అనాథలైన చిన్నారులతో రాజేశ్వరమ్మ
నంద్యాలటౌన్: ఆమె గిరిజన మహిళ. చదివింది ఇంటర్. ఆర్థిక, రాజకీయ బలం లేదు. కుటుంబ సభ్యులందరూ కులవృత్తి అయిన బుట్టలు అల్లుకునేవారే. సమాజ సేవ చేయాలన్న తలంపుతో ఆమె స్టార్ సొసైటీ స్థాపించారు. బడి బయట ఉన్న బాల కార్మికులను, అనాథ పిల్లలను అక్కున చేర్చుకొని ఆశ్రయం కల్పిస్తున్నారు. ఆమె సేవలకు ఎన్నో ప్రశంసలు వచ్చాయి. అవార్డులు సైతం వరించాయి. అందరిచేత మన్ననలు అందుకుంటున్న ఎరుకలి రాజేశ్వరమ్మ స్ఫూర్తిగాథ ఇదీ..
గోస్పాడు గ్రామానికి చెందిన ఈశ్వరమ్మ, సుబ్బరాయుడుల రెండో సంతానం రాజేశ్వరమ్మ. వీరికి ఎలాంటి ఆస్తులు లేవు. గుడిసెలో జీవనం. బుట్టలు అల్లుకుని జీవించారు. తలిదండ్రుల రెక్కల కష్టంతో రాజేశ్వరమ్మ ఒకటి నుంచి పదో తరగతి వరకు గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుకున్నారు. ఇంటర్ నంద్యాలలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో పూర్తి చేశారు. ఆర్థిక కారణాలతో తల్లిదండ్రులు చదువు మాన్పించడంతో కొన్ని రోజులు ఇంటి వద్దనే ఉంటూ బుట్టలు అల్లేవారు. ఈ సమయంలో సమాజ సేవ చేయాలనే తలంపు వచ్చింది. తనలాంటి పేదలకు సాయం చేయా లనే ఆలోచనతో తన స్నేహితుడైన సుబ్బరాయుడుతో కలిసి స్టార్ సొసైటీని 2000 సంవత్సరంలో స్థాపించారు.
ఈ స్టార్ సొసైటీ ద్వారా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూ.. బడి బయట ఉన్న పిల్లలను పాఠశాలల్లో చేర్చేవారు. రాజేశ్వరి సేవలను గుర్తించిన బాలకార్మిక పునరావాస సంస్థ అధికారులు స్టార్ సొసైటీకి ఎన్‌సీఎల్‌పీ కింద ప్రభుత్వ నిధులతో బాల కార్మిక పాఠశాలను మంజూరు చేశారు. ప్రస్తుతం 50 మంది బాలకార్మిక విద్యార్థులతో ఈ పాఠశాల నంద్యాల పట్టణంలోని నందమూరినగర్‌లో విజయవంతంగా కొనసాగుతోంది. అలాగే అహోబిలం లో మరో పాఠశాలను 50 విద్యార్థులతో ప్రభు త్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. స్నేహితుడైన సుబ్బరాయుడును 2007లో ఈమె ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరిద్దరు కలిసి స్టార్ సొసైటీ సేవలను విస్తరించారు.
నిరాశ్రయులకు వసతి గృహం..
నంద్యాల పట్టణంలోని నందమూరినగర్‌లో 2015లో నిరాశ్రయుల వసతి గృహం ఏర్పాటు చేశారు. అనాథ పిల్లలందరినీ వసతి గృహంలో చేర్చుకొని వారికి ఉచిత భోజనం, వసతితో పాటు విద్యాబుద్ధులను నేర్పిస్తున్నారు. నంద్యాల డివిజన్‌లో తప్పిపోయిన పిల్లలు, అనాథ పిల్లలు కనిపిస్తే పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు రాజేశ్వరమ్మకు ఫోన్ చేస్తున్నారు. సొంత ఖర్చులతో నిర్వహిస్తున్న ఈ వసతి గృహం అనతి కాలంలోనే జిల్లాలో పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం ఇక్కడ 30మంది ఆశ్రయం పొందుతున్నారు.
పురస్కారాలివీ..
♦ 2010లో ఉత్తమ ఎన్‌జీఓగా గుర్తింపు
♦ 2011లో గవర్నర్ నరసింహన్ చేతుల మీదుగా అవార్డు స్వీకరణ
♦ 2011లో రాజీవ్ విద్యామిషన్ ద్వారా అవార్డు అందజేత
♦ ఉత్తమ మహిళగా గుర్తించి 2017 మార్చిలో అవార్డు అందజేత
♦ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యురాలుగా నియామకం.
సేవలు ఇవీ..
స్టార్ సొసైటీ ద్వారా రాజేశ్వరమ్మ పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. నంద్యాల పట్టణంలో టైలరింగ్ ప్రోగ్రాం కింద 2 వేల మంది మహిళలకు కుట్టు శిక్షణ ఇప్పించారు. అప్పటి జిల్లా కలెక్టర్ విజయమోహన్ చేతుల మీదుగా కుట్టు శిక్షణ తీసుకున్న మహిళలకు డీఆర్‌డీఏ సహకారంతో ఉచితంగా కుట్టుమిషన్లను ఇప్పించారు. రాజీవ్ విద్యా మిషన్ ద్వారా ప్యాపిలి మండలం పీఆర్‌పల్లె గ్రామంలో వలసల నివారణ ప్రభుత్వం కేంద్రాన్ని స్థాపించగా.. పలువురు విద్యార్థులను రాజేశ్వరమ్మ ఈ కేంద్రంలో చేర్పించి జిల్లా కలెక్టర్ చేత ప్రశంసలు పొందారు.
Comments
Please login to add a commentAdd a comment