Covid - 19, Father And Mother Deceased With Corona Children Orphaned Sircilla - Sakshi
Sakshi News home page

కరోనా కల్లోలం: గూడు చెదిరిన గువ్వలు

Published Mon, May 31 2021 12:57 PM | Last Updated on Mon, May 31 2021 4:00 PM

Father And Mother Deceased With Covid Children Orphaned In Sircilla - Sakshi

సాక్షి, సిరిసిల్ల: ఆటో నడుపుతూ నాన్న.. బీడీలు చుడుతూ అమ్మ.. అరకొర ఆదాయమే అయినా.. ఆనందానికి ఎన్నడూ కొదవలేని కుటుంబం వారిది. సాఫీగా సాగిపోతున్న జీవితంలో కరోనా కల్లోలం రేపింది. ఇద్దరు పిల్లలతో కూడిన ఆ పొదరింట్లో పెను విషాదం నింపింది. ఐదు రోజుల వ్యవధిలోనే దంపతులు ప్రాణాలు కోల్పోగా.. అనాథలైన ఆ ఇద్దరు చిన్నారులు కూడా మహమ్మారితో పోరాడుతుండటంతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.  

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌కు చెందిన షేక్‌ ఖలీమ్‌(40) ఆటోడ్రైవర్‌. అతడి భార్య నికత్‌ తబుసమ్‌(38) బీడీ కార్మికురాలు. వారికి ఇద్దరు పిల్లలు పదిహేనేళ్ల అమాన్, పదమూడేళ్ల రుమానా ఉన్నారు. గతంలో మూడేళ్లపాటు బతుకుదెరువు కోసం సౌదీ అరేబియాకు వెళ్లిన ఖలీమ్‌.. కాలం కలిసి రాక అప్పులు మరిన్ని మూటగట్టుకుని ఇల్లు చేరాడు. అప్పటికే వీసాకు చేసిన మరో రూ.3 లక్షల వరకు అప్పులు ఉన్నాయి. ఈ అప్పులు తీర్చేందుకు, కుటుంబాన్ని పోషించేందుకు ఖలీమ్‌ సిరిసిల్లలో ఆటో నడుపుతూ కష్టపడేవాడు. తబుసమ్‌ కూడా బీడీలు చుడుతూ భర్తకు చేదోడు వాదోడుగా ఉండేది.

అయితే 15 రోజుల క్రితం ఖలీమ్‌కు కరోనా పాజిటివ్‌ వచ్చింది. తొలుత స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స చేయించుకున్నాడు. తర్వాత పరిస్థితి విషమించడంతో కరీంనగర్‌లోని ఓ ప్రై వేటు ఆస్పత్రిలో చేరాడు. తెలిసిన వారివద్ద రూ.2 లక్షల వరకు అప్పు చేసి ఆస్పత్రిలో చెల్లించాడు. కానీ ఫలితం దక్కలేదు. ఐదు రోజుల కిందట ఖలీమ్‌ మృత్యువాత పడ్డాడు. శవాన్ని సిరిసిల్లకు తెచ్చి బంధువులు అంత్యక్రియలు నిర్వహించారు.

తల్లినీ కనికరించని కరోనా 
భర్త మరణంతో తబుసమ్‌ గుండెలవిసేలా రోదించింది. పిల్లలు బెంబేలు పడిపోవడం చూసి చివరకు ధైర్యం తెచ్చుకుంది. కానీ భర్త ఖలీమ్‌ ద్వారా అప్పటికే సోకిన కరోనా వైరస్‌తో తబుసమ్‌ ఆరోగ్యం కూడా క్షీణించింది. దీంతో ఆమెను కూడా కరీంనగర్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. సమీప బంధువులు మళ్లీ రూ.2 లక్షల వరకు అప్పు తెచ్చి ఆస్పత్రి ఖర్చులకు చెల్లించారు. కోలుకుంటుందని, పిల్లల బాగోగులు చూసుకుంటుందని భావిస్తుండగా.. కరోనాతో చేసిన పోరాటంలో ఆమె కూడా ఓడిపోయింది. శనివారం రాత్రి తబుసమ్‌ కన్నుమూసింది. 

చందాలతో అంత్యక్రియలు 
ఐదురోజుల వ్యవధిలోనే భార్యాభర్తలు చనిపోవడంతో చేతిలో డబ్బులేని ఖలీమ్‌ బంధువులు.. పలువురి నుంచి చందాలు పోగు చేశారు. అలా పోగుచేసిన రూ.27 వేలతో వారి సంప్రదాయం ప్రకారం ఆదివారం ఉదయం ఆమెకు అంత్యక్రియలు నిర్వహించారు. 

పాపం పసివాళ్లు
ఊహ తెలిసిన పిల్లలు కావడంతో వారిని ఓదార్చడం ఎవరి వల్లా కావడం లేదు.  ఐదు రోజుల వ్యవధిలో అమ్మానాన్నలు చనిపోవడం వారు తట్టుకోలేక పోతున్నారు. చిన్న ఇల్లు.. పుట్టెడు అప్పులే ఇప్పుడు వారికి మిగిలింది. వాటితో పాటు అమ్మానాన్నల ద్వారా సోకిన వైరస్‌. ఇద్దరు పిల్లలూ పాజిటివ్‌ కావడంతో అదే ఇంట్లో దిక్కులేని పక్షుల్లా ఉంటున్నారు. సరైన వైద్యం లేక.. ఆదుకునే నాథుడు లేక బేల చూపులు చూస్తున్నారు. కనీసం అమ్మమ్మ, తాత కానీ, నానమ్మ, తాత కానీ లేకపోవడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. తమనెవరైనా ఆదుకుంటారేమోనని ఆశగా ఎదురు చూస్తున్నారు.
చదవండి: విషాదం: ప్రసవానికి వచ్చి కరోనాకు బలి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement