ఆదివారం కృష్ణా జిల్లా పెడనకు చెందిన చిన్నారులకు రూ.10 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్ పత్రాలను అందిస్తున్న జిల్లా కలెక్టర్ ఇంతియాజ్
సాక్షి, అమరావతి: కష్టపడి కలో గంజో తాగే కుటుంబాల్లో కోవిడ్ రేపుతున్న చిచ్చు సాధారణమైనది కాదు. పిల్లలకు కన్నవాళ్లను దూరం చేస్తూ అనాథలుగా మారుస్తోంది. దీంతో వారంతా పండుటాకుల లాంటి అమ్మమ్మలు, నానమ్మలు, తాతల వద్దకు చేరి తలదాచుకోవాల్సి వస్తోంది. ఈ విపత్కర సమయంలో భావి తరాన్ని ఆదుకోవడం అతి పెద్ద సవాల్. ఈ బాధ్యతను దూరదృష్టితో గుర్తించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ దృఢమైన నిర్ణయం తీసుకుని మిగతా రాష్ట్రాలతో పాటు కేంద్రానికి సైతం ఆదర్శంగా నిలిచింది. బాధిత చిన్నారుల పేరుతో వెంటనే రూ.10 లక్షల చొప్పున డిపాజిట్ చేయడంతోపాటు దానిపై వచ్చే వడ్డీతో నెల నెలా వారి కనీస ఆర్థిక అవసరాలు తీరుస్తూ బాసటగా నిలుస్తోంది. ఇలా 25 ఏళ్లు వచ్చేవరకు అవసరాలు తీరుస్తూ అనంతరం డిపాజిట్ మొత్తాన్ని వారి చేతికే అందించేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముందుచూపుతో, దార్శనికతో నిర్ణయం తీసుకున్నారు.
ఆ నిర్ణయం అమలు ఇప్పటికే మొదలైంది కూడా. ఈ కోవలోనే తాజాగా కేంద్రం కూడా ప్రకటన చేసింది. కాకపోతే కేంద్రం బాధిత బాలల పేరుతో వెంటనే డిపాజిట్ చేసి వడ్డీ డబ్బులు చెల్లించకుండా వారికి 18 – 23 ఏళ్ల వయసు వచ్చే నాటికి స్టైఫండ్ చెల్లిస్తామని, 23 ఏళ్ల తరువాత రూ.10 లక్షలు తీసుకునే అవకాశం కల్పిస్తామని ప్రకటించింది. అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రం చిన్నారుల పోషణ, ఆర్థిక అవసరాలు, నెలవారీ ఖర్చులను పరిగణలోకి తీసుకుంటూ ప్రతి నెలా డిపాజిట్ డబ్బులపై వడ్డీ చెల్లించాలని నిర్ణయించడం గమనార్హం. తద్వారా ఎలాంటి జాప్యం, తాత్సారం లేకుండా బాధిత బాలలు తక్షణమే ప్రయోజనం పొందేలా ఊరట కల్పించారు.
చొరవ చూపిన సీఎం జగన్..
కరోనాతో తల్లిదండ్రులను పోగొట్టుకుని నిస్సహాయులుగా మిగిలిన చిన్నారులకు భరోసా కల్పిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చొరవ చూపి తీసుకున్న నిర్ణయం ప్రభావం దేశవ్యాప్తంగా కనిపిస్తోంది. అనాథలుగా ఆక్రోశిస్తున్న చిన్నారుల ఆవేదనను అందరి కంటే ముందుగా గుర్తించి కొంత మేరకైనా పరిష్కార మార్గాన్ని చూపి మానవీయ కోణాన్ని చాటుకున్నారు. కరోనా విపత్తు వేళ లోకం తెలియని చిన్నారులను ఆదుకోవడంలో పెద్ద మనసు చూపి ముఖ్యమంత్రి జగన్ టార్చిబేరర్‌గా నిలిచారంటూ రాజకీయ వర్గాలు ప్రశంసిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో గత నెలన్నర రోజులుగా బాధిత బాలలకు భరోసా కల్పిస్తూ చేపట్టిన పలు కార్యక్రమాలను ఒక నమూనాగా కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ శాఖ పేర్కొనడం గమనార్హం. బాలల విషయంలో అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసిన ఆ శాఖ ఆంధ్రప్రదేశ్‌లో చిన్నారులకు లభిస్తున్న భరోసాను ప్రస్తావించడం గమనార్హం.
ఆర్థిక అవసరాలు తీరేలా..
