Kalpana Saroj
-
12 ఏళ్లకే పెళ్లి, అత్తింటి వేధింపులు.. నేడు వందల కోట్ల సంపదకు..
Success Story Of Kalpana Saroj: చిన్నతనం నుంచే ఎన్నెన్నో కష్టాలు ఎదుర్కొని నేడు ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన విజయవంతమైన వ్యాపారవేత్తల్లో ఒకరు 'కల్పనా సరోజ్' (Kalpana Saroj). 12 సంవత్సరాల వయసుకే పెళ్లి చేసుకుని అత్తింటి వేధింపులు పడలేక చనిపోవాలనుకున్న మహిళ ఈ రోజు వందల కోట్ల సామ్రాజ్యానికి అధినేత్రి. ఈమె గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 1961లో మహారాష్ట్రలోని అకోలాలోని రోపర్ఖేడా గ్రామంలో జన్మించిన 'కల్పనా సరోజ్' తండ్రి పోలీస్ కానిస్టేబుల్. ఈమెకు 12 సంవత్సరాల వయసులోనే పెళ్లి చేశారు. వివాహం తరువాత ఆమె భర్త కుటుంబంతో ముంబైలోని ఒక మురికివాడలో నివసించింది. అత్తింటి వేధింపులు ఎక్కువయ్యాయి. ఆ తరువాత భర్తను విడిచి పుట్టింటికి వెళ్ళింది. కష్టాలు భరించలేక ఆత్మహత్యాయత్నం చేసింది. అది కూడా విఫమైంది. ఆ తరువాత వారి బంధువుల ఇంట్లో ఉంటూ నెలకు రూ. 60 జీతానికి ఒక సంస్థలో చేరింది. ఆ తరువాత అదనంగా రూ. 100 సంపాదించడం ప్రారంభించింది. ఆ తరువాత పట్టు వదలకుండా నిరంతరం శ్రమిస్తూనే ఉంది. ప్రభుత్వ సాయంతో రూ.50,000 పొంది సొంతంగా బొటిక్ ప్రారంభించింది. ఆ తరువాత KS ఫిల్మ్ ప్రొడక్షన్ అనే నిర్మాణ సంస్థను స్థాపించింది. పరిచయాలను ఏర్పరచుకోవడం ద్వారా, ఆమె రియల్ ఎస్టేట్ సంస్థను పెంచుకుంటూ 'కమానీ ట్యూబ్స్'ప్రారంభించింది. ఇదీ చదవండి: పద్మజ కుమారి పర్మార్.. రాజవంశంలో పుట్టింది మరి.. అలాంటి బుద్ధులే వస్తాయి! కమనీ ట్యూబ్స్.. ప్రారంభంలో కమనీ ట్యూబ్స్ గణనీయమైన నష్టాలను చవిచూసినప్పటికీ, కల్పనా సరోజ్ తెలివితేటలతో లాభాల బాట పట్టించింది. ప్రస్తుతం ఈ సంస్థ రూ.100 కోట్లకు పైగా ఆదాయం తెచ్చిపెడుతోంది. అంతే కాకుండా ఈమె ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ బెంగుళూరు బోర్డ్ ఆఫ్ గవర్నర్స్‌లో సభ్యురాలు కూడా. కల్పనా సరోజ్ ఆస్తులు విలువ 112 మిలియన్ డాలర్లు. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం దాదాపు రూ. 930 కోట్లు కంటే ఎక్కువని సమాచారం. ఎన్నో కష్టనష్టాలు చవిచూసి మిలినియర్ స్థాయికి చేరి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచినా ఈమెను 'నిజమైన స్లమ్‌డాగ్ మిలియనీర్' అని పిలుస్తారు. కల్పనా సరోజ్ 2013లో భారత అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ పొందింది. అంతే కాకుండా ఈమె భారతీయ మహిళా బ్యాంక్ డైరెక్టర్ల బోర్డులో ఒకరుగా ఉన్నారు. కేవలం రోజుకు రూ. 2 సంపాదించే స్థాయి నుంచి వందలమందికి ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదిగింది అంటే నిజంగా చాలా గొప్ప విషయం. ఈమె ప్రతి మహిళకు ఆదర్శనీయమనే చెప్పాలి. -
కల్పనా సరోజ్.. జీవితమే ఒక పోరాటం
ఆమె ఒక బాల కార్మికురాలు.. నెలకు 60 రూపాయలు ఆమె ఆదాయం. చిన్నతనంలోనే వివాహం చేశారు.. అత్తింట్లో నరకం చూశారు. తర్వాత స్వయంకృషితో ముళ్ల బాటలాంటి తన జీవితాన్ని పూల రథం చేసుకున్నారు.. ఐదు వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధినేత్రి అయ్యారు. ఆమె కల్పనాసరోజ్. కల్పనా సరోజ్ ఆరు కంపెనీలకు అధినేత్రి. ఆరు వందల మందికి ఉపాధి కల్పించారు. ఇంత స్థాయికి ఎదగడానికి ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్నారు. ‘‘నేను 1958లో మహారాష్ట్ర అకోలా జిల్లాలో మధ్యతరగతి కుటుంబంలో పుట్టాను. మా నాన్నగారు పోలీస్ కానిస్టేబుల్. నాకు ఇద్దరు తమ్ముళ్లు, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. ‘నాది బాల్య వివాహం’’ అంటూ తన గురించి చెబుతారు కల్పనా సరోజ్. ఏడో తరగతి పూర్తి కాగానే కల్పనా సరోజ్‌కు వివాహం చేసేశారు. ఆమె తన భర్తతో కలిసి థానేలోని ఉల్హాన్స్ నగర్ అనే మురికివాడలోని ఒక చిన్నగదిలో, పదిహేను మంది మధ్యన అడుగు పెట్టారు. అయితే అక్కడి వాతావరణంలో ఇమడలేకపోయిన కల్పనా సరోజ్, తండ్రితో కలిసి తిరిగి పుట్టింటికి వచ్చేశారు. మొదటి వంద నోటు... స్వగ్రామానికి వచ్చిన తరవాత తల్లిదండ్రులను ఒప్పించి ముంబైలో బంధువుల ఇంట్లో ఉంటూ, ఒక బట్టల దుకాణంలో నెలకు అరవై రూపాయల జీతానికి ఉద్యోగంలో చేరారు. బట్టలు కుట్టటం నేర్చుకుని, అదనంగా నెలకు వంద రూపాయలు సంపాదించటం ప్రారంభించారు. ‘‘నా జీవితం లో మొట్టమొదటిసారి వంద రూపాయల నోటు చూశాను’’ అంటూ ఆనందంగా చెబుతున్న కల్పనా సరోజ్, ఆ రోజు నుంచి ఒక్క నిమిషం కూడా వృథా చేయలేదు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ, సౌకర్యంగా ఉండే ఇల్లు అద్దెకు తీసుకునే స్థాయికి ఎదిగారు. పట్టుదలతో ముందడుగు.. జ్యోతిబా ఫూలే స్కీమ్ కింద 1975లో 50,000 రూపాయల ప్రభుత్వ సహాయం అందింది. ఆ డబ్బుతో క్లాత్ బొటిక్ ప్రారంభించారు. పాత వస్తువుల విక్రయం కూడా ప్రారంభించారు. క్రమశిక్షణ, దీక్ష, పట్టుదలతో... వేసిన ప్రతి అడుగులోను విజయం సాధించి, ‘సుశిక్షిత్ బేరాజ్‌గార్ యువక్ సంఘటన’ ప్రారంభించారు. ఈ సంస్థ ద్వారా సుమారు మూడు వేల మందికి ఉద్యోగాలు లభించాయి. ఇప్పుడు ఈ సంస్థలో కల్పనా సరోజ్‌కు పదకొండు మంది సహాయకులుగా పనిచేస్తున్నారు. ‘‘నా వయసు 20 సంవత్సరాలే అయినప్పటికీ అందరూ ఎంతో ఆప్యాయంగా, అభిమానంగా నన్ను తాయీ (పెద్దక్క) అని పిలుస్తున్నారు’’ అంటున్న కల్పనా సరోజ్ సౌకర్యవంతమైన జీవితంలోకి అడుగుపెట్టారు. రెండు దశాబ్దాల తరవాతే మరో విజయవంతమైన అడుగు వేయగలిగారు. చైర్ పర్సన్‌గా... 