మూడంతస్తుల నివాస భవనం కూలిపోవడంతో ఒకరు మరణించగా, 11 మందికి గాయాలయ్యాయి.
సాక్షి, న్యూఢిల్లీ: మూడంతస్తుల నివాస భవనం కూలిపోవడంతో ఒకరు మరణించగా, 11 మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన పశ్చిమ ఢిల్లీలోని మోతీనగర్‌లో ఉన్న సదర్శన్‌పార్క్ ప్రాంతంలో బుధవారం చోటు చేసుకుంది. గాయపడినవారిని భవనం శిథిలాల కింద నుంచి వెలికితీసి ఆస్పత్రికి తరలించారు. శిథిలాల కింద ఇంకా ఎవరైనా ఉన్నారేమో అని చూడటం కోసం అనేక గంటల పాటు గాలించారు. కాగా, ఈ ప్రమాదంలో మరణించిన వ్యక్తిని 20 సంవత్సరాల ఆనంద్ శశినాథ్‌గా గుర్తించారు. ‘ఉదయం 7.45 గంటలకు పేలుడు జరిగి భవనం కూలిన సమాచారం అందింది. సమాచారం అందిన వెంటనే పలు అగ్నిమాపక వాహనాలతో రంగంలోకి దిగి సహాయ కార్యక్రమాలను ఆరంభించామని అగ్నిమాపక విభాగపు అధికారి ఒకరు తెలిపారు. స్థానిక ప్రజలు కూడా సహాయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీసేందుకు తోడ్పడ్డారు. ఈ భవనంలో నివాసమున్న వారిలో అధికులు అద్దెకున్నవారేనని తెలిసింది. భవనం కింది అంతస్తులో ఓ ఫ్యాక్టరీ నడిచేద ని దానిలో బాయిలర్ పేలడంతోనే భవనం కూలి ఉంటుందని అనుమానిస్తున్నారు.