ముగ్గురు పిల్లలతో తండ్రి ప్రసాద్
సాక్షి, అమరావతి బ్యూరో: మద్యం మత్తులో విజయవాడ రైల్వేస్టేషన్‌లో పిల్లలను వదిలివెళ్లిన తండ్రి తిరిగి వారి చెంతకు చేరాడు. తండ్రిని చూసిన ఆ చిన్నారులు నాన్నా! అంటూ ఆనందంతో ఉప్పొంగారు. పిల్లలను చూడగానే తండ్రి, నాన్నను చూసిన ఆనందంలో పిల్లలు ఉద్వేగానికి లోనై కన్నీటి పర్యంతమయ్యారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సైదాపురం మండలం తురిమెర్లకు చెందిన తాపీ మేస్త్రి చప్పిడి ప్రసాద్ విజయవాడ రామవరప్పాడులో కొన్నాళ్లుగా తన ముగ్గురు పిల్లలతో ఉంటున్నాడు.
ప్రసాద్ భార్య ఇదివరకే అతడిని వదలి వెళ్లిపోయింది. నాలుగు రోజుల క్రితం సొంతూరు వెళ్దామంటూ ప్రసాద్ పిల్లలతో కలిసి బెజవాడ రైల్వేస్టేషన్‌కు వచ్చాడు. పిల్లలను అక్కడే వదిలి ఎటో వెళ్లిపోయాడు. ఆ రాత్రంతా రైల్వేస్టేషన్లోనే ఏడుస్తూ ఎదురు చూసిన పిల్లలను చైల్డ్‌లైన్ ప్రతినిధులు చేరదీసి ఆశ్రయం కల్పించారు. తండ్రి కోసం ఆరా తీసినా ఫలితం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో శనివారం ‘పాపం పసివాళ్లు’ శీర్షికన ‘సాక్షి’ దిన పత్రికలో కథనం ప్రచురితమైంది.
ఇంతలో తండ్రి ప్రసాద్ తాను పనిచేసే నిర్మాణ రంగ సంస్థ ప్రతినిధిని వెంటబెట్టుకుని రైల్వేస్టేషన్‌కు చేరుకుని తన బిడ్డల గురించి వాకబు చేశాడు. జీఆర్పీ సిబ్బంది సూచనలతో చైల్డ్‌లైన్ ప్రతినిధుల వద్దకు వెళ్లాడు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ) సంరక్షణలో ఉన్న పిల్లల వద్దకు ప్రసాద్‌ను తీసుకెళ్లారు. అక్కడ తండ్రిని చూడగానే పిల్లలు ఒక్కసారిగా నాన్నా.. అంటూ భోరుమన్నారు. ప్రసాద్ పరుగున వారి వద్దకు వెళ్లి గట్టిగా హత్తుకుని రోదించారు. తండ్రి కూడా భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమయ్యాడు. ఆ సన్నివేశాన్ని చూసిన అక్కడి వారూ కన్నీరొలికారు.
తండ్రికి తాత్కాలికంగా అప్పగింత..
సీడబ్ల్యూసీ ప్రతినిధులు విజయవాడలో ప్రసాద్ ఉంటున్న పరిసరాల్లో విచారణకు సామాజిక కార్యకర్తను పంపారు. అక్కడ ప్రసాద్ వ్యవహారశైలి, తదితర అంశాలను తెలుసుకుని మంగళవారం సోషల్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు సమర్పిస్తారు. అప్పటి వరకు నిర్మాణ సంస్థ ప్రతినిధి నుంచి హామీ తీసుకుని పిల్లలను తండ్రికి తాత్కాలికంగా అప్పగించినట్టు సీడబ్ల్యూసీ చైర్మన్ సువార్త ‘సాక్షి’కి చెప్పారు. సీడబ్ల్యూసీ ఆదేశాల మేరకు తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రసాద్ తల్లి వృద్ధాప్యంతో ఉన్నందున పిల్లలను తురిమెర్లకు పంపేకంటే కౌన్సెలింగ్ ఇచ్చి తండ్రి వద్దనే ఉంచాలని యోచిస్తున్నారు. నాలుగు రోజుల ఎదురు చూపుల అనంతరం తండ్రి చెంతకు చేరడంతో పసివాళ్ల కథ సుఖాంతమైంది.
చదవండి: Nellore: పాపం పసివాళ్లు! అమ్మానాన్నలు కాదనుకున్న అభాగ్యులు
Comments
Please login to add a commentAdd a comment