దేశీయ ఐటీకి మరో గట్టి షాక్
న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గద్దెనెక్కిన తర్వాత దేశీయ ఐటీ తీవ్ర గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే వర్క్ వీసా నిబంధనల్లో కఠినతరమైన నిబంధనలు తీసుకొచ్చి దేశీయ ఐటీ కంపెనీలకు గట్టిషాకివ్వగా.. తాజాగా అమెరికా ప్రభుత్వం స్టార్టప్ వీసాల అమలును వాయిదావేస్తున్నట్టు ప్రకటించింది. ఈ ప్రకటన దేశీయ ఐటీ, ఇతర ఎంటర్‌ప్రీన్యూర్లపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ స్టార్టప్ వీసాలను బరాక్ ఒబామా మరికొన్ని రోజుల్లో అధ్యక్షుడిగా పదవి విరమణ చేయబోతున్నారన్న సమయంలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యురిటీ ఆమోదించింది. ఈ వీసాల ద్వారా విదేశీ ఎంటర్‌ప్రీన్యూర్లు అమెరికాలో కంపెనీలు ఏర్పాటుచేసి, అక్కడ నివసించేందుకు అనుమతి ఉంటుంది. సిలికాన్ వ్యాలీ సుదీర్ఘకాల డిమాండ్ అనంతరం ఈ వీసాలకు అమెరికా ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఈ వీసా నిబంధనలు జూలై 17 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. కానీ వీటి అమలును జాప్యం చేస్తున్నట్టు అమెరికా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం దేశీయ ఐటీ ఎంటర్‌ప్రీన్యూర్లకు తీవ్ర ఆటంకంగా కనిపిస్తోంది. ''ఒకవేళ కంపెనీలని ప్రారంభించి, పెద్ద మొత్తంలో ఉద్యోగాలు కల్పించాలంటే ఇదే ఉత్తమమైన వీసా''అని ఓ ఎంటర్‌ప్రీన్యూర్ చెప్పారు.
ఈ వీసా నిబంధనలను మార్చి 14కు వాయిదావేస్తున్నట్టు ట్రంప్ కార్యాలయం పేర్కొంది. నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ 2016 ప్రకారం, అమెరికాకు శరణార్థులుగా వచ్చిన వారే, సగానికి పైగా అమెరికా స్టార్టప్‌లలో వ్యవస్థాపకులుగా ఉన్నారు. ఈ కంపెనీల్లో 70 శాతానికి మేనేజ్‌మెంట్ లేదా ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ టీమ్‌లలో ఇమ్మిగ్రెంట్లే కీలకవ్యక్తులుగా ఉన్నారు. వీరిలో భారతీయ సంతతికి చెందిన వారు దాదాపు 30 శాతం మంది ఉన్నారు. స్టార్టప్‌వీసాల అమలును జాప్యం చేస్తున్నట్టు ట్రంప్ ప్రభుత్వం ప్రకటించిన వెంటనే తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇది ఓ బ్రైయిన్ డెడ్ పాలసీగా, అమెరికాకు లాస్-లాస్‌గా ఇండియన్-అమెరికన్ టెక్నాలజీ ఎంటర్‌ప్రీన్యూర్ వివేక్ వాద్వా చెప్పారు. ఈ వీసాల వల్ల భారత్‌తో పాటు మిగతా దేశాలు లబ్దిచెందుతున్నాయని పేర్కొన్నారు. అంతేకాక అమెరికా ఆర్థిక వ్యవస్థను విస్తరించవచ్చని చెప్పారు. కానీ ట్రంప్ ప్రభుత్వం అమెరికాలో పోటీతత్వం, ఆర్థికవృద్ధిపై దృష్టికేంద్రీకరించకుండా వలస-వ్యతిరేక గ్రూప్‌లపై ఎక్కువగా ఫోకస్ చేసినట్టు వాద్వా తెలిపారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏఓఎల్ సహవ్యవస్థాపకుడు స్టీవ్ కేసు కూడా ట్వీట్‌చేశారు. స్టార్టప్ వీసా విధానాన్ని వాయిదావేయడం ట్రంప్ ప్రభుత్వం అతిపెద్ద తప్పుఅని, ఇమ్మిగ్రెంట్ ఎంటర్‌ప్రీన్యూర్స్ ఉద్యోగాలను దొంగలించేవారు కాదని, ఉద్యోగాలను సృష్టించేవారని పేర్కొన్నారు.