Kalpana Saroj Success Story In Telugu: జీవితమే ఒక పోరాటం - Sakshi
Sakshi News home page

కల్పనా సరోజ్.. జీవితమే ఒక పోరాటం

Published Sat, May 29 2021 3:38 PM | Last Updated on Sat, May 29 2021 6:38 PM

Kalpana Saroj: Dalit Child Bride Who Runs Multi Crore Company Today - Sakshi

ఆమె ఒక బాల కార్మికురాలు..  నెలకు 60 రూపాయలు ఆమె ఆదాయం. చిన్నతనంలోనే వివాహం చేశారు.. అత్తింట్లో నరకం చూశారు. తర్వాత స్వయంకృషితో  ముళ్ల బాటలాంటి తన జీవితాన్ని  పూల రథం చేసుకున్నారు.. ఐదు వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధినేత్రి అయ్యారు. ఆమె కల్పనాసరోజ్‌. 

కల్పనా సరోజ్‌ ఆరు కంపెనీలకు అధినేత్రి. ఆరు వందల మందికి ఉపాధి కల్పించారు. ఇంత స్థాయికి ఎదగడానికి ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్నారు. ‘‘నేను 1958లో మహారాష్ట్ర అకోలా జిల్లాలో మధ్యతరగతి కుటుంబంలో పుట్టాను. మా నాన్నగారు పోలీస్‌ కానిస్టేబుల్‌. నాకు ఇద్దరు తమ్ముళ్లు, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. ‘నాది బాల్య వివాహం’’ అంటూ తన గురించి చెబుతారు కల్పనా సరోజ్‌. ఏడో తరగతి పూర్తి కాగానే కల్పనా సరోజ్‌కు వివాహం చేసేశారు. ఆమె తన భర్తతో కలిసి థానేలోని ఉల్హాన్స్‌ నగర్‌ అనే మురికివాడలోని ఒక చిన్నగదిలో, పదిహేను మంది మధ్యన అడుగు పెట్టారు. అయితే అక్కడి వాతావరణంలో ఇమడలేకపోయిన కల్పనా సరోజ్, తండ్రితో కలిసి తిరిగి పుట్టింటికి వచ్చేశారు. 

మొదటి వంద నోటు...
స్వగ్రామానికి వచ్చిన తరవాత తల్లిదండ్రులను ఒప్పించి ముంబైలో బంధువుల ఇంట్లో ఉంటూ, ఒక బట్టల దుకాణంలో నెలకు అరవై రూపాయల జీతానికి ఉద్యోగంలో చేరారు. బట్టలు కుట్టటం నేర్చుకుని, అదనంగా నెలకు వంద రూపాయలు సంపాదించటం ప్రారంభించారు. ‘‘నా జీవితం లో మొట్టమొదటిసారి వంద రూపాయల నోటు చూశాను’’ అంటూ ఆనందంగా చెబుతున్న కల్పనా సరోజ్, ఆ రోజు నుంచి ఒక్క నిమిషం కూడా వృథా చేయలేదు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ, సౌకర్యంగా ఉండే ఇల్లు అద్దెకు తీసుకునే స్థాయికి ఎదిగారు.

పట్టుదలతో ముందడుగు..
జ్యోతిబా ఫూలే స్కీమ్‌ కింద 1975లో 50,000 రూపాయల ప్రభుత్వ సహాయం అందింది. ఆ డబ్బుతో క్లాత్‌ బొటిక్‌ ప్రారంభించారు. పాత వస్తువుల విక్రయం కూడా ప్రారంభించారు. క్రమశిక్షణ, దీక్ష, పట్టుదలతో... వేసిన ప్రతి అడుగులోను విజయం సాధించి, ‘సుశిక్షిత్‌ బేరాజ్‌గార్‌ యువక్‌ సంఘటన’ ప్రారంభించారు. ఈ సంస్థ ద్వారా సుమారు మూడు వేల మందికి ఉద్యోగాలు లభించాయి. ఇప్పుడు ఈ సంస్థలో కల్పనా సరోజ్‌కు పదకొండు మంది సహాయకులుగా పనిచేస్తున్నారు. ‘‘నా వయసు 20 సంవత్సరాలే అయినప్పటికీ అందరూ ఎంతో ఆప్యాయంగా, అభిమానంగా నన్ను తాయీ (పెద్దక్క) అని పిలుస్తున్నారు’’ అంటున్న కల్పనా సరోజ్‌ సౌకర్యవంతమైన జీవితంలోకి అడుగుపెట్టారు. రెండు దశాబ్దాల తరవాతే మరో విజయవంతమైన అడుగు వేయగలిగారు.
 
చైర్‌ పర్సన్‌గా...
1995లో లిటిగేషన్‌లో ఉన్న స్థలం కొన్నారు. ‘‘నాకు స్థలాల గురించి తెలియకపోవటంతో మోసపోయాను. కలెక్టర్‌ సహకారంతో ఆ స్థలాన్ని డెవలప్‌మెంట్‌కి ఇవ్వగలిగాను’’ అంటున్న కల్పనా సరోజ్, ఆ స్థలంతోనే రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ఎవ్వరూ ఊహించనంత ముందుకు దూసుకుపోయారు. నాలుగుకోట్ల టర్నోవర్‌ స్థాయికి ఎదిగారు. పది సంవత్సరాలుగా మూతబడిన కమానీ ట్యూబ్స్‌ కంపెనీకి చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టి, కంపెనీని లాభాల బాట పట్టించి, రెండు వేల కోట్ల టర్నోవర్‌ స్థాయికి ఎదిగారు. ఒక బట్టల దుకాణంలో నెలకు అరవై రూపాయల జీతంతో ఒక హెల్పర్‌గా తన జీవితాన్ని ప్రారంభించిన దళిత మహిళ నేడు ఐదు వేల చదరపు అడుగుల ఇంట్లో దర్జాగా నివసిస్తున్నారు. ఇప్పుడు కల్పనా సరోజ్‌ వయసు ఆరు పదులు దాటింది. హాయిగా రిటైర్మెంట్‌ తీసుకుని ఊపిరి పీల్చుకుంటున్నారనుకుంటే పొరపాటే. హోటల్‌ రంగంలోకి అడుగు పెడుతున్నారు. 


మంచి కుటుంబం..
కల్పనా పునర్వివాహం చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు, కుమార్తె సీమా హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు చేశారు, అబ్బాయి అమర్‌ కమర్షియల్‌ పైలట్‌. భర్త కాలం చేశారు. ఇప్పుడామె భారతీయ మహిళా బ్యాంక్‌ డైరెక్టర్‌గా సేవలు అందిస్తున్నారు. ఎన్నో కడగండ్ల తర్వాత తన రెండో జీవితాన్ని ప్రారంభించి, విజయాలు సాధించి బెస్ట్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌గా నిరూపించుకుని పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement