‘పెద్ద చదువులు చదవాలి’ అనేది పేదింటి అమ్మాయి ఆక్సా కోరిక. అయితే అదంత తేలికైన విషయం కాదని ఆమెకు అర్థం అయింది. దారి పొడగునా ఎన్నో అడ్డంకులు ఎదుర్కొంది. అయినా సరే ఆమె ప్రయాణం ఆగలేదు. ‘పెద్ద చదువులు చదవడానికి పేదరికం అడ్డు కాదు’ అని నిరూపించి ఎంతో మంది అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలుస్తోంది అక్సా పులారా. టెక్ దిగ్గజం గూగుల్‌లో ఇన్నోవేషన్ ప్రాజెక్ట్‌లలో కీలక బాధ్యతలు చూస్తోంది.
మహారాష్ట్రలోని సాంగ్లీలో పుట్టిన ఆక్సా పులారా ‘వాల్చంద్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్’ నుండి బ్యాచిలర్ డిగ్రీ చేసింది. ‘చదివింది చాలు’ అన్నారు ఇంటి పెద్దలు. ఉన్నత చదువులు చదవాలనేది అక్సా లక్ష్యం.
‘నేను ఇంకా చదువుకోవాలనుకుంటున్నాను’ అంటే ససేమిరా అన్నారు.అదేపనిగా అడిగితే పెద్దల మనసు కరిగింది. ‘సరేలే. చదువుకో’ అన్నారు. ఆరోజు తనకు ఎంత సంతోషమైందో!
‘యస్...నేను సాధించగలను’ అనే గట్టి నమ్మకం వచ్చింది. ఆ నమ్మకమే అక్సాకు ఎంతో శక్తిని ఇచ్చింది. ఆ శక్తే తనను అమెరికా వరకు తీసుకెళ్లింది. అమెరికాలో చదువుకుంటున్న వారి గురించి వినడమే కాని తాను కూడా చదువు కోసం అక్కడికి వెళతానని కలలో కూడా అనుకోలేదు. సదరన్ కాలిఫోర్నియా యూనివర్శిటీలో చేరింది. ఆ తరువాత స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీలో కొంతకాలం పనిచేసింది. అక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్(యంఎల్)తో సహా అత్యాధునిక సాంకేతికతలో నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంది. (రోజుకు నాలుగు గంటలే పని, నెల ఆదాయం 15 లక్షలకు పై మాటే!)
ఆ తరువాత గూగుల్‌లో చేరింది. అక్కడ ఏఐ, మెషిన్ లెర్నింగ్ ఇన్నోవేషన్‌లకు సంబంధించిన ప్రాజెక్ట్‌లను లీడ్ చేస్తోంది. కాలేజీ, యూనివర్శిటీ రోజుల్లో గూగుల్‌లో ఆవిష్కరణల గురించి ఆసక్తిగా తెలుసుకునేది. ఇప్పుడు ఆ ఆవిష్కరణలలో తాను కూడా భాగం అయింది. అక్సాకు మొదటి నుంచి టెక్నాలజీ అంటే ఇష్టం. ముఖ్యంగా కట్టింగ్–ఎడ్జ్ టెక్నాలజీగా చెప్పే ఏఐ, ఎంఎల్‌లో ప్రతి చిన్న విషయం తెలుసుకునే ప్రయత్నం చేసేది. నిజజీవితంలో మనం ఎదుర్కొనే ట్రాఫిక్‌జామ్‌లాంటి సమస్యలకు ఏఐ, ఎంఐ సాంకేతికత పరిష్కారం చూపుతుందని అంటుంది ఆక్సా పులారా.
గూగుల్‌లో చేరిన తరువాత ఆ సంస్థ ఏఐ అండ్ ఎంఎల్ డెవలప్‌మెంట్స్‌లో ప్రధానపాత్ర పోషిస్తోంది. టీమ్ వర్క్‌స్పేసెస్, లుకర్ స్టూడియో ప్రో మొదలైన ఇన్నోవేటివ్ గూగుల్ ప్రొడక్ట్స్‌లో తన వంతు పాత్ర నిర్వహించింది. మనలో సామర్థ్యం ఉండగానే సరి΄ోదు. ఆ సామర్థ్యానికి తగిన వేదిక కూడా దొరకాలి. గూగుల్ రూపంలో ఆమెకు సరైన వేదిక దొరికింది.
‘గూగుల్‌లో కనిపించే కల్చరల్ ఆఫ్ ఇన్నోవేషన్ ప్రభావంతో పరిశోధనలపై ఆసక్తి పెరిగింది. సంక్లిష్టమై సమస్యలకు పరిష్కారం కనుక్కోవాలనే కుతూహలం నన్ను ముందుకు నడిపించింది’ అంటుంది అక్సా పులారా. ఆమె పట్టుదల, ఉత్సాహం చూస్తుంటే ఎన్నో ఆవిష్కరణలలో కీలకపాత్ర పోషించబోతుందని గట్టిగా చెప్పవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment