స్వచ్ఛమైన పువ్వులు | Shanthi Venkat Special Care To Childrens Home | Sakshi
Sakshi News home page

స్వచ్ఛమైన పువ్వులు

Published Mon, Jan 13 2020 1:52 AM | Last Updated on Mon, Jan 13 2020 1:52 AM

Shanthi Venkat Special Care To Childrens Home - Sakshi

కొలను నిండా పూలుంటే కనుల నిండా నవ్వులుంటే ఎలా ఉంటుందో.. అలా ప్రశాంతంగా.. ఆహ్లాదంగా ఉంటుంది ఈ హోమ్‌. ఇక్కడి పిల్లలందరూ స్వచ్ఛతకు ప్రతిరూపాలు. శాంతమ్మ ఒడిలో ఎదుగుతున్న ‘దివ్య’ స్వరూపాలు!

సికింద్రాబాద్, ఈస్ట్‌ మారేడ్‌పల్లి, మహేంద్ర హిల్స్‌. ఆకుపచ్చ గేటున్న నాలుగంతస్థుల చక్కటి భవనం. అది ‘శ్రీ విద్యాస్‌ సెంటర్‌ ఫర్‌ ద స్పెషల్‌ చిల్డ్రన్‌’ హోమ్‌. గులాబీ, నందివర్ధనం, కస్తూరి, గన్నేరు, బంగారు గంటలు, మందార, గరుడ వర్ధనం, క్రోటన్స్, కలబంద, సంపెంగ తీగలతోపాటు రకరకాల చెట్లున్నాయి. మధ్యాహ్నం ఒకటిన్నర దాటింది. పిల్లల భోజనాలు పూర్తయ్యాయి. ఆయాలు పిల్లలు నేలమీద పోసిన అన్నం మెతుకులను తుడిచేస్తున్నారు. మరోవైపు పిల్లలందరూ రెండు వరుసలుగా కూర్చుని తలెత్తి చూస్తూ చప్పట్లు కొడుతున్నారు. వాళ్లు చూస్తున్నది టీవీలో ప్లే అవుతున్న కామిక్‌ షో.

బుడబుక్కల వాళ్లు ‘అంబ పలుకు జగదంబ పలుకు’ అంటూ గంట వాయిస్తుంటే పిల్లలు పెద్దగా నవ్వుతున్నారు. ఆ షో తర్వాత ఇద్దరమ్మాయిలు తెరమీదచ్చి ‘ఒప్పుల కుప్ప– వయ్యారి భామ’ అంటూ ఒకరి చేతులు మరొకరు పట్టుకుని గిర్రున తిరుగుతున్నారు. ఇక పిల్లల కేరింతలకు హద్దే లేకుండా పోయింది. ఎల్‌కేజీ, యూకేజీ పిల్లల్లాగ ఉంది వాళ్ల సంబరం. ‘‘నిజమే, వీళ్లు ప్రతి దానికీ చిన్న పిల్లల్లా సంతోషపడతారు. స్వచ్ఛమైన మనసు వాళ్లది. అమాయకత్వంలో ఉండే ముగ్ధత్వం మరి దేనిలోనూ ఉండదు. దేవుడు వాళ్లను ఎప్పటికీ కల్మషం మకిలి అంటని స్వచ్ఛతతోనే ఉంచాలనుకున్నామో ఏమో, అందుకే ఇలా పుట్టించినట్లున్నాడు’’ అన్నారు ఆ హోమ్‌ను నిర్వహిస్తున్న శాంతి వెంకట్‌.

తల్లి కంటే ఎక్కువ శ్రద్ధ
శాంతి వెంకట్‌ స్పెషల్‌ చిల్డ్రన్‌ కోసం 1999లో హోమ్‌ స్థాపించారు. ఎనిమిది మంది పిల్లలతో మొదలైన హోమ్‌లో ఇప్పుడు నూటయాభై మంది పిల్లలున్నారు. వాళ్లలో ఓ వంద మంది పిల్లలు డే కేర్‌లో ఉదయం వచ్చి సాయంత్రం ఇళ్లకు వెళ్లిపోతారు. యాభై మంది పిల్లలు హాస్టల్‌లో ఉంటారు. గుంటూరు జిల్లా, సత్తెనపల్లిలో పుట్టి పెరిగిన శాంతి నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌లో స్పెషల్‌ ఎడ్యుకేటర్‌గా శిక్షణ పొందారు. స్పెషల్‌ కిడ్స్‌ కోసం మామూలు టీచర్‌ ట్రైనింగ్‌ సరిపోదు. రోజూ ఆ పిల్లల సైకాలజీని చదువుతుండాలి, వారి మానసిక ఆరోగ్యాన్ని పరిశీలిస్తూ ఉండాలి. వారి ప్రవర్తనకు అనుగుణంగా వారితో మెలగుతూ ఆ పిల్లలను ఒక క్రమపద్ధతిలో తీర్చిదిద్దాలి. ఎడ్యుకేటర్‌లు పేరుకు టీచర్లే కానీ తల్లికంటే ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాలి.

ఇంత బాధ్యతాయుతమైన వృత్తిని ఇష్టంగా ఎంచుకున్నారు శాంతి. ఆమెను, ఆమె ఆశయాలను ఇష్టపడిన సివిల్‌ ఇంజనీర్‌ వెంకట్‌.. వివాహంతో ఆమెతోబంధం ఏర్పరుచుకోవాలనుకున్నారు. అప్పుడు ఆమె చెప్పిన మాట ఒక్కటే... ‘నేను ఎంచుకున్న ప్రొఫెషన్‌ను గౌరవించాలి. స్పెషల్‌ కిడ్స్‌ని నార్మల్‌ కిడ్స్‌గా తీర్చిదిద్దే యజ్ఞం ఇది. ఈ యజ్ఞం కోసం జీవితాన్ని అంకితం చేయాల్సి వస్తే వెనుకాడను. అందుకు అంగీకారమైతేనే’ అన్నారామె. ఆ కండిషన్‌లతోపాటు ఒక బిడ్డను మాత్రమే కనాలనే నియమానికి కూడా తన అంగీకారాన్ని తెలియచేశారు వెంకట్‌.  శాంతి తన ఉద్యోగ జీవితం, హోమ్‌ నిర్వహకురాలిగా మారడంతోపాటు నిర్వహణలో ఎదురైన కష్టాలు, గట్టెక్కిన తీరును కూడా గుర్తు చేసుకున్నారు.

అటెన్షన్‌ ఇస్తుండాలి
‘‘ఆటిజమ్, డౌన్స్‌ సిండ్రోమ్‌తో బాధపడుతున్న వాళ్లు ఎక్కువగా ఉన్నారు మా దగ్గర. ఐదేళ్ల పిల్లల నుంచి నలభై దాటిన వాళ్లు కూడా ఉన్నారు. ఎన్నేళ్లు దాటినా వాళ్లందరూ పిల్లలే. చొక్కాగుండీ పెట్టుకోవడం కూడా చాలా రోజులు నేర్పించాలి. వాళ్లు సొంతంగా తమ పనులు చేసుకోగలిగిన లైఫ్‌ స్కిల్స్‌తోపాటు పదిమందిలో మెలగాల్సిన సోషల్‌ స్కిల్స్‌ను కూడా నేర్పిస్తాం. అటెన్షన్‌ సీకింగ్‌ అనేది ఈ పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. అందరి దృష్టి తమ మీదకు మళ్లించుకోవడానికి ఏదో ఒక వస్తువును పగలకొట్టడం, పెద్దగా అరవడం వంటివి చేస్తారు. ఈ లక్షణాలను భయపడి పేరెంట్స్‌ ఈ పిల్లలను ఫంక్షన్‌లకు తీసుకెళ్లరు. మా (హోమ్‌లో ఉన్న) పిల్లలకు బయట డిన్నర్‌లకెళ్లినప్పుడు క్యూలో నిలబడి తమ వంతు కోసం వెయిట్‌ చేయడం, ఏమి తినాలో వాటినే వడ్డించుకోవడం, కింద పడేయకుండా తినడం కూడా వచ్చు.

వాళ్లు ఒక పని చేసినప్పుడు ప్రశంసించాలి. ప్రశంసలతోనే దారికి తెచ్చుకోవాలి. నిజానికి ప్రశంసలు కోరుకోనిదెవరు? నలుగురిలో తమకు అటెన్షన్‌ కావాలనే కోరిక పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరిలోనూ ఉంటుంది. అయితే మామూలు వాళ్లు ఆ కోరికను బయటపడనివ్వరు. ప్రశంసల కోసం ఎప్పుడు ఎదురు చూడాలో, ఎక్కడ ఎదురు చూడాలో, ఎక్కడ తగ్గి ఉండాలో మామూలు వాళ్లకు తెలిసి ఉంటుంది. అది తెలియకపోవడమే ఈ పిల్లల్లో ఉన్న లోపం. అంతకంటే మరే లోపమూ ఉండదు వీళ్లలో. కూరగాయలు తరుగుతారు. దుస్తులు మడత పెడతారు. మా సెంటర్‌లో వారంలో ఒక రోజు కుకింగ్‌ క్లాస్‌ ఉంటుంది. ఈ పిల్లల్లో చాలా మంది గ్యాస్‌ వెలిగించి చక్కగా వంట చేస్తారు. పెద్ద పిల్లలు తమకు రెండు చపాతీలు చేసుకుని చిన్న పిల్లలకు ఒకటి చేసిస్తారు. వాళ్లు ఏ పని చేస్తున్నా మేము దగ్గర ఉండి పర్యవేక్షిస్తుంటాం. మా అమ్మ ఉన్న రోజుల్లో అయితే హోమ్‌లో పండుగలు బాగా చేసేవాళ్లం. సంక్రాంతి, వినాయక చవితికి 21 రకాలు వండి పిల్లలకు అరిటాకులో వడ్డించేది.

ఇది పదమూడో చోటు
ఈ హోమ్‌ స్థాపించేటప్పుడు నిర్వహణ సమస్యలు ఇన్ని రకాలుగా వస్తాయని ఏ మాత్రం ఊహించలేదు. పన్నెండు అద్దె ఇళ్లను మారి ఇప్పుడు శాశ్వత నివాసంలోకి అడుగుపెట్టాం. పిల్లలు అల్లరి చేస్తున్నారని పొరుగింటి వాళ్లు పోలీస్‌ కంప్లయింట్‌ ఇచ్చారు. కొన్ని ఇళ్లలో ఇంటి యజమానులు నెలకోసారి వచ్చి గదులు, షెల్ఫులు చెక్‌ చేసుకునేవాళ్లు. ప్రతి ఇంటినీ ఖాళీ చేసి వచ్చేటప్పుడు ఎదురు డబ్బు కట్టాల్సి వచ్చేది. చిలుకూరు బాలాజీ దగ్గర ప్రదక్షిణలు చేసి మా పిల్లలకు శాశ్వతంగా ఒక గూడు కల్పించమని మొక్కుకున్నాను. తిరుమల వెంకటేశ్వరునికి తల నీలాలు మొక్కుకున్నాను. మొత్తానికి మా కష్టాన్ని గుర్తించిన ఆ భగవంతుడు దాతలను పంపించాడు.ఒకరు ఈ స్థలాన్ని కొని హోమ్‌కు నామమాత్రపు ఫీజుతో వందేళ్లకు లీజ్‌కిచ్చారు. మరో పెద్ద కంపెనీ నాలుగంతస్థుల భవనాన్ని పిల్లలకు అనువుగా డిజైన్‌ చేసి మరీ కట్టించి ఇచ్చింది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వాళ్లు ఫర్నిచర్‌ విరాళంగా ఇచ్చారు.

మా హోమ్‌లో పిల్లల పేరెంట్స్‌తోనే అసోసియేషన్‌ ఏర్పాటు చేసుకున్నాం. ఏరోనాటికల్‌ ఇంజనీర్‌ రమారవిచంద్రన్‌ హోమ్‌ ప్రారంభం నుంచి ప్రెసిడెంట్‌గా ఉన్నారు. పేరెంట్స్‌ విరాళాలతోపాటు గుప్తదాతలు ఎంతోమంది సహాయం చేస్తున్నారు. మావారు సివిల్‌ ఇంజనీర్‌ కావడంతో ఈ భవన నిర్మాణంలో చాలా సహాయం చేశారు. ఆ దేవుడు ‘ఆయనను నాకిచ్చిన ఉద్దేశం పూర్తయింద’నుకున్నాడో ఏమో! నాకు ఇబ్బంది లేని విధంగా అన్నీ ఏర్పరిచి, ఇక నూటికి నూరుశాతం ఇదే పనికి జీవితాన్ని అంకితం చేయమని కాబోలు రెండేళ్ల కిందట ఆయన్ను తీసుకెళ్లిపోయాడు. మా అబ్బాయి యూకేలో ఎంబీఏ చేస్తున్నాడు. ఇప్పుడు నాకు ఈ పిల్లలదే లోకం. దేవుడు ఈ పిల్లల కోసం నాకున్న ఇతర భవబంధాలను తగ్గించాడు. ఈ భవసాగరాన్ని ఈదడమే నాకు వేంకటేశ్వరుడు అప్పగించిన బాధ్యత’’ అని ముగించారు శాంతి.
ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి
ఫొటోలు: నోముల రాజేశ్‌ రెడ్డి

గార్డెనింగ్‌ అలవాటు చేశాం
మా పిల్లలకు ఈ మధ్య మొక్కలు పెంచడం అలవాటు చేశాం. నిజానికి మేము ఊహించనంత మార్పు వచ్చింది. ఎప్పుడూ మాట్లాడుతూ ఉండే పిల్లలు కూడా తదేక దీక్షతో మొక్కలకు నీళ్లు పోయడం, కలుపు మొక్కలు పీకి పారేయడం వంటి పనులన్నీ చక్కగా చేస్తున్నారు. వాళ్లు పెంచిన మొక్కలకు పువ్వు పూసి కాయ కాస్తే ఎంత సంతోషపడతారో మాటల్లో చెప్పలేం. మార్కెట్‌కెళ్లి కూరగాయలు కొనడం కూడా నేర్చుకున్నారు. కూరగాయల లిస్ట్‌ రాస్తారు, హోమ్‌కు కావాల్సిన సరుకుల జాబితా రాయడం నేర్చుకున్నారు. వంద రూపాయలిచ్చి చిల్లర తీసుకోవడం కూడా వచ్చింది. పద్దెనిమిదేళ్లు నిండిన పిల్లలకు ఏదో ఒక పనిలో శిక్షణనిస్తున్నాం. ఒకేషనల్‌ కోర్సులో శిక్షణ ఇచ్చి ఒక వ్యాపకంలో నిమగ్నం చేయగలిగితే వాళ్లు ఎవరికీ భారం కారు. వాళ్ల ఇళ్లలో వాళ్లకు ఇబ్బంది కలగకుండా జీవించగలుగుతారు. ఈ పిల్లలు ఈ దశకు చేరడానికి మధ్య ఉన్న మా ప్రయాణమే అసలైనది. ఎంత చెప్పుకున్నా తరగనిది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement