పుట్టుకలోనే ఆ విధి చిన్న చూపు చూసింది పుట్టాక తల్లిదండ్రులు మరింత అన్యాయం చేశారు. మా కొద్దీ పాప అంటూ చెత్త కుప్పలో పడేశారు. కానీ ఇక్కడే ఆమెకు మరో దారి దొరికింది. ఆ అవకాశాన్ని అందిపుచ్చుని తానేంటో నిరూపించుకుంది. అంతేకాదు గొప్ప లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఆ సాహసం పేరు మాలా పాపాల్కర్. ఇంతకీ ఆమె సాధించిన ఘనత ఏంటి తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.
25 ఏళ్ల క్రితం పుట్టుకతోనే కంటి చూపు లేదని కన్నవారే చెత్తకుప్పలో పడేశారు. మహారాష్ట్రంలోని జల్గావ్ రైల్వే స్టేషన్‌లో చెత్త కుప్పలో చిన్నారిని గమనించిన పోలీసులు స్థానిక రిమాండ్ హోంకు తరలించారు. అక్కడి నుంచి 270 కిలోమీటర్ల దూరం ఉన్న చెవిటి, అంధుల కోసం మెరుగైన సౌకర్యాలతో ఉండే సామాజిక కార్యకర్త శంకర్‌బాబా పాపల్కర్ అనాథాశ్రమంలో చేర్చారు. శంకర్‌బాబా బాలిక సంరక్షణకు ఏర్పాట్లు చేశారు. ఆశ్రమంలోనే అమ్మాయి బ్రెయిలీ లిపిలో చదువుకునే అవకాశం కలిగింది. తోటివారు గర్వపడేలా సత్తా చాటుకుంది.
పద్మశ్రీ అవార్డ్ గ్రహిత శంకర్ బాబా పాపల్కర్ ఆ చిన్నారికి తన ఇంటి పేరు కలిపి మాలా శంకర్ బాబా పాపల్కర్ అని పేరు పెట్టడం మరో విశేషం. అంతే మాలా పట్టుదలగా ఎదిగింది. తాజాగా (మే 16న ) విడుదలైన మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (MPSC) ఫలితాల్లో మాలా ర్యాంక్ సాధించింది. ముంబై సెక్రటేరియట్ లో క్లర్క్ కం టైపిస్ట్ ఉద్యోగాన్ని దక్కించుకుంది.
‘‘నన్ను రక్షించి, ఈ రోజు ఈ పరిస్థితికి తీసుకురావడానికే దేవుడు దేవదూతలను పంపించాడని, ఇక్కడితో తాను ఆగనని యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతానని IAS అవడమే తన లక్ష్యం’ అని మాలా చెప్తుతోంది. తన విజయానికి శంకర్ బాబా పాపల్కర్, యూనిక్ అకాడమీ అమరావతి ప్రొఫెసర్ అమోల్ పాటిల్, ప్రకాష్ టోప్లే కారణమంటూ వారికి కృతజ్ఞతలు తెలిపింది.
2018లో అమరావతి యూనివర్శిటీ నుండి గ్రాడ్యుయేషన్ , ప్రభుత్వ విదర్భ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ హ్యుమానిటీస్ నుండి ఆర్ట్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది మాలా. బ్రెయిలీ లీపి, రైటర్ సహాయంతో పరీక్షలుకు హాజరయ్యేది. ఎడ్యుకేషన్‌కు సంబంధించి దర్యాపూర్‌కు చెందిన ప్రొఫెసర్ ప్రకాష్ తోప్లే పాటిల్ దత్తత తీసుకున్నారని శంకర్‌బాబా వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment