అనాథలే ఆదాయం! | NGOs use Orphan Children For Begging in Hyderabad | Sakshi
Sakshi News home page

అనాథలే ఆదాయం!

Published Fri, Jul 19 2019 9:16 AM | Last Updated on Tue, Jul 23 2019 10:58 AM

NGOs use Orphan Children For Begging in Hyderabad - Sakshi

నగర శివారు ప్రాంతాల్లోనే పెద్ద ఎత్తున ప్రభుత్వ అనుమతి లేని కేంద్రాలు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లా పరిధిలో ఇలాంటి కేంద్రాల దందా బçహాటంగా కొనసాగతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌ జిల్లా పరిధిలో సుమారు 71 అనాథ పిల్లల సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. అందులో ఏడు ప్రభుత్వ అనాథ అశ్రమాలు కాగా, మిలిగిన 64 కేంద్రాల్లో 51 కేంద్రాలు ఐదేళ్ల  కాలపరిమితి గల లైసెన్స్‌తో నడుస్తున్నాయి. మిగిలిన 13 సంస్థలకు ఆరు నెలల కాలపరిమితి గల ప్రొవిజన్‌ లైసెన్స్‌ ఉన్నాయి. తొమ్మిది సంస్థలను ప్రభుత్వ అనుమతులు లేకుండానే నిర్వాహిస్తున్నారు. మేడ్చల్‌ పరిధిలో 120 వరకు అనాథ చిన్నారుల సంరక్షణ కేంద్రాలు ఉండగా వాటిలో సగానికి పైగా లైసెన్స్‌తో పాటు కనీస ప్రభుత్వ అనుమతి కూడా లేనట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా పరిధిలో 100కి పైగా ఉన్న సంస్థల్లోనూ అదే పరిస్థితి ఉన్నట్టు అధికారలు గుర్తించారు. ఆయా అక్రమ కేంద్రాల నిర్వాహకులు బహాటంగా అడ్డదార్లు తొక్కుతున్నా సంబంధిత అధికారులు చూసీ చూడనట్లు వ్యవహారస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.  

సాక్షి,సిటీబ్యూరో: విశ్వనగరి వైపు పరుగులు తీస్తున్న హైదరాబాద్‌లో ‘అనాథ పిల్లల సంరక్షణ’ నిర్వాహకులకు కాసులు కురిపిస్తోంది. సేవ ముసుగులో అడ్డదార్లు తొక్కుతున్నారు. కొన్ని సంస్థలు నిజాయితీగా అనాథ పిల్లకు సేవ చేస్తుండగా.. మరికొన్ని స్వచ్ఛద సంస్థలు మాత్రం అనాథల సంరక్షణ కేంద్రాల పేరుతో పిల్లలను చేర్చుకుని వారితో ముఖ్య కూడళ్లలో డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్నారు. అందుకు ఆయా కూడళ్లలో వాహనదారుల నుంచి ‘అనాథలకు సహాయం’ పేరుతో వసూళ్లు చేయిస్తుండగా, మరి కొన్ని సంస్థలైతే ఏకంగా చిన్నారులతో భిక్షాటన చేయిస్తున్న సంఘటనలు కూడా ఉన్నాయి. ఫలితంగా ‘అనాథ చిన్నారుల సంరక్షణ’ కొందరికి ఉపాధి కేంద్రాలుగా మారుతున్నాయనే విమర్శలు వ్యక్తముతున్నాయి. నగరంలో చందాలు, భిక్షాటన దందాకు అడ్డూ అదుపూ లేని కారణంగా పలువురు నిర్వాహకులు అనాథ పిల్లలను పావుగా వాడుకుంటున్నట్లు తెలుస్తోంది.

నగరంలో 300కు పైగా కేంద్రాలు
రాష్ట్రంలోనే అత్యధికంగా అనాథ పిల్లల సంరక్షణ కేంద్రాలు హైదరాబాద్‌ నగరంలోనే ఉన్నట్లు అధికార లెక్కలు చెబుతున్నాయి. ఇక్కడ దాదాపు 300కు పైగా కేంద్రాలు నడుస్తున్నట్టు చెబుతున్నారు. వాటిలో 40 శాతం కేంద్రాలకు మాత్రమే ప్రభుత్వ అనుమతి ఉండగా, మిగిలిన కేంద్రాలు ఎలాంటి అనుమతి లేకుండానే కొనసాగుతున్నాయి. అనాథ పిల్లలకు ఆశ్రయం కల్పించాలంటే కేంద్రాల నిర్వహణకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ప్రభుత్వ పరంగా అనుమతి పొందాలంటే ఎన్నో కఠిన నిబంధనలు పాటించాలి. లైసెన్స్‌ అంత సులభం కాదు. నిబంధనల ప్రకారం ప్రభుత్వ రిజిస్ట్రేషన్‌ శాఖలో సొసైటీ, లేదా ట్రస్ట్‌ కింద నమోదైన స్వచ్ఛంద సేవా సంస్థలు అనా«థ పిల్లల సంరక్షణ కేంద్రాలు, అనాథ ఆశ్రమాల ఏర్పాటు చేసుకునేందుకు వెసులుబాటు ఉంటుంది. కనీసం మూడేళ్ల అనుభవం గల స్వచ్ఛంద సంస్థలు మాత్రమే అనాథ పిల్లల సంరక్షణ కేంద్రాల ఏర్పాటు అనుమతి పొందే అవకాశం ఉంది. సంస్థ నియమ నిబంధనలు, అనుభవం, అర్థిక వనరుల సమీకరణ, అనా«థ చిన్నారుల సంరక్షణ సామర్థ్యం, చిన్నారులకు డైట్, కనీస వసతులు వంటి అంశాలపై అధికారులు సంతృప్తి చెందాలి. అప్పుడే అనుమతి ఇస్తారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు  చేసుకున్నాక అన్ని అంశాలు సరిగా ఉంటే ఆరునెలల కాలపరితితో కూడిన ప్రొవిజన్‌ లైసెన్స్‌ జారీ అవుతుంది. తర్వాత ఐదుగురు జిల్లా స్థాయి అధికారుల విచారణ కమిటీ పూర్తిస్థాయి విచారణ జరిపి  కేంద్రాల పనితీరు బట్టి రాష్ట్ర స్థాయి విచారణ కమిటీకి సిఫార్సు చేస్తుంది. రాష్ట్ర స్థాయి కమిటీ కూడా మరోసారి విచారణ జరిపి  నిబంధనలకు లోబడి ఉంటే ఐదేళ్లకు అనుమతి ఇస్తుంది. అయితే, ప్రస్తుతం కొనసాగుతున్న అనాథ పిల్లల సంరక్షణ కేంద్రాల్లో చాలావాటికి ఎలాంటి లైసెన్స్‌ లేకపోవడం గమనార్హం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement