తల్లిదండ్రులు వదిలి వెళ్లడంతో బిక్కుబిక్కుమంటున్న చిన్నారులు
సాక్షి, అమరావతి బ్యూరో: ఆ పిల్లలు అమ్మా నాన్నలు ఉన్న అనాథలు! తండ్రి తాగుడుకు బానిసగా మారాడు. తండ్రి పెట్టే బాధలు భరించలేక కొన్నాళ్ల క్రితమే పిల్లలను వదిలేసి తల్లి వెళ్లిపోయింది. అప్పట్నుంచి బిడ్డలను తనతోనే ఉంచుకున్న తండ్రి కూడా ఇప్పుడు వారిని వదిలించుకుని ఎటో వెళ్లిపోయాడు. ఇలా కన్న పేగులు కాదనడంతో లోకం తెలియని ఆ పసిపిల్లలు అభాగ్యులయ్యారు. తల్లిదండ్రులున్నా దిక్కులేని వారైన ముగ్గురు చిన్నారుల దయనీయ గాథ ఇది..!
నెల్లూరుకు చెందిన ప్రసాద్, శ్రీలత దంపతులు. భవన నిర్మాణ కార్మికులుగా పనిచేసే వీరికి ప్రణీత (7), ప్రశాంతి (5), బాలాజీ భగవాన్ (3) ముగ్గురు సంతానం. తాగుడుకు అలవాటుపడ్డ ప్రసాద్ తరచూ భార్యను కొడుతూ ఉండేవాడు. సహనం నశించిన ఆమె పిల్లలను, భర్తను విడిచి పెట్టి ఆరేడు నెలల క్రితం వెళ్లిపోయింది. ఆ తర్వాత కొన్నాళ్లు పిల్లలను సాకిన తండ్రి వారిని వెంటబెట్టుకుని నెల్లూరు నుంచి విజయవాడ వచ్చాడు. విజయవాడలో చిన్న రేకుల షెడ్డులో బిడ్డల్ని ఉంచి పనికెళ్లి వచ్చేవాడు. పిల్లలకు కాస్తో కూస్తో తిండి పెట్టేవాడు. అమ్మ దూరమైన ఆ చిన్నారులు నాన్నలోనే అమ్మనూ చూసుకున్నారు. మద్యం మత్తులో ఉన్న నాన్న పక్కలోనే ఆదమరచి నిదురించేవారు. అమ్మలా నాన్న తమను విడిచి వెళ్లడన్న నమ్మకంతో ఉండేవారు. కానీ రెండ్రోజుల క్రితం నాన్న కూడా అమ్మ బాటనే ఎంచుకున్నాడు.
‘నెల్లూరులో ఉన్న నాయనమ్మ దగ్గరకు తీసుకెళ్తాను రండి’ అని చెప్పడంతో ఆ చిన్నారులు ఎగిరి గంతేశారు. ఆనందపరవశంలో ఉన్న బిడ్డల్ని విజయవాడ రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్లి ఒకటో నంబరు ప్లాట్‌ఫాంపై కూర్చోబెట్టాడు. ‘మీరు ఇక్కడే ఉండండి.. ఇప్పుడే వచ్చేస్తాను..’ అంటూ వెళ్లిపోయాడు. నాన్న కోసం ఆ పిల్లలు రాత్రంతా వేయి కళ్లతో చూస్తూనే ఉన్నారు.
కానీ ఎప్పటికీ తండ్రి రాకపోవడంతో బేలగా ఏడుస్తున్న వారిని రైల్వే స్టేషన్‌లో కొందరు జీఆర్పీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు గురువారం రాత్రి రైల్వేస్టేషన్‌లో ఉన్న చైల్డ్‌లైన్ ప్రతినిధులకు అప్పగించారు. తండ్రి ఆచూకీ కోసం చైల్డ్‌లైన్ ప్రతినిధులు చేసిన ప్రయత్నాలు ఫలించ లేదు. దీంతో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సూచనల మేరకు ప్రణీత, ప్రశాంతిలను నగరంలోని కృష్ణలంక ప్రజ్వల హోం ఫర్ గర్ల్స్‌లోను, బాలాజీ భగవాన్‌ను గాంధీనగర్‌లోని ఎస్‌కేసీవీ ట్రస్ట్ సంరక్షణలో ఉంచినట్టు చైల్డ్‌లైన్ ప్రతినిధి శ్రీకాంత్ ‘సాక్షి’కి చెప్పారు.
నాన్న కావాలి..
తమను కాదని వెళ్లిపోయిన నాన్న వస్తాడని ఆ చిన్నారులు గంపెడాశతో ఉన్నారు. నాన్న కావాలి.. అంటూ జాలిగా అడుగుతున్నారు. లేదంటే నాయనమ్మ దగ్గరకైనా వెళ్లి పోతామంటున్నారు. అక్కడ అంగన్వాడీకెళ్లయినా చదువుకుంటామంటున్నారు. ‘అమ్మ ఉన్నన్నాళ్లూ మమ్మల్ని బాగానే చూసుకునేది. ఆమ్మ వెళ్లిపోయాక నాన్న కూడా బాగానే చూసుకునేవాడు. నేను నాన్నకు వంటలో సాయపడేదాన్ని. నేను నెల్లూరు ఎస్పీఎస్ స్కూల్‌లో రెండో తరగతి చదివేదాన్ని. చెల్లి, తమ్ముడు విజయవాడలో అంగన్వాడీకెళ్లే వారు.. అమ్మ, నాన్నలకు తమ్ముడంటే చాలా ఇష్టం. అయినా ఇద్దరూ వదిలి వెళ్లిపోయారు..’ అని పెద్ద కుమార్తె ప్రణీత వాపోయింది. తమను చదివిస్తే బాగా చదువుకుంటామంటోంది ప్రణీత!
చదవండి: అమెరికా చరిత్రలో ఇది చీకటి రోజు.. డొనాల్డ్ ట్రంప్‌పై బైడెన్ తీవ్ర విమర్శలు
Comments
Please login to add a commentAdd a comment