అమృతానగర్‌లోని శ్రీ చౌడేశ్వరి ఫౌండేషన్
ప్రొద్దుటూరు క్రైం : అనాథ ఆశ్రమం పేరుతో పసి పిల్లల చేత భిక్షాటన చేయిస్తున్న శ్రీ చౌడేశ్వరి ఫౌండేషన్ నిర్వాహకులపై రూరల్ పోలీస్‌స్టేషన్లో కేసు నమోదైంది. పిల్లల చేత భిక్షాటన చేస్తున్నారని సమాచారం రావడంతో డిస్ట్రిక్ట్ లెవెల్ ఇన్‌స్పెక్షన్ టీం గురువారం సాయంత్రం ఆశ్రమాన్ని తనిఖీ చేశారు. తనిఖీల్లో భిక్షాటన చేయిస్తున్నట్లు వాస్తవాలు వెల్లడి కావడంతో వారు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన మేరకు పాపయ్య, సరోజమ్మతో పాటు కొందరు కలిసి ప్రొద్దుటూరు మండలంలోని అమృతానగర్‌లో ఐదేళ్ల నుంచి శ్రీ చౌడేశ్వరి ఫౌండేషన్ అనాథ, పేద పిల్లల ఆశ్రమ పాఠశాలను నిర్వహిస్తున్నారు. ఆశ్రమంలో 14 మంది పిల్లలతో పాటు చైల్డ్‌వెల్‌ఫేర్ కమిటీ అనుమతి లేకుండా మరో ముగ్గురు పిల్లలు ఉంటున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పిల్లలకు ఆశ్రమంలో అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో విద్యాబోధన జరగాల్సి ఉంది. అయితే ఆశ్రమ నిర్వాహకులు పసి పిల్లలను పాఠశాలకు పంపకుండా రోజూ భిక్షాటనకు తీసుకొని వెళ్తున్నారు. రోజు ఆటోలో కూర్చోపెట్టుకొని, వారి చేతికి అనాథ పిల్లలమనే కరపత్రాన్ని ఇచ్చి రోజుకో వీధికి తీసుకొని వెళ్లి వదిలి పెడుతున్నారు. వారు రోజుకు రూ. వందల్లో డబ్బు తీసుకొని రాగా కేవలం తమకు 10 రూపాయలు మాత్రమే ఇస్తున్నారని పిల్లలు సీడబ్ల్యూసీ అధికారుల విచారణలో వెల్లడించారు.
పిల్లలలను మరో ఆశ్రమంలో చేర్పిస్తాం
ఆశ్రమాన్ని తనిఖీ చేసిన సమయంలో రికార్డులో ఉన్న 14 మందితో పాటు అనధికారికంగా ఉన్న ముగ్గురు పిల్లలను సీడబ్ల్యూసీ అధికారులు పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. ముగ్గురు పిల్లలను జిల్లా అధికారుల అనుమతితో మంచి ఆశ్రమంలో చేర్పించి మెరుగైన ఆశ్రమంలో చేర్పిస్తామని డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అధికారి ఎల్లారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో అనేక ఆశ్రమాల్లో చాలా దారుణాలు జరిగాయని, దీన్ని దృష్టిలో ఉంచుకొని జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేస్తున్నామని చెప్పారు. జిల్లాలో 44 అనాథ బాలల ఆశ్రమాలు ఉండగా వాటిలో 37 స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నడుస్తుండగా, 7 ఆశ్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు. పిల్లలకు విద్యను అందిచకుండా వారి హక్కులను హరిస్తున్న నిర్వాహకులపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. పసి పిల్లల చేత భిక్షమెత్తించడం నేరమని ఆయన తెలిపారు. 14 మంది పిల్లల తల్లి దండ్రులను పిలిపించి విచారణ చేస్తామన్నారు. ఆ తర్వాత జిల్లా అధికారుల ఆదేశాల ప్రకారం నడుచుకుంటామని తెలిపారు. సీడబ్ల్యూసీ టీం సభ్యులు డాక్టర్ ప్రసన్నలక్ష్మి, చైల్డ్‌వెల్‌ఫేర్ కమిటీ సభ్యురాలు వరమ్మ, డీసీపీఓ శివకుమార్‌రెడ్డిలతో సీఐ ఓబులేసు మాట్లాడారు. అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ చంద్రశేఖర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment