moti nagar
-
అమ్మ మనసు.. మా దగ్గర పెరిగిన అమ్మాయిని పెళ్లి చేసుకునే వాళ్లకు కొన్ని కండిషన్లు!
మన జీవితాన్ని మనం రాసుకుంటామా? మరెవరైనా రాస్తారా? యాగ్నెస్ నుదుటిన మదర్ థెరిసా అనే మకుటాన్ని చేర్చింది ఎవరు? అనుకోకుండా ఓ రోజు... నిర్మల అనే యువతి నలుగురు పిల్లలకు అమ్మ కావాలని రాసింది ఎవరు? యాభై ఏళ్లు వచ్చే లోపే డెబ్బై మంది పిల్లలకు తల్లయింది గూడపాటి నిర్మల. మరో ముగ్గురు పాపాయిలకు అమ్మమ్మ కూడా. గుడివాడలో పుట్టిన నిర్మలది ఆంగ్లో ఇండియన్ నేపథ్యం ఉన్న కుటుంబం. హైదరాబాద్, మోతీనగర్‌లో జీవోదయ హోమ్ ఫర్ చిల్డ్రన్‌లో నలభై మంది పిల్లలతో సాగుతోంది ఆమె జీవితం. అమ్మకు వైద్యం కోసం 2006లో హైదరాబాద్ వచ్చినప్పుడు ఆమె ఊహకు కూడా అందని విషయం ఇది. అలాంటి ఏ మాత్రం ఊహించని విషయాలు తన జీవితంలో ఎన్నో జరిగాయన్నారు నిర్మల. తాను ఒక డైరెక్షన్ అనుకుంటే తన ప్రమేయం లేకుండా ఏదో ఓ సంఘటన తన మార్గాన్ని మలుపు తిప్పుతూ వచ్చిందని చెప్పారామె. నాటి రైలు ప్రయాణం ‘‘అమ్మానాన్నలు స్కూల్ హెడ్మాస్టర్లు. ముగ్గురమ్మాయిల్లో పెద్దమ్మాయిని. ఇంటర్ తర్వాత లా చదవాలనేది నా కోరిక. అయితే ఆ సెలవుల్లో ట్రైన్లో ప్రయాణిస్తున్నప్పుడు ఓ సంఘటన... నా తోటి ప్రయాణికులు మాతోపాటు రైల్లో ప్రయాణిస్తున్న ఇద్దరు లెప్రసీ పేషెంట్లను నిర్దాక్షిణ్యంగా ప్లాట్‌ఫామ్ మీదకు తోసేశారు. ‘అదేంటి, అలా చేశారు’ అని అడిగితే ‘ఇదెవత్తో పిచ్చి పిల్లలా ఉంద’ని నన్ను ఈసడించుకున్నారు కూడా. అప్పటికి నాకు లెప్రసీ అంటే ఏమిటో తెలియదు. ఇంటికి వెళ్లి మా తాతయ్యను అడిగినప్పుడు వాళ్ల జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో చెప్పారాయన. అప్పుడు డిగ్రీకి చెన్నైకి వెళ్లి లెప్రసీ సంబంధిత కోర్సు చేశాను. అలాగే టీబీ, హెచ్ఐవీ నిర్మూలన సర్వీస్ కోర్సులు చేశాను. అమ్మ కోసం హైదరాబాద్‌కి వచ్చిన తర్వాత ఓ ఆంగ్లో ఇండియన్ ఎంఎల్ఏ సూచనతో బోరబండ, పర్వత్ నగర్లో ఉన్న లెప్రసీ కాలనీలో సర్వీస్ మొదలు పెట్టాను. ఓ రోజు మాదాపూర్‌లో మాణింగ్ వాక్ చేస్తున్నప్పుడు నా కళ్ల ముందు ఓ దుర్ఘటన. ఓ తల్లిదండ్రులు ఆటో స్టాండ్ దగ్గర లగేజ్‌తో ఉన్నారు. వాళ్ల నలుగురు పిల్లల్ని అప్పుడే రోడ్డుకు ఒక పక్కగా ఉంచి, తల్లిదండ్రులు సామాను ఆటో దగ్గరకు తీసుకువెళ్తున్నారు. ఇంతలో పెద్ద పెద్ద బండరాళ్లతో ఓ లారీ... రాంగ్‌సైడ్ వచ్చి వాళ్లను ఢీకొట్టింది. తల్లిదండ్రులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం తెలుసుకుని ప్రాణాలు కోల్పోయిన వారి తల్లిదండ్రులు వచ్చారు. అంటే... నలుగురు చిన్న పిల్లల అమ్మమ్మ – తాత, నానమ్మ –తాతలన్నమాట. వాళ్లు ఆ పిల్లలను చూస్తూ ‘నష్టజాతకులు’ అని ఓ మాట అనేసి తమకేమీ పట్టనట్లు వెళ్లిపోయారు. లెప్రసీ కాలనీ సర్వీస్‌తో అప్పటికే ఆ పీఎస్ పరిధిలోని పోలీసులు పరిచయం అయ్యారు. వారు ఆ పిల్లలను స్టేట్ హోమ్‌లో చేర్చే బాధ్యత నాకప్పగించారు. నలుగురు పిల్లలకు గార్డియన్‌గా నేనే సంతకం చేసి స్టేట్‌హోమ్‌లో చేర్చాను. అయితే... ఆ బాధ్యత అంతటితో తీరలేదు. స్టేట్ హోమ్ నుంచి ఫోన్ కాల్ ఆ నలుగురు పిల్లల్లో పెద్దమ్మాయి లైన్లో ఉంది. ‘అమ్మా! మమ్మల్ని హోమ్‌లో చేర్చేటప్పుడు మీరు సంతకం చేశారట. హోమ్ వాళ్లు మమ్మల్ని బయటకు పంపించాలన్నా కూడా మీరే సంతకం చేయాలట. మీరు వచ్చి సంతకం చేస్తే మేము బయటకు వెళ్లిపోతాం. ఇక్కడ ఉండలేం’ ఇదీ ఆ ఫోన్ సారాంశం. ఎక్కడికి వెళ్తారు. నీకు పదేళ్లు కూడా లేవు. ఇద్దరు తమ్ముళ్లు, చెల్లికి ఏడాది కూడా నిండలేదు. వాళ్లను నువ్వు ఎలా చూసుకుంటావని అడిగితే సమాధానం లేదు. ‘ఎక్కడికో ఒక చోటకు వెళ్లిపోతాం, ఇక్కడ మాత్రం ఉండలేం’ అదే మంకుపట్టు. అప్పుడు పోలీసుల నుంచి ఓ రిక్వెస్ట్. ఆ పిల్లలను మీరు సంతకం చేసి బయటకు తీసుకురాకపోతే గోడదూకి వెళ్లిపోతారు. ఆ పోవడం రోడ్డు మీదకే. సిగ్నళ్ల దగ్గర బెగ్గర్‌గా మారిపోతారు. వాళ్లను దగ్గర పెట్టుకుని చదివించే మార్గం చూడమన్నారు. దాంతో వాళ్లను మా ఇంటికి తీసుకువచ్చాను. ఆలా ఆ రోజు నలుగురు పిల్లలకు అమ్మనయ్యాను. చంటిబిడ్డను చూసుకోవడానికి మా ఊరి నుంచి ఒక డొమెస్టిక్ హెల్పర్‌ను పిలిపించుకున్నాను. ఆ తర్వాత పోలీసుల నుంచి తరచూ ఓ ఫోన్. అమ్మానాన్నలకు దూరమైన పిల్లల్లో పోలీసుల దృష్టికి వచ్చిన వాళ్లను తెచ్చి వదిలిపెట్టసాగారు. అలా మూడు నెలలకు నా ఇల్లు ఇరవై మంది పిల్లల ఇల్లయింది. అంతమంది పిల్లలను ఇంట్లో ఉంచడానికి ఇంటి ఓనరు అభ్యంతరం చెప్పడంతో పూర్తి స్థాయి హోమ్ ప్రారంభించాను. ఇప్పుడు మా హోమ్ నుంచి మొత్తం డెబ్బై మంది పిల్లలు సహాయం పొందుతున్నారు. నలభై మంది ఈ హోమ్‌లో ఉన్నారు. పన్నెండు మంది అబ్బాయిలు విజయవాడలో ఉన్నారు. ఎనిమిది మంది సెమీ ఆర్ఫన్లకు ఈ హోమ్ నుంచే భోజనం వెళ్తుంది. వాళ్లకు తల్లి మాత్రమే ఉంటుంది. ఆమెకు తన పిల్లల్ని పోషించడానికి, చదివించడానికి శక్తి లేని పరిస్థితుల్లో పిల్లల చదువులు, భోజనం, దుస్తులు అన్నీ మా హోమ్ చూసుకుంటుంది. పిల్లలు మాత్రం ఉదయం వాళ్ల ఇంటి నుంచి స్కూలుకు వస్తారు, రాత్రికి తల్లి దగ్గరకు వెళ్లిపోతారు. ఇక కాలేజ్‌కెళ్లే వాళ్ల విషయానికి వస్తే... ఎనిమిది మంది ఇంటర్, ఒక అమ్మాయి డిగ్రీ చదువుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇరవై మంది నర్సింగ్, పాలిటెక్నిక్ చేస్తున్నారు. ఐదుగురు