కరోనా విపత్తుతో తల్లిదండ్రులను పోగొట్టుకున్న చిన్నారులను ఆదుకోవడంతోపాటు చదువు, సంరక్షణ బాధ్యతలను రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ పర్యవేక్షిస్తోంది. ఎవరైనా తల్లిదండ్రులు ఆసుపత్రి పాలైతే కోలుకునే వరకు బాలల సంరక్షణ బాధ్యతలను కూడా చేపడుతోంది. కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన పిల్లల పేరిట రూ.10 లక్షలు చొప్పున డిపాజిట్ చేసి దానిపై వచ్చే వడ్డీతో వారికి ఆర్థిక భరోసా కల్పిస్తారు. ఉచితంగా చదువు చెప్పించి, సంరక్షించి, 25 ఏళ్లు వచ్చిన తర్వాత ఆ డిపాజిట్ మొత్తాన్ని వారికే దక్కేలా పథకాన్ని అమల్లోకి తెచ్చారు.
స్పెషల్ డ్రైవ్...
తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులను గుర్తించి సంరక్షించేందుకు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. ఇందుకు అంగన్‌వాడీ, పోలీస్, సచివాలయాలు, వలంటీర్ల సహకారాన్ని తీసుకుంటున్నారు. శిశు సంక్షేమ శాఖ గణాంకాల ప్రకారం ఈ ఏడాది మార్చి 1 నుంచి ఈ నెల 26వతేదీ వరకు కోవిడ్ కారణంగా తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పోయిన చిన్నారులు 137 మంది, ఒకరిని పోగొట్టుకున్న వారు 2,049 మంది ఉన్నారు.
చిన్నారుల కోసం ప్రత్యేకంగా హెల్ప్‌లైన్
‘కోవిడ్ సమయంలో చిన్నారులను ఆదుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇవి పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. పిల్లల కోసం ప్రత్యేకంగా కోవిడ్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశాం. ఇందుకోసం డయల్ 181, 1098 కాల్ సెంటర్‌లను ఉపయోగిస్తున్నాం. మార్చి నుంచి దీనిపై పోలీస్, ఇతర శాఖల సమన్వయంతో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాం. కరోనా కారణంగా తల్లిదండ్రులను పోగొట్టుకుని అనాధలైన పిల్లల పునరావాసం, తల్లిదండ్రులు ఆసుపత్రిలో చేరితే పిల్లల తాత్కాలిక సంరక్షణ కోసం ఎప్పటికప్పుడు 181, 1098 టోల్ ఫ్రీ నెంబర్లు ద్వారా సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం’
–కృతికా శుక్లా, మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్
ఈ ఏడాది మే 17న..
కరోనా మహమ్మారితో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల పేరుతో రూ.10 లక్షలు చొప్పున ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి ప్రతి నెలా ఆర్థిక అవసరాలు తీరేలా వడ్డీ డబ్బులు చెల్లించడంతోపాటు చదువు బాధ్యతలను చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. 25 ఏళ్లు వచ్చిన తరువాత డిపాజిట్ మొత్తాన్ని బాధితులకే చెల్లించనున్నారు. మే 19న ఇందుకు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు(జీవో) జారీ అయ్యాయి.
మే 18న..
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సైతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తరహాలోనే కోవిడ్‌తో తల్లిదండ్రులను పోగొట్టుకున్న బాలలను ఆదుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. చిన్నారులకు ఉచితంగా చదువు చెప్పించడమే కాకుండా 25 ఏళ్లు వచ్చే వరకు ప్రతి నెల రూ.2,500 చొప్పున నగదు సాయం చేస్తామన్న కేజ్రీవాల్ నిర్ణయం ఈనెల 25 నుంచి అమలులోకి వచ్చింది.
మే 27న..
కేరళ రాష్ట్ర ప్రభుత్వం సైతం ఆంధ్రప్రదేశ్ బాటలోనే నిర్ణయం తీసుకుంది. బాధిత బాలలకు రూ.3 లక్షల చొప్పున డిపాజిట్ చేయడంతోపాటు డిగ్రీ వరకు ఉచిత విద్యను అందిస్తామని కేరళ సీఎం పినరయి విజయన్ ప్రకటించారు.
మే 29న..
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సైతం కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన బాలలకు రూ.5 లక్షల చొప్పున సాయాన్ని ప్రకటించారు.
మే 29..
కోవిడ్‌తో కన్నవారిని పోగొట్టుకున్న చిన్నారులను ఆదుకుంటామని, ఉచితంగా చదువు చెప్పించి పీఎం కేర్స్ ద్వారా అండగా ఉంటామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. బాధిత చిన్నారులకు 18 ఏళ్ల వయసు వచ్చే నాటికి రూ.10 లక్షలు చొప్పున కార్పస్ ఫండ్ డిపాజిట్ చేసి 18 – 23 ఏళ్ల మధ్య స్టైఫండ్ అందిస్తామని, ఆ తరువాత వారికి డబ్బులు తీసుకునే అవకాశం కల్పిస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment