
అనాథ బాలికలకు నగదు అందిస్తున్న గడా అధికారి ముత్యంరెడ్డి
జగదేవ్‌పూర్(గజ్వేల్): మండలంలోని చాట్లపల్లి గ్రామానికి చెందిన విద్యార్థులు శ్వేత, అంజలి అమ్మానాన్నలను కోల్పోయి అనాథలుగా మారారు. నాలుగేళ్ల క్రితం నాన్న మృతిచెందగా, బుధవారం అమ్మ మృతి చెందింది. ఇద్దరు ఆడపిల్లల దయనీయస్థితిపై గురువారం సాక్షిలో ‘నాడు నాన్న.. నేడు అమ్మ’ అనే కథనం ప్రచురితమైంది. సాక్షిలో వచ్చిన అనాథ పిల్లల దయనీయస్థితిపై సీఎం కేసీఆర్ స్పందించారు. వెంటనే ఎమ్మెల్సీ శేరిసుభాష్‌రెడ్డికి విద్యార్థులను ఆదుకోవాలని ఆదేశించారు. వెంటనే తను కలెక్టర్ వెంకట్రామిరెడ్డికి ఆదేశించారు. తక్షణ సహాయం కింద లక్ష నగదును మంజూరు చేశారు. కలెక్టర్ అదేశాల మేరకు గఢా ప్రత్యేక అధికారి ముత్యంరెడ్డి గురువారం సాయంత్రం చాట్లపల్లి గ్రామానికి చేరుకుని అనాథ బాలికలను పరామర్శించారు. కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం లక్ష నగదును అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాక్షిలో వచ్చిన కథనానికి సీఎం కేసీఆర్ స్పందించారని పేర్కొన్నారు. సీఎం ఆదేశాల మేరకు అనాథ పిల్లల అదుకోవడం జరిగిందని తెలిపారు. పై చదువుల కోసం ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని చెప్పారు. అలాగే హాస్టల్ సౌకర్యం కూడా కల్పించడం జరుగుతుందన్నారు. అమ్మానాన్నలు లేరని ఆధైర్యపడవద్దని, మనోధైర్యంతో చదువులో రాణించాలని సూచించారు. అలాగే తనవంతుగా చిన్నారులకు సాయం అందజేస్తానని మంత్రి హరీశ్‌రావు చాట్లపల్లి సర్పంచ్‌కు ఫోన్‌లో తెలిపారు.
Request @Collector_SDPT to kindly take care of these two girls
— KTR (@KTRTRS) April 9, 2020
Get them into Govt residential schools asap https://t.co/ncctiaFSXL
కేటీఆర్ ట్వీట్...
చాట్లపల్లి గ్రామంలోని అనాథ బాలికలపై సాక్షిలో వచ్చిన కథనానికి మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. వారిని ప్రభుత్వం పరంగా ఆదుకుంటామని పేర్కొన్నారు. వారిని ఆదుకోవాలని కోరుతూ కలెక్టర్ వెంకట్రామిరెడ్డికి ట్వీట్ చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ స్పందించడంతో గ్రామస్తులు, కుటుంబ సభ్యులు, బంధువులు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జగదేవ్‌పూర్ తహసీల్దార్ కరుణాకర్‌రావు 25 కిలోల బియ్యం అందించారు. కార్యక్రమంలో ఎంపీపీ బాలేషంగౌడ్, సర్పంచ్ నరేష్, ఎంపీటీసీ కావ్యదర్గయ్య, రైతు సమన్వయ సమితి మండల కో ఆర్డినేటర్ శ్రీనివాస్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, పీఎసీఎస్ ఉపాధ్యక్షుడు బాల్‌రాజు, జిల్లా నాయకులు లక్ష్మన్ తదితరులు పాల్గొన్నారు.