చిన్నారుల కోసం ఓ రాజభవనం
అనాథ పిల్లల కోసం నిజాం ప్రభువు ఏర్పాటు చేసిన అందమైన ప్యాలెస్ విక్టోరియా మెమోరియల్ హోమ్ అండ్ ఇండస్ట్రియల్ స్కూల్. నగరంలోని గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌కు ఎదురుగా 64ఎకరాల విస్తీర్ణంలో ఉందా ప్యాలెస్. మార్నింగ్‌వాక్‌కు వెళ్లే ఏ కొద్ది మందికో తప్ప నూరేళ్లకు పైబడిన చరిత్ర ఉన్న ఆ ప్యాలెస్ గురించి చాలా మందికి తెలియదు. అక్కడ బాలబాలికలు కష్టాలు మరచి హాయిగా చదువుకుంటున్నారు.
ఆ రోజుల్లో ఈ ప్రాంతం దట్టమైన అడవిలా ఉండేది. ఆరో నిజాం ప్రభువు మీర్ మహబూబ్ అలీ 1890లో తన వేసవి విడిదిగా ప్యాలెస్ నిర్మాణం చేపట్టాడు. నిర్మాణ దశలో ఉన్నప్పుడే అటుగా వచ్చిన నిజాం ప్రభువుకు ఏదో దుశ్శకునం ఎదురై అశుభ సూచకంగా తోచింది. నిర్మాణం పనులు వెంటనే నిలిపివేయాలని ఆదేశించారు.
విక్టోరియా స్మృత్యర్థం...
1902... ఇంగ్లండ్‌లో విక్టోరియా మహారాణి మరణించిన తొలి రోజులు. ఆమె స్మృత్యర్థం ఒక మెమోరియల్ ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో ఉన్న ఆనాటి బ్రిటిష్ రె సిడెంట్ సర్ డేవడ్ బార్ ఓరోజున వేటకు ఆ ప్రాంతానికి వచ్చారు. అక్కడి విశాలమైన ఆ అసంపూర్తి ప్యాలెస్‌ను చూసిమెమోరియల్‌కు అనువైనదని భావించాడు.
ఆ తరువాత నిజాంను కలిసి ఆ భవనాన్ని తమకు అప్పగించాలని కోరాడు. బ్రిటిష్ పాలకులతో మంచి సంబంధాలున్న ఆరో నిజాం వెంటనే అందుకు అంగీకరించడమే కాదు... సగంలోఆగిపోయిన నిర్మాణం పనులను పూర్తి చేసి విక్టోరియా మహారాణి మెమోరియల్ స్థాపనం కోసం బ్రిటిష్ వారికి అప్పజెప్పినట్లు ఆధారాలున్నాయి. ఆ ప్యాలెస్‌లో చారిటబుల్ సంస్థగా ఆస్పత్రి లేదా అనాథ ఆశ్రమం ఏర్పాటు చేయాలని బ్రిటిష్ రెసిడెంట్ సర్ డేవిడ్ బార్ ప్రతిపాదించారు. తరువాత అనాథ బాలల విద్యాసంస్థ ఏర్పాటుకే మొగ్గు చూపారు. అప్పటికే 54 మంది విద్యార్థులతో వరంగల్‌లో నడుస్తున్న అనాథాశ్రమాన్ని హైదరాబాద్‌కు తరలించి తాత్కాలికంగా చాదర్‌ఘాట్‌లోని ఓ బిల్డింగ్‌లో నిర్వహించారు. ప్యాలెస్ నిర్మాణం పూర్తయిన తరువాత 1905 జనవరి 1న ‘విక్టోరియా మెమోరియల్ హోం ఫర్ ది ఆర్ఫన్స్’కు తరలించారు.
అనాథలు కాదన్న నెహ్రూ...
భారతదేశానికి స్వాత్రంత్యం సిద్ధించాక విక్టోరియా మెమోరియల్ హోమ్ బాధ్యత రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలోకి వచ్చింది. ఈ నూరు సంవత్సరాల్లో కేంద్ర విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్, విజయలక్ష్మీ పండిట్, దుర్గాబాయ్ దేశ్‌ముఖ్, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి షేక్ అబ్దుల్లా ఒకరేమిటి... ఎంతో మంది ప్రముఖులు హోమ్‌ను సంద ర్శించారు. 1953 జనవరి 19న భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ కూడా ఈ స్కూల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా 20 నిమిషాలు ఆ చిన్నారులతో ముచ్చటించిన ఆయన... చదువు, ఆటపాటల్లో ముందున్న ఆ పిల్లలను అనాథలనడం సరికాదని... సంస్థ పేరులో ఉన్న ఆర్ఫన్స్ అన్న పదం తొలగించాలని సూచించారు. నెహ్రూ సూచనల మేరకు విక్టోరియా మెమోరియల్ హోమ్ అండ్ ఇండస్ట్రియల్ స్కూల్‌గా మారింది. నాడు పండిట్ నెహ్రూ వెలిబుచ్చిన అభిప్రాయాలు ఆయన చేవ్రాలుతో విజిటర్స్ బుక్‌లో నేటికి భద్రంగా ఉన్నాయి.
అన్నింటా ముందే...
ఐదేళ్ల నుంచి 16 ఏళ్లలోపు పిల్లలకు ఇక్కడ ఆశ్ర యమిస్తారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో ఒకటో తరగతి నుంచి పది వరకు రెండు సెక్షన్లలో సుమారు 900 మంది చదువుతున్నారు. ఆ తరువాత ఇంటర్మీడియట్ కోసం సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న జూనియర్ కాలేజీల్లో ఇక్కడి విద్యార్థులకు ప్రాధాన్యమిస్తున్నారు. ప్రతి ఏటా ఉత్తీర్ణత 80 నుంచి 85 శాతం ఉంటోంది. ఇక్కడ చదువుతోపాటు ప్రింటింగ్ టెక్నాలజీ, టైలరింగ్, ఎలక్ట్రిషియన్, కార్పెంటరీ వంటి ఉపాధి కోర్సుల్లో కూడా శిక్షణ ఇస్తున్నారు.
ఈ విద్యార్థులు స్పోర్ట్స్ అండ్ గేమ్స్, ఎన్‌సీసీల్లోనూ ముందే ఉన్నారు. అనేక జాతీయ స్థాయి క్రీడల్లో అవార్డులు అందుకున్నారు. విద్యార్థులు సాధించిన పతకాలు, ట్రోఫీలతో స్కూల్లోని గదుల గోడలు నిండిపోయాయి. ఈ పాఠశాలలో డ్రాపవుట్ అనే మాటే వినపడదు. భోజన, వసతి సౌకర్యాలతో పాటు యూనిఫాం, వైద్యం కూడా సాంఘిక సంక్షేమ శాఖే అందిస్తోంది. ఈ పిల్లలకు ఎవరైనా సాయం చేయాలనుకుంటే నగదు కాకుండా దుప్పట్లు, టవల్స్, సబ్బులు, దుస్తులు... ఇలా వస్తు రూపంలో ఇవ్వాలని స్కూల్ ప్రిన్సిపాల్ తెలిపారు. సంప్రదించాల్సిన ఫోన్ 040-24045144.
- మల్లాది కృష్ణానంద్
malladisukku@gmail.com