చవగ్గా హైస్పీడ్ వైర్లెస్ పరికరం
భారత సంతతి శాస్త్రవేత్తల రూపకల్పన
వాషింగ్టన్: కేవలం ఒక సాధారణ ఇంక్జెట్ ప్రింటర్‌ను ఉపయోగించి.. అత్యంత వేగవంతమైన వైర్లెస్ తయారీకి తోడ్పడే పరికరాన్ని అమెరికాలోని ఇద్దరు భారత సంతతి శాస్త్రవేత్తలు రూపొందించారు. సాధారణంగా బ్లూటూత్ వంటి వైర్లెస్ సాంకేతికతల వేగం ఆ పరికరాల్లోని చిప్‌ల విద్యుత్ వాహక సామర్థ్యం, కాంతి ప్రసరణ, స్పందనలపై ఆధారపడి ఉంటుంది. వాటి తయారీకోసం సాధారణంగా సిలికాన్‌తో పాటు పలు లోహాలను వినియోగిస్తారు. అయితే మరింత వేగం, వ్యయాన్ని తగ్గించడం కోసం.. ప్లాస్టిక్ షీట్లపై లోహాల పూత ఆధారంగా సూక్ష్మస్థాయి నిర్మాణాల (ప్లాస్మోనిక్స్)ను శాస్త్రవేత్తలు ఇటీవల అభివృద్ధి చేశారు. ఈ ప్లాస్మోనిక్స్ తయారీకి కోట్ల రూపాయల విలువైన యంత్రాలు అవసరం కావడంతో పాటు.. వీటిలో విద్యుత్, కాంతి ప్రసరణ సామర్థ్యాన్ని నియంత్రించడం కష్టతరం కూడా.
కానీ, ఉటా వర్సిటీ ఎలక్ట్రికల్ ఇంజనీర్లు అజయ్ నహటా, గుప్తా.. కేవలం రూ. మూడున్నర వేల విలువైన ఇంక్జెట్ ప్రింటర్‌తో ప్లాస్మోనిక్స్‌ను తయారు చేశారు. ప్రింటర్లో వేర్వేరు రంగుల ఇంక్‌కు బదులుగా వెండి, కార్బన్ ఇంక్‌లను ఉపయోగించి రెండున్నర అంగుళాల ప్లాస్టిక్ షీటుపై 2,500 స్ట్రక్చర్లను ముద్రించగలిగారు. తమ పరిశోధనపై అజయ్, గుప్తా వివరణ ఇస్తూ.. ‘‘ఒక సాధారణ ఇంక్జెట్ ప్రింటర్‌తో ప్లాస్మోనిక్స్‌ను రూపొందించాం. ప్రింటర్లో వెండి, కార్బన్ ఇంకుల శాతాన్ని మార్చడం వల్ల.. విద్యుత్ వాహక, అయస్కాంత, కాంతి ప్రసరణ సామర్థ్యాలను అవసరమైనట్లుగా రూపొందించుకోవచ్చు. ఇవి దాదాపు 2.4 టెరాహెడ్జ్ ఫ్రీక్వెన్సీ వరకు పనిచేయగలవు. ప్లాస్మోనిక్స్‌ను వేగవంతమైన వైర్లెస్ పరికరాల రూపకల్పనకు వినియోగించవచ్చు’’ అని పేర్కొన్నారు.