1995లో లిటిగేషన్లో ఉన్న స్థలం కొన్నారు. ‘‘నాకు స్థలాల గురించి తెలియకపోవటంతో మోసపోయాను. కలెక్టర్ సహకారంతో ఆ స్థలాన్ని డెవలప్మెంట్కి ఇవ్వగలిగాను’’ అంటున్న కల్పనా సరోజ్, ఆ స్థలంతోనే రియల్ ఎస్టేట్ రంగంలో ఎవ్వరూ ఊహించనంత ముందుకు దూసుకుపోయారు. నాలుగుకోట్ల టర్నోవర్ స్థాయికి ఎదిగారు. పది సంవత్సరాలుగా మూతబడిన కమానీ ట్యూబ్స్ కంపెనీకి చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టి, కంపెనీని లాభాల బాట పట్టించి, రెండు వేల కోట్ల టర్నోవర్ స్థాయికి ఎదిగారు. ఒక బట్టల దుకాణంలో నెలకు అరవై రూపాయల జీతంతో ఒక హెల్పర్‌గా తన జీవితాన్ని ప్రారంభించిన దళిత మహిళ నేడు ఐదు వేల చదరపు అడుగుల ఇంట్లో దర్జాగా నివసిస్తున్నారు. ఇప్పుడు కల్పనా సరోజ్ వయసు ఆరు పదులు దాటింది. హాయిగా రిటైర్మెంట్ తీసుకుని ఊపిరి పీల్చుకుంటున్నారనుకుంటే పొరపాటే. హోటల్ రంగంలోకి అడుగు పెడుతున్నారు. మంచి కుటుంబం.. కల్పనా పునర్వివాహం చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు, కుమార్తె సీమా హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేశారు, అబ్బాయి అమర్ కమర్షియల్ పైలట్. భర్త కాలం చేశారు. ఇప్పుడామె భారతీయ మహిళా బ్యాంక్ డైరెక్టర్‌గా సేవలు అందిస్తున్నారు. ఎన్నో కడగండ్ల తర్వాత తన రెండో జీవితాన్ని ప్రారంభించి, విజయాలు సాధించి బెస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా నిరూపించుకుని పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. -
స్లమ్‌డాగ్ మిలియనీర్.. కల్పనా సరోజ్
జీరో నుంచి హీరోలు అయిన ఎంతోమందిని వెండితెరపై చూస్తుంటాం. కానీ నిజజీవితంలో.. చదువుకోవాలని ఆశ, అందరితో కలిసి ఆడుకోవాలనే కోరికలు ఎన్ని ఉన్నా.. పరిస్థితులు అనుకూలించక ఏడో తరగతిలోనే పెళ్లిచేసుకుని అత్తారింటి వేధింపుల కింద నలిగి.. తిరిగి పుట్టింటికి చేరి.. చివరికి స్లమ్‌డాగ్ మిలీనియర్‌గా ఎదిగిన కల్పనా సరోజ్ గురించి తెలుసుకోవడం మనందరికీ స్ఫూర్తి కలిగించే విషయం. మహారాష్ట్రలోని విదర్భలో 1961లో అత్యంత వెనుకబడిన దళిత కుటుంబంలో జన్మించారు కల్పనా. ఆమెకు ముగ్గురు అక్కచెళ్లెళ్లతోపాటు ఇద్దరు తమ్ముళ్లు. తండ్రి పోలీసు కానిస్టేబుల్. వీరంతా పోలీస్ క్వార్టర్స్‌లోనే ఉండేవారు. 12 ఏళ్లకే పెళ్లి.. ఎంతో చలాకీగా ఉండే కల్పనకు ఏడో తరగతిలోనే.. చదువు మాన్పించి ముంబైకి చెందిన సమీర్ సరోజ్ అనే వ్యక్తితో పెళ్లి చేశారు. అప్పుడామే వయసు పన్నెండేళ్లు. అసలే అంతంతమాత్రంగా ఉండే పుట్టినింటి నుంచి మెట్టినింట్లోకి అడుగు పెట్టిన కల్పన సరోజ్‌కు పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లయింది. అత్తారిల్లు ముంబై మురికివాడలో ఉంది. ఆ ఇంట్లో మొత్తం 12 మందికి వండిపెట్టడమేగాక, ఇంటి పనంతా భూజాల మీదపడింది. ఎంత పనిచేసినా కూరలో ఉప్పు ఎక్కువైందనో, తక్కువైందనో తిడుతూ శారీకంగా, మానసింగా హింసించేవారు. అలా ఆర్నేళ్లు గడిచిన తరువాత ఓ పనిమీద ముంబై వెళ్లిన కల్పన నాన్న.. కూతుర్ని కలిసేందుకు వెళ్లాడు. అప్పుడు బక్కచిక్కిన కల్పనను చూసి నిర్ఘాంతపోయాడు. ఆమె కష్టాల గురించి తెలుసుకున్నాడు. వెంటనే అక్కడి నుంచి పుట్టింటికి తీసుకొచ్చాడు. కుటుంబ భారం.. అలా కల్పన జీవితం సాగిపోతుండగా పోలీసు వ్యవస్థలో కొన్ని మార్పులు చేయడంతో తన తండ్రి ఉద్యోగం పోయింది. దాంతో కుటుంబ భారం మొత్తం కల్పన మీదే పడింది. విదర్భలో ఉన్న కుటుంబాన్ని ముంబైకి తీసుకు వచ్చి 48 రూపాయలకు ఇల్లు అద్దెకు తీసుకుంది. అయితే తనకు కుట్టుపని ద్వారా వచ్చే జీతం చాలకపోవడంతో తానే ఒక మిషన్‌ను కొనుక్కొని ఇంట్లో కుట్టడం ప్రారంభించింది. అయినా డబ్బులు సరిపోయేవి కావు. ఎవరో ప్రభుత్వం లోన్లు ఇస్తుంది అని చెప్పడంతో అక్కడి లోకల్ పార్టీ నేతను కలిసి తన గోడు వెళ్లబోసుకుంది. అయితే ఆ లోన్‌లో తనకూ వాటా ఇవ్వాలని అడగడంతో నిరాశగా వెనుదిరిగింది. తనువు చాలించాలని.. ఇంటికి వచ్చిన సరోజ్‌కు అందరూ తిట్టారు. ఆడపిల్లను ఇంట్లో నే ఉంచుకుంటావా? అంటూ నిలదీశారు. అయినా అతను వెనక్కు తగ్గలేదు. అంతలోనే పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ పడితే.. కల్పనతో దరఖాస్తు చేయించాడు. అయితే చదువు లేదనే కారణంతో తిరస్కరించారు. ఇటువంటి పరిస్థితిలో ఖాళీగా ఉన్న ఆమెకు పుట్టింట్లో నూ కష్టాలు మొదలయ్యాయి. దీంతో ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించి, విఫలమైంది. రెండురూపాయల కూలీ... జీవితం నాకు మరోక అవకాశాన్ని ఇచ్చిందని గ్రహించిన కల్పనా ఎలాగైనా బతకాలని నిశ్చయించుకుంది. అనుకుందే తడవుగా ముంబైలో ఉండే బాబాయ్ ఇంటికి వెళ్లింది. అక్కడ కొన్నిరోజులు కుట్టుపని నేర్చుకుంది. బాబాయ్ తనకు తెలిసిన ఓ ట్రైన్ డ్రైవర్ దగ్గరకు కల్పను తీసుకెళ్లాడు. ఆయన సాయంతో ఓ దర్జీ దుకాణానికి వెళ్లి, అక్కడ పనిలో కుదిరింది. అప్పుడు ఆమె జీతం రోజుకు రెండు రూపాయలే! హెల్పర్‌గా చేరిన కల్పన.. అక్కడి పనివారు భోజనానికి వెళ్లినప్పుడు మిషన్‌పై డ్రెస్‌లను వేగంగా కుట్టడాన్ని గమనించిన యజమాని ఆమెకు కుడా కుట్టే పనిని అప్పగించాడు. దీంతో ఆమె జీతం నెలకు రూ.102కు పెరిగింది. స్వచ్ఛంద సంస్థ సాయంతో : చివరకు ఓ స్వచ్ఛంద సంస్థ సాయంతో తాను లోన్ పొందడమే కాకుండా.. తనలాంటి మహిళలెందరిలోనో చైతన్యం తీసు కొచ్చి, వారందరికీ ఉపాధి మార్గాన్ని చూపించింది. ఆ తర్వాత లోన్‌గా వచ్చిన డబ్బుతో ఫర్నిచర్ వ్యాపారాన్ని మొదలుపెట్టింది. మరోవైపు ఎన్జీవోను సమర్థవంతంగా నిర్వహించింది. కమని సీఈవోగా... ఎన్జీవో సేవల ద్వారా కల్పనకు ఎంతో పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. అప్పటికే 20 ఏళ్లుగా నడుస్తున్న కమని ట్యూబ్స్ అనే సంస్థ పీకల్లోతూ నష్టాలో కూరుకుపోయింది. అప్పుడు కంపెనీ వారసులు ఆధిపత్య పోరులో కంపెనీ మరింత దిగజారి కార్మికులంతా రోడ్డున పడ్డారు. కోర్టు తీర్పు ప్రకారం కంపెనీ యాజమాన్యహక్కులను కార్మికులకు అప్పచెప్పింది. అప్పుడు వారంతా కల్పన దగ్గరకు వచ్చి తమ కంపెనీనీ నిలబెట్టాని కోరారు. దీంతో కల్పన వెంటనే ప్రభుత్వం, అప్పు ఇచ్చిన బ్యాంకులతో మాట్లాడి జరిమానాలు, వడ్డీలు తగ్గించమని కోరింది. అవి తగ్గిస్తే మొత్తం బకాయిలు తాను చెల్లిస్తానని చెప్పడంతో అందుకు వారు ఒప్పుకున్నారు. ఏడేళ్లలో అప్పులు, మూడేళ్లలో కార్మికుల జీతాలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. 2000లో కమనిట్యూబ్స్ ఇండస్ట్రీకి బోర్డు ప్రెసిడెంట్ అయిన ఆమే మూడు నెలల్లో జీతాలు మొత్తం చెల్లించి, తరువాత బకాలయిలన్నింటినీ తీర్చింది. కంపెనీని లాభాల్లోకి తీసుకొచ్చింది. రూ.168 కోట్ల నష్టాల్లో ఉన్న కంపెనీనీ రూ.700 కోట్ల లాభాల్లోకి తీసుకు, ఆ సంస్థకే అధిపతిగా కొనసాగుతోంది కల్పన. అవార్డులు.. ఆమె చేసిన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 2013లో పద్మశ్రీతో సత్కరించింది. అంతేగాక భార తీయ మహిళా బ్యాంకుకు బోర్డ్ ఆఫ్ డైరెక్టరుగా కూడా నియమించింది. – సాక్షి స్కూల్ ఎడిషన్ -
స్లమ్‌డాగ్ మిలియనీర్!
స్ఫూర్తి ‘కల్పనా సరోజ్ నిజమైన స్లమ్‌డాగ్ మిలియనీర్’. పైకి ప్రశంసలా కనిపిస్తూనే వ్యంగ్యాన్ని తనలో దాచుకున్న వ్యాఖ్య ఇది. అవును... కమానీ ట్యూబ్స్ సీఈవో కల్పన. 600 కోట్ల వ్యాపార సామ్రాజ్య అధినేత్రి. అయినా ఆమె మూలాలు మాత్రం దళితకులానికి చెందినవని చెప్పేందుకు కొందరు సాటి వ్యాపారవేత్తలు కుటిలత్వంతో వాడిన పదం స్లమ్‌డాగ్. ఎవరెన్ని అన్నా... ఆమె జీవితం మాత్రం అక్షరాలా ఎందరికో స్ఫూర్తి. కల్పనా సరోజ్ విదర్భ ప్రాంతంలోని రోపెర్ఖేడా గ్రామంలో నిరుపేద దళిత కుటుంబంలో జన్మించింది. ఆరుగురు తోబుట్టువులు. తండ్రి కానిస్టేబుల్. పోలీస్ క్వార్టర్స్‌లో నివాసం. కులం తక్కువని కల్పనను తమ పిల్లలతో కలసి ఆడుకునేందుకు అగ్రవర్ణాలొప్పుకోలేదు. కల్పన చదువులో మెరిక. కానీ తోటి విద్యార్థుల్నించి దూరంగా కూర్చోబెట్టేవారు. రెక్క విప్పుకుంటున్న ఆశల్ని చిదిమేశారు. విదర్భ... దేశంలోని దరిద్రపు గొట్టు ప్రాంతాల్లో మొదటి స్థానం. దీనికి తోడు అక్కడ దళితుల్లో బాల్యవివాహాల సంప్రదాయం. ఏడో తరగతిలో ఉండగా పెళ్లి చేశారు. కల్పనకి అప్పుడు పన్నెండేళ్లు. భర్త వెంట ముంబై మురికివాడలోని అత్తగారింటికి పయనమైంది. కల్పనకు పెళ్లి తర్వాత జీవితం ముళ్ల పాన్పయింది. పదిమందున్న ఇంటికి పనిమనిషైంది. ఏవో వంకలతో వీపుచీరేవారు. ఆరునెలల్లో చిక్కి శల్యమైంది. చూసిన తండ్రి బెదిరిపోయాడు. కల్పన పుట్టింటికి చేరింది. జాలి లేకుండా ఇరుగు పొరుగు బుగ్గలు నొక్కుకున్నారు. కల్పన టైలరింగ్ నేర్చుకుంది. నిలదొక్కుకుంది. దీంతో పొరుగువారి వేధింపులు పెరిగాయి. రోజూ చీత్కారాలతో బ్రతకటం కన్నా చావటమే సులభమనిపించి, కల్పన విషం తాగింది. కానీ, బతికింది. మృత్యువును అంత దగ్గరగా చూశాక జీవనపోరాటం కష్టమనిపించలేదు. అప్పుడామె వయసు 16. బొంబాయిలోని బంధువుల ద్వారా వస్త్ర కర్మాగారంలో పనికి కుదిరింది. రోజు కూలీ రెండు రూపాయలు. టైలర్‌గా తన ప్రతిభను నిరూపించుకోవటంతో అనతి కాలంలోనే నెల జీతం రూ. 200కు పెరిగింది. అప్పుడే తండ్రి ఉద్యోగం పోవటంతో కుటుంబం మొత్తం ముంబై చేరింది. తను ఒక్కతే సంపాదనపరురాలు. చెల్లెలు అనారోగ్యం బారిన పడింది. కల్పన తెలిసిన వారందరి దగ్గర చేయి చాచింది. తిరస్కరణే ఎదురయ్యింది. కల్పనకు అర్థమైంది. డబ్బు లేకుండా బ్రతకటమంత పనికిరాని పని ప్రపంచంలో మరొకటి లేదు. ఆ క్షణంలో అంతులేని డబ్బు సంపాదించాలనే ఆశ కల్పనలో బలంగా వేళ్లూనుకుంది. అప్పటి నుంచి రోజుకు 16 గంటలు పనిచేయసాగింది. ప్రభుత్వ రుణంతో టైలరింగ్, గృహోపకరణాలు విక్రయించే షాపు ప్రారంభించింది. వ్యాపారమే తర్వాత తన పాలిట బిజినెస్ స్కూల్‌గా మారింది. సాటి వ్యాపారస్థుణ్ణి పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలకు తల్లయింది. భవనం నిర్మించి గృహోపకరణాల విక్రయంతో పాటు స్థిరాస్థి వ్యాపారాన్ని ప్రారంభించారు. అప్పుడే రోడ్డు ప్రమాదంలో కల్పన భర్త కన్నుమూశాడు. కల్పన కుప్పకూలింది. కానీ జీవితం నేర్పిన పాఠాలతో త్వరగానే తేరుకుంది. ఖాయిలా పరిశ్రమ పాలిట కల్పతరువు నెహ్రూ, గాంధీల శిష్యుడు రాంజీభాయ్ కమానీ ‘కమానీ ట్యూబ్స్’ను స్థాపించారు. ఆయన మరణానంతరం కంపెనీ దివాళా తీసింది. 1997లో కంపెనీ మూసివేతకు రంగం సిద్ధమైంది. కల్పనతో పరిచయం ఉన్న కార్మికులు సమస్యను ఆమె దృష్టికి తెచ్చారు. నోటికాడ కూడు పోకుండా కాపాడాలని కోరారు. 566 కుటుంబాలను ఆదుకోగలననే ఆలోచనతో తనకు ఆ రంగంలో ఎలాంటి అనుభవం లేకున్నా కల్పన ఒప్పుకున్నారు. పరిశ్రమను అధ్యయనం చేశారు. 2000లో కంపెనీ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. 2006లో కల్పన కంపెనీ చైర్మన్ అయ్యారు. పరిస్థితులు కుదురుకున్నాయి. బ్యాంకుల అప్పులు తీర్చారు. కంపెనీకి మౌలిక వసతులు సమకూర్చారు. 2006లో మహారాష్ట్రలోని ఖేర్లాంజీ జిల్లాలో దళితుల ఊచకోతపై మీడియా స్పందించకపోవటంతో సొంత బేనర్ కింద ‘ఖేర్లాంజీ’ పేరుతో సినిమాగా నిర్మించారు. 2013లో కల్పనను ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. డిగ్రీలు, ఎంబీఏలు వ్యాపారవేత్తలను తయారు చేయలేవు. ‘పట్టుదల, ధైర్యం, మీపై మీకు విశ్వాసం మాత్రమే మిమ్మల్ని రంగంలో నిలబెడతాయి’ అనే కల్పన కట్టుబాటనే మడుగులో, సంప్రదాయమనే బురదలో అరవిరిసిన కమలం. - దండేల కృష్ణ