ఏడుగురు భారత సంతతి విద్యార్థులు ఈ ఏడాది స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయ ప్రతిష్టాత్మక నైట్స్ హెనెస్సీ స్కాలర్‌షిప్‌ను పొందారు. ప్రంచంలోనే అతిపెద్ద గ్రాడ్యుయేట్ ఫెలోషిప్ అయిన ఈ స్కాలర్‌షిప్ కోసం 90 మంది స్కాలర్‌లను ఎంపిక చేయగా, వారిలో ఆంక్ అగర్వాల్, వాసన్ కుమార్, అనీష్ పప్పు, ఇషా సంఘ్వి, కృతిక సింగ్, కృష్ణ పాఠక్, రాహుల్ పెనుమాక ఉన్నారు. ఆ విద్యార్థులంతా వైద్యం,సాంకేతికత, ఇంజనీరింగ్, న్యాయ రంగాలు తదితర విభాగాల్లో ఈ స్కాలర్‌షిప్‌లను పొందారు.
వాళ్లంతా ఆ యూనివర్సిటీలో పీహెచ్‌డీ, ఎండీఏ, ఎండీ డిగ్రీలు చేయనున్నారు. ఈ ఏడాది తొలిసారిగా 30 దేశాలకు చెందిన 90 మంది విద్యార్థులు స్టాన్‌ఫోర్డ్‌లోని ఏడు పాఠాశాలల్లో 45 గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లు చేయడానికి రావడం విశేషం. ఈ ఏడాది ఆ విద్యార్థుల్లో ఆస్ట్రియా, బహ్రెయిన్, బెలారస్, బొలీవియా, బల్గేరియా, ఫ్రాన్స్, శ్రీలంక విద్యార్థులు కూడా ఉన్నారు. ఇక ఎంపికైన విద్యార్థుల బ్యాచ్‌లో దాదాపు 47% మంది యూఎస్ యేతర పాస్‌పోర్ట్‌లు కలిగిఉన్నారు.
ఈ మేరకు నైట్-హెన్నెస్సీ స్కాలర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టీనా సీలిగ్ మాట్లాడుతూ..ప్రతి స్కాలర్ తన నేపథ్య సమాజానికి ఆదర్శంగా ఉండటమేగాక ప్రత్యేక దృక్పథాన్ని తీసుకొస్తారు. అలాగే ప్రపంచంలోని అన్ని సవాళ్లను అధిగమించేలా విభిన్న సంస్కృతుల భావజాలన్ని ఆకళింపు చేసుకునేలా జ్ఞానాన్ని సముపార్జించి స్ఫూర్తిగా నిలుస్తారని అన్నారు. కాగా, ఈ ఫెలోషిప్‌తో విద్యార్థులు ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయంలో మూడేళ్ల గ్రాడ్యేయేట్ అధ్యయనాన్ని కొనసాగించేలా ఆర్థిక సాయం అందుకుంటారు .
Comments
Please login to add a commentAdd a comment