
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో 103 మంది, తెలంగాణలో 123 మంది పిల్లలు అనాథలయ్యారని సుప్రీంకోర్టుకు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్(నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్–ఎన్‌సీపీసీఆర్) తెలిపింది. కరోనా వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల వివరాలు, తల్లిదండ్రుల్లో ఒకరిని కోల్పోయిన వారి వివరాలు తెలపాలంటూ ఇటీవల జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ అనిరుద్ధ బోస్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది.
ఈ నేపథ్యంలో బాలస్వరాజ్ పోర్టల్‌లో ఆయా రాష్ట్రాలు అప్‌లోడ్ చేసిన వివరాలను ఎన్‌సీపీసీఆర్ అఫిడవిట్ రూపంలో కోర్టుకు మంగళవారం అందజేసింది. కరోనా కారణంగా దేశవ్యాప్తంగా 1,742 మంది చిన్నారులు తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయారని, తల్లిదండ్రుల్లో ఒకరిని కోల్పోయినవారు 7,464 మంది ఉన్నారని పేర్కొంది. ఏపీలో తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయినవారు 103 మంది, తల్లిదండ్రుల్లో ఒకరిని కోల్పోయినవారు 13 మంది ఉన్నారని పేర్కొంది.