లక్ష అడుగుల ఎత్తు నుంచి తీసిన వీడియో
అరిజోనా: బెలూన్కు అమర్చి ఆకాశంలోకి పంపిన అధునాతన కెమెరా తీసిన వీడియో ఇప్పుడు సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో హల్చల్ చేస్తోంది. స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన కొందరు విద్యార్థులు 2013లో చేసిన ప్రయోగం ఫలితాలు ఆలస్యంగా వెలుగులోకొచ్చాయి. అరిజోనా సమీపంలో అధునాతన కెమెరాను అమర్చిన బెలూన్ను ఎన్నో పరీక్షల అనంతరం ఆకాశంలోకి పంపారు. అది భూమి నుంచి లక్ష అడుగుల ఎత్తులోని స్ట్రాటో ఆవరణం వరకు వెళ్లొచ్చింది. గంటన్నర పాటూ ప్రయాణించిన బెలూన్ ప్రయాణించే సామర్థ్యం కోల్పోయి తిరిగి భూమిని చేరింది. అది ప్రయాణిస్తున్న సమయంలో అరిజోనాలోని కొలరాడో నది, గ్రాండ్ కానియన్, భూమిమీద వివిధ ప్రాంతాలు.. కెమెరా తీసిన వీడియోలో స్పష్టంగా వచ్చాయి. భూమిని అంత ఎత్తునుంచి తీసిన వీడియో విహంగవీక్షణంలా ఉంది. అప్పుడే తిరిగి భూమికి వచ్చిన ఆ బెలూన్ ఇటీవల లభించడంతో ఇప్పుడు ఆ వీడియో బయటకు వచ్చింది.
బెలూన్ ప్రయాణించే సమయంలో కెమెరా తీసిన వీడియోనే కాకుండా, ఈ ప్రయోగం కోసం ఆ విద్యార్థులు ఎలా సన్నదమయ్యారో కూడా కలుపుకోని మొత్తం నాలుగు నిమిషాల నిడివి గల వీడియో ఫూటేజ్ అందులో ఉంది. అధునాతన కెమరాని పరీక్షించడం, గ్రాండ్ కానియన్ విభిన్న ఫుటేజ్ని సంపాదించడం కోసం ఈ ప్రయోగం చేసినట్టు ఆ విద్యార్థులు చెబుతున్నారు. చాలా రోజుల తర్వాత తాము పంపిన కెమెరా ఫూటేజ్ లభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.