సాక్షి, హైదరాబాద్: ప్రతి ఏటా తన పుట్టినరోజు సందర్భంగా వినూత్న సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టే బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు 47వ పుట్టినరోజు సందర్భంగా ఈ ఏడాది అర్థవంతంగా జరుపుకోవాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో యూసుఫ్‌గూడాలో ఉన్న స్టేట్ హోమ్‌లోని అనాధ పిల్లలకు అండగా నిలవాలనుకుంటున్నట్లు ప్రకటించారు.
గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా 10, 12వ తరగతుల్లో ప్రతిభావంతులైన 47 మంది పిల్లలకు, ప్రొఫెషనల్ కోర్సుల నుంచి మరో 47 మంది పిల్లలకు వ్యక్తిగతంగా అండగా ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. ఈ విద్యార్థులందరికీ ఉచితంగా ల్యాప్ టాప్‌లు అందిస్తానని తెలిపారు. వారి బంగారు భవిష్యత్‌కై బెస్ట్ ఇన్‌స్టిట్యూట్ ద్వారా రెండేండ్ల పాటు అత్యుత్తమ కోచింగ్ ఇప్పిస్తానని స్పష్టం చేశారు. కాగా, తన పుట్టినరోజు సందర్భంగా ఎవరికి తోచిన మార్గంలో వారు అనాథ పిల్లలకు సహాయం చేయాలని బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులను కోరుతున్నానని కేటీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
నేడు వెయ్యిమంది రక్తదానం
మంత్రి కేటీఆర్ 47వ జన్మదినం సందర్భంగా సోమవారం ఖాజాగూడలోని దివ్యశ్రీ ఎన్‌ఎస్‌ఎల్ ఐటీ పార్క్‌లో సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తెలంగాణ ఫెసిలిటీస్ మేనేజ్‌మెంట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఐటి టవర్లలో పనిచేసే దాదాపు 1000 మంది టెక్కీలు రక్తదానం ఇవ్వనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment