ఈ తరహా నగరం దేశంలో ఎక్కడా లేదు: సీఎం రేవంత్‌రెడ్డి
పెట్టుబడులకు గమ్యస్థానంగా ఫ్యూచర్ సిటీ
కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్‌ను ప్రారంభించిన సీఎం
సాక్షి, హైదరాబాద్: ‘పొరుగు రాష్ట్రాలు సహా భారతదేశంలోనే ఎవరి వద్దా లేని హైదరాబాద్ నగరం మా వద్ద ఉంది. ఇక్కడ ఉన్న ఔటర్ రింగు రోడ్డు వంటి మౌలిక వసతులు, వాతావరణం, శాంతిభద్రతలు దేశంలో మరెక్కడా లేవు. మేము పక్క రాష్ట్రాలతో పోటీ పడాలనే ఆలోచనలకంటే ప్రపంచంతో పోటీ పడాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం. కేవలం అమెరికా, దక్షిణ కొరియాకే పరిమితం కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంస్థలకు పిలుపునిస్తున్నా.
తెలంగాణకు పెట్టుబడులతో వస్తే భద్రత, లాభంతో పాటు సాంకేతిక నైపుణ్యం అందించే యువశక్తి మా వద్ద ఉంది. పెట్టుబడులతో ఎవరు వచ్చినా రక్షణ ఉంటుందని హామీ ఇస్తున్నా. మీకు అవసరమైన అనుమతులు, వసతులు తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తుంది..’అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి చెప్పారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్ కోకాపేటలో 10 లక్షల చదరపు అడుగుల్లో ఏర్పాటు చేసిన కొత్త క్యాంపస్‌ను సీఎం బుధవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘మా పోటీ కర్ణాటక, తమిళనాడు, ఏపీ వంటి రాష్ట్రాలతో కాదు. హైదరాబాద్ వంటి మహా నగరం, కాగ్నిజెంట్ వంటి దిగ్గజ సంస్థలు ఇక్కడ ఉన్నాయి. హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసి నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపేలా పాలసీల్లో పారదర్శకత పాటిస్తాం. పెట్టుబడులకు ప్రోత్సాహం ఇవ్వాలని భావిస్తున్నాం’అని రేవంత్ చెప్పారు.
భిన్నాభిప్రాయాలు ఉన్నా అభివృద్ధి
‘కులీ కుతుబ్‌షాహీలు మొదలుకుని హైదరాబాద్ నగరం 430 ఏళ్లుగా రాజకీయ భిన్నాభిప్రాయాలను అధిగమిస్తూ అభివృద్ధి చెందుతోంది. అధికారంలో ఎవరు ఉన్నా భేదాభిప్రాయాలు లేనందునే ప్రపంచంతో పోటీ పడుతోంది. నిరుద్యోగ సమస్యకు సాంకేతిక నైపుణ్యంతో పరిష్కారం చూపాలనే రాజీవ్‌గాంధీ ఆలోచన మేరకు 1992లో నాటి సీఎం నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి హైటెక్ సిటీకి పునాది వేశారు.
చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత హైటెక్ సిటీ నిర్మించారు. వైఎస్ హయాంలో మూడో నగరంగా సైబరాబాద్ నిర్మాణం జరిగింది. భవిష్యత్తు అవసరాలను హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ నగరాలు తీర్చే పరిస్థితి లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎయిర్‌పోర్టుకు కూతవేటు దూరంలో నాలుగో నగరం ‘ఫ్యూచర్ సిటీ’ని నిర్మిస్తాం. చైనా బయట పెట్టుబడుల కోసం చూస్తున్న అమెరికా, దక్షిణ కొరియా వంటి దేశాలకు ఫ్యూచర్ సిటీ సమాధానం చెప్తుంది. ఫ్యూచర్ సిటీలో కాగ్నిజెంట్ వంటి సంస్థలు భాగస్వాములు కావాలి..’అని సీఎం అన్నారు.
ఇన్వెస్టర్ టాస్‌్కఫోర్స్ ఏర్పాటు
‘అమెరికా, దక్షిణ కొరియా పర్యటన ద్వారా రూ.31,500 కోట్ల పెట్టుబడులు, 30,750 ఉద్యోగాల కల్పన జరుగుతుంది. త్వరలో మరిన్ని పెట్టుబడుల సాధన దిశగా సమావేశాల నిర్వహణ కోసం ‘ఇన్వెస్టర్ టాస్‌్కఫోర్స్’ఏర్పాటు చేస్తాం. తెలంగాణను ఫ్యూచర్ స్టేట్‌గా మార్చేందుకు హైదరాబాద్‌ను కోర్ అర్బన్ ఏరియాగా, ఔటర్ రింగు రోడ్డు, రీజినల్ రింగు రోడ్డు నడుమ ప్రాంతాన్ని సెమీ అర్బన్ ఏరియాగా, రీజినల్ రింగు రోడ్డు వెలుపల ఉన్న ప్రాంతాన్ని రూరల్ తెలంగాణగా వర్గీకరిస్తున్నాం. సెమీ అర్బన్ ఏరియాను తయారీ కేంద్రంగా, రూరల్ తెలంగాణలోని ప్రాంతాలను ఆసియాలోనే అత్యుత్తమ గ్రామాలుగా అభివృద్ధి చేస్తాం..’అని రేవంత్ చెప్పారు.
57 వేల మంది హైదరాబాద్ నుంచే: కాగ్నిజెంట్ ప్రెసిడెంట్
‘హైదరాబాద్‌లో కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్‌ను కేవలం ఆరు నెలల్లో సిద్ధం చేసి ప్రారంభిస్తున్నాం. 2002 నుంచి హైదరాబాద్ అభివృద్ధిలో కాగ్నిజెంట్ భాగస్వామిగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా కాగ్నిజెంట్‌కు 3.56 లక్షల మంది ఉద్యోగులు ఉంటే అందులో 70 శాతం అంటే 2.40 లక్షల మంది భారత్ నుంచే ఉన్నారు.
వీరిలో 57 వేల మంది హైదరాబాద్‌లోనే పనిచేస్తుండగా, 39 శాతం మంది మహిళలే కావడం గమనార్హం..’అని కాగ్నిజెంట్ ఈవీపీ ప్రెసిడెంట్ సూర్య గుమ్మడి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, ఐటీ, పరిశ్రమల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, కాగ్నిజెంట్ ప్రతినిధులు నారాయణన్, జాన్‌కిమ్, కేథరిన్ డియాజ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment