చైతన్యశీల నెట్‌వర్క్ | The fight against the evil of fluoride | Sakshi
Sakshi News home page

చైతన్యశీల నెట్‌వర్క్

Published Thu, Dec 4 2014 10:36 PM | Last Updated on Sat, Sep 2 2017 5:37 PM

చైతన్యశీల నెట్‌వర్క్

చైతన్యశీల నెట్‌వర్క్

ఫ్లోరైడ్ రక్కసిపై పోరాటం
 
అతను ముంబై ఐఐటియన్. అందులోనూ ప్రపంచ పేరెన్నికగన్న స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీలో పీహెచ్‌డీ స్కాలర్. కో అంటే కోట్ల రూపాయలు సంపాదించే ఉద్యోగాలు తెచ్చుకోవచ్చు. విదేశాలకు వెళ్లి డాలర్లు మూటగట్టుకోవచ్చు. కానీ  సుందర రాజన్‌కృష్ణన్ అలా చేయలేదు. సామాజిక రుగ్మతలను అంతం చేయాలన్న మహనీయుల స్ఫూర్తితో తనకంటూ ఓ ప్రత్యేక మార్గాన్ని ఎంచుకున్నాడు. జన్మతః తమిళనాడుకు చెందినవాడైనా, ముంబైవాసిగా అనేక అంశాల్లో అవగాహనను ఏర్పరచుకున్నాడు. ఫ్లోరైడ్ ప్రభావంతో చిన్న వయసులోనే కాళ్లు వంకర్లు తిరిగి...పడక మంచానికే అంకితమయిన చిన్నారుల జీవితాలను గాడిన పెట్టడాన్ని బాధ్యతగా భావించాడు. అసోం, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, మధ్యప్రదేశ్... ఇలా తనకు అవకాశం వచ్చిన ప్రతిచోటా ఫ్లోరిన్‌పై యుద్ధం చేస్తున్నాడు. రోహిణీ నీలేకని లాంటి ప్రముఖుల సహకారాన్ని తీసుకుంటూనే అనేక రంగాల్లో నిష్ణాతులైన వారిని కలుపుకుని ఫ్లోరైడ్ రక్కసిపై పోరాడేందుకు ఓ నెట్‌వర్క్ ఏర్పాటు చేశాడు.

అదే ఫ్లోరైడ్ నాలెడ్జి అండ్ యాక్షన్ నెట్‌వర్క్. ఇమ్‌రెన్ అనే స్వచ్ఛంద సంస్థకు ఎగ్జిక్యూటివ్ డైరె క్టర్‌గా పనిచేస్తున్న సుందరరాజన్ కృష్ణన్ ఇప్పుడు ఈ నెట్‌వర్క్‌కు సంధానకర్త. దేశంలోని ప్రముఖులందరినీ ఓ గొడుగు కిందకు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్న వ్యక్తి. ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాల్లో ఒకటైన నల్లగొండ జిల్లాకు తన నెట్‌వర్క్ బృందంతో కలిసి వచ్చిన సుందర రాజన్‌కృష్ణన్ ‘సాక్షి’తో పంచుకున్న అనుభవాలు అతని మాటల్లోనే...
 
నెట్‌వర్క్ ఒక్కటే ఏమీ చేయలేదు. ప్రజలతో పాటు అన్ని రంగాల నిపుణులు సహకరిస్తే ఫ్లోరైడ్ రక్కసిని మట్టుబెడతామన్న నమ్మకం ఉంది. అందరూ తమ అభిప్రాయాలను పంచుకునేందుకు ఫ్లోరైడ్ ఇండియా డాట్ ఓఆర్‌జీ అనే వెబ్‌సైట్‌ను ఏర్పాటుచేశాం. ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ ద్వారా ప్రజల్లోకి వెళుతున్నాం. అందరినీ చైతన్యవంతులను చేయడమే ధ్యేయంగా పెట్టుకున్నాం. ఆహారం, నీటి సరఫరా, అందరి భాగస్వామ్యం సక్రమంగా ఉంటే ఈ ఫ్లోరైడ్‌ను గెలవడం పెద్ద కష్టమేమీ కాదనేది మా నెట్‌వర్క్ అభిప్రాయం.
 
 
 నేను స్వతహాగా జియాలజిస్టును. భూగర్భ జల కాలుష్యం మీద పనిచేస్తున్నాను. స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీలో పీహెచ్‌డీ పూర్తి చేసిన తర్వాత 2007లో రెండేళ్ల పోస్ట్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌కు అవకాశం వచ్చింది. ఆ కార్యక్రమం అమెరికాలో ఎందుకు, మన దేశంలో చేద్దాం అనుకుని ఇక్కడకు వచ్చాను. వస్తూనే గుజరాత్‌లోని ఆనంద్‌లో ఉన్న ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్‌మెంట్ ఎట్ ఆనంద్ (ఇర్మా)కు వెళ్లాను. క్షీరవిప్లవ పితామహుడు డాక్టర్. వర్గీస్ కురియన్ ఆశయాలకు అనుగుణంగా ఏర్పాటు చేసిన ఈ సంస్థ, దాదాపు ఇరవయ్యేళ్లుగా సహజ వనరుల నిర్వహణపై జాతీయస్థాయిలో పనిచేస్తోంది. అక్కడ డాక్టర్ కటార్ సింగ్ (ప్రస్తుత చైర్మన్)తో పాటు అనేకమందితో కలిసి రెండేళ్లు పని చేసిన తర్వాత... భూగర్భ జలకాలుష్యానికి ఒక్కటి కాదు, సవాలక్ష కారణాలున్నాయని అర్థమైంది. మన దేశంలో భూగర్భ జలాల నిర్వహణలోనే లోపముంది. ఇందులో ఫ్లోరైడ్ ప్రధాన సమస్య. ఈ సమస్యపై 40-50 ఏళ్లుగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నా ఫలితం లేదు. క్షేత్రస్థాయిలో సమస్య పరిష్కారం కావడం లేదు.

ఇర్మాతో పని చేసినప్పుడు కలిసిన రాజ్‌నారాయణ్ ఇందు అనే ఆర్థికవేత్త, నేను కలిసి టాటా గ్రూప్‌ను సంప్రదించాం. సహజవనరుల నిర్వహణపై మా ప్రెజెంటేషన్‌ను చూసి వాళ్లు మాకు సహకారం అందించేందుకు ముందుకొచ్చారు. వారి సహకారంతోనే దేశవ్యాప్తంగా తిరిగి ఫ్లోరైడ్ సమస్యపై అధ్యయనం చేస్తున్నాం. అసోం, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పర్యటించాం. క్షేత్రస్థాయి పరిశీలనలో వచ్చిన ఇన్‌పుట్స్ చూస్తే భయమేసింది. ఇన్ని కోట్లరూపాయలు ఖర్చు పెడుతున్నా ప్రభుత్వాలు ఏమీ చేయలేకపోతున్నాయి, మనవల్ల అవుతుందా అనిపించింది. అంతలో ఓ వ్యక్తిని కలవమని  ఎవరో సలహా ఇచ్చారు. ఆ సలహానే ఇంత దూరం తీసుకొచ్చింది.

 మేం కలవాల్సిన ఆ వ్యక్తి ఎవరో కాదు... దేశవ్యాప్తంగా సుపరిచితుడైన న్యూరోసర్జన్ డాక్టర్ అపోలో అంజిరెడ్డి. ఆయన్ను కలిసిన తర్వాత భగవద్గీత చదివినంత ఉపశమనం కలిగింది. ‘నో సర్జరీ నథింగ్.. ఓన్లీ కాల్షియం ఇన్ టూ ఫుడ్’... ఆయన చెప్పిన ఈ మాట మా మార్గాన్ని మార్చేసింది. ఫ్లోరైడ్ సమస్యలో పౌషకాహార లోపం అనేది కీలకమైన ఆధారం. ఎముకలను ప్రభావితం చేసే ఫ్లోరిన్ ప్రభావాన్ని తగ్గించాలంటే ఆహారపదార్థాలు బలవర్థకమైనవై ఉండాలి. వాస్తవానికి మనదేశంలోనే కాదు, అనేక పాశ్చాత్య దేశాల్లోనూ ఫ్లోరిన్ సమస్య ఉంది. కానీ వారి ఆహారంలో ఉండే కొన్ని లవణాలు వారిని సంరక్షిస్తున్నాయి. మనదేశంలో అలా లేదు. రోజుకు 800 మిల్లీ గ్రాముల క్యాల్షియం మన దేహంలోని ఎముకలకు అవసరమయితే, అందులో మనం తీసుకుంటోంది కేవలం 200 మిల్లీ గ్రాములే. అందుకే మన పిల్లలు మంచం మీదే జీవితమంతా గడుపుతున్నారు. ఆహారంలో కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ సి పెరిగితే ఫ్లోరోసిస్ సమస్యను నివారించడం పెద్ద కష్టమేమీ కాదని అంజిరెడ్డిగారితో చర్చల తర్వాత మాకు అర్థమయింది.
 
ఝబువాకి వెళ్తే గుండె ఝల్లుమంది

ఈ చర్చల తర్వాత దేశంలోనే ఫ్లోరైడ్ సమస్యతో బాధపడుతున్న అత్యంత వెనుకబడిన ప్రాంతంలో పనిచేయాలని నిర్ణయించుకున్నాం. టాటా ట్రస్టు మూడేళ్ల పాటు సాయం చేసేందుకు అంగీకరించింది. మొదటగా మధ్యప్రదేశ్‌లోని గిరిజన జిల్లా ఝబువాను ఎంచుకున్నాం. వెళ్లగానే అక్కడ నివాసముంటున్న వారికి రక్త, మూత్ర పరీక్షలతోపాటు ఎక్స్‌రేలు కూడా తీశాం. రిపోర్టులు చూసి భయమేసింది. ఆరేళ్ల నుంచి అరవై ఏళ్ల వారి వరకు కనీసం నడవలేని స్థితి. వెంటనే అక్కడి ప్రజలకు పౌష్టికాహారాన్ని అందజేశాం. రోజూ ఉసిరి (విటమిన్ సి కోసం), చలికాలంలో నువ్వులు, బెల్లం అందించాం. స్థానికంగా లభించే కాసియా ట్యూరా (ఇక్కడ చిన్నకసింద అంటాం) అనే పండ్లు సేకరించాం. 400 కిలోల పండ్లు సేకరించి ఎండబెడితే 40 కిలోల ఔషధం వచ్చింది. దీన్ని కూడా పంపిణీ చేశాం. రెండేళ్లలో ఫ్లోరోసిస్ బాధితుల్లో గణనీయమైన మార్పు కనిపించింది. వారి కంటి చూపు మెరుగుపడింది. మళ్లీ పరీక్షలు చేస్తే రిపోర్టుల్లో కూడా తేడా కనిపించింది. అందుకు నీలేశ్ కేస్ స్టడీయే నిదర్శనం. నీలేశ్‌కి ఏడేళ్లు. బడికెళ్తున్నాడు. కానీ కూర్చోలేడు. కూర్చోవాలంటే నడుముల కింద రాయి పెట్టుకుని కూర్చోవాల్సిందే. కానీ మేమందించిన ఆహారం తీసుకున్న తర్వాత కోలుకున్నాడు.. నడిచాడు.. ఇప్పుడైతే పరుగెడుతున్నాడు.  

ఆ సమయంలోనే ఐ.ఎం.బిశ్వాల్ అనే వ్యక్తి పరిచయం అయ్యారు. వారి ద్వారా రోహిణీ నీలేకనిని కలిసే అవకాశం వచ్చింది. వారు తమ ఎన్జీవో ద్వారా ఖర్చు పెడుతున్న మొత్తంలో సగం నిధులు నీటి సంబంధిత కార్యక్రమాలకే వెచ్చిస్తున్నారు. ఒకరికో, ఇద్దరికో సాయం చేయలేం కానీ.. ఫ్లోరైడ్‌పై పోరాడుతున్న వారందరినీ ఒక్కచోటకు చేర్చి వేదిక ఏర్పాటు చేసేందుకు సహకరిస్తామని చెప్పారు. అప్పుడు ఆవిర్భవించిందే ‘ఫ్లోరైడ్ నాలెడ్జ్ అండ్ యాక్షన్ నెట్‌వర్క్ (ఎఫ్‌కేఏఎన్). ఏడాదిన్నర కాలంగా ఈ నెట్‌వర్క్‌ని నడిపిస్తున్నాం. మా నెట్‌వర్క్‌లోని భాగస్వాములంతా ఫ్లోరైడ్ నివారణే అజెండాగా పనిచేస్తున్నాం. ముఖ్యంగా సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, నిధుల సమీకరణ, ప్రభుత్వ వ్యవస్థల సహకారం తీసుకోవడం, అందరికీ ఓ వేదిక కల్పించడం అనే నాలుగు అంశాలపైనే దృష్టి పెట్టి పనిచేస్తున్నాం. వివిధ రంగాలకు చెందిన నిష్ణాతులతో కూడిన మా నెట్‌వర్క్‌లో 260 మంది సభ్యులు. వారిలో 70-80 మంది క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. రోహిణీ నీలేకని, టాటా ట్రస్టు లతో పాటు డాక్టర్ అంజిరెడ్డి, డాక్టర్ ఖందాలే, డాక్టర్ తపస్ చగ్మా, డాక్టర్. ఎ.బి.పాల్ (అసోం), డాక్టర్ ఎ.కె.సుశీల (ఎయిమ్స్, న్యూఢిల్లీ) లాంటి వాళ్లు మాతో ఉన్నారు. ఇందులో డాక్టర్ ఎ.కె.సుశీల ఫ్లోరైడ్ లాభదాయకం కాదు.. హానికరం అనే సూత్రాన్ని చెప్పడం ద్వారా పాశ్చాత్య దేశీయులు దంత సౌందర్యం కోసం ఫ్లోరైడ్ వాడకుండా నివారించగలుగుతున్నారు. ఇలాంటి వారంతా మాతో కలిసి యుద్ధం చేస్తున్నప్పుడు గెలవలేమా అనిపిస్త్తోంది. ఏదో ఒకరోజు ఫ్లోరైడ్ పీడ మన దేశంలో విరగడ అవుతుందనే ధైర్యం కలుగుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement