే త్వరలో తాను తండ్రి కాబోతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం తన భార్య మౌనిక ప్రెగ్నెన్సీతో ఉందనే విషయాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. అయితే మనోజ్ సినిమాలతో పాటు సామాజిక సేవలోనూ ముందు వరుసలో ఉంటారు. అనాథ ఆశ్రమాల విద్యార్థులకు సాయం చేస్తుంటారు. తాజాగా మరోసారి మంచు మనోజ్ దంపతులు గొప్ప మనసును చాటుకున్నారు. మౌనిక ప్రెగ్నెన్సీ ధరించిన తర్వాత తొలిసారిగా మనోజ్ దంపతులు అనాధాశ్రమాన్ని సందర్శించారు. అక్కడ ఉన్న విద్యార్థులకు భోజనాలు ఏర్పాటు చేశారు. అంతే కాకుండా దగ్గరుండి విద్యార్థులకు భోజనం వడ్డించారు. ఇది చూసిన అభిమానులు మీరు గ్రేట్ అన్నా అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. మనోజ్ ప్రస్తుతం ఓ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. View this post on Instagram A post shared by Kamlesh Nand (work) (@artistrybuzz_) -
అనాథ పిల్లలకు అండగా
సాక్షి, హైదరాబాద్: ప్రతి ఏటా తన పుట్టినరోజు సందర్భంగా వినూత్న సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు 47వ పుట్టినరోజు సందర్భంగా ఈ ఏడాది అర్థవంతంగా జరుపుకోవాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో యూసుఫ్‌గూడాలో ఉన్న స్టేట్ హోమ్‌లోని అనాధ పిల్లలకు అండగా నిలవాలనుకుంటున్నట్లు ప్రకటించారు. గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా 10, 12వ తరగతుల్లో ప్రతిభావంతులైన 47 మంది పిల్లలకు, ప్రొఫెషనల్ కోర్సుల నుంచి మరో 47 మంది పిల్లలకు వ్యక్తిగతంగా అండగా ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. ఈ విద్యార్థులందరికీ ఉచితంగా ల్యాప్ టాప్‌లు అందిస్తానని తెలిపారు. వారి బంగారు భవిష్యత్కై బెస్ట్ ఇన్స్టిట్యూట్ ద్వారా రెండేండ్ల పాటు అత్యుత్తమ కోచింగ్ ఇప్పిస్తానని స్పష్టం చేశారు. కాగా, తన పుట్టినరోజు సందర్భంగా ఎవరికి తోచిన మార్గంలో వారు అనాథ పిల్లలకు సహాయం చేయాలని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను కోరుతున్నానని కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు. నేడు వెయ్యిమంది రక్తదానం మంత్రి కేటీఆర్ 47వ జన్మదినం సందర్భంగా సోమవారం ఖాజాగూడలోని దివ్యశ్రీ ఎన్ఎస్ఎల్ ఐటీ పార్క్‌లో సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తెలంగాణ ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఐటి టవర్లలో పనిచేసే దాదాపు 1000 మంది టెక్కీలు రక్తదానం ఇవ్వనున్నారు. -
ఆదిపురుష్ రిలీజ్.. మనోజ్ చేసిన పనికి ప్రశంసలు
ప్రభాస్ ఆదిపురుష్ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. సినిమా విడుదల రోజు ఎక్కడా చూసిన జై శ్రీరామ్ నినాదాలే వినిపించాయి. అయితే ఈ సినిమాకు ఇప్పటికే ఆదిపురుష్ టీం కొందరికి ఉచితంగా టికెట్స్ అందిస్తున్నట్లు కూడా ప్రకటించింది. ఇవాళ ఆదిపురుష్ విడుదల సందర్భంగా టాలీవుడ్ దంపతులు మంచు మనోజ్- భూమా మౌనిక చేసిన పనికి ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇంతకీ ఈ జంట ఏం చేశారో తెలుసుకుందాం. (ఇది చదవండి: సినిమా బాలేదన్నందుకు చితక్కొట్టిన ఫ్యాన్స్.. వీడియో వైరల్) ఇటీవలే మంచుమనోజ్ తన పుట్టిన రోజులు వేడుకలను అనాథాశ్రమంలో జరుపుకున్న సంగతి తెలిసిందే. వారందరికీ పుస్తకాలు, బ్యాగులు అందజేసి తన గొప్ప మనసును చాటుకున్నారు. తాజాగా ఆదిపురుష్ రిలీజ్ సందర్భంగా అనాథ పిల్లలతో కలిసి మంచు మనోజ్- మౌనిక సినిమాను వీక్షించారు. పిల్లల కోసం టికెట్స్ మంచు మనోజ్ కొనుగోలు చేశారు. ప్రసాద్ ఐమాక్స్‌లో అనాథ పిల్లలతో కలిసి సినిమా చూస్తున్న ఫోటోలు నెట్టింట్లో వైరలవుతున్నాయి. అలాంటి వారి కోసం మనోజ్ దాదాపు 2500 టికెట్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం. దీంతో మంచు మనోజ్ చేసిన పనికి ప్రభాస్ ఫ్యాన్స్ సైతం అభినందిస్తున్నారు. Our 𝐑𝐨𝐜𝐤𝐢𝐧𝐠 𝐒𝐭𝐚𝐫 @HeroManoj1 & @BhumaMounika spread joy today as they watched the #Prabhas' blockbuster #Adipurush with orphanage kids. ❤️ Their kind gesture brought smiles to the faces of the children,creating a memorable experience for the kids !#ManchuManoj #RSMM pic.twitter.com/hr9eLezv1k — Rocking Star ManojManchu Fan zone (@RSMMFanZone) June 16, 2023 -
అనాథ పిల్లలతో కలిసి బర్త్ డే చేసుకున్న టాలీవుడ్ హీరో
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ గొప్ప మనసును చాటుకున్నారు. ఇవాళ తన పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్‌లో అనాథ శరణాలయాన్నిసందర్శించారు. కుత్బుల్లాపూర్, గాజుల రామారంలోని కేర్ అండ్ లవ్ చిన్నారులతో కలిసి తన బర్త్ డే వేడుకలు జరుపుకున్నారు. కాసేపు చిన్నారులతో ముచ్చటించారు. (ఇది చదవండి: నాగార్జున మేనకోడలితో యంగ్ హీరో అడివి శేష్ పెళ్లి..!) పిల్లలతో కాసేపు సరదాగా గడిపిన మనోజ్.. అనంతరం వారికి నోట్ పుస్తకాలు, బొమ్మలు, బ్యాగ్స్, స్వీట్స్ పంపిణీ చేశారు. తన పుట్టిన రోజు వేడుకలను చిన్నారుల మధ్య చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని మంచు మనోజ్ అన్నారు. అనాథ పిల్లలతో మనోజ్ బర్త్ డే జరుపుకోవడాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు. మనోజ్ మాట్లాడుతూ.. 'పిల్లల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. భవిష్యత్తులో పిల్లలకు మరిన్ని సేవలు అందిస్తా. వారి కళ్లలో ఆనందం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ' అని అన్నారు. (ఇది చదవండి: తిండి లేక కేవలం నీళ్లు తాగి కడుపు నింపుకున్నా: విలన్ గంగరాజు) -
ఇది నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది: శ్రీలీల
ఇండస్ట్రీలో ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతున్న హీరోయిన్ శ్రీలీల. పెళ్లిసందD సినిమాతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ ధమాకా సూపర్ హిట్‌తో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్గా మారిపోయింది. అందానికి తోడు అదృష్టం కూడా తోడైనట్లు ఈ సినిమా హిట్‌తో శ్రీలీల క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. సీనియర్ హీరోల దగ్గర్నుంచి యంగ్‌స్టర్స్ కూడా ఆ బ్యూటీతో జతకట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ అమ్మడు కేవలం గ్లామర్‌తోనే కాదు సమాజ సేవలోనూ ముందుంటోంది. తాజాగా ఓ అనాథ ఆశ్రమాన్ని సందర్శించిన శ్రీలీల వారితో కలిసి సందడి చేసింది. చిన్నారులతో సరదాగా ఆడి పాడింది. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేసింది ముద్దుగుమ్మ. అవి కాస్తా సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. చిన్నారులతో కలిసి ఉన్న ఫోటోలు పంచుకున్న శ్రీలీల ఓ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది. ఈ రోజు నా జీవితంలో మరపురాని రోజుగా నిలిచిపోతుందని తెలిపింది. జీవితంలో ఇలాంటివి చాలా విలువైనవిగా నిలుస్తాయని అన్నారు. శ్రీలీల తన ఇన్‌స్టాలో రాస్తూ.. ' ఇదే నా చిన్న సమూహం. పెద్ద కలలతో ఉన్న నా చిన్న పిల్లలు. ఈ క్షణాలు చాలా విలువైనవని వారిని చూసే వరకు మీకు తెలియదు. నా జీవితంలో సంతోషంగా గడిపిన రోజు ఇదే. వారితో, కథలు, డ్యాన్స్, పాటలు, ప్రేమతో ఒకరినొకరు ముంచెత్తడం. ప్రేమతో నిండిన హృదయంతో వారితో ఉండడం నాకు జీవితాతం గుర్తుండిపోతుంది. వారు తమ అందమైన చిన్న చిరునవ్వులతో నన్నుచూసి పొంగిపోయారు. మీలో ప్రతి ఒక్కరూ ఇలాంటి సందర్భాన్ని అనుభవించాలని కోరుకుంటున్నారని నాకు తెలుసు. అది సాధ్యమేనని నన్ను నమ్మండి. చాలా సార్లు ప్రజలు ఇతరుల కోసం ఉండాలని కోరుకుంటారు కానీ వారికి దిశా నిర్దేశం లేదు. వారికి ఏం చేయాలో... ఎలా చేయాలో తెలియదు.' అంటూ రాసుకొచ్చింది. శ్రీలీల ఇన్‌స్టాలో రాస్తూ..' అంతా మీ చేతుల్లోనే ఉంది - ఒక్క ట్యాప్, ఒక్క గూగుల్ సెర్చ్ మీ చుట్టూ ఉన్న అందమైన పిల్లలను ఆరా తీయండి. ఇది చూసి మీరు విపరీతమైన విరాళాలు ఇస్తారని నేను ఆశించట్లేదు. కానీ నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, మీకు అత్యంత విలువైన సమయం, మీ ప్రేమ వారికి పంచండి. వారికి కావలసింది అదే.. వారానికి లేదా నెలకు ఒకసారి వారితో భోజనం చేస్తూ సమయాన్ని వెచ్చించండి. ఇది కడుపు నింపడమే కాదు, వారి హృదయాలను నింపుతుంది. నిండు మనసుతో #Hereforyouను ప్రారంభిద్దాం. మీరు అనాథాశ్రమాన్ని లేదా అలాంటి ఏదైనా సంస్థను సందర్శించినప్పుడల్లా ఒక చిత్రాన్ని పోస్ట్ చేసి, #Hereforyouని ట్యాగ్ చేయండి. మీ చిత్రాలను చూడటానికి నేను ఎదురు చూస్తున్నా. దీన్ని కలిసి చేద్దాం. చేయి చేయి కలిపి ##Hereforyou.' అంటూ రాసుకొచ్చింది. అనాథ అశ్రమంలోని పిల్లలను కలిసి శ్రీలీల ప్రతి ఒక్కరూ మీ విలువైన సమయాన్ని ఒక్కసారైనా కేటాయించండి అంటూ అభిమానులను కోరింది. View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) -
అనాథ పిల్లల సంరక్షణ బాధ్యత ప్రభుత్వానిదే
సాక్షి, హైదరాబాద్: అనాథ పిల్లల సంరక్షణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని, ఇందుకు ప్రత్యేక విధానాన్ని ప్రకటించాలని ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ డిమాండ్ చేశారు. పలు వేదికలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు ప్రత్యేక విధానంపై పలు వాగ్ధానాలు చేసినా కార్యాచరణ లేదని ఆయన మండిపడ్డారు. అనాథ పిల్లల సంరక్షణ చర్యలపై ప్రభుత్వం విధివిధానాలు ప్రకటించి ప్రత్యేక గుర్తింపు కార్డులు, కేజీ టు పీజీ ఉచిత విద్య తదితర అంశాలపై స్పష్టత ఇవ్వాలని కోరుతూ ఈనెల 30న ఇందిరాపార్క్ వద్ద దీక్ష నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. -
అమ్మ మనసు.. మా దగ్గర పెరిగిన అమ్మాయిని పెళ్లి చేసుకునే వాళ్లకు కొన్ని కండిషన్లు!
మన జీవితాన్ని మనం రాసుకుంటామా? మరెవరైనా రాస్తారా? యాగ్నెస్ నుదుటిన మదర్ థెరిసా అనే మకుటాన్ని చేర్చింది ఎవరు? అనుకోకుండా ఓ రోజు... నిర్మల అనే యువతి నలుగురు పిల్లలకు అమ్మ కావాలని రాసింది ఎవరు? యాభై ఏళ్లు వచ్చే లోపే డెబ్బై మంది పిల్లలకు తల్లయింది గూడపాటి నిర్మల. మరో ముగ్గురు పాపాయిలకు అమ్మమ్మ కూడా. గుడివాడలో పుట్టిన నిర్మలది ఆంగ్లో ఇండియన్ నేపథ్యం ఉన్న కుటుంబం. హైదరాబాద్, మోతీనగర్‌లో జీవోదయ హోమ్ ఫర్ చిల్డ్రన్‌లో నలభై మంది పిల్లలతో సాగుతోంది ఆమె జీవితం. అమ్మకు వైద్యం కోసం 2006లో హైదరాబాద్ వచ్చినప్పుడు ఆమె ఊహకు కూడా అందని విషయం ఇది. అలాంటి ఏ మాత్రం ఊహించని విషయాలు తన జీవితంలో ఎన్నో జరిగాయన్నారు నిర్మల. తాను ఒక డైరెక్షన్ అనుకుంటే తన ప్రమేయం లేకుండా ఏదో ఓ సంఘటన తన మార్గాన్ని మలుపు తిప్పుతూ వచ్చిందని చెప్పారామె. నాటి రైలు ప్రయాణం ‘‘అమ్మానాన్నలు స్కూల్ హెడ్మాస్టర్లు. ముగ్గురమ్మాయిల్లో పెద్దమ్మాయిని. ఇంటర్ తర్వాత లా చదవాలనేది నా కోరిక. అయితే ఆ సెలవుల్లో ట్రైన్లో ప్రయాణిస్తున్నప్పుడు ఓ సంఘటన... నా తోటి ప్రయాణికులు మాతోపాటు రైల్లో ప్రయాణిస్తున్న ఇద్దరు లెప్రసీ పేషెంట్లను నిర్దాక్షిణ్యంగా ప్లాట్‌ఫామ్ మీదకు తోసేశారు. ‘అదేంటి, అలా చేశారు’ అని అడిగితే ‘ఇదెవత్తో పిచ్చి పిల్లలా ఉంద’ని నన్ను ఈసడించుకున్నారు కూడా. అప్పటికి నాకు లెప్రసీ అంటే ఏమిటో తెలియదు. ఇంటికి వెళ్లి మా తాతయ్యను అడిగినప్పుడు వాళ్ల జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో చెప్పారాయన. అప్పుడు డిగ్రీకి చెన్నైకి వెళ్లి లెప్రసీ సంబంధిత కోర్సు చేశాను. అలాగే టీబీ, హెచ్ఐవీ నిర్మూలన సర్వీస్ కోర్సులు చేశాను. అమ్మ కోసం హైదరాబాద్‌కి వచ్చిన తర్వాత ఓ ఆంగ్లో ఇండియన్ ఎంఎల్ఏ సూచనతో బోరబండ, పర్వత్ నగర్లో ఉన్న లెప్రసీ కాలనీలో సర్వీస్ మొదలు పెట్టాను. ఓ రోజు మాదాపూర్‌లో మాణింగ్ వాక్ చేస్తున్నప్పుడు నా కళ్ల ముందు ఓ దుర్ఘటన. ఓ తల్లిదండ్రులు ఆటో స్టాండ్ దగ్గర లగేజ్‌తో ఉన్నారు. వాళ్ల నలుగురు పిల్లల్ని అప్పుడే రోడ్డుకు ఒక పక్కగా ఉంచి, తల్లిదండ్రులు సామాను ఆటో దగ్గరకు తీసుకువెళ్తున్నారు. ఇంతలో పెద్ద పెద్ద బండరాళ్లతో ఓ లారీ... రాంగ్‌సైడ్ వచ్చి వాళ్లను ఢీకొట్టింది. తల్లిదండ్రులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం తెలుసుకుని ప్రాణాలు కోల్పోయిన వారి తల్లిదండ్రులు వచ్చారు. అంటే... నలుగురు చిన్న పిల్లల అమ్మమ్మ – తాత, నానమ్మ –తాతలన్నమాట. వాళ్లు ఆ పిల్లలను చూస్తూ ‘నష్టజాతకులు’ అని ఓ మాట అనేసి తమకేమీ పట్టనట్లు వెళ్లిపోయారు. లెప్రసీ కాలనీ సర్వీస్‌తో అప్పటికే ఆ పీఎస్ పరిధిలోని పోలీసులు పరిచయం అయ్యారు. వారు ఆ పిల్లలను స్టేట్ హోమ్‌లో చేర్చే బాధ్యత నాకప్పగించారు. నలుగురు పిల్లలకు గార్డియన్‌గా నేనే సంతకం చేసి స్టేట్‌హోమ్‌లో చేర్చాను. అయితే... ఆ బాధ్యత అంతటితో తీరలేదు. స్టేట్ హోమ్ నుంచి ఫోన్ కాల్ ఆ నలుగురు పిల్లల్లో పెద్దమ్మాయి లైన్లో ఉంది. ‘అమ్మా! మమ్మల్ని హోమ్‌లో చేర్చేటప్పుడు మీరు సంతకం చేశారట. హోమ్ వాళ్లు మమ్మల్ని బయటకు పంపించాలన్నా కూడా మీరే సంతకం చేయాలట. మీరు వచ్చి సంతకం చేస్తే మేము బయటకు వెళ్లిపోతాం. ఇక్కడ ఉండలేం’ ఇదీ ఆ ఫోన్ సారాంశం. ఎక్కడికి వెళ్తారు. నీకు పదేళ్లు కూడా లేవు. ఇద్దరు తమ్ముళ్లు, చెల్లికి ఏడాది కూడా నిండలేదు. వాళ్లను నువ్వు ఎలా చూసుకుంటావని అడిగితే సమాధానం లేదు. ‘ఎక్కడికో ఒక చోటకు వెళ్లిపోతాం, ఇక్కడ మాత్రం ఉండలేం’ అదే మంకుపట్టు. అప్పుడు పోలీసుల నుంచి ఓ రిక్వెస్ట్. ఆ పిల్లలను మీరు సంతకం చేసి బయటకు తీసుకురాకపోతే గోడదూకి వెళ్లిపోతారు. ఆ పోవడం రోడ్డు మీదకే. సిగ్నళ్ల దగ్గర బెగ్గర్‌గా మారిపోతారు. వాళ్లను దగ్గర పెట్టుకుని చదివించే మార్గం చూడమన్నారు. దాంతో వాళ్లను మా ఇంటికి తీసుకువచ్చాను. ఆలా ఆ రోజు నలుగురు పిల్లలకు అమ్మనయ్యాను. చంటిబిడ్డను చూసుకోవడానికి మా ఊరి నుంచి ఒక డొమెస్టిక్ హెల్పర్‌ను పిలిపించుకున్నాను. ఆ తర్వాత పోలీసుల నుంచి తరచూ ఓ ఫోన్. అమ్మానాన్నలకు దూరమైన పిల్లల్లో పోలీసుల దృష్టికి వచ్చిన వాళ్లను తెచ్చి వదిలిపెట్టసాగారు. అలా మూడు నెలలకు నా ఇల్లు ఇరవై మంది పిల్లల ఇల్లయింది. అంతమంది పిల్లలను ఇంట్లో ఉంచడానికి ఇంటి ఓనరు అభ్యంతరం చెప్పడంతో పూర్తి స్థాయి హోమ్ ప్రారంభించాను. ఇప్పుడు మా హోమ్ నుంచి మొత్తం డెబ్బై మంది పిల్లలు సహాయం పొందుతున్నారు. నలభై మంది ఈ హోమ్‌లో ఉన్నారు. పన్నెండు మంది అబ్బాయిలు విజయవాడలో ఉన్నారు. ఎనిమిది మంది సెమీ ఆర్ఫన్లకు ఈ హోమ్ నుంచే భోజనం వెళ్తుంది. వాళ్లకు తల్లి మాత్రమే ఉంటుంది. ఆమెకు తన పిల్లల్ని పోషించడానికి, చదివించడానికి శక్తి లేని పరిస్థితుల్లో పిల్లల చదువులు, భోజనం, దుస్తులు అన్నీ మా హోమ్ చూసుకుంటుంది. పిల్లలు మాత్రం ఉదయం వాళ్ల ఇంటి నుంచి స్కూలుకు వస్తారు, రాత్రికి తల్లి దగ్గరకు వెళ్లిపోతారు. ఇక కాలేజ్‌కెళ్లే వాళ్ల విషయానికి వస్తే... ఎనిమిది మంది ఇంటర్, ఒక అమ్మాయి డిగ్రీ చదువుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇరవై మంది నర్సింగ్, పాలిటెక్నిక్ చేస్తున్నారు. ఐదుగురు కర్నాటకలో మెడిసిన్, సాఫ్ట్వేర్ కోర్సుల్లో ఉన్నారు. మొదట నేను ఇంటికి తెచ్చుకున్న ఆ నలుగురు పిల్లల్లో పెద్దమ్మాయి, సంతకం చేస్తే వెళ్లిపోతానని ఫోన్ చేసిన అమ్మాయి కూడా ఇప్పుడు కర్నాటకలో మెడిసిన్ చేస్తున్న వాళ్లలో ఉంది. మా పిల్లల్లో ముగ్గురు పూనా, వైజాగ్, బెంగళూరుల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వాళ్లు ఒక్కొక్కరూ నలుగురు పిల్లల చదువు బాధ్యత తీసుకున్నారు. వాళ్లు ముగ్గురూ పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నారు. ప్రసవాలు కూడా మా హోమ్‌లోనే. ఆ పిల్లలు నన్ను ‘అమ్మమ్మ’ అంటారు. ఆ చిన్న పిల్లలకు నలభై మంది పిన్నమ్మలు. మాది జగమంత కుటుంబం’’ అన్నారు నిర్మల తన పిల్లల మధ్య కూర్చుని వాళ్లను ముద్దు చేస్తూ. నిర్మల ఆఫీసు గదిలో గోడకు మదర్ థెరిసా ఒక బిడ్డను ఎత్తుకున్న ఫొటో ఉంది. ఈ మదర్... చుట్టూ పిల్లలతో ఆ మదర్‌కు మరోరూపంగా కనిపించింది. మా దగ్గర పెరిగిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చే వాళ్లకు కండిషన్లుంటాయి. వాళ్లను ఉద్యోగం మాన్పించకూడదు. పెళ్లికి ముందే కొంత మొత్తం అమ్మాయి పేరు మీద డిపాజిట్ చేయాలి. అనాథ అని సంబోధించరాదు. అలాగే తమ అభ్యుదయ భావాలను సమాజం ముందు ప్రదర్శించుకోవడానికి ‘అనాథను పెళ్లి చేసుకున్నాను’ అని చెప్పుకోరాదు. పాట నడిపేది నేను సింగర్‌ని. పాటలు పాడడం ద్వారా మంచి రాబడి ఉండేది. దాంతో హోమ్ నడపడం ఏ మాత్రం కష్టం కాలేదప్పట్లో. థైరాయిడ్ సమస్యతో గొంతుకు ఆపరేషన్ అయింది. ఇప్పుడు పాడలేను. ప్రధాన ఆదాయ వనరు ఆగిపోయింది. పిల్లలకు దుస్తులు, భోజనం వరకు ఇబ్బంది లేదు. మా హోమ్‌ని చూసిన వాళ్లు వాటిని విరాళంగా ఇస్తుంటారు. బర్త్‌డేలు మా పిల్లలతో కలిసి చేసుకోవడం కూడా మాకు బాగా ఉపకరిస్తోంది. స్కూలు, కాలేజ్ ఫీజులు, ఇంటి అద్దెకు మాత్రం డబ్బుగా కావాల్సిందే. డబ్బుగా ఇస్తే దారి మళ్లుతుందేమోననే సందేహం ఉంటుంది. నేను అభ్యర్థించేది ఒక్కటే. నా చేతికి డబ్బు ఇవ్వవద్దు. ఈ పిల్లలకు పుస్తకాలు కొనివ్వడం, స్కూల్కెళ్లి ఫీజులు చెల్లించడం స్వయంగా వారే చేయవచ్చు. ఏడాది పాటు ఒక బిడ్డను చదివించవచ్చు. మనసుంటే మార్గాలూ ఉంటాయి. – గూడపాటి నిర్మల, జీవోదయ హోమ్ ఫర్ చిల్డ్రన్ నిర్వహకురాలు – వాకా మంజులారెడ్డి ఫొటోలు: నోముల రాజేశ్ రెడ్డి -
నాన్న తిరిగొచ్చాడు..! నెల్లూరు చిన్నారుల ఆనందం..
సాక్షి, అమరావతి బ్యూరో: మద్యం మత్తులో విజయవాడ రైల్వేస్టేషన్లో పిల్లలను వదిలివెళ్లిన తండ్రి తిరిగి వారి చెంతకు చేరాడు. తండ్రిని చూసిన ఆ చిన్నారులు నాన్నా! అంటూ ఆనందంతో ఉప్పొంగారు. పిల్లలను చూడగానే తండ్రి, నాన్నను చూసిన ఆనందంలో పిల్లలు ఉద్వేగానికి లోనై కన్నీటి పర్యంతమయ్యారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సైదాపురం మండలం తురిమెర్లకు చెందిన తాపీ మేస్త్రి చప్పిడి ప్రసాద్ విజయవాడ రామవరప్పాడులో కొన్నాళ్లుగా తన ముగ్గురు పిల్లలతో ఉంటున్నాడు. ప్రసాద్ భార్య ఇదివరకే అతడిని వదలి వెళ్లిపోయింది. నాలుగు రోజుల క్రితం సొంతూరు వెళ్దామంటూ ప్రసాద్ పిల్లలతో కలిసి బెజవాడ రైల్వేస్టేషన్‌కు వచ్చాడు. పిల్లలను అక్కడే వదిలి ఎటో వెళ్లిపోయాడు. ఆ రాత్రంతా రైల్వేస్టేషన్లోనే ఏడుస్తూ ఎదురు చూసిన పిల్లలను చైల్డ్‌లైన్ ప్రతినిధులు చేరదీసి ఆశ్రయం కల్పించారు. తండ్రి కోసం ఆరా తీసినా ఫలితం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో శనివారం ‘పాపం పసివాళ్లు’ శీర్షికన ‘సాక్షి’ దిన పత్రికలో కథనం ప్రచురితమైంది. ఇంతలో తండ్రి ప్రసాద్ తాను పనిచేసే నిర్మాణ రంగ సంస్థ ప్రతినిధిని వెంటబెట్టుకుని రైల్వేస్టేషన్‌కు చేరుకుని తన బిడ్డల గురించి వాకబు చేశాడు. జీఆర్పీ సిబ్బంది సూచనలతో చైల్డ్‌లైన్ ప్రతినిధుల వద్దకు వెళ్లాడు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ) సంరక్షణలో ఉన్న పిల్లల వద్దకు ప్రసాద్‌ను తీసుకెళ్లారు. అక్కడ తండ్రిని చూడగానే పిల్లలు ఒక్కసారిగా నాన్నా.. అంటూ భోరుమన్నారు. ప్రసాద్ పరుగున వారి వద్దకు వెళ్లి గట్టిగా హత్తుకుని రోదించారు. తండ్రి కూడా భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమయ్యాడు. ఆ సన్నివేశాన్ని చూసిన అక్కడి వారూ కన్నీరొలికారు. తండ్రికి తాత్కాలికంగా అప్పగింత.. సీడబ్ల్యూసీ ప్రతినిధులు విజయవాడలో ప్రసాద్ ఉంటున్న పరిసరాల్లో విచారణకు సామాజిక కార్యకర్తను పంపారు. అక్కడ ప్రసాద్ వ్యవహారశైలి, తదితర అంశాలను తెలుసుకుని మంగళవారం సోషల్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు సమర్పిస్తారు. అప్పటి వరకు నిర్మాణ సంస్థ ప్రతినిధి నుంచి హామీ తీసుకుని పిల్లలను తండ్రికి తాత్కాలికంగా అప్పగించినట్టు సీడబ్ల్యూసీ చైర్మన్ సువార్త ‘సాక్షి’కి చెప్పారు. సీడబ్ల్యూసీ ఆదేశాల మేరకు తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రసాద్ తల్లి వృద్ధాప్యంతో ఉన్నందున పిల్లలను తురిమెర్లకు పంపేకంటే కౌన్సెలింగ్ ఇచ్చి తండ్రి వద్దనే ఉంచాలని యోచిస్తున్నారు. నాలుగు రోజుల ఎదురు చూపుల అనంతరం తండ్రి చెంతకు చేరడంతో పసివాళ్ల కథ సుఖాంతమైంది. చదవండి: Nellore: పాపం పసివాళ్లు! అమ్మానాన్నలు కాదనుకున్న అభాగ్యులు -
Nellore: పాపం పసివాళ్లు! అమ్మానాన్నలు కాదనుకున్న అభాగ్యులు
సాక్షి, అమరావతి బ్యూరో: ఆ పిల్లలు అమ్మా నాన్నలు ఉన్న అనాథలు! తండ్రి తాగుడుకు బానిసగా మారాడు. తండ్రి పెట్టే బాధలు భరించలేక కొన్నాళ్ల క్రితమే పిల్లలను వదిలేసి తల్లి వెళ్లిపోయింది. అప్పట్నుంచి బిడ్డలను తనతోనే ఉంచుకున్న తండ్రి కూడా ఇప్పుడు వారిని వదిలించుకుని ఎటో వెళ్లిపోయాడు. ఇలా కన్న పేగులు కాదనడంతో లోకం తెలియని ఆ పసిపిల్లలు అభాగ్యులయ్యారు. తల్లిదండ్రులున్నా దిక్కులేని వారైన ముగ్గురు చిన్నారుల దయనీయ గాథ ఇది..! నెల్లూరుకు చెందిన ప్రసాద్, శ్రీలత దంపతులు. భవన నిర్మాణ కార్మికులుగా పనిచేసే వీరికి ప్రణీత (7), ప్రశాంతి (5), బాలాజీ భగవాన్ (3) ముగ్గురు సంతానం. తాగుడుకు అలవాటుపడ్డ ప్రసాద్ తరచూ భార్యను కొడుతూ ఉండేవాడు. సహనం నశించిన ఆమె పిల్లలను, భర్తను విడిచి పెట్టి ఆరేడు నెలల క్రితం వెళ్లిపోయింది. ఆ తర్వాత కొన్నాళ్లు పిల్లలను సాకిన తండ్రి వారిని వెంటబెట్టుకుని నెల్లూరు నుంచి విజయవాడ వచ్చాడు. విజయవాడలో చిన్న రేకుల షెడ్డులో బిడ్డల్ని ఉంచి పనికెళ్లి వచ్చేవాడు. పిల్లలకు కాస్తో కూస్తో తిండి పెట్టేవాడు. అమ్మ దూరమైన ఆ చిన్నారులు నాన్నలోనే అమ్మనూ చూసుకున్నారు. మద్యం మత్తులో ఉన్న నాన్న పక్కలోనే ఆదమరచి నిదురించేవారు. అమ్మలా నాన్న తమను విడిచి వెళ్లడన్న నమ్మకంతో ఉండేవారు. కానీ రెండ్రోజుల క్రితం నాన్న కూడా అమ్మ బాటనే ఎంచుకున్నాడు. ‘నెల్లూరులో ఉన్న నాయనమ్మ దగ్గరకు తీసుకెళ్తాను రండి’ అని చెప్పడంతో ఆ చిన్నారులు ఎగిరి గంతేశారు. ఆనందపరవశంలో ఉన్న బిడ్డల్ని విజయవాడ రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్లి ఒకటో నంబరు ప్లాట్‌ఫాంపై కూర్చోబెట్టాడు. ‘మీరు ఇక్కడే ఉండండి.. ఇప్పుడే వచ్చేస్తాను..’ అంటూ వెళ్లిపోయాడు. నాన్న కోసం ఆ పిల్లలు రాత్రంతా వేయి కళ్లతో చూస్తూనే ఉన్నారు. కానీ ఎప్పటికీ తండ్రి రాకపోవడంతో బేలగా ఏడుస్తున్న వారిని రైల్వే స్టేషన్లో కొందరు జీఆర్పీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు గురువారం రాత్రి రైల్వేస్టేషన్లో ఉన్న చైల్డ్‌లైన్ ప్రతినిధులకు అప్పగించారు. తండ్రి ఆచూకీ కోసం చైల్డ్‌లైన్ ప్రతినిధులు చేసిన ప్రయత్నాలు ఫలించ లేదు. దీంతో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సూచనల మేరకు ప్రణీత, ప్రశాంతిలను నగరంలోని కృష్ణలంక ప్రజ్వల హోం ఫర్ గర్ల్స్లోను, బాలాజీ భగవాన్ను గాంధీనగర్‌లోని ఎస్కేసీవీ ట్రస్ట్ సంరక్షణలో ఉంచినట్టు చైల్డ్‌లైన్ ప్రతినిధి శ్రీకాంత్ ‘సాక్షి’కి చెప్పారు. నాన్న కావాలి.. తమను కాదని వెళ్లిపోయిన నాన్న వస్తాడని ఆ చిన్నారులు గంపెడాశతో ఉన్నారు. నాన్న కావాలి.. అంటూ జాలిగా అడుగుతున్నారు. లేదంటే నాయనమ్మ దగ్గరకైనా వెళ్లి పోతామంటున్నారు. అక్కడ అంగన్వాడీకెళ్లయినా చదువుకుంటామంటున్నారు. ‘అమ్మ ఉన్నన్నాళ్లూ మమ్మల్ని బాగానే చూసుకునేది. ఆమ్మ వెళ్లిపోయాక నాన్న కూడా బాగానే చూసుకునేవాడు. నేను నాన్నకు వంటలో సాయపడేదాన్ని. నేను నెల్లూరు ఎస్పీఎస్ స్కూల్లో రెండో తరగతి చదివేదాన్ని. చెల్లి, తమ్ముడు విజయవాడలో అంగన్వాడీకెళ్లే వారు.. అమ్మ, నాన్నలకు తమ్ముడంటే చాలా ఇష్టం. అయినా ఇద్దరూ వదిలి వెళ్లిపోయారు..’ అని పెద్ద కుమార్తె ప్రణీత వాపోయింది. తమను చదివిస్తే బాగా చదువుకుంటామంటోంది ప్రణీత! చదవండి: అమెరికా చరిత్రలో ఇది చీకటి రోజు.. డొనాల్డ్ ట్రంప్‌పై బైడెన్ తీవ్ర విమర్శలు -
ఎముకలు కొరుకుతున్న చలి, ఆకలి మంటకు తట్టుకోలేక భిక్షాటన.. చివరికి!
సాక్షి, నల్గొండ: ఊహ తెలియని వయసు నుంచే సోదరితో పాటు అనాథాశ్రమంలో పెరిగాడు. ఏమైందో తెలియదు కానీ ఏడాది క్రితం సోదరి కూడా అతడిని విడిచి వెళ్లిపోయింది. దీంతో నెల రోజుల క్రితం ఆ బాలుడు ఆశ్రమం నుంచి బయటికొచ్చాడు. జానెడు పొట్ట కోసం లారీ క్లీనర్‌గా.. చివరకు బిచ్చగాడిగా మారాడు. అయినా ఎవరూ ఆదరించలేదు. ఓ వైపు ఆకలి మంట.. మరో వైపు నా అనే వారు ఎవరూ లేరనే మనస్తాపంతో తనువు చాలించాలని సాగర్‌లో కాల్వలోకి దూకాడు. అటుగా వెళ్తున్న ఓ రేషన్ డీలర్ ఆ బాలుడిని కాపాడి పోలీసులకు అప్పగించాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తుతెలియని వ్యక్తులు ఊహ తెలియని వయసులోనే ప్రియాంక ఆమె సోదరుడు శ్రీకాంత్ హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి ఎస్ఓఎస్ ఆశ్రమంలో వదిలి వెళ్లారు. అప్పటి నుంచి ఆ ఇద్దరు అక్కడే ఆశ్రయం పొందారు. చదవండి: హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అరెస్ట్ ఒంటరయ్యానని.. ఏడాది క్రితం ప్రియాంక ఆశ్రమం వదిలి ఎక్కడికో వెళ్లిపోయింది. అప్పటినుంచి శ్రీకాంత్ ఒంటరివాడయ్యాడు. దీంతో నెల రోజుల క్రితం ఆశ్రమం నుంచి పారిపోయాడు. మూడురోజులు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తిరిగిన శ్రీకాంత్ హైవేపైకి చేరుకుని లారీ ఎక్కాడు. 20 రోజుల పాటు అదే లారీకి క్లీనర్‌గా పనిచేశాడు. ఆ లారీడ్రైవర్ మూడు రోజుల క్రితం తిప్పర్తి మండల కేంద్రంలో శ్రీకాంత్‌ను దింపి వెళ్లిపోయాడు. చలికి వణుకుతూ .. ఆకలికి తట్టుకోలేక.. లారీడ్రైవర్ విడిచిపెట్టినప్పటి నుంచి శ్రీకాంత్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఓ వైపు ఎముకలు కొరుకుతున్న చలి, మరో వైపు ఆకలి మంటకు తట్టుకోలేకపోయాడు.దీంతో చేయిచాచి భిక్షాటన చేశాడు. అయినా ఆదరణ కరువవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం వేములపల్లి మండల కేంద్రానికి చేరుకున్న శ్రీకాంత్ సాగర్ ఎడమ కాల్వలోకి దూకాడు. నీటిలో కొట్టుకుపోతున్న బాలుడిని గమనించిన రేషన్ డీలర్ అమరారపు వెంకటయ్య తాడు సహాయంతో ఒడ్డుకు లాగి కాపాడాడు. అనంతరం తన ఇంటికి తీసుకెళ్లి భోజనం పెట్టి వివరాలు తెలుసుకుని పోలీసులకు అప్పగించాడు. బాలుడి గురించి ఆరా తీసి అప్పగిస్తామని ఎస్ఐ రాజు తెలిపారు. అప్పటి వరకు ఆ బాలుడికి అన్ని సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. చదవండి: ఏడేళ్లుగా ప్రేమ.. తీరా పెళ్లి చేసుకోవాలని అడిగితే. మరో అమ్మాయితో.. -
ముళ్లకంపలో మానవత్వం.. ఊపిరి పోసే ‘ఊయల’
కొందరు కసాయిలు దయాదాక్షిణ్యాలను మరచిపోతున్నారు.. కడుపు తీపిని చంపేసుకుంటున్నారు.. కన్నపేగును తెంపేసుకుంటున్నారు.. అభం శుభం తెలియని శిశువుల ఉసురు తీసేస్తున్నారు.. ఆడపిల్ల పుట్టిందని కొందరు.. వివాహేతర సంబంధాలను కప్పిపుచ్చుకునేందుకు ఇంకొందరు.. పోషణ భారమై మరికొందరు బిడ్డలను రోడ్డుపాలు చేస్తున్నారు.. కనికరం లేకుండా కుప్పతొట్టిలో వదిలేస్తున్నారు .. మానవత్వం మరచి ముళ్లకంపల్లోకి విసిరేస్తున్నారు.. సమాజంలో తలెత్తిన వికృత పోకడలను అరికట్టేందుకు ప్రభుత్వం నడుంబిగించింది. మనిషి కర్కశత్వానికి బలైన అనాథ చిన్నారులను ‘ఊయల’ పథకంతో ఆదుకుంటోంది. పసి ప్రాణాల ఆలనాపాలనా చూసుకునేందుకు ప్రత్యేక సిబ్బందిని నియమించింది. విద్యాబుద్ధులు నేరి్పంచి ప్రయోజకులుగా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ అమలు చేస్తోంది. చిరుశ్వాసను చిదిమేయకుండా ‘ఊయల’లోకి చేర్చాలని కోరుతోంది. సాక్షి, తిరుపతి: అనాథ శిశువులకు ప్రభుత్వం అభయమిస్తోంది. పసి ప్రాణాలకు భరోసా కల్పిస్తోంది. పురిటి బిడ్డలను చెత్తకుండీలు, ముళ్లపొదల పాలు చేసేవారు కాస్త మానవత్వంతో ఆలోచించి ఊయల పథకాన్ని వినియోగించుకోవాలని సూచిస్తోంది. అలాంటి శిశువుల సంరక్షణను బాధ్యతగా తీసుకుంటామని తెలియజేస్తోంది. జిల్లాలో ఈ పథకం కింద రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, పీహెచ్‌సీల, ఏరియా ఆస్పత్రుల వద్ద 45 ఊయలలను ఏర్పాటు చేసింది. ఇందుకోసం రూ.1.35లక్షలను వెచ్చించింది. అక్కున చేర్చుకుంటూ.. ఊయల్లో పడుకోబెట్టిన అనాథ శిశువులను ప్రభుత్వమే అక్కున చేర్చుకుని సంరక్షిస్తుంది. ఇందుకోసం జిల్లాలలోని శిశువిహార్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. పిల్లల ఆలనాపాలనా చూసుకునేందుకు కొందరు మహిళలను నియమించింది. వారి చదువు సంధ్యలను ప్రభుత్వమే చూసుకుంటుంది. ఉన్నత విధ్యను అభ్యసించిన వారికి ఉద్యోగావకాశాలను సైతం కల్పించాలని నిర్ణయించింది. అనాథ పిల్లల సంరక్షణే లక్ష్యం అనాథ పిల్లల సంరక్షణే లక్ష్యంగా ప్రభుత్వం ఊయల పథకం ప్రారంభించింది. ఇప్పటికే జిల్లాలో చాలా చోట్ల ఊయలలు ఏర్పాటు చేశాం. మరి కొన్నిప్రాంతాల్లో త్వరలోనే ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాం. పసిబిడ్డలను పడేయకుండా ఊయలలో వేస్తే వారిని బాధ్యతగా పెంచుతాం. – నాగశైలజ, ఐసీడీఎస్ పీడీ, చిత్తూరు పేరూరు కట్టపై శిశువు మృతదేహం తిరుపతి క్రైం: కన్ను తెరవని పసిగుడ్డు.. తల్లి పేగు తెంపిన నెత్తుటి మరకలు ఆరలేదు.. పురిటి వాసన పోలేదు.. పేరూరు కట్టపై ఆడ శిశువు నిర్జీవంగా పడి ఉంది. తొమ్మిది నెలలు మోసిన అమ్మకు భారమైపోయిందో.. నేలన పడగానే ఊపిరి ఆగిపోయిందో.. ఆడబిడ్డని ఉసురు తీసేశారో తెలియదు.. ఊయలూగాల్సిన పసికందు మృతదేహాన్ని చెరువు కట్టపై పడేశారు. ఒక వేళ మృత శిశువుగా జన్మించినా అంత నిర్దయగా అంతిమ సంస్కారం కూడా నిర్వహించకుండా ముళ్ల పొదల్లోకి విసిరేయడం చూపరుల హృదయాలను కలచివేసింది. తిరుపతి–చంద్రగిరి జాతీయ రహదారి సమీపంలోని పేరూరు కట్టపై సోమవారం ఉదయం ఆడ శిశువు మృతదేహం లభ్యమైంది. ఎస్ఐ దీపిక ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. -
కోవిడ్‌తో ‘అనాథలైన’ చిన్నారులకు స్టైపండ్ పెంపు !
న్యూఢిల్లీ: కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన పిల్లలకు తాము అందిస్తున్న నెలవారీ ఆర్థికసాయాన్ని రెట్టింపు చేయాలని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తున్న రూ.2,000ల స్టైపండ్‌ను రూ.4,000కు పెంచాలని భావిస్తున్నట్లు సంబంధిత కేంద్ర ఉన్నతాధికారి ఒకరు మంగళవారం వెల్లడించారు. ఈ పెంపు ప్రతిపాదనను కేంద్ర మంత్రి మండలి ఆమోదించాల్సి ఉంది. పిల్లలకు అందిస్తున్న నెలవారీ భత్యాన్ని పెంచాలని కేంద్ర మహిళా, శిశు సంరక్షణ మంత్రిత్వ శాఖ ప్రతిపాదించిందని, త్వరలో ఈ ప్రతిపాదన కేబినెట్ ముందుకు వెళ్లనుంది. -
అనాథలకు ప్రభుత్వమే తల్లీతండ్రీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అనాథలకు తల్లి, తండ్రిగా ప్రభుత్వం ఉంటుందని రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ తెలిపింది. అనాథల సంరక్షణ కోసం కొత్త విధానాన్ని తీసుకొస్తామని పేర్కొంది. ఈ మేరకు విధివిధానాలు రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. రాష్ట్రంలోని అనాధల సంరక్షణ నిమిత్తం ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ శనివారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో మొదటిసారి సమావేశమైంది. రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు కె.తారక రామారావు, ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకరరావు, శ్రీనివాస్‌గౌడ్, సబితా ఇంద్రారెడ్డి తదితరులు హాజరయ్యారు. అనాథల సంక్షేమాన్ని ప్రభుత్వం మానవీయ కోణంలో చూస్తోందని, ఎంత ఖర్చయినా భరించేందుకు సిద్ధం ఉందని, ఈ నేపథ్యంలో సబ్ కమిటీ ద్వారా ప్రతిపాదించే పాలసీ దేశం మొత్తం గర్వించే విధంగా ఉండాలని కమిటీ అభిప్రాయపడింది. ఇతర రాష్టాలన్నీ అనుసరించే విధంగా సూచనలు రూపొందించాల్సిన ఆవశ్యకతపై కమిటీ ఏకాభిప్రాయం వ్యక్తం చేసింది. తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే అనేక రంగాల్లో దేశానికి ఆదర్శవంతంగా ఉందని, అనాథల కోసం రూపొందించే విధానం కూడా వీటన్నింటినీ మించి ఉంటుందని సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు. కుటుంబంగా స్థిరపడే వరకు బాధ్యత అనాథలుగా ప్రభుత్వ సంరక్షణలోకి వచ్చిన పిల్లలు ఎదిగి తల్లిదండ్రులుగా మారి, కుటుంబంగా స్థిరపడేవరకు ప్రభుత్వమే వారికి తల్లిదండ్రులుగా బాధ్యత తీసుకునేలా కొత్త విధానం ప్రతిపాదిస్తామని సభ్యులు చెప్పారు. పాత చట్టాలకు మార్పులు, సవరణలు కాకుండా సంపూర్ణ, సమగ్ర కొత్త విధానం , కొత్త చట్టం ఉండే విధంగా ఈ సబ్ కమిటీ కసరత్తు చేసి ప్రతిపాదనలు సిద్ధం చేస్తుందని తెలిపారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిశు విహార్‌లు, హోమ్‌లు, ఆశ్రమాలను పటిష్టంగా తయారు చేసేలా, ప్రైవేట్ ఆధ్వర్యంలో సేవా దృక్పథంతో గొప్పగా నిర్వహిస్తున్న అనాథ ఆశ్రమాలను ప్రోత్సహించేలా ఈ కమిటీ సూచనలు సమర్పిస్తుందని చెప్పారు. -
ఆ 177 మంది చిన్నారులను అక్కున చేర్చుకోండి: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: కరోనాతో మృత్యువాత పడిన వారి పిల్లలను అక్కున చేర్చుకొని ఆదరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. మొదటి, రెండోదశ కరోనా కారణంగా అనాథలుగా మారిన 177 మంది చిన్నారులు ఇబ్బందులు పడకుండా చూసుకోవాలని స్పష్టం చేసింది. ప్రతి పది మంది చిన్నారుల యోగక్షేమాలు చూసేందుకు ఒక అధికారిని నియమించాలని ప్రభుత్వానికి సూచిం చింది. కరోనా నియంత్రణకు చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన పలు ప్రజాహిత వ్యాజ్యాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం బుధవారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా డీజీపీ, జైళ్ల శాఖ డీజీపీ, మున్సిపల్, పౌరసరఫరాలు, విద్యా శాఖ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల కమిషనర్లు దాఖలు చేసిన స్థాయి నివేదికలను ధర్మాసనం పరిశీలించింది. లాక్డౌన్ సమయంలో ఉల్లంఘనల కు పాల్పడిన వారిపై చర్యలు తీసుకునేందుకు బృం దాలు ఏర్పాటు చేశామంటూ గతంలో ఇచ్చిన అం శాలనే డీజీపీ తన నివేదికలో పేర్కొనడంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. తదుపరి విచారణ నాటికి స్థాయి నివేదిక ఇవ్వాలని వీరందరినీ ఆదేశిస్తూ విచారణను జూలై 7కు వాయిదా వేసింది. ధర్మాసనం ఆదేశాలివే.. కరోనా సమయంలో మహిళలు గృహహింసకు గురికాకుండా తగిన చర్యలు చేపట్టాలి. ఎన్నికల విధుల్లో పాల్గొని కరోనాతో మృత్యువాతపడిన వారికి డెత్ బెనిఫిట్స్‌ను వెంటనే అందించేలా చర్యలు తీసుకోండి. నీలోఫర్‌లో 24 బెడ్స్ మాత్రమే అందుబాటులో ఉన్న నేపథ్యంలో కరోనా బారినపడే చిన్నారులకు చికిత్సలు అందించేందుకు ఎటువంటి చర్యలు చేపడుతున్నారో స్పష్టం చేయండి. -
'కోవిడ్‌తో అనాథలైన పిల్లలను గుర్తిస్తున్నాం'
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనాతో అనాథలైన పిల్లలను గుర్తించే పనిలో ఉన్నామని స్త్రీ, శిశు సంక్షేమశాఖ కార్యదర్శి అనురాధ పేర్కొన్నారు. బుధవారం ఆమె మాట్లాడుతూ.. '' ఇప్పటివరకు 154 మంది పిల్లలు కోవిడ్ వల్ల అనాథలయ్యారు. అనాథలుగా మారిన 56 మంది పిల్లల పేరిట ఇప్పటికే రూ.10లక్షల చొప్పున డిపాజిట్ చేశాం. దేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మొదట ఈ పథకం తీసుకొచ్చారు. ఈ పథకంపై కేంద్ర ప్రభుత్వం ఆరా తీసింది. రానున్న కరోనా థర్డ్ వేవ్ దృష్ట్యా ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి జిల్లాలో పిల్లల కోసం కోవిడ్ సెంటర్లు ఏర్పాటు చేశాం. అంగన్వాడీల ద్వారా పిల్లలకు, గర్భిణీలకు పౌష్టికాహారం అందిస్తున్నాం. ఐదేళ్ల లోపు పిల్లలున్న తల్లులకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం'' అంటూ వివరించారు. కాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ పథకాన్ని వీలైనంత తొందరగా పూర్తి చేసే పనిలో ఉన్నట్లు అనురాధ తెలిపారు. చదవండి: ఐదేళ్లలోపు చిన్నారుల తల్లులను గుర్తించండి -
కరోనాతో అనాథలైన చిన్నారులకు రూ.10 లక్షల సాయం
హనుమాన్‌జంక్షన్ రూరల్ (గన్నవరం): కరోనాతో తల్లి చనిపోవడంతో అనాథలైన ఇద్దరు చిన్నారులకు రూ.10 లక్షల ఆర్థిక సాయం పత్రాలను బుధవారం అధికారులు, వైఎస్సార్సీపీ నాయకులు అందజేశారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కానుమోలుకు చెందిన నాగేశ్వరమ్మ ఇటీవల కోవిడ్‌తో మృతిచెందారు. మూడేళ్ల కిందటే నాగేశ్వరమ్మ భర్త రమేష్ గుండెపోటుతో మరణించాడు. దీంతో వీరి ఇద్దరు పిల్లలు సాయిగణేష్, నాగరవళి అనాథలయ్యారు. స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు ఇచ్చిన సమాచారం మేరకు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అధికారులతో మాట్లాడి చిన్నారులకు ఆర్థిక సాయాన్ని మంజూరు చేయించారు. కరోనా అనాథలైన చిన్నారులను ఆదుకునేందుకు రూ.10 లక్షల సాయాన్ని సీఎం వైఎస్ జగన్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. చదవండి: పేదల ఇళ్ల కోసం ప్రత్యేకంగా జేసీలు ‘గుట్ట’ కాయస్వాహా: టీడీపీ నేత భూ బాగోతం.. -
ఏపీలో 103, తెలంగాణలో 123
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో 103 మంది, తెలంగాణలో 123 మంది పిల్లలు అనాథలయ్యారని సుప్రీంకోర్టుకు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్(నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్–ఎన్సీపీసీఆర్) తెలిపింది. కరోనా వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల వివరాలు, తల్లిదండ్రుల్లో ఒకరిని కోల్పోయిన వారి వివరాలు తెలపాలంటూ ఇటీవల జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ అనిరుద్ధ బోస్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. ఈ నేపథ్యంలో బాలస్వరాజ్ పోర్టల్‌లో ఆయా రాష్ట్రాలు అప్లోడ్ చేసిన వివరాలను ఎన్సీపీసీఆర్ అఫిడవిట్ రూపంలో కోర్టుకు మంగళవారం అందజేసింది. కరోనా కారణంగా దేశవ్యాప్తంగా 1,742 మంది చిన్నారులు తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయారని, తల్లిదండ్రుల్లో ఒకరిని కోల్పోయినవారు 7,464 మంది ఉన్నారని పేర్కొంది. ఏపీలో తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయినవారు 103 మంది, తల్లిదండ్రుల్లో ఒకరిని కోల్పోయినవారు 13 మంది ఉన్నారని పేర్కొంది. -
కరోనా కల్లోలం: గూడు చెదిరిన గువ్వలు
సాక్షి, సిరిసిల్ల: ఆటో నడుపుతూ నాన్న.. బీడీలు చుడుతూ అమ్మ.. అరకొర ఆదాయమే అయినా.. ఆనందానికి ఎన్నడూ కొదవలేని కుటుంబం వారిది. సాఫీగా సాగిపోతున్న జీవితంలో కరోనా కల్లోలం రేపింది. ఇద్దరు పిల్లలతో కూడిన ఆ పొదరింట్లో పెను విషాదం నింపింది. ఐదు రోజుల వ్యవధిలోనే దంపతులు ప్రాణాలు కోల్పోగా.. అనాథలైన ఆ ఇద్దరు చిన్నారులు కూడా మహమ్మారితో పోరాడుతుండటంతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌కు చెందిన షేక్ ఖలీమ్(40) ఆటోడ్రైవర్. అతడి భార్య నికత్ తబుసమ్(38) బీడీ కార్మికురాలు. వారికి ఇద్దరు పిల్లలు పదిహేనేళ్ల అమాన్, పదమూడేళ్ల రుమానా ఉన్నారు. గతంలో మూడేళ్లపాటు బతుకుదెరువు కోసం సౌదీ అరేబియాకు వెళ్లిన ఖలీమ్.. కాలం కలిసి రాక అప్పులు మరిన్ని మూటగట్టుకుని ఇల్లు చేరాడు. అప్పటికే వీసాకు చేసిన మరో రూ.3 లక్షల వరకు అప్పులు ఉన్నాయి. ఈ అప్పులు తీర్చేందుకు, కుటుంబాన్ని పోషించేందుకు ఖలీమ్ సిరిసిల్లలో ఆటో నడుపుతూ కష్టపడేవాడు. తబుసమ్ కూడా బీడీలు చుడుతూ భర్తకు చేదోడు వాదోడుగా ఉండేది. అయితే 15 రోజుల క్రితం ఖలీమ్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. తొలుత స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స చేయించుకున్నాడు. తర్వాత పరిస్థితి విషమించడంతో కరీంనగర్‌లోని ఓ ప్రై వేటు ఆస్పత్రిలో చేరాడు. తెలిసిన వారివద్ద రూ.2 లక్షల వరకు అప్పు చేసి ఆస్పత్రిలో చెల్లించాడు. కానీ ఫలితం దక్కలేదు. ఐదు రోజుల కిందట ఖలీమ్ మృత్యువాత పడ్డాడు. శవాన్ని సిరిసిల్లకు తెచ్చి బంధువులు అంత్యక్రియలు నిర్వహించారు. తల్లినీ కనికరించని కరోనా భర్త మరణంతో తబుసమ్ గుండెలవిసేలా రోదించింది. పిల్లలు బెంబేలు పడిపోవడం చూసి చివరకు ధైర్యం తెచ్చుకుంది. కానీ భర్త ఖలీమ్ ద్వారా అప్పటికే సోకిన కరోనా వైరస్‌తో తబుసమ్ ఆరోగ్యం కూడా క్షీణించింది. దీంతో ఆమెను కూడా కరీంనగర్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. సమీప బంధువులు మళ్లీ రూ.2 లక్షల వరకు అప్పు తెచ్చి ఆస్పత్రి ఖర్చులకు చెల్లించారు. కోలుకుంటుందని, పిల్లల బాగోగులు చూసుకుంటుందని భావిస్తుండగా.. కరోనాతో చేసిన పోరాటంలో ఆమె కూడా ఓడిపోయింది. శనివారం రాత్రి తబుసమ్ కన్నుమూసింది. చందాలతో అంత్యక్రియలు ఐదురోజుల వ్యవధిలోనే భార్యాభర్తలు చనిపోవడంతో చేతిలో డబ్బులేని ఖలీమ్ బంధువులు.. పలువురి నుంచి చందాలు పోగు చేశారు. అలా పోగుచేసిన రూ.27 వేలతో వారి సంప్రదాయం ప్రకారం ఆదివారం ఉదయం ఆమెకు అంత్యక్రియలు నిర్వహించారు. పాపం పసివాళ్లు ఊహ తెలిసిన పిల్లలు కావడంతో వారిని ఓదార్చడం ఎవరి వల్లా కావడం లేదు. ఐదు రోజుల వ్యవధిలో అమ్మానాన్నలు చనిపోవడం వారు తట్టుకోలేక పోతున్నారు. చిన్న ఇల్లు.. పుట్టెడు అప్పులే ఇప్పుడు వారికి మిగిలింది. వాటితో పాటు అమ్మానాన్నల ద్వారా సోకిన వైరస్. ఇద్దరు పిల్లలూ పాజిటివ్ కావడంతో అదే ఇంట్లో దిక్కులేని పక్షుల్లా ఉంటున్నారు. సరైన వైద్యం లేక.. ఆదుకునే నాథుడు లేక బేల చూపులు చూస్తున్నారు. కనీసం అమ్మమ్మ, తాత కానీ, నానమ్మ, తాత కానీ లేకపోవడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. తమనెవరైనా ఆదుకుంటారేమోనని ఆశగా ఎదురు చూస్తున్నారు. చదవండి: విషాదం: ప్రసవానికి వచ్చి కరోనాకు బలి -
బాధిత చిన్నారులకు తక్షణమే భరోసా
సాక్షి, అమరావతి: కష్టపడి కలో గంజో తాగే కుటుంబాల్లో కోవిడ్ రేపుతున్న చిచ్చు సాధారణమైనది కాదు. పిల్లలకు కన్నవాళ్లను దూరం చేస్తూ అనాథలుగా మారుస్తోంది. దీంతో వారంతా పండుటాకుల లాంటి అమ్మమ్మలు, నానమ్మలు, తాతల వద్దకు చేరి తలదాచుకోవాల్సి వస్తోంది. ఈ విపత్కర సమయంలో భావి తరాన్ని ఆదుకోవడం అతి పెద్ద సవాల్. ఈ బాధ్యతను దూరదృష్టితో గుర్తించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ దృఢమైన నిర్ణయం తీసుకుని మిగతా రాష్ట్రాలతో పాటు కేంద్రానికి సైతం ఆదర్శంగా నిలిచింది. బాధిత చిన్నారుల పేరుతో వెంటనే రూ.10 లక్షల చొప్పున డిపాజిట్ చేయడంతోపాటు దానిపై వచ్చే వడ్డీతో నెల నెలా వారి కనీస ఆర్థిక అవసరాలు తీరుస్తూ బాసటగా నిలుస్తోంది. ఇలా 25 ఏళ్లు వచ్చేవరకు అవసరాలు తీరుస్తూ అనంతరం డిపాజిట్ మొత్తాన్ని వారి చేతికే అందించేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుచూపుతో, దార్శనికతో నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం అమలు ఇప్పటికే మొదలైంది కూడా. ఈ కోవలోనే తాజాగా కేంద్రం కూడా ప్రకటన చేసింది. కాకపోతే కేంద్రం బాధిత బాలల పేరుతో వెంటనే డిపాజిట్ చేసి వడ్డీ డబ్బులు చెల్లించకుండా వారికి 18 – 23 ఏళ్ల వయసు వచ్చే నాటికి స్టైఫండ్ చెల్లిస్తామని, 23 ఏళ్ల తరువాత రూ.10 లక్షలు తీసుకునే అవకాశం కల్పిస్తామని ప్రకటించింది. అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రం చిన్నారుల పోషణ, ఆర్థిక అవసరాలు, నెలవారీ ఖర్చులను పరిగణలోకి తీసుకుంటూ ప్రతి నెలా డిపాజిట్ డబ్బులపై వడ్డీ చెల్లించాలని నిర్ణయించడం గమనార్హం. తద్వారా ఎలాంటి జాప్యం, తాత్సారం లేకుండా బాధిత బాలలు తక్షణమే ప్రయోజనం పొందేలా ఊరట కల్పించారు. చొరవ చూపిన సీఎం జగన్.. కరోనాతో తల్లిదండ్రులను పోగొట్టుకుని నిస్సహాయులుగా మిగిలిన చిన్నారులకు భరోసా కల్పిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవ చూపి తీసుకున్న నిర్ణయం ప్రభావం దేశవ్యాప్తంగా కనిపిస్తోంది. అనాథలుగా ఆక్రోశిస్తున్న చిన్నారుల ఆవేదనను అందరి కంటే ముందుగా గుర్తించి కొంత మేరకైనా పరిష్కార మార్గాన్ని చూపి మానవీయ కోణాన్ని చాటుకున్నారు. కరోనా విపత్తు వేళ లోకం తెలియని చిన్నారులను ఆదుకోవడంలో పెద్ద మనసు చూపి ముఖ్యమంత్రి జగన్ టార్చిబేరర్‌గా నిలిచారంటూ రాజకీయ వర్గాలు ప్రశంసిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో గత నెలన్నర రోజులుగా బాధిత బాలలకు భరోసా కల్పిస్తూ చేపట్టిన పలు కార్యక్రమాలను ఒక నమూనాగా కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ శాఖ పేర్కొనడం గమనార్హం. బాలల విషయంలో అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసిన ఆ శాఖ ఆంధ్రప్రదేశ్‌లో చిన్నారులకు లభిస్తున్న భరోసాను ప్రస్తావించడం గమనార్హం. ఆర్థిక అవసరాలు తీరేలా.. కరోనా విపత్తుతో తల్లిదండ్రులను పోగొట్టుకున్న చిన్నారులను ఆదుకోవడంతోపాటు చదువు, సంరక్షణ బాధ్యతలను రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ పర్యవేక్షిస్తోంది. ఎవరైనా తల్లిదండ్రులు ఆసుపత్రి పాలైతే కోలుకునే వరకు బాలల సంరక్షణ బాధ్యతలను కూడా చేపడుతోంది. కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన పిల్లల పేరిట రూ.10 లక్షలు చొప్పున డిపాజిట్ చేసి దానిపై వచ్చే వడ్డీతో వారికి ఆర్థిక భరోసా కల్పిస్తారు. ఉచితంగా చదువు చెప్పించి, సంరక్షించి, 25 ఏళ్లు వచ్చిన తర్వాత ఆ డిపాజిట్ మొత్తాన్ని వారికే దక్కేలా పథకాన్ని అమల్లోకి తెచ్చారు. స్పెషల్ డ్రైవ్... తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులను గుర్తించి సంరక్షించేందుకు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. ఇందుకు అంగన్వాడీ, పోలీస్, సచివాలయాలు, వలంటీర్ల సహకారాన్ని తీసుకుంటున్నారు. శిశు సంక్షేమ శాఖ గణాంకాల ప్రకారం ఈ ఏడాది మార్చి 1 నుంచి ఈ నెల 26వతేదీ వరకు కోవిడ్ కారణంగా తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పోయిన చిన్నారులు 137 మంది, ఒకరిని పోగొట్టుకున్న వారు 2,049 మంది ఉన్నారు. చిన్నారుల కోసం ప్రత్యేకంగా హెల్ప్‌లైన్ ‘కోవిడ్ సమయంలో చిన్నారులను ఆదుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇవి పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. పిల్లల కోసం ప్రత్యేకంగా కోవిడ్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశాం. ఇందుకోసం డయల్ 181, 1098 కాల్ సెంటర్లను ఉపయోగిస్తున్నాం. మార్చి నుంచి దీనిపై పోలీస్, ఇతర శాఖల సమన్వయంతో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాం. కరోనా కారణంగా తల్లిదండ్రులను పోగొట్టుకుని అనాధలైన పిల్లల పునరావాసం, తల్లిదండ్రులు ఆసుపత్రిలో చేరితే పిల్లల తాత్కాలిక సంరక్షణ కోసం ఎప్పటికప్పుడు 181, 1098 టోల్ ఫ్రీ నెంబర్లు ద్వారా సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం’ –కృతికా శుక్లా, మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ ఈ ఏడాది మే 17న.. కరోనా మహమ్మారితో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల పేరుతో రూ.10 లక్షలు చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ప్రతి నెలా ఆర్థిక అవసరాలు తీరేలా వడ్డీ డబ్బులు చెల్లించడంతోపాటు చదువు బాధ్యతలను చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. 25 ఏళ్లు వచ్చిన తరువాత డిపాజిట్ మొత్తాన్ని బాధితులకే చెల్లించనున్నారు. మే 19న ఇందుకు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు(జీవో) జారీ అయ్యాయి. మే 18న.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సైతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తరహాలోనే కోవిడ్‌తో తల్లిదండ్రులను పోగొట్టుకున్న బాలలను ఆదుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. చిన్నారులకు ఉచితంగా చదువు చెప్పించడమే కాకుండా 25 ఏళ్లు వచ్చే వరకు ప్రతి నెల రూ.2,500 చొప్పున నగదు సాయం చేస్తామన్న కేజ్రీవాల్ నిర్ణయం ఈనెల 25 నుంచి అమలులోకి వచ్చింది. మే 27న.. కేరళ రాష్ట్ర ప్రభుత్వం సైతం ఆంధ్రప్రదేశ్ బాటలోనే నిర్ణయం తీసుకుంది. బాధిత బాలలకు రూ.3 లక్షల చొప్పున డిపాజిట్ చేయడంతోపాటు డిగ్రీ వరకు ఉచిత విద్యను అందిస్తామని కేరళ సీఎం పినరయి విజయన్ ప్రకటించారు. మే 29న.. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సైతం కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన బాలలకు రూ.5 లక్షల చొప్పున సాయాన్ని ప్రకటించారు. మే 29.. కోవిడ్‌తో కన్నవారిని పోగొట్టుకున్న చిన్నారులను ఆదుకుంటామని, ఉచితంగా చదువు చెప్పించి పీఎం కేర్స్ ద్వారా అండగా ఉంటామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. బాధిత చిన్నారులకు 18 ఏళ్ల వయసు వచ్చే నాటికి రూ.10 లక్షలు చొప్పున కార్పస్ ఫండ్ డిపాజిట్ చేసి 18 – 23 ఏళ్ల మధ్య స్టైఫండ్ అందిస్తామని, ఆ తరువాత వారికి డబ్బులు తీసుకునే అవకాశం కల్పిస్తామని తెలిపారు. -
MK Stalin: అనాథ బాలలకు రూ.5 లక్షల సాయం
చెన్నై/గువాహటి: అనాథ బాలలకు, కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు రూ.5 లక్షల సాయం అందజేస్తామని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ప్రకటించారు. వారి పేరిట ఈ మొత్తాన్ని బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామన్నారు. దానిపై వడ్డీని నెలనెలా వారికి 18 ఏళ్ల వయస్సు వచ్చే వరకు అందేలా చూస్తామన్నారు. దీంతోపాటు, గ్రాడ్యుయేషన్ స్థాయి వరకు వారి చదువుకయ్యే అన్ని ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఇటువంటి చిన్నారులను గుర్తించేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఏ దిక్కూలేని బాలలకు ప్రభుత్వ వసతి గృహాలు, ఇతర సంస్థల్లో ఆశ్రయం కల్పించనున్నట్లు వెల్లడించారు. తల్లి లేదా తండ్రిని కోల్పోయిన చిన్నారులకు కూడా రూ.3 లక్షలు తక్షణ సాయంగా అందజేస్తామని సీఎం స్టాలిన్ తెలిపారు. బంధువులు లేదా సంరక్షకుల వద్ద పెరిగే చిన్నారులకు నెలకు రూ.3 వేలను 18 ఏళ్లు వచ్చేదాకా అందజేస్తామన్నారు. నెలకు రూ.3,500 ఇస్తామన్న అస్సాం సర్కార్ కోవిడ్‌తో తల్లిదండ్రులను పోగొట్టుకుని అనాథలుగా మారిన బాలల సంరక్షకులకు నెలకు రూ.3,500 చొప్పున అందజేస్తామని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ప్రకటించారు. ఇందులో కేంద్రం రూ.2 వేలు భరిస్తుందన్నారు. ఈ మొత్తం బాధిత బాలల విద్య, నైపుణ్యం మెరుగుదలకు వినియోగిస్తామన్నారు. పదేళ్ల లోపు, అయిన వారు ఎవరూ లేని బాలలను మాత్రం ప్రభుత్వ ఖర్చుతో ఆశ్రమ పాఠశాలలు, సంస్థల్లో ఆశ్రయం కల్పిస్తామన్నారు. వీరికి వృత్తి విద్యలో శిక్షణ ఇచ్చి, జీవనోపాధి లభించేలా చూస్తామన్నారు. సరైన పోషణ, రక్షణ అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. బాలికలైతే వివాహ వయస్సు వచ్చాక అరుంధతి పథకం కింద 10 గ్రాముల బంగారం, రూ.50వేల చొప్పున అందజేస్తామన్నారు. పాఠశాల, లేదా కళాశాలల్లో చదువుకునే వారికి ల్యాప్‌టాప్ కూడా అందిస్తామన్నారు. ఆదివారం నుంచి అమల్లోకి వచ్చే ‘ముఖ్యమంత్రి శిశు సేవా పథకం’ కింద ఈ మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. (చదవండి: దేశంలో 37% తగ్గిన వ్యాక్సినేషన్) -
సీఎం జగన్ చూపిన బాటలో కేంద్ర ప్రభుత్వం
సాక్షి, అమరావతి: కోవిడ్‌తో అనాథలైన పిల్లల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చూపిన బాటలో కేంద్ర ప్రభుత్వం నడుస్తోంది. కోవిడ్ వల్ల అనాథలైన పిల్లలకు కేంద్రం అండగా నిలవనుంది. ఈ క్రమంలో బాధిత చిన్నారుల పేరు మీద 10 లక్షల రూపాయలు ఫిక్సిడ్ డిపాజిట్ చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఏపీలో ఇప్పటికే సీఎం జగన్ ఈ పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏపీలో ఇప్పటికే ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. బాధిత చిన్నారులకు చెక్‌లు కూడా అందించారు. ఇక కరోనాతో అనాథలైన పిల్లలకు ఉచిత విద్యను అందించడమే కాక.. 18 ఏళ్ల తర్వాత స్కాలర్షిప్ ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించింది. 23 ఏళ్ల తర్వాత వారికి 10 లక్షల రూపాయలు ఇవ్వనుంది. ఆయుష్మాన్ భారత్ కింద రూ.5 లక్షల ఉచిత ఆరోగ్య బీమాతో పాటు అనాథ పిల్లల ఉన్నత విద్యకు విద్యారుణం, వడ్డీ కట్టనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ప్రజా సంక్షేమ పథకాల విషయంలో ఏపీ సీఎం జగన్ పలు రాష్టాల ముఖ్యమంత్రులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎన్నో సంక్షేమ పథకాలు ఏపీలో ప్రవేశపెట్టిన తర్వాతే ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు. తాజాగా కోవిడ్‌తో అనాథలైన పిల్లలకు ఆర్థిక సాయం ప్రకటించే విషయంలో కూడా కేంద్రంతో సహా పలు రాష్ట్రాలు సీఎం జగన్ చూసిన బాటలోనే నడుస్తున్నాయి. కోవిడ్‌తో అనాథలైన పిల్లలకు ఏపీలో 10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన తర్వాత కేరళ సీఎం 3 లక్షలు, తమిళనాడు సీఎం స్టాలిన్ 5 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కోవిడ్ కారణంగా తల్లితండ్రులను కోల్పోయి అనాథలైన చిన్నారులకు 25ఏళ్లు వచ్చేవరకూ ప్రతి నెల 2,500 రూపాయలు జమ చేయడమే కాకుండా ఉచిత విద్య అందించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. చదవండి: కోవిడ్‌తో అనాథలైన పిల్లలకు రూ. 10 లక్షలు.. ఉత్తర్వులు జారీ -
కోవిడ్‌తో అనాథలైన పిల్లలకు రూ. 10 లక్షలు.. ఉత్తర్వులు జారీ
సాక్షి, విజయవాడ: కోవిడ్ వల్ల అనాథలైన పిల్లలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇందుకు సంబంధించి బుధవారం వైద్య ఆరోగ్య శాఖకు ఉత్తర్వులు జారీ చేశారు. కోవిడ్ వల్ల తల్లిదండ్రులు ఇద్దరు మరణించిన.. 18 ఏళ్ల లోపు వారికి ఈ పథకం వర్తిస్తుంది. తల్లిదండ్రులిద్దరు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబలకు చెందిన వారై ఉండాలని అధికారులు తెలిపారు. కరోనాతో కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల పేరుపై ప్రభుత్వం రూ.10 లక్షల డిపాజిట్ చేయనుందని తెలిపారు. ఆ మొత్తంపై వచ్చే వడ్డీని ప్రతినెలా ఇచ్చేలా లబ్దిదారులకు అందించేలా కార్యాచరణ రూపొందించినట్లు వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ఏకే సింఘాల్ వెల్లడించిన సంగతి తెలిసిందే. చదవండి: అనాథ పిల్లల పేరున రూ.10 లక్షల డిపాజిట్: ఏ.కె.సింఘాల్ -
కోవిడ్‌తో అనాథలైన పిల్లల కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
సాక్షి, విజయవాడ: కోవిడ్ కట్టడి కోసం పటిష్ట చర్యలు తీసుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా బారిన పడి ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న వారి పిల్లలకు ప్రత్యేక సంరక్షణ కేంద్రాల ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. కోవిడ్ బారిన పడి తల్లిదండ్రులు మరణించి అనాథలైన పిల్లలకు ఈ సంరక్షణ కేంద్రాల్లో వసతి కల్పించనున్నారు. రాష్ట్రంలోని మొత్తం 13 జిల్లాల్లో సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి.. వాటికి ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాష్ట్రంలో కోవిడ్ కట్టడి కోసం పగటి పూట కర్ఫ్యూని పటిష్టంగా అమలు చేస్తున్నప్రభుత్వం.. కరోనా పేషెంట్లకు ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటుంది. అలానే మహమ్మారి కట్టడి కోసం రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగతున్న సంగతి తెలిసిందే. చదవండి: గ్రామాల్లో సోడియం హైపోక్లోరైట్ పిచికారీ -
ఆ నలుగురు పిల్లలకు అండగా ఉంటాం
సికింద్రాబాద్: అనారోగ్యంతో తల్లిదండ్రులు మృతి చెందడంతో అనాథలుగా మారిన నలుగురు పిల్లలకు అండగా ఉంటామని శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ హామీ ఇచ్చారు. సీతాఫల్మండి డివిజన్ బీదలబస్తీకి చెందిన రాధ అనే మహిళ భర్త కొద్ది నెలల క్రితమే మృతి చెందాడు. కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో రాధ కూడా మృతి చెందింది. కూలీనాలీ చేసుకుని బతికే రాధకు నలుగురు సంతానం. ముగ్గురు బాలురు, ఒక బాలిక ఉన్నారు. తల్లిదండ్రులను కోల్పోయిన నలుగురు పిల్లలు ప్రస్తుతం అమ్మమ్మ సంరక్షణలో ఉన్నారు. మంగళవారం రాధ పిల్లలను పరామర్శించిన పద్మారావుగౌడ్ వారికి నెలకు సరిపడా రేషన్ సరకులు అందించారు. తక్షణ ఖర్చుల నిమిత్తం రూ.10 వేల సహాయాన్ని అందించారు. పిల్లలకు ప్రభుత్వ పరంగా అవసరమైన సహాయ సహకారాలు అందించాలని రెవెన్యూ అధికారులను పద్మారావుగౌడ్ ఆదేశించామన్నారు. నలుగురు పిల్లలకు గురుకుల పాఠశాలలో ఉచిత విద్యాబోధనలు అందిస్తామని హామీ ఇచ్చారు. -
అనాథ అక్కా చెల్లెళ్లకు ప్రభుత్వం అండ
జగదేవ్‌పూర్(గజ్వేల్): మండలంలోని చాట్లపల్లి గ్రామానికి చెందిన విద్యార్థులు శ్వేత, అంజలి అమ్మానాన్నలను కోల్పోయి అనాథలుగా మారారు. నాలుగేళ్ల క్రితం నాన్న మృతిచెందగా, బుధవారం అమ్మ మృతి చెందింది. ఇద్దరు ఆడపిల్లల దయనీయస్థితిపై గురువారం సాక్షిలో ‘నాడు నాన్న.. నేడు అమ్మ’ అనే కథనం ప్రచురితమైంది. సాక్షిలో వచ్చిన అనాథ పిల్లల దయనీయస్థితిపై సీఎం కేసీఆర్ స్పందించారు. వెంటనే ఎమ్మెల్సీ శేరిసుభాష్‌రెడ్డికి విద్యార్థులను ఆదుకోవాలని ఆదేశించారు. వెంటనే తను కలెక్టర్ వెంకట్రామిరెడ్డికి ఆదేశించారు. తక్షణ సహాయం కింద లక్ష నగదును మంజూరు చేశారు. కలెక్టర్ అదేశాల మేరకు గఢా ప్రత్యేక అధికారి ముత్యంరెడ్డి గురువారం సాయంత్రం చాట్లపల్లి గ్రామానికి చేరుకుని అనాథ బాలికలను పరామర్శించారు. కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం లక్ష నగదును అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాక్షిలో వచ్చిన కథనానికి సీఎం కేసీఆర్ స్పందించారని పేర్కొన్నారు. సీఎం ఆదేశాల మేరకు అనాథ పిల్లల అదుకోవడం జరిగిందని తెలిపారు. పై చదువుల కోసం ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని చెప్పారు. అలాగే హాస్టల్ సౌకర్యం కూడా కల్పించడం జరుగుతుందన్నారు. అమ్మానాన్నలు లేరని ఆధైర్యపడవద్దని, మనోధైర్యంతో చదువులో రాణించాలని సూచించారు. అలాగే తనవంతుగా చిన్నారులకు సాయం అందజేస్తానని మంత్రి హరీశ్‌రావు చాట్లపల్లి సర్పంచ్‌కు ఫోన్లో తెలిపారు. Request @Collector_SDPT to kindly take care of these two girls Get them into Govt residential schools asap https://t.co/ncctiaFSXL — KTR (@KTRTRS) April 9, 2020 కేటీఆర్ ట్వీట్... చాట్లపల్లి గ్రామంలోని అనాథ బాలికలపై సాక్షిలో వచ్చిన కథనానికి మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. వారిని ప్రభుత్వం పరంగా ఆదుకుంటామని పేర్కొన్నారు. వారిని ఆదుకోవాలని కోరుతూ కలెక్టర్ వెంకట్రామిరెడ్డికి ట్వీట్ చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ స్పందించడంతో గ్రామస్తులు, కుటుంబ సభ్యులు, బంధువులు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జగదేవ్‌పూర్ తహసీల్దార్ కరుణాకర్‌రావు 25 కిలోల బియ్యం అందించారు. కార్యక్రమంలో ఎంపీపీ బాలేషంగౌడ్, సర్పంచ్ నరేష్, ఎంపీటీసీ కావ్యదర్గయ్య, రైతు సమన్వయ సమితి మండల కో ఆర్డినేటర్ శ్రీనివాస్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, పీఎసీఎస్ ఉపాధ్యక్షుడు బాల్‌రాజు, జిల్లా నాయకులు లక్ష్మన్ తదితరులు పాల్గొన్నారు. -
హ్యుమానిటీ జిందాబాద్
అమ్మ ఒడిలో ఆడుకోవాల్సిన చిన్నారులు, అయినవారితో ఉండాల్సిన మహిళలు అనాథలయ్యారు. ఎవరో చేసిన పాపానికి వీరు శిక్షఅనుభవిస్తున్నారు. అలాంటి వారి కోసం సిటీకి చెందిన పలువురు ఫిట్నెస్ ట్రైనర్లు ‘జిన్’ వేదికగా చేయి కలిపారు. ఆరోగ్యాన్ని మాత్రమే కాదు అసహాయులను ఆదుకోవడంలో కూడా సిటీజనులకు స్ఫూర్తిగా నిలిచారు. జిన్ నేపథ్యం... నగరంలో జుంబా శిక్షకులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారని, వీరిలో అత్యధికులు మహిళలనీ కూడా మనకు తెలుసు. అయితే వీరంతా ఒక వేదికను ఏర్పాటు చేసుకుని ఫిట్నెస్ను మాత్రమే కాదు మంచిని కూడా పంచుతున్నారని చాలా మందికి తెలియకపోవచ్చు. జుంబా ఇన్స్ట్రక్టర్స్ నెట్వర్క్ (జిన్)పేరుతో నెలకొల్పిన ఈ సంస్థ గత కొంత కాలంగా పలు రకాల కార్యక్రమాలు ఏర్పాటు చేసింది. అదే క్రమంలో జిఆర్వైసిఎస్ సహకారంతో నగరంలో ఆదివారం స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాన్ని నిర్వహించింది. జుంబా ఫిట్నెస్ పార్టీ పేరుతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ఎప్పటిలా ఔత్సాహికుల ఆరోగ్యం కోసం మాత్రమే కాదు నగరంలోని చైతన్య మహిళా మండలి అనే ఎన్జీఓ బాగు కోసం కూడా. జుంబా ఫిట్నెస్ పార్టీ... బహుశా నగరంలో ఇలాంటి పార్టీ గతంలో ఎవరూ చూసి ఉండకపోవచ్చు. ఒకవేళ చూసినా వీరు ఎంచుకున్న నేపథ్యం లాంటిది విని ఉండకపోవచ్చు. అవును ఆరోగ్యం కోసం ఫిట్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహించే జుంబా ట్రైనర్లు అనాథల కోసం ఫిట్ ఈవెంట్ నిర్వహించారు. కలిసికట్టుగా ఆరోగ్యకరమైన సమాజం వైపు వేసే అడుగుల్లో మానవత్వాన్ని మేళవించారు. ఈవెంట్ ఇలా.. ఒక్క జుంబా ట్రైనర్ వచ్చి ఈవెంట్ చేస్తేనే ప్రాంగణం అంతా హోరెత్తిపోతుంది. అలాంటిది నగరంలో ఉన్న జుంబా ట్రైనర్లు దాదాపు అందరూ వచ్చి ఫిట్నెస్ పార్టీ అంటూ హెల్తీ స్టెప్స్ వేయిస్తే...వేయిస్తామంటే...ఇక ఆ సందడికి హద్దుంటుందా? అందుకే సిటీలోని ఫిట్నెస్ లవర్స్ ఉర్రూతలూగారు. మాదాపూర్‌లోని ఫినిక్స్ ఎరీనాలో నిర్వహించిన ఈ ఈవెంట్‌కి పెద్ద సంఖ్యలో ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, గృహిణులు సైతం హాజరయ్యారు. ఆనందంగా ఆరోగ్యతాండవం చేశారు. పరోక్షంగా అసహాయులకు ఆసరా అందించారు. గొప్ప‘సాయం’కాలం.. తామెన్నో ఫిట్నెస్ ఈవెంట్స్ నిర్వహించినప్పటికీ ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి దాకా జరిగిన జుంబా నృత్య కార్యక్రమం చాలా విభిన్నమైందని జిన్ నిర్వాహకురాలు చాను చెప్పారు. దీని ద్వారా ఎందరో చిన్నారులకు, అవసరార్ధులకు కొంతైనా సాయం చేయగలిగినందుకు ఆనందంగా ఉందన్నారు. ఈ ఈవెంట్ ద్వారా వసూలైన మొత్తాన్ని సోమవారమే చైతన్య మహిళా మండలి నిర్వాహకులకు అందజేసినట్టు వివరించారు. ఈ తరహాలో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించడానికి ఈ ఈవెంట్ విజయం స్ఫూర్తిని అందించిందన్నారు. అనాథలూ..అన్యాయానికి గురైనవాళ్లూ.. గత 15 సంవత్సరాలుగా చైతన్య మహిళా మండలి (సీఎంఎం) ఆధ్వర్యంలో హ్యూమన్ ట్రాఫికర్స్ బారిన పడిన మహిళలను, చిన్నారులను రక్షించి ఆశ్రయం అందిస్తోంది. వీరికి నీడనివ్వడంతో పాటు ట్రౌమా కౌన్సిలింగ్, నాణ్యమైన విద్య, వైద్య సేవలు, పోషకాహారం, సైకాలజిస్ట్ సేవలు అన్నీ అందిస్తోంది. ఇక్కడ 42 మంది బాలికలు మంచి విద్యను అందుకుంటున్నారు. తల్లిదండ్రులు లేని పిల్లలు, అలాగే బలవంతంగా వ్యభిచార కూపంలోకి దింపబడిన మహిళల పిల్లలను కూడా ఈ సంస్థ చేరదీసి వారు నరక కూపంలో ఇరుక్కోకుండా తగిన పోషణ అందిస్తోంది. -
అనాథలే ఆదాయం!
నగర శివారు ప్రాంతాల్లోనే పెద్ద ఎత్తున ప్రభుత్వ అనుమతి లేని కేంద్రాలు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా పరిధిలో ఇలాంటి కేంద్రాల దందా బçహాటంగా కొనసాగతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ జిల్లా పరిధిలో సుమారు 71 అనాథ పిల్లల సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. అందులో ఏడు ప్రభుత్వ అనాథ అశ్రమాలు కాగా, మిలిగిన 64 కేంద్రాల్లో 51 కేంద్రాలు ఐదేళ్ల కాలపరిమితి గల లైసెన్స్‌తో నడుస్తున్నాయి. మిగిలిన 13 సంస్థలకు ఆరు నెలల కాలపరిమితి గల ప్రొవిజన్ లైసెన్స్ ఉన్నాయి. తొమ్మిది సంస్థలను ప్రభుత్వ అనుమతులు లేకుండానే నిర్వాహిస్తున్నారు. మేడ్చల్ పరిధిలో 120 వరకు అనాథ చిన్నారుల సంరక్షణ కేంద్రాలు ఉండగా వాటిలో సగానికి పైగా లైసెన్స్‌తో పాటు కనీస ప్రభుత్వ అనుమతి కూడా లేనట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా పరిధిలో 100కి పైగా ఉన్న సంస్థల్లోనూ అదే పరిస్థితి ఉన్నట్టు అధికారలు గుర్తించారు. ఆయా అక్రమ కేంద్రాల నిర్వాహకులు బహాటంగా అడ్డదార్లు తొక్కుతున్నా సంబంధిత అధికారులు చూసీ చూడనట్లు వ్యవహారస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాక్షి,సిటీబ్యూరో: విశ్వనగరి వైపు పరుగులు తీస్తున్న హైదరాబాద్‌లో ‘అనాథ పిల్లల సంరక్షణ’ నిర్వాహకులకు కాసులు కురిపిస్తోంది. సేవ ముసుగులో అడ్డదార్లు తొక్కుతున్నారు. కొన్ని సంస్థలు నిజాయితీగా అనాథ పిల్లకు సేవ చేస్తుండగా.. మరికొన్ని స్వచ్ఛద సంస్థలు మాత్రం అనాథల సంరక్షణ కేంద్రాల పేరుతో పిల్లలను చేర్చుకుని వారితో ముఖ్య కూడళ్లలో డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్నారు. అందుకు ఆయా కూడళ్లలో వాహనదారుల నుంచి ‘అనాథలకు సహాయం’ పేరుతో వసూళ్లు చేయిస్తుండగా, మరి కొన్ని సంస్థలైతే ఏకంగా చిన్నారులతో భిక్షాటన చేయిస్తున్న సంఘటనలు కూడా ఉన్నాయి. ఫలితంగా ‘అనాథ చిన్నారుల సంరక్షణ’ కొందరికి ఉపాధి కేంద్రాలుగా మారుతున్నాయనే విమర్శలు వ్యక్తముతున్నాయి. నగరంలో చందాలు, భిక్షాటన దందాకు అడ్డూ అదుపూ లేని కారణంగా పలువురు నిర్వాహకులు అనాథ పిల్లలను పావుగా వాడుకుంటున్నట్లు తెలుస్తోంది. నగరంలో 300కు పైగా కేంద్రాలు రాష్ట్రంలోనే అత్యధికంగా అనాథ పిల్లల సంరక్షణ కేంద్రాలు హైదరాబాద్ నగరంలోనే ఉన్నట్లు అధికార లెక్కలు చెబుతున్నాయి. ఇక్కడ దాదాపు 300కు పైగా కేంద్రాలు నడుస్తున్నట్టు చెబుతున్నారు. వాటిలో 40 శాతం కేంద్రాలకు మాత్రమే ప్రభుత్వ అనుమతి ఉండగా, మిగిలిన కేంద్రాలు ఎలాంటి అనుమతి లేకుండానే కొనసాగుతున్నాయి. అనాథ పిల్లలకు ఆశ్రయం కల్పించాలంటే కేంద్రాల నిర్వహణకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ప్రభుత్వ పరంగా అనుమతి పొందాలంటే ఎన్నో కఠిన నిబంధనలు పాటించాలి. లైసెన్స్ అంత సులభం కాదు. నిబంధనల ప్రకారం ప్రభుత్వ రిజిస్ట్రేషన్ శాఖలో సొసైటీ, లేదా ట్రస్ట్ కింద నమోదైన స్వచ్ఛంద సేవా సంస్థలు అనా«థ పిల్లల సంరక్షణ కేంద్రాలు, అనాథ ఆశ్రమాల ఏర్పాటు చేసుకునేందుకు వెసులుబాటు ఉంటుంది. కనీసం మూడేళ్ల అనుభవం గల స్వచ్ఛంద సంస్థలు మాత్రమే అనాథ పిల్లల సంరక్షణ కేంద్రాల ఏర్పాటు అనుమతి పొందే అవకాశం ఉంది. సంస్థ నియమ నిబంధనలు, అనుభవం, అర్థిక వనరుల సమీకరణ, అనా«థ చిన్నారుల సంరక్షణ సామర్థ్యం, చిన్నారులకు డైట్, కనీస వసతులు వంటి అంశాలపై అధికారులు సంతృప్తి చెందాలి. అప్పుడే అనుమతి ఇస్తారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నాక అన్ని అంశాలు సరిగా ఉంటే ఆరునెలల కాలపరితితో కూడిన ప్రొవిజన్ లైసెన్స్ జారీ అవుతుంది. తర్వాత ఐదుగురు జిల్లా స్థాయి అధికారుల విచారణ కమిటీ పూర్తిస్థాయి విచారణ జరిపి కేంద్రాల పనితీరు బట్టి రాష్ట్ర స్థాయి విచారణ కమిటీకి సిఫార్సు చేస్తుంది. రాష్ట్ర స్థాయి కమిటీ కూడా మరోసారి విచారణ జరిపి నిబంధనలకు లోబడి ఉంటే ఐదేళ్లకు అనుమతి ఇస్తుంది. అయితే, ప్రస్తుతం కొనసాగుతున్న అనాథ పిల్లల సంరక్షణ కేంద్రాల్లో చాలావాటికి ఎలాంటి లైసెన్స్ లేకపోవడం గమనార్హం. -
క్షణకాల కాంక్ష.. పిల్లలకు జీవితశిక్ష
తంబళ్లపల్లెకు చెందిన ఓ మహిళ తిరుపతిలో కూలి పనులు చేసుకొంటున్న సమయంలో అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తిని వివాహం చేసుకుంది. కొన్ని రోజులకే భార్యాభర్తలిద్దరూ స్వగ్రామం వచ్చేశారు. ఈ క్రమంలోనే ఉపాధి కోసం భర్త కోరిక మేరకు ఆమె కువైట్ వెళ్లి వచ్చింది. తిరిగొచ్చిన అనంతరం మళ్లీ కేరళకు భర్తతో కలిసి కూలి పనులకు వెళ్లింది. నాలుగు నెలల కిత్రం నయంకాని వ్యాధితో మంచానికే పరిమితమైంది. భర్త ఆమెను వదిలేసి తిరుపతి వెళ్లిపోయాడు. ఎముకల గూడుగా మారిన ఆ మహిళను రెండు నెలల క్రితం రాత్రిపూట ఆటోలో తీసుకొచ్చి బంధువులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో వదిలేసి వెళ్లిపోయారు. ఇరవై రోజులు మృత్యువుతో పోరాడి మహిళ కన్నుమూసింది. ఈమెకు ఒక కుమార్తె. మదనపల్లె కొత్త ఇండ్లకు చెందిన ఓ మహిళ ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లింది. కొన్ని సంవత్సరాల అనంతరం స్వగ్రామానికి తిరిగి వ చ్చింది. ఈ నేపథ్యంలో నెల్లూరు నుంచి గ్రామానికి వచ్చి మేస్త్రి పని చేసుకొంటున్న ఓ వ్యక్తితో స్థానికులు ఆదర్శ వివాహం జరిపించారు. వీరికి ఇద్దరు పిల్లలు. ప్రభుత్వం మంజూరు చేసిన పక్కాగృహాన్ని నిర్మించుకొన్నారు. ఇంతలో నయం కాని వ్యాధి ఇద్దరినీ కబళించింది. తల్లిదండ్రులు చనిపోవడంతో ఆ పిల్లలు అనాథలయ్యారు. ప్రస్తుతం వారు ఏమయ్యారో కూడా చెప్పేవారు లేరు. వాల్మీకిపురంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ భర్త వదిలేయడంతో ఉపాధి కోసం పూణే వెళ్లింది. ఆమెకు ఓ కుమారుడు. పూణె నుంచి స్వగ్రామానికి తరచూ వస్తూ బిడ్డను చూసుకునేది. ఈ క్రమంలోనే నయంకాని వ్యాధిబారిన పడడంతో మహిళ కన్నుమూసింది. కుమారునికీ వ్యాధి సోకడంతో తండ్రి పట్టించుకోలేదు. నానమ్మ సహకారంతో ప్రస్తుతం ఆ బాలుడు ఇంటర్ చదువుతున్నాడు. ఆమె కూడా ప్రస్తుతం నడవలేని స్థితికి చేరింది. దీంతో చదువు అర్ధంతరంగా ఆగిపోతుందని, దాతలు ఆదుకుని ఆర్థిక సాయం అందించాలని ఆ విద్యార్థి వేడుకుంటున్నాడు. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు వందల సంఖ్యలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు దుర్భర జీవితాలను వెళ్లదీస్తున్నారు. తల్లిదండ్రులు తెలిసో తెలియకో చేసిన తప్పులకు జీవితాంతం శిక్షకు గురవుతున్నారు. చిత్తూరు ,మదనపల్లె టౌన్: కరువు కోరల్లో చిక్కుకుని కొందరు, విలాసవంతమైన జీవితాన్ని గడిపేందుకు ఇంకొందరు, ఉపాధి లేక మరికొందరు. ఉన్నత చదువులు చదివినా ఉద్యోగాలు రాని నిరుద్యోగ యువతులు, మహిళలు అధికంగా వేశ్య వృత్తిని ఎంచుకుని వ్యభిచార ఊబిలో కూరుకుపోతున్నారు. డబ్బుమీద వ్యామోహంతో రెడ్‌లైట్ ఏరియాలైన ముంబయి, పూణె, ఢిల్లీ, కలకత్తా, బెంగళూర్, సింగపూర్ తదితర ప్రాంతాలకు వెళ్లి హెచ్ఐవీ బారిన పడి జీవితాలను నరకప్రాయం చేసుకుని రక్త సంబంధీకులకు దూరమవుతున్నారు. పబ్బులు, వేశ్య గృహాలకు వెళ్లి నయంకాని వ్యాధిబారిన పడుతున్నారని కొన్ని సంస్థల సర్వేలు చెబుతున్నాయి. అలా వ్యాధుల బారిన పడుతున్న వారు అధికంగా మదనపల్లెతో పాటు, పడమట మండలాలైన పీటీఎం, బి. కొత్తకోట, ములకలచెరువు, తంబళ్లపల్లె, పెద్దమండ్యంలలో గత ఐదేళ్లలో 23 వేల మందికి పైగా బాధితులు ఉన్నారు. వారిలో ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య ఏడు వేలకుపైనే ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. అనాథలవుతున్న పిల్లలు.. అలా చనిపోయిన వారి అయినవారి ఆదరణకు దూరమై అనాథలుగా మారుతున్నారు. తల్లిదండ్రులు తెలిసో తెలియకో చేసిన తప్పులకు వీరికి జీవిత కాల శిక్ష పడుతోంది. రక్తసంబంధీకులు కూడా అక్కున చేర్చుకోవడానికి నిరాకరిస్తున్నారు. కానరాని ప్రభుత్వ చర్యలు.. గతంలో ప్రభుత్వాలు డీఆర్డీఏ ఆధ్వర్యంలో ఉపాధికోసం ఇతర ప్రాంతాలకు వెళ్లే మహిళలు, యువతులను గుర్తించి పునరావాసం కల్పించేందుకు చర్యలు తీసుకుంది. అప్పట్లో ఒక్కొక్కరికీ రూ. 1000 కూడా అందించేవారు. దీంతో ఎంతో కొంత వారికి భరోసా లభించేది. ప్రస్తుత ప్రభుత్వం ఇలాంటి చర్యలేవీ చేపట్టడం లేదు. పునరావాస చర్యలు తీసుకుంటే కొంతైనా తగ్గించ వచ్చని పలువురు చెబుతున్నారు. ఆదరించని కుటుంబసభ్యులు.. వ్యాధి నిరోధక శక్తిని కోల్పోయి బాధపడుతున్న మహిళలు, పురుషులు కుటుంబసభ్యుల నిరాదరణకు గురవుతున్నారు. వ్యాధి తీవ్రత ఎక్కువై మంచం పట్టిన బాధితులను పట్టిం చుకోవడం లేదు. పైగా వారే అర్ధరాత్రి సమయాల్లో తీసుకొచ్చి మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రిలో వదలి వెళుతున్నారు. వారిని సిబ్బంది క్రానిక్ వార్డులో చేర్చి చికిత్సలు అందిం చినా ఫలితం లేక చేరిన నెల రోజుల్లోపే చనిపోతున్నారు. చనిపోయిన మృతదేహాన్ని కూడా కుటుంబసభ్యులు తీసుకెళ్లని పరిస్థితి. దీంతో కుళ్లి దుర్వాసన వస్తున్న మృతదేహాలను ఆస్పత్రి సిబ్బంది పోలీసుల సహకారంతో మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు అప్పగిస్తున్నారు. వారు ఆ మృతదేహాలను పట్టణానికి దూరంగా తీసుకెళ్లి వాగుల్లో పాతిపెట్టి వస్తున్నారు. -
అనాథాశ్రమం బాలలతో భిక్షాటన
ప్రొద్దుటూరు క్రైం : అనాథ ఆశ్రమం పేరుతో పసి పిల్లల చేత భిక్షాటన చేయిస్తున్న శ్రీ చౌడేశ్వరి ఫౌండేషన్ నిర్వాహకులపై రూరల్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. పిల్లల చేత భిక్షాటన చేస్తున్నారని సమాచారం రావడంతో డిస్ట్రిక్ట్ లెవెల్ ఇన్స్పెక్షన్ టీం గురువారం సాయంత్రం ఆశ్రమాన్ని తనిఖీ చేశారు. తనిఖీల్లో భిక్షాటన చేయిస్తున్నట్లు వాస్తవాలు వెల్లడి కావడంతో వారు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన మేరకు పాపయ్య, సరోజమ్మతో పాటు కొందరు కలిసి ప్రొద్దుటూరు మండలంలోని అమృతానగర్‌లో ఐదేళ్ల నుంచి శ్రీ చౌడేశ్వరి ఫౌండేషన్ అనాథ, పేద పిల్లల ఆశ్రమ పాఠశాలను నిర్వహిస్తున్నారు. ఆశ్రమంలో 14 మంది పిల్లలతో పాటు చైల్డ్వెల్ఫేర్ కమిటీ అనుమతి లేకుండా మరో ముగ్గురు పిల్లలు ఉంటున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పిల్లలకు ఆశ్రమంలో అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో విద్యాబోధన జరగాల్సి ఉంది. అయితే ఆశ్రమ నిర్వాహకులు పసి పిల్లలను పాఠశాలకు పంపకుండా రోజూ భిక్షాటనకు తీసుకొని వెళ్తున్నారు. రోజు ఆటోలో కూర్చోపెట్టుకొని, వారి చేతికి అనాథ పిల్లలమనే కరపత్రాన్ని ఇచ్చి రోజుకో వీధికి తీసుకొని వెళ్లి వదిలి పెడుతున్నారు. వారు రోజుకు రూ. వందల్లో డబ్బు తీసుకొని రాగా కేవలం తమకు 10 రూపాయలు మాత్రమే ఇస్తున్నారని పిల్లలు సీడబ్ల్యూసీ అధికారుల విచారణలో వెల్లడించారు. పిల్లలలను మరో ఆశ్రమంలో చేర్పిస్తాం ఆశ్రమాన్ని తనిఖీ చేసిన సమయంలో రికార్డులో ఉన్న 14 మందితో పాటు అనధికారికంగా ఉన్న ముగ్గురు పిల్లలను సీడబ్ల్యూసీ అధికారులు పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. ముగ్గురు పిల్లలను జిల్లా అధికారుల అనుమతితో మంచి ఆశ్రమంలో చేర్పించి మెరుగైన ఆశ్రమంలో చేర్పిస్తామని డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అధికారి ఎల్లారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో అనేక ఆశ్రమాల్లో చాలా దారుణాలు జరిగాయని, దీన్ని దృష్టిలో ఉంచుకొని జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేస్తున్నామని చెప్పారు. జిల్లాలో 44 అనాథ బాలల ఆశ్రమాలు ఉండగా వాటిలో 37 స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నడుస్తుండగా, 7 ఆశ్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు. పిల్లలకు విద్యను అందిచకుండా వారి హక్కులను హరిస్తున్న నిర్వాహకులపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. పసి పిల్లల చేత భిక్షమెత్తించడం నేరమని ఆయన తెలిపారు. 14 మంది పిల్లల తల్లి దండ్రులను పిలిపించి విచారణ చేస్తామన్నారు. ఆ తర్వాత జిల్లా అధికారుల ఆదేశాల ప్రకారం నడుచుకుంటామని తెలిపారు. సీడబ్ల్యూసీ టీం సభ్యులు డాక్టర్ ప్రసన్నలక్ష్మి, చైల్డ్వెల్ఫేర్ కమిటీ సభ్యురాలు వరమ్మ, డీసీపీఓ శివకుమార్‌రెడ్డిలతో సీఐ ఓబులేసు మాట్లాడారు. అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు. -
కదిలించిన ‘నువు లేక అనాథలం’
కదిరి(అనంతపురం జిల్లా): నేను.. నా కుటుంబం.. అనే స్వార్థాన్ని పక్కనపెట్టి ఇతరుల కష్టాలను కూడా తమవిగా భావించే మనసులు కూడా ఈ సమాజంలో ఉన్నాయని మరోసారి నిరూపితమైంది. అనారోగ్యంతో తల్లిదండ్రులు మృతి చెందగా ముగ్గురు పిల్లలు పంప్‌హౌస్‌లో దుర్భర జీవనం గడుపుతున్న వైనాన్ని ‘నువు లేక అనాథలం’ శీర్షికన ‘సాక్షి’ ఈనెల 5వ తేదీన ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈ కథనం ఎన్నో హృదయాలను కదిలించింది. ఆ పిల్లలు అనాథలే కావచ్చు.. కానీ మేమంతా బంధువులమేనంటూ ఎంతో మంది ముందుకొచ్చారు. వాళ్లను చదివించడంతో పాటు బాగోగులనూ చూసుకుంటామని భరోసానిచ్చారు. వీరిలో జిల్లా కలెక్టర్ వీరపాండియన్ ఒకరు. ఉదయాన్నే కథనం చదివిన ఆయన ఆర్డీఓ రామమోహన్ ఫోన్లో సంప్రదించారు. ఆ పిల్లలను తక్షణం ఆదుకునే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఆ మేరకు తలుపుల మండల తహసీల్దార్ శివయ్య పిల్లలు నివాసం ఉంటున్న పంప్‌హౌస్ వద్దకు చేరుకుని వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన నివేదికను కలెక్టర్‌కు పంపుతామన్నారు. తక్షణ సాయంగా 25 కిలోల బియ్యం అందజేశారు. అక్కడికక్కడే ఇల్లును మంజూరు చేశారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదివించేందుకు కలెక్టర్ సుముఖంగా ఉన్నట్లు వెల్లడించారు. ఇకపోతే ఎంతో మంది దాతలు కథనానికి స్పందించి ‘సాక్షి’ని ఫోన్లో సంప్రదించారు. పిల్లలను ఆదుకునేందుకు తామున్నామంటూ ముందుకొచ్చారు. తమ సమాచారం చెప్పేందుకు ఇష్టంలేని ఎంతో మంది నేరుగా వైష్ణవి బ్యాంకు ఖాతాలో నగదు జమ చేస్తున్నారు. ఆర్డీటీ సంస్థ తరపున ఆ మండల ఏటీఎల్ రాధ అక్కడికి చేరుకొని ఆ ముగ్గురు పిల్లలను వారు కోరుకున్న చోట చదివించడానికి ఆర్డీటీ సంస్థ సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇందుకు ఆ పిల్లలు కూడా సంతోషం వ్యక్తం చేస్తూ వేసవి సెలవుల అనంతరం తాము ఆర్డీటీ సంస్థ సహకారంతోనే చదువుకుంటామని తెలిపారు. చిన్నారుల వివరాలు సేకరిస్తున్న తలుపుల తహసీల్దార్ శివయ్య, ఆర్డీటీ సిబ్బంది ♦ వైఎస్సార్సీపీ ఐటీ వింగ్ ప్రవాసాంధ్రులు సైతం పిల్లలకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. మిత్రులంతా కలిసి పెద్ద మొత్తంలో నగదు పోగుచేసి వైష్ణవి బ్యాంకు ఖాతాలో జమ చేస్తామన్నారు. ♦ బెంగళూరుకు చెందిన శ్రీధరి అనే మహిళ ఆ పిల్లలకు ప్రతి నెలా రూ.500 చొప్పున సాయం అందించేందుకు ముందుకొచ్చారు. ♦ లక్ష్మీపతి అనే ఆర్మీ ఉద్యోగి ఆ పిల్లలకు రూ.5 వేలు సాయం ‘సాక్షి’లో కనబరచిన బ్యాంకు ఖాతాలో జమ చేస్తానన్నారు. ♦ కదిరి మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ రూ.1.10 లక్షల ఆర్థిక సాయం ఆ పార్టీ తలుపుల మండల నాయకుడు ఎద్దుల రాముడు ద్వారా అందించారు. ♦ కొత్తచెరువుకు చెందిన వెంకీ హీరో షోరూం యజమాని వెంకటేష్ రూ.5వేల నగదు జమచేశారు. ♦ కళ్యాణదుర్గంకు చెందిన రైతు పైనేటి శ్రీనివాస చౌదరి రూ.5 వేలు జమచేశారు. మరో రూ.5 వేలు రేపో, మాపో జమచేస్తానన్నారు. ♦ తలుపులకు చెందిన బెంగళూరు సాఫ్ట్వేర్ ఇంజినీర్ కొత్తపల్లి రాంప్రసాద్‌రెడ్డి వైష్ణవి బ్యాంకు ఖాతాలో రూ.1500 జమ చేశారు. ♦ మైసూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ బడబాగ్ని జగదీశ్వర రాజు వైష్ణవి బ్యాంకు ఖాతాలో రూ.10వేలు జమ చేశారు. ♦ అనంతపురంకు చెందిన శ్రీకాంత్ రెడ్డి రూ.3వేలు నగదు వేశారు. -
ఆమెది స్పందించే హృదయం..
సాక్షి, సిటీబ్యూరో: ఆర్పీ పట్నాయక్ దర్శకత్వంలో ఇటీవల నిర్మించిన ‘తథాస్తు‘ షార్ట్ ఫిల్మ్ కేవలం ఒకే ఒక్కరోజులోనే లక్షకుపైగా వ్యూస్ దాటిన విషయం విదితమే. అది ఇప్పటికి 4 లక్షల వ్యూస్‌తో అందరి అభిమానం పొందుతోంది. ఇందుకు కారణం ‘ఎంతోమంది అనాథలుగా జీవనం కొనసాగిస్తున్న ఈ సమాజంలో ఒక శాశ్వత పరిష్కారాన్ని చూపిస్తూ వయసుతో సంబంధం లేకుండా అన్ని వర్గాల వారూ ఈ తరంలో ఎలా మార్పు తేవచ్చొ ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా దర్శకుడు ‘ఆర్పీ పట్నాయక్‘ అద్భుతంగా రూపొందించారు. ఇందులో ప్రధాన పాత్రను సుమ కనకాల పోషించారు. ఈ కథలో తమ పాప పుట్టిన రోజును అందరివలే సాదాసీదా పార్టీలతో కానిచ్చేయకుండా.. అనాథ పిల్లలతో కలిసి జరుపుకొని వారి కడుపు నిండటంతో పాటు ఆనందం పంచినట్టవుతుందని.. తన పాపకు సర్ప్రైజ్ ఇవ్వటమే ‘తథాస్తు’ అసలు సారాంశం. నిజంగా అలాగే.. కేవలం తాను నటించిన ఈ షార్ట్ ఫిల్మ్ వరకే పరిమితం కాకుండా నిజజీవితంలో సైతం పుట్టిన రోజైన మార్చి 22న భర్త రాజీవ్ కనకాల, అత్త, కూతురు, బంధువులతో గురువారం సికింద్రాబాద్‌లోని ‘సర్వ్ నీడి’ అనాథాశ్రమానికి వచ్చారు సుమ. అక్కడి 30 మంది అనాథ పిల్లలతో మూడు గంటల పాటు గడిపారు. వారి ఆటాపాటలను వీక్షిస్తూ కబుర్లు చెప్పారు. పిల్లలకు మిఠాయిలు, పండ్లు పంచి పెట్టారు. కేక్ కట్ చేసి పిల్లలతో భోజనం చేశారు. సంస్థ నిర్వాహకుడు గౌతమ్‌కుమార్‌తో చర్చించారు. సంస్థ సేవలను కొనియాడారు. తన పుట్టిన రో జును అనాథ పిల్లల మధ్య జరుపుకోవడం మరిచిపోని సంతృప్తినిచ్చిందని సుమ వివరించారు. ఆమెది స్పందించే హృదయం.. సుమ బుల్లి తెర యాంకర్ మాత్రమే కాదు. సందర్భాన్ని బట్టి ఎదుటి వారి అవసరాన్ని బట్టి స్పందించే హృదయం ఆమెది. సాటివారికి సాయం చేయాలనేది ఆమె మనస్తత్వం. ‘తథాస్తు’ షార్ట్ ఫిల్మ్‌లో నటించేందుకు రియల్ లైఫ్ జెన్యూన్ హ్యూమన్ కావాలనే ఉద్దేశంతో సుమను ఒప్పించాను. మా యూనిట్ తరపున ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు. – ఆర్పీ పట్నాయక్ -
అనాథల అమ్మ
నంద్యాలటౌన్: ఆమె గిరిజన మహిళ. చదివింది ఇంటర్. ఆర్థిక, రాజకీయ బలం లేదు. కుటుంబ సభ్యులందరూ కులవృత్తి అయిన బుట్టలు అల్లుకునేవారే. సమాజ సేవ చేయాలన్న తలంపుతో ఆమె స్టార్ సొసైటీ స్థాపించారు. బడి బయట ఉన్న బాల కార్మికులను, అనాథ పిల్లలను అక్కున చేర్చుకొని ఆశ్రయం కల్పిస్తున్నారు. ఆమె సేవలకు ఎన్నో ప్రశంసలు వచ్చాయి. అవార్డులు సైతం వరించాయి. అందరిచేత మన్ననలు అందుకుంటున్న ఎరుకలి రాజేశ్వరమ్మ స్ఫూర్తిగాథ ఇదీ.. గోస్పాడు గ్రామానికి చెందిన ఈశ్వరమ్మ, సుబ్బరాయుడుల రెండో సంతానం రాజేశ్వరమ్మ. వీరికి ఎలాంటి ఆస్తులు లేవు. గుడిసెలో జీవనం. బుట్టలు అల్లుకుని జీవించారు. తలిదండ్రుల రెక్కల కష్టంతో రాజేశ్వరమ్మ ఒకటి నుంచి పదో తరగతి వరకు గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుకున్నారు. ఇంటర్ నంద్యాలలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో పూర్తి చేశారు. ఆర్థిక కారణాలతో తల్లిదండ్రులు చదువు మాన్పించడంతో కొన్ని రోజులు ఇంటి వద్దనే ఉంటూ బుట్టలు అల్లేవారు. ఈ సమయంలో సమాజ సేవ చేయాలనే తలంపు వచ్చింది. తనలాంటి పేదలకు సాయం చేయా లనే ఆలోచనతో తన స్నేహితుడైన సుబ్బరాయుడుతో కలిసి స్టార్ సొసైటీని 2000 సంవత్సరంలో స్థాపించారు. ఈ స్టార్ సొసైటీ ద్వారా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూ.. బడి బయట ఉన్న పిల్లలను పాఠశాలల్లో చేర్చేవారు. రాజేశ్వరి సేవలను గుర్తించిన బాలకార్మిక పునరావాస సంస్థ అధికారులు స్టార్ సొసైటీకి ఎన్సీఎల్పీ కింద ప్రభుత్వ నిధులతో బాల కార్మిక పాఠశాలను మంజూరు చేశారు. ప్రస్తుతం 50 మంది బాలకార్మిక విద్యార్థులతో ఈ పాఠశాల నంద్యాల పట్టణంలోని నందమూరినగర్‌లో విజయవంతంగా కొనసాగుతోంది. అలాగే అహోబిలం లో మరో పాఠశాలను 50 విద్యార్థులతో ప్రభు త్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. స్నేహితుడైన సుబ్బరాయుడును 2007లో ఈమె ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరిద్దరు కలిసి స్టార్ సొసైటీ సేవలను విస్తరించారు. నిరాశ్రయులకు వసతి గృహం.. నంద్యాల పట్టణంలోని నందమూరినగర్‌లో 2015లో నిరాశ్రయుల వసతి గృహం ఏర్పాటు చేశారు. అనాథ పిల్లలందరినీ వసతి గృహంలో చేర్చుకొని వారికి ఉచిత భోజనం, వసతితో పాటు విద్యాబుద్ధులను నేర్పిస్తున్నారు. నంద్యాల డివిజన్లో తప్పిపోయిన పిల్లలు, అనాథ పిల్లలు కనిపిస్తే పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు రాజేశ్వరమ్మకు ఫోన్ చేస్తున్నారు. సొంత ఖర్చులతో నిర్వహిస్తున్న ఈ వసతి గృహం అనతి కాలంలోనే జిల్లాలో పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం ఇక్కడ 30మంది ఆశ్రయం పొందుతున్నారు. పురస్కారాలివీ.. ♦ 2010లో ఉత్తమ ఎన్జీఓగా గుర్తింపు ♦ 2011లో గవర్నర్ నరసింహన్ చేతుల మీదుగా అవార్డు స్వీకరణ ♦ 2011లో రాజీవ్ విద్యామిషన్ ద్వారా అవార్డు అందజేత ♦ ఉత్తమ మహిళగా గుర్తించి 2017 మార్చిలో అవార్డు అందజేత ♦ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యురాలుగా నియామకం. సేవలు ఇవీ.. స్టార్ సొసైటీ ద్వారా రాజేశ్వరమ్మ పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. నంద్యాల పట్టణంలో టైలరింగ్ ప్రోగ్రాం కింద 2 వేల మంది మహిళలకు కుట్టు శిక్షణ ఇప్పించారు. అప్పటి జిల్లా కలెక్టర్ విజయమోహన్ చేతుల మీదుగా కుట్టు శిక్షణ తీసుకున్న మహిళలకు డీఆర్డీఏ సహకారంతో ఉచితంగా కుట్టుమిషన్లను ఇప్పించారు. రాజీవ్ విద్యా మిషన్ ద్వారా ప్యాపిలి మండలం పీఆర్‌పల్లె గ్రామంలో వలసల నివారణ ప్రభుత్వం కేంద్రాన్ని స్థాపించగా.. పలువురు విద్యార్థులను రాజేశ్వరమ్మ ఈ కేంద్రంలో చేర్పించి జిల్లా కలెక్టర్ చేత ప్రశంసలు పొందారు. -
పేదలు..అనాథ పిల్లలకు రక్షణగా ప్రభుత్వం
- 2016-17 నుంచి కేజీ టు పీజీ విద్య - డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి - ఉద్యమాల ఖిల్లా.. ఓరుగల్లు : నాయిని నర్సింహారెడ్డి - ఎస్సెస్సీ, ఇంటర్ ప్రతిభా విద్యార్థులకు ప్రజ్ఞాపురస్కారాల అందజేత కరీమాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని పేద, అనాధ పిల్లలకు రక్షణగా కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం కృషి చేస్తోందని డిప్యూటీ సీఎం క డియం శ్రీహరి అన్నారు. వరంగల్ జిల్లాలో ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షల్లో ప్రతిభ చూపిన ప్ర భుత్వ పాఠశాలలు, కళాశాలలకు చెందిన వి ద్యార్థులకు ప్రజ్ఞా పురస్కారాలను బుధవా రం అందజేశారు. వరంగల్ నగరంలోని రంగశాయిపేట గణపతి ఇంజనీరింగ్ కళాశాలలో లర్న్ టు లైవ్ ఫౌండేషన్ చైర్మన్, కీ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ సీఈఓ జ్యోతిరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి హాజరయ్యూరు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2016-17 సంవత్సరం నుంచి కేజీ టు పీజీ ఉచిత విద్య అందించనున్నట్లు చెప్పారు. కామన్ స్కూల్ విధానం తీసుకురానున్నట్లు వివరించారు. అనాథలు, పేద పిల్లలకు అండగా ఉంటూ వారి అభివృద్ధికి పాటుపడుతున్న జ్యోతిరెడ్డి అభినందనీయురాలన్నారు. రాష్ట్ర హోం, కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ ఓరుగల్లు పోరుగల్లు అని, ఉద్యమ ఖిల్లా అన్నారు. అలాంటి గడ్డమీద కష్టపడి చిదివి ఉన్నత స్థాయికెదిగిన జ్యోతిరెడ్డి అమెరికాకు వెల్లినా ఇక్కడి అనాధ, పేద పిల్లల కోసం పాటుపడుతుండడం ఆదర్శనీయమన్నారు. అనాథ పిల్లలకు అడ్రస్ ఏర్పాటు చేయడం, వారి భవిష్యత్‌కు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూడడం ప్రభుత్వ ధ్యేయమన్నారు. విద్యావ్యవస్థ బాగుపడితేనే అంతా బాగుపడుతుందన్నారు. లర్న్ టు లైవ్ ఫౌండేషన్ చైర్మన్ జ్యోతిరెడ్డి మాట్లాడుతూ పేదల కళ్లల్లో ఆనందం చూడాలనే ఉద్దేశంతో తాను ఈ సేవా కార్యక్రమం చేస్తున్నామన్నారు. దేశంలో 3 కోట్ల మంది అనాథలున్నారని, వారికి విద్య, భవిష్యత్, చిరునామా, హక్కుల కోసం కృషి చేస్తామన్నారు. ఇలాంటి అనాథలు, పేద పిల్లలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. ఈ సందర్బంగా టెన్త్‌లో ఒకరు, ఇంటర్లో ఇద్దరు విద్యార్ధులకు రూ.10 వేల చొప్పున రూ.30 వేల నగదుతో పాటు బ్యాగు, మెమొంటో, సర్టిఫికెట్లను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి చేతుల మీదుగా అందించారు. మరో 85 మంది విద్యార్థులకూ మెమొంటోలు, సర్టిఫికెట్లు, బ్యాగులు అందించారు. ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ బాస్కర్, అరూరి రమేష్, చల్లా ధర్మారెడ్డి, డీఐజీ మల్లారెడ్డి, ఎస్పీ అంబర్కిషోర్జా, టీఆర్ఎస్ జిల్లా, అర్బన్ అధ్యక్షులు టి.రవీందర్రావు, నన్నపునేని నరేందర్, వాగ్దేవి విద్యాసంస్థల అధినేత దేవేందర్రెడ్డితోపాటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. పాఠశాలల్లో ల్యాబ్‌లు ఏర్పాటు చేయూలి కరీమాబాద్ : ప్రభుత్వ పాఠశాలల్లో ప్రయోగశాలలు ఏర్పాటు చేస్తే విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుందని, ఈ మేరకు ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, హోంశాఖ మంత్రి నారుుని నర్సంహారెడ్డిని చేర్యాల జెడ్పీఎస్ఎస్ విద్యార్థిని ఎ.సమత కోరింది. వారు నవ్వుతూ... కచ్చితంగా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
అనాథ బాలలకు గుర్తింపునివ్వాలి
బంజారాహిల్స్(హైదరాబాద్): రాష్ట్రంలో ఉన్న అనాథ బాలలకు గుర్తింపునిచ్చే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కీస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ సీఈవో దూళిపాళ్ల జ్యోతిరెడ్డి కోరారు. మంగళవారం ఆమె బంజారాహిల్స్ రోడ్ నంబర్12లోని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డిని ఆయన నివాసంలో టీపీసీసీ నేత ఉదయ్చందర్రెడ్డితో కలసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. తెలంగాణలో11 లక్షల మంది అనాథలున్నారని, వారందరికీ గుర్తింపు లేకపోవడం వల్ల సామాజిక సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం సన్న బియ్యంతో సరిపెట్టుకుంటోందని చెప్పారు. ప్రతిపక్ష నేతగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉందని ఆమె సూచించారు. అనాథలకు ఆధార్ కార్డు ఇవ్వడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని, వారు చదువు కోవడానికి వీలుంటుందని చెప్పారు. ఈ విషయమై త్వరలోనే ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని కూడా కలసి విన్నవించనున్నట్లు తెలిపారు. -
చిన్నారుల కోసం ఓ రాజభవనం
అనాథ పిల్లల కోసం నిజాం ప్రభువు ఏర్పాటు చేసిన అందమైన ప్యాలెస్ విక్టోరియా మెమోరియల్ హోమ్ అండ్ ఇండస్ట్రియల్ స్కూల్. నగరంలోని గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌కు ఎదురుగా 64ఎకరాల విస్తీర్ణంలో ఉందా ప్యాలెస్. మార్నింగ్‌వాక్‌కు వెళ్లే ఏ కొద్ది మందికో తప్ప నూరేళ్లకు పైబడిన చరిత్ర ఉన్న ఆ ప్యాలెస్ గురించి చాలా మందికి తెలియదు. అక్కడ బాలబాలికలు కష్టాలు మరచి హాయిగా చదువుకుంటున్నారు. ఆ రోజుల్లో ఈ ప్రాంతం దట్టమైన అడవిలా ఉండేది. ఆరో నిజాం ప్రభువు మీర్ మహబూబ్ అలీ 1890లో తన వేసవి విడిదిగా ప్యాలెస్ నిర్మాణం చేపట్టాడు. నిర్మాణ దశలో ఉన్నప్పుడే అటుగా వచ్చిన నిజాం ప్రభువుకు ఏదో దుశ్శకునం ఎదురై అశుభ సూచకంగా తోచింది. నిర్మాణం పనులు వెంటనే నిలిపివేయాలని ఆదేశించారు. విక్టోరియా స్మృత్యర్థం... 1902... ఇంగ్లండ్‌లో విక్టోరియా మహారాణి మరణించిన తొలి రోజులు. ఆమె స్మృత్యర్థం ఒక మెమోరియల్ ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో ఉన్న ఆనాటి బ్రిటిష్ రె సిడెంట్ సర్ డేవడ్ బార్ ఓరోజున వేటకు ఆ ప్రాంతానికి వచ్చారు. అక్కడి విశాలమైన ఆ అసంపూర్తి ప్యాలెస్‌ను చూసిమెమోరియల్కు అనువైనదని భావించాడు. ఆ తరువాత నిజాంను కలిసి ఆ భవనాన్ని తమకు అప్పగించాలని కోరాడు. బ్రిటిష్ పాలకులతో మంచి సంబంధాలున్న ఆరో నిజాం వెంటనే అందుకు అంగీకరించడమే కాదు... సగంలోఆగిపోయిన నిర్మాణం పనులను పూర్తి చేసి విక్టోరియా మహారాణి మెమోరియల్ స్థాపనం కోసం బ్రిటిష్ వారికి అప్పజెప్పినట్లు ఆధారాలున్నాయి. ఆ ప్యాలెస్‌లో చారిటబుల్ సంస్థగా ఆస్పత్రి లేదా అనాథ ఆశ్రమం ఏర్పాటు చేయాలని బ్రిటిష్ రెసిడెంట్ సర్ డేవిడ్ బార్ ప్రతిపాదించారు. తరువాత అనాథ బాలల విద్యాసంస్థ ఏర్పాటుకే మొగ్గు చూపారు. అప్పటికే 54 మంది విద్యార్థులతో వరంగల్‌లో నడుస్తున్న అనాథాశ్రమాన్ని హైదరాబాద్‌కు తరలించి తాత్కాలికంగా చాదర్‌ఘాట్‌లోని ఓ బిల్డింగ్‌లో నిర్వహించారు. ప్యాలెస్ నిర్మాణం పూర్తయిన తరువాత 1905 జనవరి 1న ‘విక్టోరియా మెమోరియల్ హోం ఫర్ ది ఆర్ఫన్స్’కు తరలించారు. అనాథలు కాదన్న నెహ్రూ... భారతదేశానికి స్వాత్రంత్యం సిద్ధించాక విక్టోరియా మెమోరియల్ హోమ్ బాధ్యత రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలోకి వచ్చింది. ఈ నూరు సంవత్సరాల్లో కేంద్ర విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్, విజయలక్ష్మీ పండిట్, దుర్గాబాయ్ దేశ్‌ముఖ్, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి షేక్ అబ్దుల్లా ఒకరేమిటి... ఎంతో మంది ప్రముఖులు హోమ్‌ను సంద ర్శించారు. 1953 జనవరి 19న భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ కూడా ఈ స్కూల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా 20 నిమిషాలు ఆ చిన్నారులతో ముచ్చటించిన ఆయన... చదువు, ఆటపాటల్లో ముందున్న ఆ పిల్లలను అనాథలనడం సరికాదని... సంస్థ పేరులో ఉన్న ఆర్ఫన్స్ అన్న పదం తొలగించాలని సూచించారు. నెహ్రూ సూచనల మేరకు విక్టోరియా మెమోరియల్ హోమ్ అండ్ ఇండస్ట్రియల్ స్కూల్‌గా మారింది. నాడు పండిట్ నెహ్రూ వెలిబుచ్చిన అభిప్రాయాలు ఆయన చేవ్రాలుతో విజిటర్స్ బుక్‌లో నేటికి భద్రంగా ఉన్నాయి. అన్నింటా ముందే... ఐదేళ్ల నుంచి 16 ఏళ్లలోపు పిల్లలకు ఇక్కడ ఆశ్ర యమిస్తారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో ఒకటో తరగతి నుంచి పది వరకు రెండు సెక్షన్లలో సుమారు 900 మంది చదువుతున్నారు. ఆ తరువాత ఇంటర్మీడియట్ కోసం సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న జూనియర్ కాలేజీల్లో ఇక్కడి విద్యార్థులకు ప్రాధాన్యమిస్తున్నారు. ప్రతి ఏటా ఉత్తీర్ణత 80 నుంచి 85 శాతం ఉంటోంది. ఇక్కడ చదువుతోపాటు ప్రింటింగ్ టెక్నాలజీ, టైలరింగ్, ఎలక్ట్రిషియన్, కార్పెంటరీ వంటి ఉపాధి కోర్సుల్లో కూడా శిక్షణ ఇస్తున్నారు. ఈ విద్యార్థులు స్పోర్ట్స్ అండ్ గేమ్స్, ఎన్సీసీల్లోనూ ముందే ఉన్నారు. అనేక జాతీయ స్థాయి క్రీడల్లో అవార్డులు అందుకున్నారు. విద్యార్థులు సాధించిన పతకాలు, ట్రోఫీలతో స్కూల్లోని గదుల గోడలు నిండిపోయాయి. ఈ పాఠశాలలో డ్రాపవుట్ అనే మాటే వినపడదు. భోజన, వసతి సౌకర్యాలతో పాటు యూనిఫాం, వైద్యం కూడా సాంఘిక సంక్షేమ శాఖే అందిస్తోంది. ఈ పిల్లలకు ఎవరైనా సాయం చేయాలనుకుంటే నగదు కాకుండా దుప్పట్లు, టవల్స్, సబ్బులు, దుస్తులు... ఇలా వస్తు రూపంలో ఇవ్వాలని స్కూల్ ప్రిన్సిపాల్ తెలిపారు. సంప్రదించాల్సిన ఫోన్ 040-24045144. - మల్లాది కృష్ణానంద్ malladisukku@gmail.com