కర్నాటకలో మెడిసిన్, సాఫ్ట్వేర్ కోర్సుల్లో ఉన్నారు. మొదట నేను ఇంటికి తెచ్చుకున్న ఆ నలుగురు పిల్లల్లో పెద్దమ్మాయి, సంతకం చేస్తే వెళ్లిపోతానని ఫోన్ చేసిన అమ్మాయి కూడా ఇప్పుడు కర్నాటకలో మెడిసిన్ చేస్తున్న వాళ్లలో ఉంది. మా పిల్లల్లో ముగ్గురు పూనా, వైజాగ్, బెంగళూరుల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వాళ్లు ఒక్కొక్కరూ నలుగురు పిల్లల చదువు బాధ్యత తీసుకున్నారు. వాళ్లు ముగ్గురూ పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నారు. ప్రసవాలు కూడా మా హోమ్‌లోనే. ఆ పిల్లలు నన్ను ‘అమ్మమ్మ’ అంటారు. ఆ చిన్న పిల్లలకు నలభై మంది పిన్నమ్మలు. మాది జగమంత కుటుంబం’’ అన్నారు నిర్మల తన పిల్లల మధ్య కూర్చుని వాళ్లను ముద్దు చేస్తూ. నిర్మల ఆఫీసు గదిలో గోడకు మదర్ థెరిసా ఒక బిడ్డను ఎత్తుకున్న ఫొటో ఉంది. ఈ మదర్... చుట్టూ పిల్లలతో ఆ మదర్‌కు మరోరూపంగా కనిపించింది. మా దగ్గర పెరిగిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చే వాళ్లకు కండిషన్లుంటాయి. వాళ్లను ఉద్యోగం మాన్పించకూడదు. పెళ్లికి ముందే కొంత మొత్తం అమ్మాయి పేరు మీద డిపాజిట్ చేయాలి. అనాథ అని సంబోధించరాదు. అలాగే తమ అభ్యుదయ భావాలను సమాజం ముందు ప్రదర్శించుకోవడానికి ‘అనాథను పెళ్లి చేసుకున్నాను’ అని చెప్పుకోరాదు. పాట నడిపేది నేను సింగర్‌ని. పాటలు పాడడం ద్వారా మంచి రాబడి ఉండేది. దాంతో హోమ్ నడపడం ఏ మాత్రం కష్టం కాలేదప్పట్లో. థైరాయిడ్ సమస్యతో గొంతుకు ఆపరేషన్ అయింది. ఇప్పుడు పాడలేను. ప్రధాన ఆదాయ వనరు ఆగిపోయింది. పిల్లలకు దుస్తులు, భోజనం వరకు ఇబ్బంది లేదు. మా హోమ్‌ని చూసిన వాళ్లు వాటిని విరాళంగా ఇస్తుంటారు. బర్త్‌డేలు మా పిల్లలతో కలిసి చేసుకోవడం కూడా మాకు బాగా ఉపకరిస్తోంది. స్కూలు, కాలేజ్ ఫీజులు, ఇంటి అద్దెకు మాత్రం డబ్బుగా కావాల్సిందే. డబ్బుగా ఇస్తే దారి మళ్లుతుందేమోననే సందేహం ఉంటుంది. నేను అభ్యర్థించేది ఒక్కటే. నా చేతికి డబ్బు ఇవ్వవద్దు. ఈ పిల్లలకు పుస్తకాలు కొనివ్వడం, స్కూల్కెళ్లి ఫీజులు చెల్లించడం స్వయంగా వారే చేయవచ్చు. ఏడాది పాటు ఒక బిడ్డను చదివించవచ్చు. మనసుంటే మార్గాలూ ఉంటాయి. – గూడపాటి నిర్మల, జీవోదయ హోమ్ ఫర్ చిల్డ్రన్ నిర్వహకురాలు – వాకా మంజులారెడ్డి ఫొటోలు: నోముల రాజేశ్ రెడ్డి -
‘నాన్న కష్టం చూడలేక’.. సూర్యుడి కంటే ముందే డ్యూటీ
ఈ ఇద్దరమ్మాయిలు... అక్కాచెల్లెళ్లు. అక్క ఇంటర్ ఫస్టియర్... చెల్లి టెన్త్ క్లాస్. ఇద్దరూ ధైర్యానికి ప్రతీకలుగా నిలుస్తున్నారు. నాన్న కోసం కష్టమైన పనిని ఇష్టంగా అందుకున్నారు. ఆడపిల్లలు చేయని సాహసానికి సిద్ధమయ్యారు. చీకటి చీల్చడానికి సూర్యుడు డ్యూటీ చేస్తాడు. ఆ సూర్యుడికంటే ముందే వీళ్ల డ్యూటీ మొదలవుతుంది. సూర్యుడు వెలుతురును పంచేలోపు... ఈ అక్కాచెల్లెళ్లు అక్షరాల వెలుగును పంచుతున్నారు. నాన్నకు ఎదురైన కష్టాన్ని పంచుకున్నారు. ఇంటి చీకటిని తొలగిస్తున్న కాంతి వీచికలయ్యారు. తెలతెలవారుతోంది. హైదరాబాద్ నగర వీథుల్లో రోడ్డు మీద మాణింగ్ వాకింగ్ చేసే వాళ్లు, వీథులు చిమ్మేవాళ్లు తప్ప మనుష్య సంచారం పెద్దగా లేదు. ఓ అమ్మాయి రయ్యిమంటూ స్కూటీ మీద వచ్చి ఓ ఇంటి ముందు ఆగింది. న్యూస్ పేపర్ని రోల్ చుట్టి ఇంటి బాల్కనీలోకి విసిరేసింది. మరో కాలనీలో అంతకంటే చిన్నమ్మాయి ఇంటింటికీ వెళ్లి న్యూస్ పేపర్ వేస్తోంది. ఓ ఇంటి ముందు అప్పటికే నిద్రలేచి ఉన్న ఓ పెద్దావిడ నవ్వుతూ ఆ అమ్మాయిని పలకరించింది. ‘‘ఆడపిల్ల ఇంత ధైర్యంగా పొద్దున్నే ఇలా ఇంటింటికీ వచ్చి పేపర్ వేయడం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోందమ్మాయ్! అయినా ఇంత కష్టమైన పనికి ధైర్యంగా ముందుకు రావడం గొప్ప విషయమే. జాగ్రత్త తల్లీ’’ అని జాగ్రత్త చెప్పిందా పెద్దావిడ. ‘‘అలాగే మామ్మ గారూ!’’ అని ఆ అమ్మాయి కూడా నవ్వుతూ మామ్మగారికి టాటా చెప్పి మరో ఇంటిదారి పట్టింది. న్యూస్‌పేపర్ డెలివరీ చేస్తున్న ఈ అమ్మాయిలు కెలావత్ ప్రమీల, పవిత్ర. హైదరాబాద్, బోరబండ, శివమ్మ బాపురెడ్డి హిల్స్‌లో నివసిస్తున్నారు. రోజూ ఉదయం ఐదింటికే నిద్రలేచి ఆరు లోపు మోతీనగర్ చౌరస్తాలోని పేపర్ పాయింట్‌కు చేరుకుంటారు. ఏడు గంటల లోపు మోతీనగర్ చుట్టు పక్కల ఐదారు కాలనీల్లో పేపర్ వేసేసి, ఇంటికి వచ్చి రిఫ్రెష్ అయ్యి ఆన్లైన్ క్లాసులకు సిద్ధమవుతారు. పవిత్ర టెన్త్ క్లాస్, ప్రమీల ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నారు. కరోనా ప్రపంచాన్ని కుదిపేసింది. ఈ కుటుంబానికి కూడా పరీక్ష పెట్టింది. బాయ్స్ మానేశారు ‘‘మా నాన్నకు న్యూస్ పేపర్ లైన్ ఉంది. ఇరవై ఏళ్లుగా పేపర్లు వేస్తున్నాడు. నాన్న దగ్గర బాయ్స్ ఉండేవాళ్లు. మా లైన్లో మొత్తం ఏడు వందల పేపర్లు పడేవి. కరోనా కారణంగా చాలా మంది పేపర్ మానేశారు. బాయ్స్ కూడా పని మానేశారు. కరోనా భయం తగ్గిన తర్వాత కొందరు బాయ్స్ మళ్లీ వచ్చారు. కానీ అప్పటికే పేపర్ కాపీలు బాగా తగ్గిపోయాయి. బాయ్స్‌కు ఒక్కొక్కరికి వెయ్యి, పన్నెండు వందలు ఇవ్వాలంటే నాన్నకు కుదిరేది కాదు. బాయ్స్ లేకుండా అన్ని ఇళ్లకూ నాన్న ఒక్కడే వేయాలంటే టైమ్ సరిపోయేది కాదు. పేపర్ లేటుగా వేస్తే కోప్పడతారు కదా! పైగా నాన్న పేపర్ వేసిన తరవాత ఫిల్మ్ నగర్లో రేషన్ షాపులో ఉద్యోగానికి వెళ్లాలి. నాన్న అటూ ఇటూ పరుగులు తీయాల్సి వచ్చేది. నాన్న కష్టం చూస్తుంటే బాధనిపించేది. దాంతో ‘మేము పేపర్ వేస్తాం నాన్నా’ అని నాన్నని ఒప్పించాం’’ అని చెప్పింది ప్రమీల. రోజూ పేపర్ చదువుతాం నాన్న పనిలో ఉండడం వల్ల మాకు రోజూ ఇంగ్లిష్, తెలుగు పేపర్లు చదవడం అలవాటైంది. మేము చదివేది ఇంగ్లిష్ మీడియమే, కానీ చిన్నప్పటి నుంచి పేపర్లు చదవడం వల్ల తెలుగు కూడా బాగా వచ్చేసింది’’ అని చెప్పారు ప్రమీల, పవిత్ర. బాగా చదువుకుని పోలీస్ ఆఫీసర్ అవుతామని చెప్తున్న ఈ అక్కాచెల్లెళ్ల సాహస ప్రస్థానం పలువురికి స్ఫూర్తిదాయకం. మెచ్చుకుంటున్నారు! లాక్డౌన్ పోయి అన్‌లాక్ మొదలైంది. కానీ పరిస్థితులు మాత్రం పూర్వపు స్థితికి చేరనేలేదు. పేపర్‌తో కరోనా రాదని తెలిసిన తర్వాత కూడా కాపీలు ముందులాగ పెరగలేదు. ఇప్పుడు మా లైన్లో మూడు వందల కాపీలు వేస్తున్నాం. మేము పేపర్ వేసే ఇళ్లలో పెద్ద వాళ్లు చాలామంది మమ్మల్ని పలకరించి మాట్లాడతారు. ‘ఆడపిల్లలు బాగా చదువుకోవాలి, అన్ని పనుల్లోనూ ముందుకు రావాలమ్మా. మిమ్మల్ని చూస్తే ముచ్చటేస్తోంది’ అంటారు. – ప్రమీల పేపర్ల మధ్య పెరిగాం! మేము చిన్నప్పుడు సెలవుల్లో నాన్న పేపర్ వేయడానికి వెళ్తుంటే మారం చేసి మరీ నాన్న స్కూటీ మీద వెళ్లే వాళ్లం. ఈ కాలనీలన్నీ మాకు బాగా తెలుసు. పేపర్ల మధ్యనే పెరిగాం. ఏ కాలనీలో ఏ పేపర్ ఎన్ని కాపీలు వేయాలనే లెక్క కూడా త్వరగానే తెలిసింది. మాకిద్దరికీ స్కూటీ నేర్పించాడు నాన్న. మా అక్క రూట్లో ఇళ్లు ఒకదానికొకటి దూరంగా ఉన్నాయి. తను స్కూటీ మీద వెళ్తుంది. దగ్గర దగ్గరగా ఉన్న ఎనభై పేపర్ల రూట్ నాది. పేపర్ వేసిన తరవాత నాన్న, అక్క, నేను ముగ్గురం కలిసి ఇంటికి వెళ్తాం – పవిత్ర – వాకా మంజులారెడ్డి -
కూలిన భవనం.. ఏడుగురు దుర్మరణం
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో ఘోర ప్రమాదం సంభవించింది. మోతీనగర్‌లోని సుదర్శన్ పార్క్ వద్దగల ఓ మూడంతస్థుల ఫ్యాక్టరీలో పేలుడు సంభవించండంతో భవనంలోని కొంత భాగం కుప్పకూలింది. గురువారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందగా మరో 8 మందిని రెస్క్యూ టీం రక్షించింది. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉన్నట్టు సమాచారం. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని డీసీపీ (పశ్చిమ ఢిల్లీ) మోనికా భరద్వాజ్ తెలిపారు. ప్రమాద సమయంలో మొత్తం 18 మంది ఫ్యాక్టరీలో ఉన్నట్టు చెప్పారు. అయితే, స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. ప్రమాద సమయంలో 13 మంది ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. పక్కనే ఉన్న స్క్రాప్‌యార్డులో మరో 12 మంది ఉన్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికి తీసేందుకు ముమ్మర సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఫైర్ ఆఫీసర్ అతుల్ గార్గ్ తెలిపారు. -
మోతీనగర్‌లో ఐదుగురు బుకీలు అరెస్ట్
హైదరాబాద్ : సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మోతీనగర్ లలితాటవర్ వద్ద క్రికెట్ బెట్టింగ్ స్థావరాలపై ఎస్వోటీ పోలీసులు శనివారం దాడులు నిర్వహించారు. బెట్టింగ్ నిర్వహిస్తున్న ఐదుగురు బుకీలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 15 సెల్ ఫోన్లతోపాటు రూ.5.30 లక్షల నగదు, ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మోతీనగర్‌లో భవనం కూలి ఒకరు మృతి 11 మందికి గాయాలు
సాక్షి, న్యూఢిల్లీ: మూడంతస్తుల నివాస భవనం కూలిపోవడంతో ఒకరు మరణించగా, 11 మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన పశ్చిమ ఢిల్లీలోని మోతీనగర్‌లో ఉన్న సదర్శన్‌పార్క్ ప్రాంతంలో బుధవారం చోటు చేసుకుంది. గాయపడినవారిని భవనం శిథిలాల కింద నుంచి వెలికితీసి ఆస్పత్రికి తరలించారు. శిథిలాల కింద ఇంకా ఎవరైనా ఉన్నారేమో అని చూడటం కోసం అనేక గంటల పాటు గాలించారు. కాగా, ఈ ప్రమాదంలో మరణించిన వ్యక్తిని 20 సంవత్సరాల ఆనంద్ శశినాథ్‌గా గుర్తించారు. ‘ఉదయం 7.45 గంటలకు పేలుడు జరిగి భవనం కూలిన సమాచారం అందింది. సమాచారం అందిన వెంటనే పలు అగ్నిమాపక వాహనాలతో రంగంలోకి దిగి సహాయ కార్యక్రమాలను ఆరంభించామని అగ్నిమాపక విభాగపు అధికారి ఒకరు తెలిపారు. స్థానిక ప్రజలు కూడా సహాయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీసేందుకు తోడ్పడ్డారు. ఈ భవనంలో నివాసమున్న వారిలో అధికులు అద్దెకున్నవారేనని తెలిసింది. భవనం కింది అంతస్తులో ఓ ఫ్యాక్టరీ నడిచేద ని దానిలో బాయిలర్ పేలడంతోనే భవనం కూలి ఉంటుందని అనుమానిస్తున్నారు. -
వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ టీవీ ఆర్టిస్ట్
-
వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ టీవీ ఆర్టిస్ట్
హైదరాబాద్ : హైదరాబాద్‌లో అర్ధరాత్రి నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మోతీనగర్‌లోని ఓ అపార్ట్మెంట్లోవ్యభిచారం చేస్తుండగా... ఓ టీవీ ఆర్టిస్ట్‌ను పట్టుకున్నారు. ఆమెతో పాటు మరో ఇద్దర్నీ అరెస్ట్ చేసి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పట్టుబడిన టీవీ ఆర్టిస్ట్ కుంకుమ పువ్వు సీరియల్లో నటిస్తున్న ఓ నటిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి కోర్టుకు తరలించనున్నారు. మరోవైపు వ్యభిచార నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.