రోగమేమిటో తెలుసుకోవడం ఈ రోజుల్లో ఎంత కష్టమో మనకు తెలియంది కాదు. వ్యాధి నిర్ధారణకు చేసే పరీక్షలకూ మన జేబులు గుల్ల కావాల్సిందే.
రోగమేమిటో తెలుసుకోవడం ఈ రోజుల్లో ఎంత కష్టమో మనకు తెలియంది కాదు. వ్యాధి నిర్ధారణకు చేసే పరీక్షలకూ మన జేబులు గుల్ల కావాల్సిందే. కానీ పక్క ఫొటోలో ఉన్న వ్యక్తి చేతిలో ఉన్న చిప్‌ను చూశారా? అదుంటే ఈ పరిస్థితి ఉండదు. కేవలం ఒక ఇంక్‌జెట్‌ప్రింటర్ సాయంతో స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు సిద్ధం చేసిన ఈ చిప్‌తో మలేరియా మొదలుకొని క్షయ, కేన్సర్ వంటి అనేక వ్యాధుల తాలూకూ పరీక్షలు సులువుగా చేసేయవచ్చు.
ల్యాబ్ ఆన్ చిప్ పేరుతో ఇలాటి చౌవకైన వ్యాధి నిర్ధారణ పరికరాల కోసం చాలాకాలంగా ప్రయత్నాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రాథమిక దశలోనే వ్యాధులను నిర్ధారిస్తే చికిత్స చాలా సులువు అవుతుందని, అది కూడా చౌకగా జరిగితే మరీ మేలన్న ఉద్దేశంతో తామీ చిప్‌ను తయారు చేశామని అంటున్నారు రహీమ్ ఎస్‌ఫండ్యాపౌర్. సలికోన్‌తో తయారు చేసిన ఈ చిప్‌లోని ఒక భాగంలో స్వేదం లేదా రక్తాన్ని జొప్పిస్తే నిమిషాల వ్యవధిలో పరీక్షలు జరిపి ఫలితాలు వెల్లడిస్తుంది ఇది. ఈ చిప్‌లో ఉండే అతిసూక్ష్మమైన కాలువల గుండా శరీర కణాలు ప్రవహిస్తూ అక్కడి రసాయనాలతో చర్యలు జరిపి ఫలితాలిస్తాయన్నమాట.
– సాక్షి నాలెడ్జ్ సెంటర్