పోగూరి చంద్రబాబు, తిరుపతి సిటీ అమ్మ, నాన్నల అండతో.. ఆప్యాయతానురాగాల నీడన .. కుటుంబ బలంతో జీవితానికి బాట వేసుకునే అవకాశం ఉండటం నిజంగానే అదృష్టం!అమ్మ, నాన్నల్లేని అనాథలకూ అలాంటి అదృష్టాన్ని కల్పిస్తోంది ఎస్వీ బాలమందిరం!
తిరుపతి, భవానీనగర్‌లో టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీ బాలమందిరం.. నా అన్నవారు లేని బాలలకు, సింగిల్ పేరెంట్ పిల్లలకు తానున్నానంటూ ఆశ్రయమిచ్చి ఆదుకుంటోంది! ప్రేమ, వాత్సల్యాలను పంచుతూ.. విద్యాబుద్ధులు అందించి వారిని బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దుతోంది. అందులో విద్యనభ్యసించిన పిల్లలు నేడు దేశ, విదేశాల్లో ఉన్నతోద్యోగాల్లో స్థిరపడ్డారు. ఇంజినీర్లు, డాక్టర్లుగా రాణిస్తున్నారు. వ్యాపారవేత్తలుగానూ ఎదిగారు. టీటీడీలో నాలుగో తరగతి ఉద్యోగాల నుంచి సూపరింటెండెంట్, డీఈఓ స్థాయి వరకు విధులు నిర్వహిస్తున్నారు.
అనాథాశ్రమం నుంచి ఎస్వీ బాలమందిరంగా..
టీటీడీ తొలి ఈఓ అన్నారావు 1943లో టీటీడీ అనాథాశ్రమ పాఠశాలను ప్రారంభించారు. ఆదిలోనే ఇది నాటి ప్రధాని జవహార్‌లాల్ నెహ్రూ దృష్టిని ఆకట్టుకుంది. ఆయన 1962లో బడిని సందర్శించి ‘చిల్డ్రన్స్ ఆఫ్ లార్డ్ వేంకటేశ్వర’ అని పిలవడంతో అదికాస్త ఎస్వీ బాలమందిరంగా మారింది. 2005 నుంచి సుమారు 500 మంది అనాథ పిల్లలు బాలమందిరంలో విద్యనభ్యసిస్తున్నారు. వీరిని అధికారులు శ్రీవారి పిల్లలుగానే భావిస్తూ సేవలు అందిస్తున్నారు.
బ్యాంక్‌లో సీనియర్ మేనేజర్‌గా..
మాది శ్రీకాళహస్తి, తొట్టంబేడు. నేను మూడో తరగతిలో ఉన్నప్పుడే అమ్మ, నాన్న చనిపోయారు. మా అవ్వ నన్ను ఎస్వీ బాలమందిరంలో చేర్పించింది. అది అమ్మ, నాన్న లేని లోటును తీర్చడమే కాకుండా చక్కగా చదువు చెప్పించింది. భరతనాట్యంలోనూ ట్రైనింగ్ ఇప్పించింది. ఇంటర్, డిగ్రీ, ఎంబీఏ అన్నీ టీటీడీ అధికారుల అండదండలతోనే పూర్తి చేశాను. ప్రస్తుతం బెంగళూరు కోటక్ మహీంద్ర బ్యాంకులో సీనియర్ మేనేజర్‌గా పనిచేస్తున్నాను.
– బి గుర్రమ్మ
క్వాలిటీ మేనేజర్‌గా..
మాది చిత్తూరు జిల్లాలోని మోర్దాన్ పల్లి. నాకు ఊహ తెలియని వయసులో నాన్న చనిపోయాడు. నాన్న పోవడంతో అమ్మ మానసిక ఆరోగ్యం దెబ్బతిన్నది. నాకో అన్న. కూలీ పనులకు వెళ్లేవాడు. నన్ను మా మేనమామ ఎస్వీ బాలమందిరంలో చేర్పించారు. పది వరకు అక్కడే చదివాను. డిగ్రీ తర్వాత మయాన్మార్‌లోని ఒక ప్రముఖ కంపెనీలో జాబ్ రావడంతో వెళ్లాను. ఆ వర్క్ ఎక్స్‌పీరియెన్స్‌తో బెంగళూరులో క్వాలిటీ మేనేజర్‌గా ఆఫర్ రావడంతో తిరిగొచ్చేసి అందులో జాయిన్ అయ్యాను.
– రాజేష్
మేనేజర్‌గా..
మా స్వస్థలం తిరుపతి జిల్లాలోని పిచ్చాటూరు. చిన్నతనంలోనే అమ్మ, నాన్న దూరమయ్యారు. మా అమ్మమ్మ నన్ను ఎస్వీ బాలమందిరంలో చేర్పించింది. పదవ తరగతి వరకు అక్కడే ఉన్నాను. వారి సహకారంతోనే తిరుపతిలోని ఓ ప్రైవేట్ కాలేజ్‌లో ఎంబీఏ చేశాను. ఇప్పుడు యూఎస్‌ఏలో ఓ ఎమ్‌ఎన్‌సీలో మేనేజర్‌గా పనిచేస్తున్నాను.
– జి.ఇంద్రజ
యూరాలజిస్ట్‌గా..
శ్రీకాళహస్తి మండలం, పల్లాం మా సొంతూరు. నా చిన్నప్పుడే అమ్మ, నాన్న చనిపోయారు. నాకో అన్న. మా బాబాయ్ హెల్ప్‌తో ఎస్వీ బాలమందిరంలో చేరాను. టెన్త్ క్లాస్ వరకు అక్కడే ఉన్నాను. ఎమ్‌సెట్‌లో ఫ్రీ సీట్ సాధించాను. కర్నూలు మెడికల్ కాలేజ్‌లో ఎంబీబీఎస్ తర్వాత యూరాలజీలో స్పెషలైజేషన్ చేశాను. ప్రస్తుతం నెల్లూరులోని ఓ పేరొందిన హాస్పిటల్‌లో పనిచేస్తున్నాను. మాలాంటి ఎంతో మందిని ఆదరించి మంచి భవిష్యత్తును ప్రసాదించిన ఎస్వీ బాల మందిరానికి ఎప్పటికీ రుణపడి ఉంటాను.
– డాక్టర్ వై. యువరాజు
ఆంట్రపెన్యూర్‌గా..
మా సొంతూరు రెడ్డిగుంట. మేం ముగ్గురం పిల్లలం. నా తొమ్మిదేళ్ల వయస్సులో అమ్మ, నాన్న ఇద్దరూ చనిపోయారు. మమ్మల్ని మా బంధువులు ఎస్వీ బాలమందిరంలో చేర్చారు. ఎంబీఏ చేశాను. వ్యాపారవేత్తగా ఎదగాలనే ఉద్దేశంతో తమ్ముడితో కలసి ఐస్‌క్రీమ్ ఔట్‌లెట్స్‌ను ప్రారంభించాను. చెన్నై కేంద్రంగా ఎమ్ అండ్ ఎమ్ ఎంటర్‌ప్రైజెస్ పేరుతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో ఐస్‌క్రీమ్ షాపులు, ఔట్‌లెట్స్ ఉన్నాయి.హెయిర్ సెలూ¯Œ లనూ నడుపుతున్నాం. సుమారు వందమందికి పైగా ఉపాధి కల్పిస్తున్నాం. బాలమందిరంలోని పదిమంది స్నేహితులకూ ఎంప్లాయ్‌మెంట్ ఇచ్చాం! ఆ బడి మాకు అమ్మలాంటిది.
– వి లోకేష్
Comments
Please login to add a commentAdd a comment