స్టాన్‌ఫోర్డ్‌ వర్సిటీ సహకారం | CM Revanth team met with representatives of Stanford University | Sakshi
Sakshi News home page

స్టాన్‌ఫోర్డ్‌ వర్సిటీ సహకారం

Published Sun, Aug 11 2024 5:58 AM | Last Updated on Sun, Aug 11 2024 5:58 AM

CM Revanth team met with representatives of Stanford University

తెలంగాణలో బయోడిజైన్‌ రంగంలో నైపుణ్యాల అభివృద్ధి లక్ష్యం

ప్రభుత్వ భాగస్వామ్యంతో శాటిలైట్‌ సెంటర్‌ ఏర్పాటు పరిశీలన 

స్టాన్‌ఫోర్డ్‌ వర్సిటీ ప్రతినిధులతో సీఎం రేవంత్‌ బృందం భేటీ 

హైదరాబాద్‌లో జోయిటిస్‌ కేపబులిటీ సెంటర్‌ విస్తరణ

సాక్షి, హైదరాబాద్‌:  తెలంగాణ ప్రభుత్వంతో కలసి పనిచేసేందుకు అమెరికాలోని కాలిఫోర్ని­యాలో ఉన్న స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ ముందుకొచ్చింది. బయోడిజైన్‌ రంగంలో నైపుణ్యాభివృద్ధి లక్ష్యంగా రాష్ట్రంలో స్టాన్‌ఫోర్డ్‌ బయోడిజైన్‌ శాటిలైట్‌ సెంటర్‌ ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని ప్రకటించింది. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీని సందర్శించింది. స్టాన్‌ఫోర్డ్‌ బైర్స్‌ సెంటర్‌ ఫర్‌ బయోడిజైన్‌ విభాగం సీనియర్‌ ప్రతినిధులతో సమావేశమైంది. ఈ సందర్భంగా స్టాన్‌ఫోర్డ్‌ ఆధ్వర్యంలో జరిగే బయోడిజైన్‌ ఆవిష్కరణలను తెలంగాణలో విద్య, ఆరోగ్య రక్షణ విభాగాలకు అనుసంధానం చేయాలనే ఆలోచనను వర్సిటీ ప్రతినిధులతో సీఎం రేవంత్‌ పంచుకున్నారు. 

కొత్త యూనివర్సిటీల్లో భాగస్వామ్యం 
తెలంగాణలో ఏర్పాటు చేస్తున్న యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ, న్యూ లైఫ్‌ సైన్సెస్‌ యూనివర్సిటీలో భాగస్వామ్యం పంచుకోవాలని స్టాన్‌ఫో­ర్డ్‌ వర్సిటీని రాష్ట్ర బృందం ఆహా్వనించింది. అధునాతన పరిజ్ఞానం మారి్పడి, ఉమ్మడి పరిశోధనలపైనా చర్చించింది. ఈ సందర్భంగా స్టాన్‌ఫోర్డ్‌ వర్సిటీ తెలంగాణతో కలిసి పనిచేస్తుందని బయోడిజైన్‌ విభాగం అధిపతులు అనురాగ్‌ మై­రాల్, జోష్‌ మాకోవర్‌ ప్రకటించారు. తమ ఆసక్తి­ని వ్యక్తం చేస్తూ సీఎం బృందానికి లేఖ ఇచ్చారు. వైద్య, విద్య పరికరాలు, కొత్త ఆవిష్కరణలకు తమ మద్దతు ఉంటుందని తెలిపారు. స్టాన్‌ఫోర్డ్‌ వర్సిటీతో భాగస్వామ్యం తెలంగాణ యువత భవిష్యత్తుకు కొత్త బాటలు వేస్తుందని సీఎం రేవంత్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. 

గూగుల్‌ కార్యాలయానికి రేవంత్‌ బృందం 
వర్సిటీలో పర్యటన అనంతరం సీఎం రేవంత్‌ బృందం కాలిఫోర్నియాలోని మౌంటేన్‌ వ్యూలో ఉన్న గూగుల్‌ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించింది. తెలంగాణలో టెక్‌ సేవల విస్తృతి, ఏఐ సిటీ నిర్మాణం, స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటు తదితర ప్రాజెక్టుల్లో భాగం పంచుకునే విషయమై గూగుల్‌ సంస్థ ఉన్నతాధికారులతో చర్చలు జరిపింది. 

ప్రొఫెసర్‌ రామ్‌చరణ్‌తో భేటీ 
సీఎం రేవంత్‌ కాలిఫోర్నియాలో ప్రముఖ బిజినెస్‌ కన్సల్టెంట్, రచయిత, వక్త ప్రొఫెసర్‌ రామ్‌చరణ్‌తో భేటీ అయ్యారు. తెలంగాణ, హైదరాబాద్‌ ప్రత్యేకతలకు అంతర్జాతీయంగా ప్రాచుర్యం కల్పించేందుకు రాష్ట్రాన్ని సందర్శించాలని ఆహా్వనించారు. వేగంగా మారుతున్న వాణిజ్య వాతావరణంలో ఎదురయ్యే సమస్యల పరిష్కారం, పెట్టుబడుల సాధనకు అనుసరించాల్సిన మార్గాలపై వారు చర్చించారు. ప్రొఫెసర్‌ రామ్‌చరణ్‌ పలు అంతర్జాతీయ కంపెనీలు, సీఈవోలు, బోర్డులతో కలసి పనిచేశారు. 

హైదరాబాద్‌లో జొయిటిస్‌ విస్తరణ 
ప్రముఖ జంతు ఆరోగ్య సంస్థ జొయిటిస్‌ హైదరాబాద్‌లో తమ కేపబులిటీ సెంటర్‌ (సామర్థ్య కేంద్రం)ను విస్తరించాలని నిర్ణయించింది. 2024 సెపె్టంబర్‌ నుంచి విస్తరణ కార్యకలాపాలు ప్రారంభిస్తామని, వందలాది మందికి కొత్త ఉద్యోగాలు లభిస్తాయని పేర్కొంది. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు బృందంతో జొయిటిస్‌ ప్రతినిధులు భేటీ అయ్యారు. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి లైఫ్‌సైన్సెస్‌ హబ్‌గా తీర్చిదిద్దాలనే ఆలోచనలకు జొయిటిస్‌ విస్తరణ దోహదం చేస్తుందని వారు పేర్కొన్నారు. ఈ భేటీలో జోయిటిస్‌ చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌ కీత్‌ సర్‌బాగ్, ఇండియా కేపబిలిటీ సెంటర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అనిల్‌ రాఘవ్‌ తదితరులు పాల్గొన్నారు. 

విస్తరణకు మోనార్క్‌ ట్రాక్టర్స్‌ ప్రణాళిక 
హైదరాబాద్‌లో తమ కార్యకలాపాల విస్తరణకు మోనార్క్‌ ట్రాక్టర్స్‌ సంస్థ ముందుకొచ్చింది. అమెరికాలో సీఎం రేవంత్‌ నేతృత్వంలోని రాష్ట్ర బృందం మోనార్క్‌ ట్రాక్టర్స్‌ సంస్థ సీఈఓ ప్రవీణ్‌ పెన్మత్స, ఇతర ప్రతినిధులతో భేటీ అయింది. హైదరాబాద్‌లోని తమ పరిశోధన, అభివృద్ధి కేంద్రానికి అనుబంధంగా అటానమస్‌ ట్రాక్టర్‌ టెస్టింగ్‌ సదుపాయాన్ని ఏర్పాటు చేస్తామని మోనార్క్‌ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. ప్రపంచంలోనే మొదటిసారిగా డ్రైవర్‌ లెస్‌ స్మార్ట్‌ ఎలక్ట్రిక్‌ ట్రాక్టర్లను తమ సంస్థ రూపొందించిందని తెలిపారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement