అమ్మ మనసు.. మా దగ్గర పెరిగిన అమ్మాయిని పెళ్లి చేసుకునే వాళ్లకు కొన్ని కండిషన్లు! | Mother Nirmala: Jeevodaya Home For Children | Sakshi
Sakshi News home page

Mother Nirmala: మదర్‌ నిర్మల.. అమ్మ మనసు.. మా దగ్గర పెరిగిన అమ్మాయిని పెళ్లి చేసుకునే వాళ్లకు కొన్ని కండిషన్లు!

Published Thu, Mar 24 2022 1:10 AM | Last Updated on Thu, Mar 24 2022 10:19 AM

Mother Nirmala: Jeevodaya Home For Children - Sakshi

మన జీవితాన్ని మనం రాసుకుంటామా? మరెవరైనా రాస్తారా? యాగ్నెస్‌ నుదుటిన మదర్‌ థెరిసా అనే మకుటాన్ని చేర్చింది ఎవరు? అనుకోకుండా ఓ రోజు... నిర్మల అనే యువతి నలుగురు పిల్లలకు అమ్మ కావాలని రాసింది ఎవరు? యాభై ఏళ్లు వచ్చే లోపే డెబ్బై మంది పిల్లలకు తల్లయింది గూడపాటి నిర్మల. మరో ముగ్గురు పాపాయిలకు అమ్మమ్మ కూడా.

గుడివాడలో పుట్టిన నిర్మలది ఆంగ్లో ఇండియన్‌ నేపథ్యం ఉన్న కుటుంబం. హైదరాబాద్, మోతీనగర్‌లో జీవోదయ హోమ్‌ ఫర్‌ చిల్డ్రన్‌లో నలభై మంది పిల్లలతో సాగుతోంది ఆమె జీవితం. అమ్మకు వైద్యం కోసం 2006లో హైదరాబాద్‌ వచ్చినప్పుడు ఆమె ఊహకు కూడా అందని విషయం ఇది. అలాంటి ఏ మాత్రం ఊహించని విషయాలు తన జీవితంలో ఎన్నో జరిగాయన్నారు నిర్మల. తాను ఒక డైరెక్షన్‌ అనుకుంటే తన ప్రమేయం లేకుండా ఏదో ఓ సంఘటన తన మార్గాన్ని మలుపు తిప్పుతూ వచ్చిందని చెప్పారామె.
 
నాటి రైలు ప్రయాణం
‘‘అమ్మానాన్నలు స్కూల్‌ హెడ్మాస్టర్‌లు. ముగ్గురమ్మాయిల్లో పెద్దమ్మాయిని. ఇంటర్‌ తర్వాత లా చదవాలనేది నా కోరిక. అయితే ఆ సెలవుల్లో ట్రైన్‌లో ప్రయాణిస్తున్నప్పుడు ఓ సంఘటన... నా తోటి ప్రయాణికులు మాతోపాటు రైల్లో ప్రయాణిస్తున్న ఇద్దరు లెప్రసీ పేషెంట్‌లను నిర్దాక్షిణ్యంగా ప్లాట్‌ఫామ్‌ మీదకు తోసేశారు. ‘అదేంటి, అలా చేశారు’ అని అడిగితే ‘ఇదెవత్తో పిచ్చి పిల్లలా ఉంద’ని నన్ను ఈసడించుకున్నారు కూడా. అప్పటికి నాకు లెప్రసీ అంటే ఏమిటో తెలియదు.

ఇంటికి వెళ్లి మా తాతయ్యను అడిగినప్పుడు వాళ్ల జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో చెప్పారాయన. అప్పుడు డిగ్రీకి చెన్నైకి వెళ్లి లెప్రసీ సంబంధిత కోర్సు చేశాను. అలాగే టీబీ, హెచ్‌ఐవీ నిర్మూలన సర్వీస్‌ కోర్సులు చేశాను. అమ్మ కోసం హైదరాబాద్‌కి వచ్చిన తర్వాత ఓ ఆంగ్లో ఇండియన్‌ ఎంఎల్‌ఏ సూచనతో బోరబండ, పర్వత్‌ నగర్‌లో ఉన్న లెప్రసీ కాలనీలో సర్వీస్‌ మొదలు పెట్టాను.

ఓ రోజు మాదాపూర్‌లో మాణింగ్‌ వాక్‌ చేస్తున్నప్పుడు నా కళ్ల ముందు ఓ దుర్ఘటన. ఓ తల్లిదండ్రులు ఆటో స్టాండ్‌ దగ్గర లగేజ్‌తో ఉన్నారు. వాళ్ల నలుగురు పిల్లల్ని అప్పుడే రోడ్డుకు ఒక పక్కగా ఉంచి, తల్లిదండ్రులు సామాను ఆటో దగ్గరకు తీసుకువెళ్తున్నారు. ఇంతలో పెద్ద పెద్ద బండరాళ్లతో ఓ లారీ... రాంగ్‌సైడ్‌ వచ్చి వాళ్లను ఢీకొట్టింది. తల్లిదండ్రులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం తెలుసుకుని ప్రాణాలు కోల్పోయిన వారి తల్లిదండ్రులు వచ్చారు.

అంటే... నలుగురు చిన్న పిల్లల అమ్మమ్మ – తాత, నానమ్మ –తాతలన్నమాట. వాళ్లు ఆ పిల్లలను చూస్తూ ‘నష్టజాతకులు’ అని ఓ మాట అనేసి తమకేమీ పట్టనట్లు వెళ్లిపోయారు. లెప్రసీ కాలనీ సర్వీస్‌తో అప్పటికే ఆ పీఎస్‌ పరిధిలోని పోలీసులు పరిచయం అయ్యారు. వారు ఆ పిల్లలను స్టేట్‌ హోమ్‌లో చేర్చే బాధ్యత నాకప్పగించారు. నలుగురు పిల్లలకు గార్డియన్‌గా నేనే సంతకం చేసి స్టేట్‌హోమ్‌లో చేర్చాను. అయితే... ఆ బాధ్యత అంతటితో తీరలేదు.

స్టేట్‌ హోమ్‌ నుంచి ఫోన్‌ కాల్‌
ఆ నలుగురు పిల్లల్లో పెద్దమ్మాయి లైన్‌లో ఉంది. ‘అమ్మా! మమ్మల్ని హోమ్‌లో చేర్చేటప్పుడు మీరు సంతకం చేశారట. హోమ్‌ వాళ్లు మమ్మల్ని బయటకు పంపించాలన్నా కూడా మీరే సంతకం చేయాలట. మీరు వచ్చి సంతకం చేస్తే మేము బయటకు వెళ్లిపోతాం. ఇక్కడ ఉండలేం’ ఇదీ ఆ ఫోన్‌ సారాంశం. ఎక్కడికి వెళ్తారు. నీకు పదేళ్లు కూడా లేవు. ఇద్దరు తమ్ముళ్లు, చెల్లికి ఏడాది కూడా నిండలేదు. వాళ్లను నువ్వు ఎలా చూసుకుంటావని అడిగితే సమాధానం లేదు.

‘ఎక్కడికో ఒక చోటకు వెళ్లిపోతాం, ఇక్కడ మాత్రం ఉండలేం’ అదే మంకుపట్టు. అప్పుడు పోలీసుల నుంచి ఓ రిక్వెస్ట్‌. ఆ పిల్లలను మీరు సంతకం చేసి బయటకు తీసుకురాకపోతే గోడదూకి వెళ్లిపోతారు. ఆ పోవడం రోడ్డు మీదకే. సిగ్నళ్ల దగ్గర బెగ్గర్‌గా మారిపోతారు. వాళ్లను దగ్గర పెట్టుకుని చదివించే మార్గం చూడమన్నారు. దాంతో వాళ్లను మా ఇంటికి తీసుకువచ్చాను. ఆలా ఆ రోజు నలుగురు పిల్లలకు అమ్మనయ్యాను. చంటిబిడ్డను చూసుకోవడానికి మా ఊరి నుంచి ఒక డొమెస్టిక్‌ హెల్పర్‌ను పిలిపించుకున్నాను.

ఆ తర్వాత పోలీసుల నుంచి తరచూ ఓ ఫోన్‌. అమ్మానాన్నలకు దూరమైన పిల్లల్లో పోలీసుల దృష్టికి వచ్చిన వాళ్లను తెచ్చి వదిలిపెట్టసాగారు. అలా మూడు నెలలకు నా ఇల్లు ఇరవై మంది పిల్లల ఇల్లయింది. అంతమంది పిల్లలను ఇంట్లో ఉంచడానికి ఇంటి ఓనరు అభ్యంతరం చెప్పడంతో పూర్తి స్థాయి హోమ్‌ ప్రారంభించాను. ఇప్పుడు మా హోమ్‌ నుంచి మొత్తం డెబ్బై మంది పిల్లలు సహాయం పొందుతున్నారు. నలభై మంది ఈ హోమ్‌లో ఉన్నారు. పన్నెండు మంది అబ్బాయిలు విజయవాడలో ఉన్నారు. ఎనిమిది మంది సెమీ ఆర్ఫన్‌లకు ఈ హోమ్‌ నుంచే భోజనం వెళ్తుంది. వాళ్లకు తల్లి మాత్రమే ఉంటుంది.

ఆమెకు తన పిల్లల్ని పోషించడానికి, చదివించడానికి శక్తి లేని పరిస్థితుల్లో పిల్లల చదువులు, భోజనం, దుస్తులు అన్నీ మా హోమ్‌ చూసుకుంటుంది. పిల్లలు మాత్రం ఉదయం వాళ్ల ఇంటి నుంచి స్కూలుకు వస్తారు, రాత్రికి తల్లి దగ్గరకు వెళ్లిపోతారు. ఇక కాలేజ్‌కెళ్లే వాళ్ల విషయానికి వస్తే... ఎనిమిది మంది ఇంటర్, ఒక అమ్మాయి డిగ్రీ చదువుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇరవై మంది నర్సింగ్, పాలిటెక్నిక్‌ చేస్తున్నారు. ఐదుగురు కర్నాటకలో మెడిసిన్, సాఫ్ట్‌వేర్‌ కోర్సుల్లో ఉన్నారు. మొదట నేను ఇంటికి తెచ్చుకున్న ఆ నలుగురు పిల్లల్లో పెద్దమ్మాయి, సంతకం చేస్తే వెళ్లిపోతానని ఫోన్‌ చేసిన అమ్మాయి కూడా ఇప్పుడు కర్నాటకలో మెడిసిన్‌ చేస్తున్న వాళ్లలో ఉంది.

మా పిల్లల్లో ముగ్గురు పూనా, వైజాగ్, బెంగళూరుల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వాళ్లు ఒక్కొక్కరూ నలుగురు పిల్లల చదువు బాధ్యత తీసుకున్నారు. వాళ్లు ముగ్గురూ పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నారు. ప్రసవాలు కూడా మా హోమ్‌లోనే. ఆ పిల్లలు నన్ను ‘అమ్మమ్మ’ అంటారు. ఆ చిన్న పిల్లలకు నలభై మంది పిన్నమ్మలు. మాది జగమంత కుటుంబం’’ అన్నారు నిర్మల తన పిల్లల మధ్య కూర్చుని వాళ్లను ముద్దు చేస్తూ. నిర్మల ఆఫీసు గదిలో గోడకు మదర్‌ థెరిసా ఒక బిడ్డను ఎత్తుకున్న ఫొటో ఉంది. ఈ మదర్‌... చుట్టూ పిల్లలతో ఆ మదర్‌కు మరోరూపంగా కనిపించింది.

మా దగ్గర పెరిగిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చే వాళ్లకు కండిషన్‌లుంటాయి. వాళ్లను ఉద్యోగం మాన్పించకూడదు. పెళ్లికి ముందే కొంత మొత్తం అమ్మాయి పేరు మీద డిపాజిట్‌ చేయాలి. అనాథ అని సంబోధించరాదు. అలాగే తమ అభ్యుదయ భావాలను సమాజం ముందు ప్రదర్శించుకోవడానికి ‘అనాథను పెళ్లి చేసుకున్నాను’ అని చెప్పుకోరాదు.

పాట నడిపేది
నేను సింగర్‌ని. పాటలు పాడడం ద్వారా మంచి రాబడి ఉండేది. దాంతో హోమ్‌ నడపడం ఏ మాత్రం కష్టం కాలేదప్పట్లో. థైరాయిడ్‌ సమస్యతో గొంతుకు ఆపరేషన్‌ అయింది. ఇప్పుడు పాడలేను. ప్రధాన ఆదాయ వనరు ఆగిపోయింది. పిల్లలకు దుస్తులు, భోజనం వరకు ఇబ్బంది లేదు. మా హోమ్‌ని చూసిన వాళ్లు వాటిని విరాళంగా ఇస్తుంటారు.

బర్త్‌డేలు మా పిల్లలతో కలిసి చేసుకోవడం కూడా మాకు బాగా ఉపకరిస్తోంది. స్కూలు, కాలేజ్‌ ఫీజులు, ఇంటి అద్దెకు మాత్రం డబ్బుగా కావాల్సిందే. డబ్బుగా ఇస్తే దారి మళ్లుతుందేమోననే సందేహం ఉంటుంది. నేను అభ్యర్థించేది ఒక్కటే. నా చేతికి డబ్బు ఇవ్వవద్దు. ఈ పిల్లలకు పుస్తకాలు కొనివ్వడం, స్కూల్‌కెళ్లి ఫీజులు చెల్లించడం స్వయంగా వారే చేయవచ్చు. ఏడాది పాటు ఒక బిడ్డను చదివించవచ్చు. మనసుంటే మార్గాలూ ఉంటాయి.
– గూడపాటి నిర్మల, జీవోదయ హోమ్‌ ఫర్‌ చిల్డ్రన్‌ నిర్వహకురాలు

– వాకా మంజులారెడ్డి
ఫొటోలు: నోముల రాజేశ్‌ రెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement