Indian entrepreneurs
-
Poonam Gupta: వ్యాపారాన్ని ఫైల్ చేసింది!
సాధారణంగా చదువు అయి΄ోగానే వెంటనే ఉద్యోగ వేటలో పడతారు చాలామంది. మంచి ఉద్యోగం కోసం వెతికి వెతికి చివరికి చిన్నపాటి జాబ్ దొరికినా చేరి΄ోతారు. కొంతమంది మాత్రం తాము కోరుకున్న దానికోసం ఎంత సమయం అయినా ప్రయత్నిస్తూనే ఉంటారు. వీరందరిలాగే ప్రయత్నించింది పూనమ్ గుప్తా. కానీ ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. దీంతో తనే ఒక వ్యాపారాన్నిప్రారంభించి వందలమందికి ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదిగింది. సమస్య ఏదైనా నిశితంగా ఆలోచిస్తే ఇట్టే పరిష్కారం దొరుకుతుందనడానికి పూనమ్ గుప్తానే ఉదాహరణగా నిలుస్తోంది. ఢిల్లీకి చెందిన ఓ వ్యాపార కుటుంబంలో పుట్టింది పూనమ్ గుప్తా. లేడీ శ్రీరామ్ కాలేజీలో ఎకనమిక్స్‌తో డిగ్రీ పూర్తి చేసిన పూనమ్.. తరువాత ఎమ్బీఏ చేసింది. చదువు అయిన వెంటనే ఉద్యోగాన్వేషణప్రారంభించింది. ఎంత ప్రయత్నించినా ఎక్కడా ఉద్యోగం రాలేదు. ఇలా జాబ్ ప్రయత్నాల్లో ఉండగానే... 2002లో పునీత్ గుప్తాతో వివాహం జరిగింది. పునీత్ స్కాట్లాండ్లో స్థిరపడడంతో పూనమ్ కూడా భర్తతో అక్కడికే వెళ్లింది. పెళ్లి అయినా.. దేశం మారినా పూనమ్ మాత్రం ఉద్యోగ ప్రయత్నాన్ని మానుకోలేదు. ఎలాగైనా జాబ్ చేయాలన్న కోరికతో అక్కడ కూడా ఉద్యోగం కోసం కాళ్లు అరిగేలా తిరిగింది. అనుభవం లేదని ఒక్కరూ ఉద్యోగం ఇవ్వలేదు. స్కాట్లాండ్లో అయినా జాబ్ దొరుకుతుందనుకున్న ఆశ నిరాశగా మారింది. అలా వచ్చిన ఆలోచనే... ఉద్యోగం కోసం వివిధ ఆఫీసులకు వెళ్లిన పూనమ్‌కు.. అక్కడ కట్టలు కట్టలుగా పేర్చిన ఫైళ్లు కనిపించేవి. ఉద్యోగం దొరకక సొంతంగా ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఆ ఫైళ్లను రీసైక్లింగ్ చేయవచ్చు గదా. అన్న ఐడియా వచ్చింది. పేపర్‌ను రీసైక్లింగ్ ఎలా చేయాలి, ఈ వ్యాపారంలో ఎదురయ్యే సవాళ్లను క్షుణ్ణంగా తెలుసుకుని కంపెనీ పెట్టాలని నిర్ణయించుకుంది. స్కాటిష్ ప్రభుత్వం ఓ పథకం కింద ఇచ్చిన లక్షరూపాయల రుణంతో 2003లో ‘పీజీ పేపర్ కంపెనీ లిమిటెడ్’ కంపెనీని పెట్టింది.ప్రారంభంలో యూరప్, అమెరికాల నుంచి పేపర్ వ్యర్థాలను కొని రీసైక్లింగ్ చేసేది. రీసైక్లింగ్ అయిన తరువాత నాణ్యమైన పేపర్‌ను తయారు చేసి విక్రయించడమే పూనమ్ వ్యాపారం. ఏడాదికేడాది టర్నోవర్‌ను పెంచుకుంటూ కంపెనీ విలువ ఎనిమిది వందల కోట్లకు పైకి చేరింది. ప్రస్తుతం అరవై దేశాల్లో పీజీ పేపర్స్ వ్యాపారాన్ని విస్తరించింది. అమెరికా, చైనా, ఇండియా, ఈజిప్టు, స్వీడన్లలో సొంతకార్యాలయాలు ఉన్నాయి. పూనమ్‌కు అండగా... పీజీ పేపర్స్‌ని పూనమ్ ప్రారంభించిన రెండేళ్లకు భర్త పునీత్‌గుప్తా కూడా ఎనభై లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలేసి కంపెనీలో చే రారు. భార్యాభర్తలు ఇద్దరు కలిసి వ్యాపారాభివృద్ధికి కృషిచేశారు. దీంతో అనతి కాలంలోనే పీజీ పేపర్స్ ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపుని తెచ్చుకుంది. పేపర్ ట్రేడింగ్ కంపెనీతోపాటు డెంటల్ హెల్త్ వంటి వ్యాపారాల్లోనూ పూనమ్ రాణిస్తోంది. అందరూ అదర్శమే... ‘‘నాకు చాలామంది రోల్ మోడల్స్ ఉన్నారు. ఒక్కోక్కరి నుంచి ఒక్కో విషయాన్ని నేర్చుకుని ఈ స్థాయికి ఎదిగాను. నాన్న, మామయ్య, టీచర్స్ నన్ను చాలా ప్రభావితం చేశారు. పెద్దయ్యాక మదర్ థెరిసా, ఇందిరా గాంధీ వంటి వారు మహిళలు ఏదైనా చేయగలరని నిరూపించి చూపించారు. వీరిని ఆదర్శంగా తీసుకుని ధైర్యంగా ముందుకెళ్తూ విజయాలు సాధిస్తున్నాను’’. – పూనమ్ గుప్తా -
హాలిడే ట్రిప్‌కి దుబాయ్ వెళ్లితే..సడెన్‌గా ఆ దేశ అధ్యక్షుడి ఎంట్రీతో..
భారత్‌కి చెందిన ఓ పారిశ్రామికవేత్త కుటుంబం హాలిడే ట్రిప్ కింద దుబాయ్‌కి వెళ్లింది. ఆ కుటుంబం అక్కడ ఎంజాయ్ చేస్తుండగా.. సడెన్‌గా అనుకోకుండా ఆ దేశ అధ్యక్షుడు వారిని కలిస్తే ఎలా ఉంటుంది. ఆ ఊహే చాలా థ్రిల్‌గా ఉంటుంది. నిజమా కలా? అన్నంత కన్ఫ్యూజన్లో ఉంటాం. అలాంటి అనుభూతినే ఈ పారిశ్రామికవేత్త కుటుంబం పొందింది. అసలేం జరిగిందంటే..భారతీయ వ్యాపారవేత్త అనాస్ రెహాన్ జునైద్, అతడి కుటుంబం హాలిడే ట్రిప్‌గా దుబాయ్‌కి వెళ్లారు. ఆ కుటుంబం చక్కగా ఎంజాయ్ చేస్తుండగా సడెన్‌గా అనుకోని రీతిలో దుబాయ్ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ అతడి సహచరులని కలిశారు. ఆ కుటుంబం లిప్ట్‌లో వెళ్తుండగా సడెన్‌గా ఈ ఘటన ఎదురవ్వడం విశేషం. వారు వెళ్తున్న అదే లిఫ్ట్‌లోకి ఆ దేశ అధ్యక్షుడు అతని పరివారం వచ్చారు. దీంతో ఆ కుటుంబం ఒక్కసారిగా షాక్‌లో ఉండిపోయింది. సదరు వ్యాపారవేత్త ఆ వ్యక్తి ఎవరో తెలుసా అని తన కూతుర్ని అడిగాడు. అంతేగాదు ఆ అధ్యక్షుడితో ఫోటోలు తీసుకునేందుకు అనుమతి కోరగా..నవ్వుతూ ఫోజులివ్వడమే గాక వారితో కాసేపు ముచ్చటించాడు షేక్. మేము నిజంగా అతన్ని కలుసుకున్నామా ఇది నమ్మలేకపోతున్నాం అంటూ భావోద్వేగానికి గురైంది ఆ కుటుంబం. షేక్‌ని కలిసేలా చేసిని ఆ లిఫ్ట్ తమకు ప్రత్యేకమని, ప్రపంచంలోని అన్ని లిఫ్ట్‌ల కంటే అదే మాకు ఇష్టమని చెప్పారు. ఈ మేరకు పారిశ్రమికవ వేత్త ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లతో పంచుకున్నాడు. దీంతో ఈ ఘటన నెట్టింట వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Anas Rahman Junaid (@a.r.junaid) (చదవండి: గూగుల్ డూడుల్‌లో ఉన్న వ్యక్తి ఎవరు?) -
అద్భుత ఆవిష్కరణకు ఘన గౌరవం
కరోనా మహమ్మారి కల్లోల కాలంలో ప్రపంచమంతా టీకాల కోసం ఎదురుచూపులు చూసింది. ఆ క్లిష్ట పరిస్థితుల్లో ఎన్నో దేశాలకు టీకాల సరఫరాదారుగా భారత్ నిలిచింది. అయితే, పాతికేళ్ల క్రితమే దేశ టీకాల చరిత్రలో సువర్ణాధ్యాయం లిఖించింది శాంతా బయోటెక్ సంస్థ. సంకల్ప బలంతో, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో హెపటైటిస్–బి టీకాను ఆవిష్కరించింది. అది కూడా చవకగా అందజేసింది. దాన్ని సుసాధ్యం చేసింది... ఆ సంస్థ వ్యవస్థాపకులు, దీర్ఘదర్శి, రేపటితో 75వ వసంతంలోకి అడుగిడుతున్న ‘పద్మభూషణ్’ కె.ఐ. వరప్రసాద్‌రెడ్డి. ఈ నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ అవతరణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం... దేశ ప్రగతిలో భాగస్వాములైన ప్రముఖులకు ఇచ్చే ప్రతిష్ఠాత్మక ‘వై.ఎస్.రాజశేఖరరెడ్డి జీవన సాఫల్య పురస్కారం’ ఆయనకు అందించింది. నేడు దేశం స్వాతంత్య్ర అమృతోత్సవాలు జరుపు కొంటోంది. పాతికేళ్ళ క్రితం స్వాతంత్య్ర స్వర్ణోత్సవాలు జరుపుకొంది. ఆ శుభవేళల్లో దేశ బయోటెక్ రంగంలో సువర్ణాక్షరాలుగా లిఖించిన తొలి అధ్యాయం పురుడు పోసుకుంది. తొట్ట తొలిగా పూర్తి స్వదేశీ వ్యాక్సిన్ రూపకల్పన జరిగిన శుభ సంరంభం అది! సుమారు 30 ఏళ్ళ క్రితం దేశంలో హెప టైటిస్–బి అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఎయిడ్స్ కంటే ప్రమాదకారిగా ప్రపంచాన్ని వణికిస్తోంది. జెనీవాలో జరుగుతున్న ఒక సమావేశానికి శాంతా బయోటెక్ వ్యవస్థాపకులు వరప్రసాద్ రెడ్డి హాజరయ్యారు. ఒక ప్రసంగకర్త మన దేశ సామర్థ్యంపై, మన ప్రభుత్వాల ఉదాసీనతపై, మనవారి ప్రతిభపై లోకువగా మాట్లాడారు. మనల్ని బిచ్చగాళ్ళ కింద జమకట్టారు. ఆ నిందను నిర్మూల్యం చేస్తూ అనేక దేశాలకు వ్యాక్సిన్లు పంపే మహోన్నత స్థితికి చేరుకున్నాం. హెపటైటిస్–బి వ్యాక్సిన్ స్ఫూర్తితో శాంతా బయోటెక్నిక్స్ 13 రకాల ఇతర అద్భుతమైన వ్యాక్సి న్లను సృష్టించే స్థాయికి చేరుకుంది. లాభాపేక్ష లేకుండా అతి తక్కువ ధరలో పుట్టిన ప్రతి బిడ్డకు వ్యాక్సిన్‌ను అందించాలన్నది శాంతా బయోటెక్నిక్స్ పెట్టుకున్న నియమం. దానిని సాధించడం ఆషామాషీ కాదు. విదేశాల నుంచి సాంకేతికతను దిగుమతి చేసుకోవడం ఖరీదైన వ్యవహారం. వరప్రసాద్‌రెడ్డి నాన్నగారు కొంత పొలం అమ్మి యిచ్చిన డబ్బుకు తోడు, బంధు వులు, ఆత్మబంధువులు మరి కొంత ఇచ్చారు. అయినా అది సరిపోదు. అదిగో! అప్పుడే యూసఫ్ బిన్ అలావీ అబ్దుల్లా రూపంలో అమృత హస్తం చేయి చాచింది. అది మాజీ ప్రధాని పీవీ నర సింహారావు చలువ. వరప్రసాద్ రెడ్డి పడుతున్న కష్టాలను గమనించిన పీవీ ఈ అబ్దుల్లాను పంపారు. అబ్దుల్లా ఒమన్ విదేశీ వ్యవహారాల మంత్రి. హెపటైటిస్–బి వ్యాక్సిన్ అవసరం తెలిసిన వ్యక్తి. తాను పెట్టుబడి పెట్టి, వ్యక్తిగత స్థాయిలో గ్యారంటీగా ఉంటూ బ్యాంక్ రుణాలు తెచ్చి, ఆ యజ్ఞంలో భాగస్వాములయ్యారు. నిర్మాణం చేపట్టే నాటికి సుశిక్షుతులైన శాస్త్ర వేత్తలు లేరు. నిపుణుత, సమర్థత, నిబద్ధత కలిగిన గొప్ప బృందాన్ని సమీకరించుకొని రంగంలోకి దిగింది. అనుమతులకు, అమ్మకాలకు, పంపకాలకు అడుగడుగునా అడ్డంకులే ఎదురయ్యాయి. వ్యాక్సిన్ సామర్థ్యంపై విదేశీ కంపెనీ దుష్ప్రచారం చేసింది. సత్ సంకల్పం కాబట్టి కాలమేఘాలు తొలిగి పోయాయి. శాంతా బయోటెక్ రూపొందించిన వ్యాక్సిన్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. హెపటైటిస్ ఎంతో భయంకరమైన వ్యాధి. వేగంగా మనుషులను నిర్వీర్యులను చేస్తుంది. లివర్ సిరోసిస్ వచ్చి ఆరోగ్యం దెబ్బతింటుంది. కొంత మందిని శవాలుగా మార్చింది, కొంతమందిని జీవ చ్ఛవాలు చేసింది. అందుకే అర్జెంటుగా వ్యాక్సిన్లు తయారు చేసి పుట్టిన ప్రతిబిడ్డకూ వాడాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఘోషించింది. అత్యవసరమే అయినప్పటికీ నాణ్యత, సమర్థతపై అన్ని పరీక్షలూ జరిగి తీరాల్సిందేనన్నది శాంతా సంస్థ పట్టుదల. అన్ని పరీక్షల్లో గెలిచి, నూటికి నూరు శాతం సంపూ ర్ణమైన అర్హత సంపాయించుకున్న తర్వాతే వ్యాక్సి న్లను మార్కెట్లో ప్రవేశపెట్టింది. అలా వరప్రసాద్ రెడ్డి అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. ఈ ప్రయాణంలో, శాంతా సంస్థ అడుగడు గునా మానవత్వాన్ని చాటుకుంది. అది భారత్ నుంచి లాహోర్‌కు సుహృద్భావ యాత్రగా బస్సు వేసే చారిత్రక సందర్భం. ఆ బస్సు కంటే హెప టైటిస్ వ్యాక్సిన్లే మాకు ముఖ్యమని పాకిస్తాన్ వేడు కుంది. ఆ సందర్భంలో ప్రధానమంత్రి కార్యా లయం శాంతా బయోటెక్నిక్స్‌ను సంప్రదించింది. మానవీయ కోణంతో మిలియన్ వ్యాక్సిన్లను శాంతా సంస్థ ప్రధాన మంత్రి కార్యాలయం ద్వారా పాకి స్తాన్‌కు ఉచితంగా అందించి మానవత్వాన్ని చాటు కుంది. భారతీయ ఖ్యాతిని, ఆత్మను నిలబెట్టింది. యునిసెఫ్ విషయంలోనూ ఎంతో ఉదారాన్ని చూపించింది. యితఃపూర్వం ఒక్కొక్క వ్యాక్సిన్ 18 డాలర్లకు కొనుగోలు చేసే యునిసెఫ్‌కు కేవలం 23 సెంట్లకే అందజేసింది. ‘శాంతా’ చూపిన ఈ విత రణశీలత వల్ల యునిసెఫ్ ప్రపంచంలోని ఎన్నో పేద దేశాలకు ఉచితంగా హెపటైటిస్ వ్యాక్సిన్లు అందించి పుణ్యం మూట గట్టుకుంది. శాంతా బయోటెక్నిక్స్ వేసిన తొలి అడుగు అతి పెద్దది, అతి గొప్పది. అతి తక్కువ ధరకే వ్యాకిన్ అందించిన ప్రభావంతో మార్కెట్లో వ్యాక్సిన్ ధరలు 40వ వంతుకు పడిపోయాయి. అనేక బహుళజాతి సంస్థలు శాంతా సంస్థవైపు చూడడం మొదలుపెట్టాయి. ఆ తర్వాత బయోటెక్ రంగంలో ఎన్నో కంపెనీలు పుట్టుకొచ్చాయి. వీటన్నిటికి స్ఫూర్తిగా నిలిచి తొలి గవాక్షం తెరిచింది మాత్రం శాంతా బయోటెక్నిక్స్ అన్నది మరువ రానిది. - మాశర్మ, వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్, కాలమిస్ట్ జీవితం దేవుడిచ్చిన వరం. ఆ వరాన్ని సంపూర్ణంగా సద్వినియోగం చేసుకొని, ఆ జీవన సాఫల్యాన్ని తృప్తిగా ఆస్వాదిస్తూ, తోటివారికి తోడు పడుతూ జీవిత పరీక్షలో కృతార్థులమయ్యా మని చెప్పగల ఆత్మవిశ్వాస సంపన్నులు అరుదు. అలాంటి అరుదైన వ్యక్తులలో ఒకరు తెలుగుతేజం డాక్టర్ కోడూరి ఈశ్వర వరప్రసాద్ రెడ్డి. జన్మనిచ్చిన తల్లిదండ్రులు శాంతమ్మ, వెంకట రమణారెడ్డి గార్లనే కాదు – అక్షర భిక్ష పెట్టిన గురువులను కూడా విస్మరించని సంస్కార వంతుడు వరప్రసాద్ రెడ్డి. మాతృమూర్తి పేరు తోనే ‘శాంతా బయోటెక్’ను నెలకొల్పారు. చాగంటి వారి వ్యాఖ్యానంతో బాపు బొమ్మలతో ‘మాతృ వందనం’ అనే పుస్తక ప్రచురణతో పాటు, రెండు దశాబ్దాలుగా ప్రతి సంవత్సరం ‘మాతృ వందనం’ కార్యక్రమం జరుపుతున్నారు. కొంత మంది లబ్ద ప్రతిష్ఠుల మాతృమూర్తులను సత్క రించడం, ఒక వేద పండితుణ్ని సన్మానించి ఆధ్యా త్మిక ప్రవచనం ఏర్పాటు చెయ్యడం, రెండు ఆసుపత్రులలో నిత్యాన్నదానాలను నిర్వహించడం మొదలైనవి ఆయన అపారమైన మాతృభక్తికి నిదర్శనాలు. ‘తల్లీ నిన్ను దలంచి’, ‘తండ్రీ నిన్ను దలంచి’, ‘తండ్రి పరమ పూజ్యుడు’, ‘అమ్మకు జేజే నాన్నకు జేజే గురువుకు జేజే’ వంటి పుస్తకాలను వెలువరించి జననీ జనకులకు ఎంతటి ఉన్నత స్థానమివ్వాలో ఆచరణాత్మకంగా సూచించారు. సమాజ వికాసానికి విద్య గీటురాయి అని వరప్రసాద్ విశ్వాసం. ఆ అభిప్రాయంతోనే అనేక విద్యా సంస్థలను పోషిస్తున్నారు. తను చదువు కొన్న నేలబడి మొదలుకొని కాకినాడ ఇంజనీరింగ్ కళాశాల వరకు – అన్నిటికీ భవన నిర్మాణాలకు విరాళాలనిచ్చారు. తన ఉన్నతికి కారకులైన గురు వులనెందరినో సత్కరించారు. మద్రాసులోని కేసరి పాఠశాల, నటుడు మోహన్‌బాబు విద్యా నికేతన్, సరస్వతీ విద్యాలయ శాఖలు... ఇలా ఎన్నో విద్యా సంస్థలకు కోట్ల కొలది రూపాయ లను విరాళాలుగా ఇచ్చారు. 6 విద్యా సంస్థ లలో ఉత్తమ విద్యార్థు లకు ఏటేటా శాంతమ్మ గారి పేర స్వర్ణ పతకా లను బహూకరిస్తున్నారు. అబ్దుల్ కలాం సూచన మేరకు 11 లక్షల మంది విద్యార్థులను తన ఉప న్యాసాలతో ఉత్తేజితుల్ని చెయ్యడం, ‘ఫోకస్’ సంస్థకు బాసటగా నిలిచి యువ ఉద్యోగులకు నీతి నిజాయితీల విలువను చాటడం – విద్య పట్ల ఆయన ఆసక్తికి కొన్ని ఉదాహరణలు. వేద పాఠశాలల నిర్మాణ నిర్వహణలకు ఆర్థిక సహాయం, వేద విద్యార్థులకు ఉపకార వేతనా లివ్వడం, 100 గంటలపాటు వేదాలను రికార్డు చేయడానికి, వేద సంబంధ పుస్తకాలను ప్రచురిం చడానికి చేయూతనివ్వడం – సనాతన ఆర్ష ధర్మం పట్ల ఆయన అభిమానానికి తార్కాణాలు. అనేక దేవాలయాలకు విరాళాలివ్వడమే గాక శ్రీపురం, వేదాద్రిలలోని అన్నదానాలకు భూరి విరాళాలి వ్వడం ఆయన దానధర్మ నిరతికి సాక్ష్యాలు. అనేక అనాథాశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు నిధులివ్వడం, కేన్సర్ బారినపడి చివరి మజిలీకి చేరువవుతున్న అభాగ్యులకు ‘స్పర్శ’ వంటి సంస్థల ద్వారా ప్రశాంతతను చేకూర్చడం ఆయన మానవతా దృష్టికి మచ్చు తునకలు. వైద్యులకు, నర్సులకు శిక్షణనిచ్చే ‘పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్’, కార్నియాపై పరిశోధనలకు ఊతమిచ్చిన ఎల్.వి. ప్రసాద్ కంటి ఆసుపత్రి మొదలైన వైద్య సంస్థలకు సహకారం, వికలాంగులకు బధిరాంధులకు ఉపకరణాలు సమకూర్చడం అభినందనీయం. చిన్నతనం నుండి వరప్రసాద్ రెడ్డికి సంగీత సాహిత్యాలంటే మక్కువ. శ్రావ్యమైన పాటలను బాల్యం నుంచి పదిలపరచుకొనే అలవాటున్న ఆ రస పిపాసి అనేక మ్యూజిక్ ఆల్బమ్స్‌ను రూపొం దించారు. హాసం, శాంత–వసంత ట్రస్ట్ ప్రచుర ణలుగా శతాధిక గ్రంథాలను ప్రచురించారు. మరి కొన్నిటికి ఆర్థిక సహాయం చేశారు. మిత్రులు ఎంబీఎస్ ప్రసాద్ సంపాదకులుగా హాస్య సాహి త్యాలకు పెద్ద పీట వేస్తూ మూడేళ్లకు పైగా ‘హాసం’ పత్రికను నడిపారు. డా.సి. నారాయణ రెడ్డి, ముళ్లపూడి వెంకటరమణ, రావి కొండల రావు, తనికెళ్ల భరణి వంటి రచయితల రచనలతో పాటు సుమారు 50 పుస్తకాలను ప్రచురించారు. స్వయంగా ‘మనసు పలికే...’, ‘పరిణత వాణి’ వంటి పుస్తక రచనలు చేశారు. ప్రతి మగాడి విజయం వెనుక ఓ స్త్రీ ఉంటుం దన్న సామెతగా ఆయన నిస్వార్థ సేవకు సర్వదా సానుకూలంగా సహకరిస్తున్న వసంత ధర్మ పత్నిగా లభించడం ఆయన అదృష్టం. ‘పద్మ భూషణ్’ నుంచి తాజాగా వైఎస్సార్ జీవన సాఫల్య పురస్కారం వరకు వందల పురస్కారాలు అందుకొన్న వరప్రసాద్ సార్థక నామధేయులు. డా పైడిపాల, వ్యాసకర్త రచయిత, సినీ పరిశోధకుడు (రేపు డా‘‘ వరప్రసాద్ రెడ్డి 75వ జన్మదినోత్సవం) -
Divya Gokulnath: ఆన్లైన్ టీచర్
టీచర్ కావాలన్నది ఆమె ఆశయం. అదొక్కటే కాదు, జీవితంలో ఎన్నో సాధించాలనుకున్నారు. విదేశాలకు వెళ్లే అవకాశాలు వెదుక్కుంటూ వచ్చినా వెళ్లలేదు. తన సొంత దేశస్థులకు ఏదో ఒకటి చేయాలని కలలు కన్నారు. అలా కన్న కలలను సాకారం చేసుకున్నారు. బైజూస్ కో ఫౌండర్ అయ్యారు. ఆన్లైన్ పాఠాలు అందుబాటులోకి తీసుకువచ్చారు. శక్తిమంతమైన ఎంట్ర్‌ప్రెన్యూర్‌గా ఎదిగారు బెంగళూరుకు చెందిన దివ్య గోకుల్‌నాథ్. భారతదేశంలోనే అతి పెద్ద ఎడ్ – టెక్ కంపెనీ బైజూస్. ఈ యాప్‌కి ఎన భై మిలియన్ల సబ్స్క్రయిబర్లు ఉన్నారు. ఏడాదిన్నరగా పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి సమయంలో ‘బైజూస్’ టీమ్ కొత్త కొత్త ప్రోడక్ట్స్‌ని తీసుకు వచ్చింది. ఉద్యోగులంతా వేరు వేరు ప్రాంతాలలో ఉంటూ ఈ ఏడాది కాలంలో పనులు చేస్తూ ఎన్నో విజయాలు సాధించేలా చేశారు ఈ సంస్థ కో ఫౌండర్ దివ్య గోకుల్‌నాథ్. విద్యార్థిగా చేరి... బైజూస్‌లో ఒక స్టూడెంట్‌గా చేరి కో ఫౌండర్ స్థాయికి ఎదిగారు. తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే అమలు చేయటం వల్ల ఈ అద్భుత విజయం సాధించగలిగారు. చదువుకునే రోజుల్లోనే దివ్య ఆల్‌రౌండర్‌గా ఎదగాలనుకున్నారు. ‘‘నేను బయో టెక్నాలజీ చదువుకునే రోజుల్లో మాకు సరైన అధ్యాపకులు లేకపోవటంతో, చాలా ఇబ్బంది పడ్డాం. ఒకరితో ఒకరు చర్చించుకుంటూ పాఠాలు నేర్చుకునేవాళ్లం. పాఠాలు చెప్పే వారు లేక విద్యార్థులు ఇబ్బంది పడకుండా ఉండేలా ఏదో ఒకటి చేయాలని అప్పుడే ఒక నిశ్చయానికి వచ్చాను’’ అంటారు దివ్య గోకుల్‌నాథ్. టీచర్‌గా మొదటి రోజు.. బైజూలో విద్యార్థిగా చేరి, ఆ తరవాత అక్కడ టీచర్ని అయ్యాను. నేను టీచర్ కావాలనుకున్న నా కల అలా నెరవేరింది. మొదటి రోజు క్లాసు తీసుకున్నప్పుడు క్లాసులో వందమంది విద్యార్థులు ఉన్నారు. వారంతా నా కంటే రెండు మూడు సంవత్సరాలు మాత్రమే చిన్నవారు. నేను టీచర్లా కనిపించటం కోసం ఆ రోజున క్లాసుకి చీర కట్టుకుని వెళ్లాను. అప్పుడు నా వయసు 21 సంవత్సరాలు. ఆ రోజు పాఠం చెబుతుంటే ఎంతో సంతృప్తిగా అనిపించింది’ అంటారు దివ్య టీచర్‌గా తన మొదటి అనుభవం గురించి. విదేశాలలో పెద్దపెద్ద విశ్వవిద్యాలయాలలో చదువుకోవటానికి వచ్చిన అవకాశాన్ని వదులుకున్నారు. ఇంజినీరింగ్ చదివేటప్పుడు బయోటెక్నాలజీ చెప్పడానికి అనుభవజ్ఞులైన అధ్యాపకులు లేకపోవటంతో పడిన ఇబ్బందులను దివ్య గోకుల్‌నాథ్ మరచిపోలేదు. తనలా ఏ ఒక్క విద్యార్థి ఇబ్బంది పడకూడదనుకున్నారు. ‘ఆఫ్‌లైన్ టెస్ట్ ప్రిపరేషన్ క్లాసులు మానేసి, ఆన్లైన్ క్లాసులను దేశంలోని మారుమూలలకు సైతం తీసుకువెళ్లాలని మా బైజులో నిర్ణయించుకున్నాం. ఆ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం. 2015లో యాప్ లాంచ్ చేశాం. ఇందులో ర్యాంకులు, క్లాసులో టాపర్లు వంటివి ఉండవు. ఇందులో విజయం సాధించగలమని, మా ప్రోడక్టు మీద మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. అన్నింటికీ మించి కుటుంబ సభ్యుల సంపూర్ణ మద్దతు ఉంది’’ అంటారు దివ్య గోకుల్‌నాథ్. చిత్తశుద్ధి ఉండాలి.. స్టార్టప్‌లకు కావలసింది చిత్తశుద్ధి. ఏ స్టార్టప్ అయినా, కస్టమర్‌కి చాలా వేగంగా స్పందించడం ముఖ్యం. తొలిదశలో ఎంతమంది ఆదరిస్తున్నారనేది కాదు. పనిలో శ్రద్ధ చూపిస్తే విజయం దానంతట అదే నడుచుకుంటూ వస్తుంది. ఒక నిర్ణయం తీసుకోవటం, ఆచరణలో పెట్టడం వెంట వెంటనే జరిగి పోవాలి. ఆలస్యం చేస్తే నిరుపయోగం.. అని నమ్ముతారు దివ్య గోకుల్‌నాథ్. ‘‘నేను, బైజు... మా ఇద్దరి దార్శనికత, ప్రాధాన్యతలు ఒకేలా ఉంటాయి. మా విజయం వెనుక ప్లేబుక్ ఏమీ లేదు. ఈ పాండమిక్ సమయంలో, కేవలం ఆరు మాసాల వ్యవధిలో సుమారు 35 మిలియన్ల మంది మా యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. ఇప్పుడు మా దగ్గర 80 మిలియన్ల మంది లెర్నర్స్ ఉన్నారు. మేం ఒక్కో అడుగు ఎదుగుతున్నాం’’ అంటూ తమ విజయం గురించి చెబుతారు దివ్య గోకుల్‌నాథ్. ఎన్నో ఆశయాలు, ఆలోచనతో కృషి చేస్తున్న దివ్య గోకుల్‌నాథ్... భారతదేశంలోనే కాకుండా విదేశాలకు కూడా తమ సేవలు విస్తరించాలనుకుంటున్నారు. -
కల్పనా సరోజ్.. జీవితమే ఒక పోరాటం
ఆమె ఒక బాల కార్మికురాలు.. నెలకు 60 రూపాయలు ఆమె ఆదాయం. చిన్నతనంలోనే వివాహం చేశారు.. అత్తింట్లో నరకం చూశారు. తర్వాత స్వయంకృషితో ముళ్ల బాటలాంటి తన జీవితాన్ని పూల రథం చేసుకున్నారు.. ఐదు వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధినేత్రి అయ్యారు. ఆమె కల్పనాసరోజ్. కల్పనా సరోజ్ ఆరు కంపెనీలకు అధినేత్రి. ఆరు వందల మందికి ఉపాధి కల్పించారు. ఇంత స్థాయికి ఎదగడానికి ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్నారు. ‘‘నేను 1958లో మహారాష్ట్ర అకోలా జిల్లాలో మధ్యతరగతి కుటుంబంలో పుట్టాను. మా నాన్నగారు పోలీస్ కానిస్టేబుల్. నాకు ఇద్దరు తమ్ముళ్లు, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. ‘నాది బాల్య వివాహం’’ అంటూ తన గురించి చెబుతారు కల్పనా సరోజ్. ఏడో తరగతి పూర్తి కాగానే కల్పనా సరోజ్‌కు వివాహం చేసేశారు. ఆమె తన భర్తతో కలిసి థానేలోని ఉల్హాన్స్ నగర్ అనే మురికివాడలోని ఒక చిన్నగదిలో, పదిహేను మంది మధ్యన అడుగు పెట్టారు. అయితే అక్కడి వాతావరణంలో ఇమడలేకపోయిన కల్పనా సరోజ్, తండ్రితో కలిసి తిరిగి పుట్టింటికి వచ్చేశారు. మొదటి వంద నోటు... స్వగ్రామానికి వచ్చిన తరవాత తల్లిదండ్రులను ఒప్పించి ముంబైలో బంధువుల ఇంట్లో ఉంటూ, ఒక బట్టల దుకాణంలో నెలకు అరవై రూపాయల జీతానికి ఉద్యోగంలో చేరారు. బట్టలు కుట్టటం నేర్చుకుని, అదనంగా నెలకు వంద రూపాయలు సంపాదించటం ప్రారంభించారు. ‘‘నా జీవితం లో మొట్టమొదటిసారి వంద రూపాయల నోటు చూశాను’’ అంటూ ఆనందంగా చెబుతున్న కల్పనా సరోజ్, ఆ రోజు నుంచి ఒక్క నిమిషం కూడా వృథా చేయలేదు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ, సౌకర్యంగా ఉండే ఇల్లు అద్దెకు తీసుకునే స్థాయికి ఎదిగారు. పట్టుదలతో ముందడుగు.. జ్యోతిబా ఫూలే స్కీమ్ కింద 1975లో 50,000 రూపాయల ప్రభుత్వ సహాయం అందింది. ఆ డబ్బుతో క్లాత్ బొటిక్ ప్రారంభించారు. పాత వస్తువుల విక్రయం కూడా ప్రారంభించారు. క్రమశిక్షణ, దీక్ష, పట్టుదలతో... వేసిన ప్రతి అడుగులోను విజయం సాధించి, ‘సుశిక్షిత్ బేరాజ్‌గార్ యువక్ సంఘటన’ ప్రారంభించారు. ఈ సంస్థ ద్వారా సుమారు మూడు వేల మందికి ఉద్యోగాలు లభించాయి. ఇప్పుడు ఈ సంస్థలో కల్పనా సరోజ్‌కు పదకొండు మంది సహాయకులుగా పనిచేస్తున్నారు. ‘‘నా వయసు 20 సంవత్సరాలే అయినప్పటికీ అందరూ ఎంతో ఆప్యాయంగా, అభిమానంగా నన్ను తాయీ (పెద్దక్క) అని పిలుస్తున్నారు’’ అంటున్న కల్పనా సరోజ్ సౌకర్యవంతమైన జీవితంలోకి అడుగుపెట్టారు. రెండు దశాబ్దాల తరవాతే మరో విజయవంతమైన అడుగు వేయగలిగారు. చైర్ పర్సన్‌గా... 1995లో లిటిగేషన్లో ఉన్న స్థలం కొన్నారు. ‘‘నాకు స్థలాల గురించి తెలియకపోవటంతో మోసపోయాను. కలెక్టర్ సహకారంతో ఆ స్థలాన్ని డెవలప్మెంట్కి ఇవ్వగలిగాను’’ అంటున్న కల్పనా సరోజ్, ఆ స్థలంతోనే రియల్ ఎస్టేట్ రంగంలో ఎవ్వరూ ఊహించనంత ముందుకు దూసుకుపోయారు. నాలుగుకోట్ల టర్నోవర్ స్థాయికి ఎదిగారు. పది సంవత్సరాలుగా మూతబడిన కమానీ ట్యూబ్స్ కంపెనీకి చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టి, కంపెనీని లాభాల బాట పట్టించి, రెండు వేల కోట్ల టర్నోవర్ స్థాయికి ఎదిగారు. ఒక బట్టల దుకాణంలో నెలకు అరవై రూపాయల జీతంతో ఒక హెల్పర్‌గా తన జీవితాన్ని ప్రారంభించిన దళిత మహిళ నేడు ఐదు వేల చదరపు అడుగుల ఇంట్లో దర్జాగా నివసిస్తున్నారు. ఇప్పుడు కల్పనా సరోజ్ వయసు ఆరు పదులు దాటింది. హాయిగా రిటైర్మెంట్ తీసుకుని ఊపిరి పీల్చుకుంటున్నారనుకుంటే పొరపాటే. హోటల్ రంగంలోకి అడుగు పెడుతున్నారు. మంచి కుటుంబం.. కల్పనా పునర్వివాహం చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు, కుమార్తె సీమా హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేశారు, అబ్బాయి అమర్ కమర్షియల్ పైలట్. భర్త కాలం చేశారు. ఇప్పుడామె భారతీయ మహిళా బ్యాంక్ డైరెక్టర్‌గా సేవలు అందిస్తున్నారు. ఎన్నో కడగండ్ల తర్వాత తన రెండో జీవితాన్ని ప్రారంభించి, విజయాలు సాధించి బెస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా నిరూపించుకుని పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. -
దేశీయ ఐటీకి మరో గట్టి షాక్
న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గద్దెనెక్కిన తర్వాత దేశీయ ఐటీ తీవ్ర గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే వర్క్ వీసా నిబంధనల్లో కఠినతరమైన నిబంధనలు తీసుకొచ్చి దేశీయ ఐటీ కంపెనీలకు గట్టిషాకివ్వగా.. తాజాగా అమెరికా ప్రభుత్వం స్టార్టప్ వీసాల అమలును వాయిదావేస్తున్నట్టు ప్రకటించింది. ఈ ప్రకటన దేశీయ ఐటీ, ఇతర ఎంటర్ప్రీన్యూర్లపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ స్టార్టప్ వీసాలను బరాక్ ఒబామా మరికొన్ని రోజుల్లో అధ్యక్షుడిగా పదవి విరమణ చేయబోతున్నారన్న సమయంలో డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యురిటీ ఆమోదించింది. ఈ వీసాల ద్వారా విదేశీ ఎంటర్ప్రీన్యూర్లు అమెరికాలో కంపెనీలు ఏర్పాటుచేసి, అక్కడ నివసించేందుకు అనుమతి ఉంటుంది. సిలికాన్ వ్యాలీ సుదీర్ఘకాల డిమాండ్ అనంతరం ఈ వీసాలకు అమెరికా ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఈ వీసా నిబంధనలు జూలై 17 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. కానీ వీటి అమలును జాప్యం చేస్తున్నట్టు అమెరికా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం దేశీయ ఐటీ ఎంటర్ప్రీన్యూర్లకు తీవ్ర ఆటంకంగా కనిపిస్తోంది. ''ఒకవేళ కంపెనీలని ప్రారంభించి, పెద్ద మొత్తంలో ఉద్యోగాలు కల్పించాలంటే ఇదే ఉత్తమమైన వీసా''అని ఓ ఎంటర్‌ప్రీన్యూర్ చెప్పారు. ఈ వీసా నిబంధనలను మార్చి 14కు వాయిదావేస్తున్నట్టు ట్రంప్ కార్యాలయం పేర్కొంది. నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ 2016 ప్రకారం, అమెరికాకు శరణార్థులుగా వచ్చిన వారే, సగానికి పైగా అమెరికా స్టార్టప్‌లలో వ్యవస్థాపకులుగా ఉన్నారు. ఈ కంపెనీల్లో 70 శాతానికి మేనేజ్మెంట్ లేదా ప్రొడక్ట్ డెవలప్మెంట్ టీమ్‌లలో ఇమ్మిగ్రెంట్లే కీలకవ్యక్తులుగా ఉన్నారు. వీరిలో భారతీయ సంతతికి చెందిన వారు దాదాపు 30 శాతం మంది ఉన్నారు. స్టార్టప్వీసాల అమలును జాప్యం చేస్తున్నట్టు ట్రంప్ ప్రభుత్వం ప్రకటించిన వెంటనే తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది ఓ బ్రైయిన్ డెడ్ పాలసీగా, అమెరికాకు లాస్-లాస్‌గా ఇండియన్-అమెరికన్ టెక్నాలజీ ఎంటర్‌ప్రీన్యూర్ వివేక్ వాద్వా చెప్పారు. ఈ వీసాల వల్ల భారత్‌తో పాటు మిగతా దేశాలు లబ్దిచెందుతున్నాయని పేర్కొన్నారు. అంతేకాక అమెరికా ఆర్థిక వ్యవస్థను విస్తరించవచ్చని చెప్పారు. కానీ ట్రంప్ ప్రభుత్వం అమెరికాలో పోటీతత్వం, ఆర్థికవృద్ధిపై దృష్టికేంద్రీకరించకుండా వలస-వ్యతిరేక గ్రూప్‌లపై ఎక్కువగా ఫోకస్ చేసినట్టు వాద్వా తెలిపారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏఓఎల్ సహవ్యవస్థాపకుడు స్టీవ్ కేసు కూడా ట్వీట్‌చేశారు. స్టార్టప్ వీసా విధానాన్ని వాయిదావేయడం ట్రంప్ ప్రభుత్వం అతిపెద్ద తప్పుఅని, ఇమ్మిగ్రెంట్ ఎంటర్‌ప్రీన్యూర్స్ ఉద్యోగాలను దొంగలించేవారు కాదని, ఉద్యోగాలను సృష్టించేవారని పేర్కొన్నారు.