childrens home
-
బాలల జీవన మందిరం
పోగూరి చంద్రబాబు, తిరుపతి సిటీ అమ్మ, నాన్నల అండతో.. ఆప్యాయతానురాగాల నీడన .. కుటుంబ బలంతో జీవితానికి బాట వేసుకునే అవకాశం ఉండటం నిజంగానే అదృష్టం!అమ్మ, నాన్నల్లేని అనాథలకూ అలాంటి అదృష్టాన్ని కల్పిస్తోంది ఎస్వీ బాలమందిరం! తిరుపతి, భవానీనగర్‌లో టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీ బాలమందిరం.. నా అన్నవారు లేని బాలలకు, సింగిల్ పేరెంట్ పిల్లలకు తానున్నానంటూ ఆశ్రయమిచ్చి ఆదుకుంటోంది! ప్రేమ, వాత్సల్యాలను పంచుతూ.. విద్యాబుద్ధులు అందించి వారిని బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దుతోంది. అందులో విద్యనభ్యసించిన పిల్లలు నేడు దేశ, విదేశాల్లో ఉన్నతోద్యోగాల్లో స్థిరపడ్డారు. ఇంజినీర్లు, డాక్టర్లుగా రాణిస్తున్నారు. వ్యాపారవేత్తలుగానూ ఎదిగారు. టీటీడీలో నాలుగో తరగతి ఉద్యోగాల నుంచి సూపరింటెండెంట్, డీఈఓ స్థాయి వరకు విధులు నిర్వహిస్తున్నారు. అనాథాశ్రమం నుంచి ఎస్వీ బాలమందిరంగా..టీటీడీ తొలి ఈఓ అన్నారావు 1943లో టీటీడీ అనాథాశ్రమ పాఠశాలను ప్రారంభించారు. ఆదిలోనే ఇది నాటి ప్రధాని జవహార్‌లాల్ నెహ్రూ దృష్టిని ఆకట్టుకుంది. ఆయన 1962లో బడిని సందర్శించి ‘చిల్డ్రన్స్ ఆఫ్ లార్డ్ వేంకటేశ్వర’ అని పిలవడంతో అదికాస్త ఎస్వీ బాలమందిరంగా మారింది. 2005 నుంచి సుమారు 500 మంది అనాథ పిల్లలు బాలమందిరంలో విద్యనభ్యసిస్తున్నారు. వీరిని అధికారులు శ్రీవారి పిల్లలుగానే భావిస్తూ సేవలు అందిస్తున్నారు. బ్యాంక్‌లో సీనియర్ మేనేజర్‌గా..మాది శ్రీకాళహస్తి, తొట్టంబేడు. నేను మూడో తరగతిలో ఉన్నప్పుడే అమ్మ, నాన్న చనిపోయారు. మా అవ్వ నన్ను ఎస్వీ బాలమందిరంలో చేర్పించింది. అది అమ్మ, నాన్న లేని లోటును తీర్చడమే కాకుండా చక్కగా చదువు చెప్పించింది. భరతనాట్యంలోనూ ట్రైనింగ్ ఇప్పించింది. ఇంటర్, డిగ్రీ, ఎంబీఏ అన్నీ టీటీడీ అధికారుల అండదండలతోనే పూర్తి చేశాను. ప్రస్తుతం బెంగళూరు కోటక్ మహీంద్ర బ్యాంకులో సీనియర్ మేనేజర్‌గా పనిచేస్తున్నాను. – బి గుర్రమ్మక్వాలిటీ మేనేజర్‌గా..మాది చిత్తూరు జిల్లాలోని మోర్దాన్ పల్లి. నాకు ఊహ తెలియని వయసులో నాన్న చనిపోయాడు. నాన్న పోవడంతో అమ్మ మానసిక ఆరోగ్యం దెబ్బతిన్నది. నాకో అన్న. కూలీ పనులకు వెళ్లేవాడు. నన్ను మా మేనమామ ఎస్వీ బాలమందిరంలో చేర్పించారు. పది వరకు అక్కడే చదివాను. డిగ్రీ తర్వాత మయాన్మార్‌లోని ఒక ప్రముఖ కంపెనీలో జాబ్ రావడంతో వెళ్లాను. ఆ వర్క్ ఎక్స్‌పీరియెన్స్‌తో బెంగళూరులో క్వాలిటీ మేనేజర్‌గా ఆఫర్ రావడంతో తిరిగొచ్చేసి అందులో జాయిన్ అయ్యాను. – రాజేష్మేనేజర్గా..మా స్వస్థలం తిరుపతి జిల్లాలోని పిచ్చాటూరు. చిన్నతనంలోనే అమ్మ, నాన్న దూరమయ్యారు. మా అమ్మమ్మ నన్ను ఎస్వీ బాలమందిరంలో చేర్పించింది. పదవ తరగతి వరకు అక్కడే ఉన్నాను. వారి సహకారంతోనే తిరుపతిలోని ఓ ప్రైవేట్ కాలేజ్‌లో ఎంబీఏ చేశాను. ఇప్పుడు యూఎస్ఏలో ఓ ఎమ్ఎన్సీలో మేనేజర్‌గా పనిచేస్తున్నాను. – జి.ఇంద్రజయూరాలజిస్ట్గా..శ్రీకాళహస్తి మండలం, పల్లాం మా సొంతూరు. నా చిన్నప్పుడే అమ్మ, నాన్న చనిపోయారు. నాకో అన్న. మా బాబాయ్ హెల్ప్‌తో ఎస్వీ బాలమందిరంలో చేరాను. టెన్త్ క్లాస్ వరకు అక్కడే ఉన్నాను. ఎమ్సెట్లో ఫ్రీ సీట్ సాధించాను. కర్నూలు మెడికల్ కాలేజ్‌లో ఎంబీబీఎస్ తర్వాత యూరాలజీలో స్పెషలైజేషన్ చేశాను. ప్రస్తుతం నెల్లూరులోని ఓ పేరొందిన హాస్పిటల్లో పనిచేస్తున్నాను. మాలాంటి ఎంతో మందిని ఆదరించి మంచి భవిష్యత్తును ప్రసాదించిన ఎస్వీ బాల మందిరానికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. – డాక్టర్ వై. యువరాజుఆంట్రపెన్యూర్గా.. మా సొంతూరు రెడ్డిగుంట. మేం ముగ్గురం పిల్లలం. నా తొమ్మిదేళ్ల వయస్సులో అమ్మ, నాన్న ఇద్దరూ చనిపోయారు. మమ్మల్ని మా బంధువులు ఎస్వీ బాలమందిరంలో చేర్చారు. ఎంబీఏ చేశాను. వ్యాపారవేత్తగా ఎదగాలనే ఉద్దేశంతో తమ్ముడితో కలసి ఐస్‌క్రీమ్ ఔట్‌లెట్స్‌ను ప్రారంభించాను. చెన్నై కేంద్రంగా ఎమ్ అండ్ ఎమ్ ఎంటర్ప్రైజెస్ పేరుతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో ఐస్‌క్రీమ్ షాపులు, ఔట్లెట్స్ ఉన్నాయి.హెయిర్ సెలూ¯Œ లనూ నడుపుతున్నాం. సుమారు వందమందికి పైగా ఉపాధి కల్పిస్తున్నాం. బాలమందిరంలోని పదిమంది స్నేహితులకూ ఎంప్లాయ్మెంట్ ఇచ్చాం! ఆ బడి మాకు అమ్మలాంటిది. – వి లోకేష్ -
అమ్మ మనసు.. మా దగ్గర పెరిగిన అమ్మాయిని పెళ్లి చేసుకునే వాళ్లకు కొన్ని కండిషన్లు!
మన జీవితాన్ని మనం రాసుకుంటామా? మరెవరైనా రాస్తారా? యాగ్నెస్ నుదుటిన మదర్ థెరిసా అనే మకుటాన్ని చేర్చింది ఎవరు? అనుకోకుండా ఓ రోజు... నిర్మల అనే యువతి నలుగురు పిల్లలకు అమ్మ కావాలని రాసింది ఎవరు? యాభై ఏళ్లు వచ్చే లోపే డెబ్బై మంది పిల్లలకు తల్లయింది గూడపాటి నిర్మల. మరో ముగ్గురు పాపాయిలకు అమ్మమ్మ కూడా. గుడివాడలో పుట్టిన నిర్మలది ఆంగ్లో ఇండియన్ నేపథ్యం ఉన్న కుటుంబం. హైదరాబాద్, మోతీనగర్‌లో జీవోదయ హోమ్ ఫర్ చిల్డ్రన్‌లో నలభై మంది పిల్లలతో సాగుతోంది ఆమె జీవితం. అమ్మకు వైద్యం కోసం 2006లో హైదరాబాద్ వచ్చినప్పుడు ఆమె ఊహకు కూడా అందని విషయం ఇది. అలాంటి ఏ మాత్రం ఊహించని విషయాలు తన జీవితంలో ఎన్నో జరిగాయన్నారు నిర్మల. తాను ఒక డైరెక్షన్ అనుకుంటే తన ప్రమేయం లేకుండా ఏదో ఓ సంఘటన తన మార్గాన్ని మలుపు తిప్పుతూ వచ్చిందని చెప్పారామె. నాటి రైలు ప్రయాణం ‘‘అమ్మానాన్నలు స్కూల్ హెడ్మాస్టర్లు. ముగ్గురమ్మాయిల్లో పెద్దమ్మాయిని. ఇంటర్ తర్వాత లా చదవాలనేది నా కోరిక. అయితే ఆ సెలవుల్లో ట్రైన్లో ప్రయాణిస్తున్నప్పుడు ఓ సంఘటన... నా తోటి ప్రయాణికులు మాతోపాటు రైల్లో ప్రయాణిస్తున్న ఇద్దరు లెప్రసీ పేషెంట్లను నిర్దాక్షిణ్యంగా ప్లాట్‌ఫామ్ మీదకు తోసేశారు. ‘అదేంటి, అలా చేశారు’ అని అడిగితే ‘ఇదెవత్తో పిచ్చి పిల్లలా ఉంద’ని నన్ను ఈసడించుకున్నారు కూడా. అప్పటికి నాకు లెప్రసీ అంటే ఏమిటో తెలియదు. ఇంటికి వెళ్లి మా తాతయ్యను అడిగినప్పుడు వాళ్ల జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో చెప్పారాయన. అప్పుడు డిగ్రీకి చెన్నైకి వెళ్లి లెప్రసీ సంబంధిత కోర్సు చేశాను. అలాగే టీబీ, హెచ్ఐవీ నిర్మూలన సర్వీస్ కోర్సులు చేశాను. అమ్మ కోసం హైదరాబాద్‌కి వచ్చిన తర్వాత ఓ ఆంగ్లో ఇండియన్ ఎంఎల్ఏ సూచనతో బోరబండ, పర్వత్ నగర్లో ఉన్న లెప్రసీ కాలనీలో సర్వీస్ మొదలు పెట్టాను. ఓ రోజు మాదాపూర్‌లో మాణింగ్ వాక్ చేస్తున్నప్పుడు నా కళ్ల ముందు ఓ దుర్ఘటన. ఓ తల్లిదండ్రులు ఆటో స్టాండ్ దగ్గర లగేజ్‌తో ఉన్నారు. వాళ్ల నలుగురు పిల్లల్ని అప్పుడే రోడ్డుకు ఒక పక్కగా ఉంచి, తల్లిదండ్రులు సామాను ఆటో దగ్గరకు తీసుకువెళ్తున్నారు. ఇంతలో పెద్ద పెద్ద బండరాళ్లతో ఓ లారీ... రాంగ్‌సైడ్ వచ్చి వాళ్లను ఢీకొట్టింది. తల్లిదండ్రులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం తెలుసుకుని ప్రాణాలు కోల్పోయిన వారి తల్లిదండ్రులు వచ్చారు. అంటే... నలుగురు చిన్న పిల్లల అమ్మమ్మ – తాత, నానమ్మ –తాతలన్నమాట. వాళ్లు ఆ పిల్లలను చూస్తూ ‘నష్టజాతకులు’ అని ఓ మాట అనేసి తమకేమీ పట్టనట్లు వెళ్లిపోయారు. లెప్రసీ కాలనీ సర్వీస్‌తో అప్పటికే ఆ పీఎస్ పరిధిలోని పోలీసులు పరిచయం అయ్యారు. వారు ఆ పిల్లలను స్టేట్ హోమ్‌లో చేర్చే బాధ్యత నాకప్పగించారు. నలుగురు పిల్లలకు గార్డియన్‌గా నేనే సంతకం చేసి స్టేట్‌హోమ్‌లో చేర్చాను. అయితే... ఆ బాధ్యత అంతటితో తీరలేదు. స్టేట్ హోమ్ నుంచి ఫోన్ కాల్ ఆ నలుగురు పిల్లల్లో పెద్దమ్మాయి లైన్లో ఉంది. ‘అమ్మా! మమ్మల్ని హోమ్‌లో చేర్చేటప్పుడు మీరు సంతకం చేశారట. హోమ్ వాళ్లు మమ్మల్ని బయటకు పంపించాలన్నా కూడా మీరే సంతకం చేయాలట. మీరు వచ్చి సంతకం చేస్తే మేము బయటకు వెళ్లిపోతాం. ఇక్కడ ఉండలేం’ ఇదీ ఆ ఫోన్ సారాంశం. ఎక్కడికి వెళ్తారు. నీకు పదేళ్లు కూడా లేవు. ఇద్దరు తమ్ముళ్లు, చెల్లికి ఏడాది కూడా నిండలేదు. వాళ్లను నువ్వు ఎలా చూసుకుంటావని అడిగితే సమాధానం లేదు. ‘ఎక్కడికో ఒక చోటకు వెళ్లిపోతాం, ఇక్కడ మాత్రం ఉండలేం’ అదే మంకుపట్టు. అప్పుడు పోలీసుల నుంచి ఓ రిక్వెస్ట్. ఆ పిల్లలను మీరు సంతకం చేసి బయటకు తీసుకురాకపోతే గోడదూకి వెళ్లిపోతారు. ఆ పోవడం రోడ్డు మీదకే. సిగ్నళ్ల దగ్గర బెగ్గర్‌గా మారిపోతారు. వాళ్లను దగ్గర పెట్టుకుని చదివించే మార్గం చూడమన్నారు. దాంతో వాళ్లను మా ఇంటికి తీసుకువచ్చాను. ఆలా ఆ రోజు నలుగురు పిల్లలకు అమ్మనయ్యాను. చంటిబిడ్డను చూసుకోవడానికి మా ఊరి నుంచి ఒక డొమెస్టిక్ హెల్పర్‌ను పిలిపించుకున్నాను. ఆ తర్వాత పోలీసుల నుంచి తరచూ ఓ ఫోన్. అమ్మానాన్నలకు దూరమైన పిల్లల్లో పోలీసుల దృష్టికి వచ్చిన వాళ్లను తెచ్చి వదిలిపెట్టసాగారు. అలా మూడు నెలలకు నా ఇల్లు ఇరవై మంది పిల్లల ఇల్లయింది. అంతమంది పిల్లలను ఇంట్లో ఉంచడానికి ఇంటి ఓనరు అభ్యంతరం చెప్పడంతో పూర్తి స్థాయి హోమ్ ప్రారంభించాను. ఇప్పుడు మా హోమ్ నుంచి మొత్తం డెబ్బై మంది పిల్లలు సహాయం పొందుతున్నారు. నలభై మంది ఈ హోమ్‌లో ఉన్నారు. పన్నెండు మంది అబ్బాయిలు విజయవాడలో ఉన్నారు. ఎనిమిది మంది సెమీ ఆర్ఫన్లకు ఈ హోమ్ నుంచే భోజనం వెళ్తుంది. వాళ్లకు తల్లి మాత్రమే ఉంటుంది. ఆమెకు తన పిల్లల్ని పోషించడానికి, చదివించడానికి శక్తి లేని పరిస్థితుల్లో పిల్లల చదువులు, భోజనం, దుస్తులు అన్నీ మా హోమ్ చూసుకుంటుంది. పిల్లలు మాత్రం ఉదయం వాళ్ల ఇంటి నుంచి స్కూలుకు వస్తారు, రాత్రికి తల్లి దగ్గరకు వెళ్లిపోతారు. ఇక కాలేజ్‌కెళ్లే వాళ్ల విషయానికి వస్తే... ఎనిమిది మంది ఇంటర్, ఒక అమ్మాయి డిగ్రీ చదువుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇరవై మంది నర్సింగ్, పాలిటెక్నిక్ చేస్తున్నారు. ఐదుగురు కర్నాటకలో మెడిసిన్, సాఫ్ట్వేర్ కోర్సుల్లో ఉన్నారు. మొదట నేను ఇంటికి తెచ్చుకున్న ఆ నలుగురు పిల్లల్లో పెద్దమ్మాయి, సంతకం చేస్తే వెళ్లిపోతానని ఫోన్ చేసిన అమ్మాయి కూడా ఇప్పుడు కర్నాటకలో మెడిసిన్ చేస్తున్న వాళ్లలో ఉంది. మా పిల్లల్లో ముగ్గురు పూనా, వైజాగ్, బెంగళూరుల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వాళ్లు ఒక్కొక్కరూ నలుగురు పిల్లల చదువు బాధ్యత తీసుకున్నారు. వాళ్లు ముగ్గురూ పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నారు. ప్రసవాలు కూడా మా హోమ్‌లోనే. ఆ పిల్లలు నన్ను ‘అమ్మమ్మ’ అంటారు. ఆ చిన్న పిల్లలకు నలభై మంది పిన్నమ్మలు. మాది జగమంత కుటుంబం’’ అన్నారు నిర్మల తన పిల్లల మధ్య కూర్చుని వాళ్లను ముద్దు చేస్తూ. నిర్మల ఆఫీసు గదిలో గోడకు మదర్ థెరిసా ఒక బిడ్డను ఎత్తుకున్న ఫొటో ఉంది. ఈ మదర్... చుట్టూ పిల్లలతో ఆ మదర్‌కు మరోరూపంగా కనిపించింది. మా దగ్గర పెరిగిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చే వాళ్లకు కండిషన్లుంటాయి. వాళ్లను ఉద్యోగం మాన్పించకూడదు. పెళ్లికి ముందే కొంత మొత్తం అమ్మాయి పేరు మీద డిపాజిట్ చేయాలి. అనాథ అని సంబోధించరాదు. అలాగే తమ అభ్యుదయ భావాలను సమాజం ముందు ప్రదర్శించుకోవడానికి ‘అనాథను పెళ్లి చేసుకున్నాను’ అని చెప్పుకోరాదు. పాట నడిపేది నేను సింగర్‌ని. పాటలు పాడడం ద్వారా మంచి రాబడి ఉండేది. దాంతో హోమ్ నడపడం ఏ మాత్రం కష్టం కాలేదప్పట్లో. థైరాయిడ్ సమస్యతో గొంతుకు ఆపరేషన్ అయింది. ఇప్పుడు పాడలేను. ప్రధాన ఆదాయ వనరు ఆగిపోయింది. పిల్లలకు దుస్తులు, భోజనం వరకు ఇబ్బంది లేదు. మా హోమ్‌ని చూసిన వాళ్లు వాటిని విరాళంగా ఇస్తుంటారు. బర్త్‌డేలు మా పిల్లలతో కలిసి చేసుకోవడం కూడా మాకు బాగా ఉపకరిస్తోంది. స్కూలు, కాలేజ్ ఫీజులు, ఇంటి అద్దెకు మాత్రం డబ్బుగా కావాల్సిందే. డబ్బుగా ఇస్తే దారి మళ్లుతుందేమోననే సందేహం ఉంటుంది. నేను అభ్యర్థించేది ఒక్కటే. నా చేతికి డబ్బు ఇవ్వవద్దు. ఈ పిల్లలకు పుస్తకాలు కొనివ్వడం, స్కూల్కెళ్లి ఫీజులు చెల్లించడం స్వయంగా వారే చేయవచ్చు. ఏడాది పాటు ఒక బిడ్డను చదివించవచ్చు. మనసుంటే మార్గాలూ ఉంటాయి. – గూడపాటి నిర్మల, జీవోదయ హోమ్ ఫర్ చిల్డ్రన్ నిర్వహకురాలు – వాకా మంజులారెడ్డి ఫొటోలు: నోముల రాజేశ్ రెడ్డి -
పదేళ్ల తర్వాత అమ్మ ఒడికి
సాక్షి,హైదరాబాద్: మానసిక స్థితి సరిగాలేని ఓ బాలుడు ఏడేళ్ల వయసులో ఇంటి నుంచి తప్పిపోయాడు. ఆ బాలుడిని పోలీసులు చేరదీసి చిల్ర్డన్స్ హోమ్‌కు పంపారు. పదేళ్లు అక్కడే గడిపిన ఆ బాలుడు తెలంగాణ పోలీసుల సాయంతో అమ్మ ఒడికి చేరాడు. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ జిల్లా కొత్వాలీకి చెందిన శ్రీవాత్సవకు చిన్నతనంలో మానసిక సమస్యలున్నాయి. 2010 అక్టోబర్ 10న ఇంటి ముందు ఆడుకుంటూ తప్పిపోయాడు. అదే నెల 21న పశ్చిమబెంగాల్లోని హుగ్లీ పోలీసులు అతన్ని చేరదీశారు. అనంతరం హౌరాలోని చిల్ర్డన్స్ హోమ్‌కు పంపారు. గుర్తించిన ‘దర్పణ్’ ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీతో ‘దర్పణ్’ యాప్ ను తెలంగాణ సేఫ్టీ వింగ్ అభివృద్ధి చేశారు. తప్పిపోయిన, ఆశ్రమాల్లో ఉన్న పిల్లల ఫొటోలను దీంతో పోల్చిచూస్తారు. శ్రీవాత్సవ చిన్ననాటి ఫొటోతో హౌరాలోని చిల్ర్డన్స్ హోమ్‌లో ఉన్న బాలుడి ముఖకవళికలు ఒకేలా ఉన్నాయని యాప్ గుర్తించింది. సేఫ్టీ వింగ్ పోలీసులు శ్రీవాత్సవ తల్లిదండ్రులు, హుగ్లీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో చిల్ర్డన్స్ హోమ్‌లో ఉన్న శ్రీవాత్సవను అతని తండ్రికి అధికారులు అప్పగించారు. -
స్వచ్ఛమైన పువ్వులు
కొలను నిండా పూలుంటే కనుల నిండా నవ్వులుంటే ఎలా ఉంటుందో.. అలా ప్రశాంతంగా.. ఆహ్లాదంగా ఉంటుంది ఈ హోమ్. ఇక్కడి పిల్లలందరూ స్వచ్ఛతకు ప్రతిరూపాలు. శాంతమ్మ ఒడిలో ఎదుగుతున్న ‘దివ్య’ స్వరూపాలు! సికింద్రాబాద్, ఈస్ట్ మారేడ్‌పల్లి, మహేంద్ర హిల్స్. ఆకుపచ్చ గేటున్న నాలుగంతస్థుల చక్కటి భవనం. అది ‘శ్రీ విద్యాస్ సెంటర్ ఫర్ ద స్పెషల్ చిల్డ్రన్’ హోమ్. గులాబీ, నందివర్ధనం, కస్తూరి, గన్నేరు, బంగారు గంటలు, మందార, గరుడ వర్ధనం, క్రోటన్స్, కలబంద, సంపెంగ తీగలతోపాటు రకరకాల చెట్లున్నాయి. మధ్యాహ్నం ఒకటిన్నర దాటింది. పిల్లల భోజనాలు పూర్తయ్యాయి. ఆయాలు పిల్లలు నేలమీద పోసిన అన్నం మెతుకులను తుడిచేస్తున్నారు. మరోవైపు పిల్లలందరూ రెండు వరుసలుగా కూర్చుని తలెత్తి చూస్తూ చప్పట్లు కొడుతున్నారు. వాళ్లు చూస్తున్నది టీవీలో ప్లే అవుతున్న కామిక్ షో. బుడబుక్కల వాళ్లు ‘అంబ పలుకు జగదంబ పలుకు’ అంటూ గంట వాయిస్తుంటే పిల్లలు పెద్దగా నవ్వుతున్నారు. ఆ షో తర్వాత ఇద్దరమ్మాయిలు తెరమీదచ్చి ‘ఒప్పుల కుప్ప– వయ్యారి భామ’ అంటూ ఒకరి చేతులు మరొకరు పట్టుకుని గిర్రున తిరుగుతున్నారు. ఇక పిల్లల కేరింతలకు హద్దే లేకుండా పోయింది. ఎల్కేజీ, యూకేజీ పిల్లల్లాగ ఉంది వాళ్ల సంబరం. ‘‘నిజమే, వీళ్లు ప్రతి దానికీ చిన్న పిల్లల్లా సంతోషపడతారు. స్వచ్ఛమైన మనసు వాళ్లది. అమాయకత్వంలో ఉండే ముగ్ధత్వం మరి దేనిలోనూ ఉండదు. దేవుడు వాళ్లను ఎప్పటికీ కల్మషం మకిలి అంటని స్వచ్ఛతతోనే ఉంచాలనుకున్నామో ఏమో, అందుకే ఇలా పుట్టించినట్లున్నాడు’’ అన్నారు ఆ హోమ్‌ను నిర్వహిస్తున్న శాంతి వెంకట్. తల్లి కంటే ఎక్కువ శ్రద్ధ శాంతి వెంకట్ స్పెషల్ చిల్డ్రన్ కోసం 1999లో హోమ్ స్థాపించారు. ఎనిమిది మంది పిల్లలతో మొదలైన హోమ్‌లో ఇప్పుడు నూటయాభై మంది పిల్లలున్నారు. వాళ్లలో ఓ వంద మంది పిల్లలు డే కేర్‌లో ఉదయం వచ్చి సాయంత్రం ఇళ్లకు వెళ్లిపోతారు. యాభై మంది పిల్లలు హాస్టల్లో ఉంటారు. గుంటూరు జిల్లా, సత్తెనపల్లిలో పుట్టి పెరిగిన శాంతి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్‌లో స్పెషల్ ఎడ్యుకేటర్‌గా శిక్షణ పొందారు. స్పెషల్ కిడ్స్ కోసం మామూలు టీచర్ ట్రైనింగ్ సరిపోదు. రోజూ ఆ పిల్లల సైకాలజీని చదువుతుండాలి, వారి మానసిక ఆరోగ్యాన్ని పరిశీలిస్తూ ఉండాలి. వారి ప్రవర్తనకు అనుగుణంగా వారితో మెలగుతూ ఆ పిల్లలను ఒక క్రమపద్ధతిలో తీర్చిదిద్దాలి. ఎడ్యుకేటర్లు పేరుకు టీచర్లే కానీ తల్లికంటే ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాలి. ఇంత బాధ్యతాయుతమైన వృత్తిని ఇష్టంగా ఎంచుకున్నారు శాంతి. ఆమెను, ఆమె ఆశయాలను ఇష్టపడిన సివిల్ ఇంజనీర్ వెంకట్.. వివాహంతో ఆమెతోబంధం ఏర్పరుచుకోవాలనుకున్నారు. అప్పుడు ఆమె చెప్పిన మాట ఒక్కటే... ‘నేను ఎంచుకున్న ప్రొఫెషన్‌ను గౌరవించాలి. స్పెషల్ కిడ్స్‌ని నార్మల్ కిడ్స్‌గా తీర్చిదిద్దే యజ్ఞం ఇది. ఈ యజ్ఞం కోసం జీవితాన్ని అంకితం చేయాల్సి వస్తే వెనుకాడను. అందుకు అంగీకారమైతేనే’ అన్నారామె. ఆ కండిషన్లతోపాటు ఒక బిడ్డను మాత్రమే కనాలనే నియమానికి కూడా తన అంగీకారాన్ని తెలియచేశారు వెంకట్. శాంతి తన ఉద్యోగ జీవితం, హోమ్ నిర్వహకురాలిగా మారడంతోపాటు నిర్వహణలో ఎదురైన కష్టాలు, గట్టెక్కిన తీరును కూడా గుర్తు చేసుకున్నారు. అటెన్షన్ ఇస్తుండాలి ‘‘ఆటిజమ్, డౌన్స్ సిండ్రోమ్‌తో బాధపడుతున్న వాళ్లు ఎక్కువగా ఉన్నారు మా దగ్గర. ఐదేళ్ల పిల్లల నుంచి నలభై దాటిన వాళ్లు కూడా ఉన్నారు. ఎన్నేళ్లు దాటినా వాళ్లందరూ పిల్లలే. చొక్కాగుండీ పెట్టుకోవడం కూడా చాలా రోజులు నేర్పించాలి. వాళ్లు సొంతంగా తమ పనులు చేసుకోగలిగిన లైఫ్ స్కిల్స్‌తోపాటు పదిమందిలో మెలగాల్సిన సోషల్ స్కిల్స్‌ను కూడా నేర్పిస్తాం. అటెన్షన్ సీకింగ్ అనేది ఈ పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. అందరి దృష్టి తమ మీదకు మళ్లించుకోవడానికి ఏదో ఒక వస్తువును పగలకొట్టడం, పెద్దగా అరవడం వంటివి చేస్తారు. ఈ లక్షణాలను భయపడి పేరెంట్స్ ఈ పిల్లలను ఫంక్షన్లకు తీసుకెళ్లరు. మా (హోమ్‌లో ఉన్న) పిల్లలకు బయట డిన్నర్లకెళ్లినప్పుడు క్యూలో నిలబడి తమ వంతు కోసం వెయిట్ చేయడం, ఏమి తినాలో వాటినే వడ్డించుకోవడం, కింద పడేయకుండా తినడం కూడా వచ్చు. వాళ్లు ఒక పని చేసినప్పుడు ప్రశంసించాలి. ప్రశంసలతోనే దారికి తెచ్చుకోవాలి. నిజానికి ప్రశంసలు కోరుకోనిదెవరు? నలుగురిలో తమకు అటెన్షన్ కావాలనే కోరిక పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరిలోనూ ఉంటుంది. అయితే మామూలు వాళ్లు ఆ కోరికను బయటపడనివ్వరు. ప్రశంసల కోసం ఎప్పుడు ఎదురు చూడాలో, ఎక్కడ ఎదురు చూడాలో, ఎక్కడ తగ్గి ఉండాలో మామూలు వాళ్లకు తెలిసి ఉంటుంది. అది తెలియకపోవడమే ఈ పిల్లల్లో ఉన్న లోపం. అంతకంటే మరే లోపమూ ఉండదు వీళ్లలో. కూరగాయలు తరుగుతారు. దుస్తులు మడత పెడతారు. మా సెంటర్లో వారంలో ఒక రోజు కుకింగ్ క్లాస్ ఉంటుంది. ఈ పిల్లల్లో చాలా మంది గ్యాస్ వెలిగించి చక్కగా వంట చేస్తారు. పెద్ద పిల్లలు తమకు రెండు చపాతీలు చేసుకుని చిన్న పిల్లలకు ఒకటి చేసిస్తారు. వాళ్లు ఏ పని చేస్తున్నా మేము దగ్గర ఉండి పర్యవేక్షిస్తుంటాం. మా అమ్మ ఉన్న రోజుల్లో అయితే హోమ్‌లో పండుగలు బాగా చేసేవాళ్లం. సంక్రాంతి, వినాయక చవితికి 21 రకాలు వండి పిల్లలకు అరిటాకులో వడ్డించేది. ఇది పదమూడో చోటు ఈ హోమ్ స్థాపించేటప్పుడు నిర్వహణ సమస్యలు ఇన్ని రకాలుగా వస్తాయని ఏ మాత్రం ఊహించలేదు. పన్నెండు అద్దె ఇళ్లను మారి ఇప్పుడు శాశ్వత నివాసంలోకి అడుగుపెట్టాం. పిల్లలు అల్లరి చేస్తున్నారని పొరుగింటి వాళ్లు పోలీస్ కంప్లయింట్ ఇచ్చారు. కొన్ని ఇళ్లలో ఇంటి యజమానులు నెలకోసారి వచ్చి గదులు, షెల్ఫులు చెక్ చేసుకునేవాళ్లు. ప్రతి ఇంటినీ ఖాళీ చేసి వచ్చేటప్పుడు ఎదురు డబ్బు కట్టాల్సి వచ్చేది. చిలుకూరు బాలాజీ దగ్గర ప్రదక్షిణలు చేసి మా పిల్లలకు శాశ్వతంగా ఒక గూడు కల్పించమని మొక్కుకున్నాను. తిరుమల వెంకటేశ్వరునికి తల నీలాలు మొక్కుకున్నాను. మొత్తానికి మా కష్టాన్ని గుర్తించిన ఆ భగవంతుడు దాతలను పంపించాడు.ఒకరు ఈ స్థలాన్ని కొని హోమ్‌కు నామమాత్రపు ఫీజుతో వందేళ్లకు లీజ్‌కిచ్చారు. మరో పెద్ద కంపెనీ నాలుగంతస్థుల భవనాన్ని పిల్లలకు అనువుగా డిజైన్ చేసి మరీ కట్టించి ఇచ్చింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్లు ఫర్నిచర్ విరాళంగా ఇచ్చారు. మా హోమ్‌లో పిల్లల పేరెంట్స్‌తోనే అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నాం. ఏరోనాటికల్ ఇంజనీర్ రమారవిచంద్రన్ హోమ్ ప్రారంభం నుంచి ప్రెసిడెంట్‌గా ఉన్నారు. పేరెంట్స్ విరాళాలతోపాటు గుప్తదాతలు ఎంతోమంది సహాయం చేస్తున్నారు. మావారు సివిల్ ఇంజనీర్ కావడంతో ఈ భవన నిర్మాణంలో చాలా సహాయం చేశారు. ఆ దేవుడు ‘ఆయనను నాకిచ్చిన ఉద్దేశం పూర్తయింద’నుకున్నాడో ఏమో! నాకు ఇబ్బంది లేని విధంగా అన్నీ ఏర్పరిచి, ఇక నూటికి నూరుశాతం ఇదే పనికి జీవితాన్ని అంకితం చేయమని కాబోలు రెండేళ్ల కిందట ఆయన్ను తీసుకెళ్లిపోయాడు. మా అబ్బాయి యూకేలో ఎంబీఏ చేస్తున్నాడు. ఇప్పుడు నాకు ఈ పిల్లలదే లోకం. దేవుడు ఈ పిల్లల కోసం నాకున్న ఇతర భవబంధాలను తగ్గించాడు. ఈ భవసాగరాన్ని ఈదడమే నాకు వేంకటేశ్వరుడు అప్పగించిన బాధ్యత’’ అని ముగించారు శాంతి. ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి ఫొటోలు: నోముల రాజేశ్ రెడ్డి గార్డెనింగ్ అలవాటు చేశాం మా పిల్లలకు ఈ మధ్య మొక్కలు పెంచడం అలవాటు చేశాం. నిజానికి మేము ఊహించనంత మార్పు వచ్చింది. ఎప్పుడూ మాట్లాడుతూ ఉండే పిల్లలు కూడా తదేక దీక్షతో మొక్కలకు నీళ్లు పోయడం, కలుపు మొక్కలు పీకి పారేయడం వంటి పనులన్నీ చక్కగా చేస్తున్నారు. వాళ్లు పెంచిన మొక్కలకు పువ్వు పూసి కాయ కాస్తే ఎంత సంతోషపడతారో మాటల్లో చెప్పలేం. మార్కెట్‌కెళ్లి కూరగాయలు కొనడం కూడా నేర్చుకున్నారు. కూరగాయల లిస్ట్ రాస్తారు, హోమ్‌కు కావాల్సిన సరుకుల జాబితా రాయడం నేర్చుకున్నారు. వంద రూపాయలిచ్చి చిల్లర తీసుకోవడం కూడా వచ్చింది. పద్దెనిమిదేళ్లు నిండిన పిల్లలకు ఏదో ఒక పనిలో శిక్షణనిస్తున్నాం. ఒకేషనల్ కోర్సులో శిక్షణ ఇచ్చి ఒక వ్యాపకంలో నిమగ్నం చేయగలిగితే వాళ్లు ఎవరికీ భారం కారు. వాళ్ల ఇళ్లలో వాళ్లకు ఇబ్బంది కలగకుండా జీవించగలుగుతారు. ఈ పిల్లలు ఈ దశకు చేరడానికి మధ్య ఉన్న మా ప్రయాణమే అసలైనది. ఎంత చెప్పుకున్నా తరగనిది. -
నిబంధనలకు విరుద్ధంగా చిల్డ్రన్స్ హోం: ఇద్దరి అరెస్ట్
మల్కాజ్గిరి: నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న చిల్డ్రన్స్ హోంపై బాలల సంరక్షణ అధికారులు దాడి చేశారు. మేడ్చల్‌జిల్లా మేడిపల్లి మండలం పర్వతపురంలో బాలల సంరక్షణ శాఖ అధికారులు తనిఖీలు చేశారు. భార్యాభర్తలిద్దరు చిల్డ్రన్స్ హోమ్ నడుపుతున్నట్లు గుర్తించారు. జువైనల్ చట్టంలో ఉండాల్సిన నిబంధనలు కాని, చైల్డ్ వెల్ఫేర్ సంస్థ అనుమతులు కాని లేకుండా భార్యాభర్తలిద్దరు గుడ్‌విల్ క్రైస్ట్ మినిస్ట్రీస్ అనే పేరుతో ఈ చిల్డ్రన్స్ హోమ్ నడుపుతున్నారని మల్కాజిగిరి డీసీపీ ఉమామహేశ్వర శర్మ తెలిపారు. దీంతో కడప జిల్లాకు చెందిన సంజీవయ్య, సులోచన దంపతులను అరెస్ట్ చేశామన్నారు. చిన్న పిల్లలతో మత ప్రార్ధనలు చేయిస్తున్నట్లు తమ దర్యాప్తులో తేలిందన్నారు. నిందితులపై ఐపీసీ 342, 370, 153, (a),రెడ్ విత్ 120 (b) కింద కేసు నమోదు చేశామని ఆయన చెప్పారు. -
చిల్డ్రన్స్ హోంకు చిన్నారి పెళ్లికూతురు
పలమనేరు (చిత్తూరు) : బాల్య వివాహం జరిగిన ఓ చిన్నారి పెళ్లి కూతురిని అధికారులు చిల్డ్రన్స్ హోంకు తరలించారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా పలమనేరులో శనివారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. పలమనేరులోని బోయవీధికి చెందిన 14 ఏళ్ల బాలికకు పెద్దలు శనివారం వివాహం జరిపించారు. అదే రోజున ఆమె అత్తారింట్లో అడుగుపెట్టింది. కాగా మదనపల్లె సబ్ కలెక్టర్‌కు ఈ బాల్య వివాహంపై సమాచారం అందడంతో... ఆయన ఆదేశాల మేరకు ఐసీడీఎస్ అధికారులు శనివారం రాత్రి రంగంలోకి దిగారు. సంబంధిత నవ వధువు ఇంటికి వెళ్లి పెద్దలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ పెళ్లి చెల్లదని, బాలికకు 18 ఏళ్లు నిండేవరకు బాలల సంరక్షణ కేంద్రంలో ఉంచి కుట్లు, అల్లికలు నేర్పిస్తామని చెప్పి... అత్తారింటి నుంచి ఆ నవ వధువును చిల్డ్రన్స్ హోంకు తరలించారు.