ప్రణబ్ ముఖర్జీ నుంచి ‘పద్మశ్రీ’ అందుకుంటూ కల్పన
స్ఫూర్తి
‘కల్పనా సరోజ్ నిజమైన స్లమ్‌డాగ్ మిలియనీర్’. పైకి ప్రశంసలా కనిపిస్తూనే వ్యంగ్యాన్ని తనలో దాచుకున్న వ్యాఖ్య ఇది. అవును... కమానీ ట్యూబ్స్ సీఈవో కల్పన. 600 కోట్ల వ్యాపార సామ్రాజ్య అధినేత్రి. అయినా ఆమె మూలాలు మాత్రం దళితకులానికి చెందినవని చెప్పేందుకు కొందరు సాటి వ్యాపారవేత్తలు కుటిలత్వంతో వాడిన పదం స్లమ్‌డాగ్. ఎవరెన్ని అన్నా... ఆమె జీవితం మాత్రం అక్షరాలా ఎందరికో స్ఫూర్తి.
కల్పనా సరోజ్ విదర్భ ప్రాంతంలోని రోపెర్‌ఖేడా గ్రామంలో నిరుపేద దళిత కుటుంబంలో జన్మించింది. ఆరుగురు తోబుట్టువులు. తండ్రి కానిస్టేబుల్. పోలీస్ క్వార్టర్స్‌లో నివాసం. కులం తక్కువని కల్పనను తమ పిల్లలతో కలసి ఆడుకునేందుకు అగ్రవర్ణాలొప్పుకోలేదు. కల్పన చదువులో మెరిక. కానీ తోటి విద్యార్థుల్నించి దూరంగా కూర్చోబెట్టేవారు. రెక్క విప్పుకుంటున్న ఆశల్ని చిదిమేశారు.
విదర్భ... దేశంలోని దరిద్రపు గొట్టు ప్రాంతాల్లో మొదటి స్థానం. దీనికి తోడు అక్కడ దళితుల్లో బాల్యవివాహాల సంప్రదాయం. ఏడో తరగతిలో ఉండగా పెళ్లి చేశారు. కల్పనకి అప్పుడు పన్నెండేళ్లు. భర్త వెంట ముంబై మురికివాడలోని అత్తగారింటికి పయనమైంది.
కల్పనకు పెళ్లి తర్వాత జీవితం ముళ్ల పాన్పయింది. పదిమందున్న ఇంటికి పనిమనిషైంది. ఏవో వంకలతో వీపుచీరేవారు. ఆరునెలల్లో చిక్కి శల్యమైంది. చూసిన తండ్రి బెదిరిపోయాడు. కల్పన పుట్టింటికి చేరింది.
జాలి లేకుండా ఇరుగు పొరుగు బుగ్గలు నొక్కుకున్నారు. కల్పన టైలరింగ్ నేర్చుకుంది. నిలదొక్కుకుంది. దీంతో పొరుగువారి వేధింపులు పెరిగాయి. రోజూ చీత్కారాలతో బ్రతకటం కన్నా చావటమే సులభమనిపించి, కల్పన విషం తాగింది. కానీ, బతికింది. మృత్యువును అంత దగ్గరగా చూశాక జీవనపోరాటం కష్టమనిపించలేదు. అప్పుడామె వయసు 16.
బొంబాయిలోని బంధువుల ద్వారా వస్త్ర కర్మాగారంలో పనికి కుదిరింది. రోజు కూలీ రెండు రూపాయలు. టైలర్‌గా తన ప్రతిభను నిరూపించుకోవటంతో అనతి కాలంలోనే నెల జీతం రూ. 200కు పెరిగింది. అప్పుడే తండ్రి ఉద్యోగం పోవటంతో కుటుంబం మొత్తం ముంబై చేరింది. తను ఒక్కతే సంపాదనపరురాలు. చెల్లెలు అనారోగ్యం బారిన పడింది. కల్పన తెలిసిన వారందరి దగ్గర చేయి చాచింది. తిరస్కరణే ఎదురయ్యింది. కల్పనకు అర్థమైంది. డబ్బు లేకుండా బ్రతకటమంత పనికిరాని పని ప్రపంచంలో మరొకటి లేదు. ఆ క్షణంలో అంతులేని డబ్బు సంపాదించాలనే ఆశ కల్పనలో బలంగా వేళ్లూనుకుంది. అప్పటి నుంచి రోజుకు 16 గంటలు పనిచేయసాగింది.
ప్రభుత్వ రుణంతో టైలరింగ్, గృహోపకరణాలు విక్రయించే షాపు ప్రారంభించింది. వ్యాపారమే తర్వాత తన పాలిట బిజినెస్ స్కూల్‌గా మారింది. సాటి వ్యాపారస్థుణ్ణి పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలకు తల్లయింది.
భవనం నిర్మించి గృహోపకరణాల విక్రయంతో పాటు స్థిరాస్థి వ్యాపారాన్ని ప్రారంభించారు. అప్పుడే రోడ్డు ప్రమాదంలో కల్పన భర్త కన్నుమూశాడు. కల్పన కుప్పకూలింది. కానీ జీవితం నేర్పిన పాఠాలతో త్వరగానే తేరుకుంది.
ఖాయిలా పరిశ్రమ పాలిట కల్పతరువు
నెహ్రూ, గాంధీల శిష్యుడు రాంజీభాయ్ కమానీ ‘కమానీ ట్యూబ్స్’ను స్థాపించారు. ఆయన మరణానంతరం కంపెనీ దివాళా తీసింది. 1997లో కంపెనీ మూసివేతకు రంగం సిద్ధమైంది. కల్పనతో పరిచయం ఉన్న కార్మికులు సమస్యను ఆమె దృష్టికి తెచ్చారు. నోటికాడ కూడు పోకుండా కాపాడాలని కోరారు. 566 కుటుంబాలను ఆదుకోగలననే ఆలోచనతో తనకు ఆ రంగంలో ఎలాంటి అనుభవం లేకున్నా కల్పన ఒప్పుకున్నారు. పరిశ్రమను అధ్యయనం చేశారు. 2000లో కంపెనీ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. 2006లో కల్పన కంపెనీ చైర్మన్ అయ్యారు. పరిస్థితులు కుదురుకున్నాయి. బ్యాంకుల అప్పులు తీర్చారు. కంపెనీకి మౌలిక వసతులు సమకూర్చారు. 2006లో మహారాష్ట్రలోని ఖేర్లాంజీ జిల్లాలో దళితుల ఊచకోతపై మీడియా స్పందించకపోవటంతో సొంత బేనర్ కింద ‘ఖేర్లాంజీ’ పేరుతో సినిమాగా నిర్మించారు. 2013లో కల్పనను ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. డిగ్రీలు, ఎంబీఏలు వ్యాపారవేత్తలను తయారు చేయలేవు. ‘పట్టుదల, ధైర్యం, మీపై మీకు విశ్వాసం మాత్రమే మిమ్మల్ని రంగంలో నిలబెడతాయి’ అనే కల్పన కట్టుబాటనే మడుగులో, సంప్రదాయమనే బురదలో అరవిరిసిన కమలం. - దండేల కృష్ణ