స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌.. కల్పనా సరోజ్‌ | Inspirational Success Story of Kalpana Saroj, CEO, Kamani Tubes | Sakshi
Sakshi News home page

స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌.. కల్పనా సరోజ్‌

Published Fri, Nov 24 2017 11:37 PM | Last Updated on Sat, Nov 25 2017 12:10 AM

Inspirational Success Story of Kalpana Saroj, CEO, Kamani Tubes - Sakshi - Sakshi - Sakshi

జీరో నుంచి హీరోలు అయిన ఎంతోమందిని వెండితెరపై చూస్తుంటాం. కానీ నిజజీవితంలో.. చదువుకోవాలని ఆశ, అందరితో కలిసి ఆడుకోవాలనే కోరికలు ఎన్ని ఉన్నా.. పరిస్థితులు అనుకూలించక ఏడో తరగతిలోనే పెళ్లిచేసుకుని అత్తారింటి వేధింపుల కింద నలిగి.. తిరిగి పుట్టింటికి చేరి.. చివరికి స్లమ్‌డాగ్‌ మిలీనియర్‌గా ఎదిగిన కల్పనా సరోజ్‌ గురించి తెలుసుకోవడం మనందరికీ స్ఫూర్తి కలిగించే విషయం.

మహారాష్ట్రలోని విదర్భలో 1961లో  అత్యంత వెనుకబడిన  దళిత కుటుంబంలో జన్మించారు కల్పనా. ఆమెకు ముగ్గురు అక్కచెళ్లెళ్లతోపాటు ఇద్దరు తమ్ముళ్లు. తండ్రి పోలీసు కానిస్టేబుల్‌. వీరంతా పోలీస్‌ క్వార్టర్స్‌లోనే ఉండేవారు.

12 ఏళ్లకే పెళ్లి..
ఎంతో చలాకీగా ఉండే కల్పనకు ఏడో తరగతిలోనే.. చదువు మాన్పించి ముంబైకి చెందిన సమీర్‌ సరోజ్‌ అనే వ్యక్తితో పెళ్లి చేశారు. అప్పుడామే వయసు పన్నెండేళ్లు. అసలే అంతంతమాత్రంగా ఉండే పుట్టినింటి నుంచి మెట్టినింట్లోకి అడుగు పెట్టిన కల్పన సరోజ్‌కు పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లయింది. అత్తారిల్లు ముంబై మురికివాడలో ఉంది. ఆ ఇంట్లో మొత్తం 12 మందికి వండిపెట్టడమేగాక, ఇంటి పనంతా భూజాల మీదపడింది. ఎంత పనిచేసినా కూరలో ఉప్పు ఎక్కువైందనో, తక్కువైందనో తిడుతూ శారీకంగా, మానసింగా హింసించేవారు. అలా ఆర్నేళ్లు గడిచిన తరువాత ఓ పనిమీద ముంబై వెళ్లిన కల్పన నాన్న.. కూతుర్ని కలిసేందుకు వెళ్లాడు. అప్పుడు బక్కచిక్కిన కల్పనను చూసి నిర్ఘాంతపోయాడు. ఆమె కష్టాల గురించి తెలుసుకున్నాడు. వెంటనే అక్కడి నుంచి పుట్టింటికి తీసుకొచ్చాడు.

కుటుంబ భారం..
అలా కల్పన జీవితం సాగిపోతుండగా పోలీసు వ్యవస్థలో కొన్ని మార్పులు చేయడంతో తన తండ్రి ఉద్యోగం పోయింది. దాంతో కుటుంబ భారం మొత్తం కల్పన మీదే పడింది. విదర్భలో ఉన్న కుటుంబాన్ని ముంబైకి తీసుకు వచ్చి 48 రూపాయలకు ఇల్లు అద్దెకు తీసుకుంది. అయితే తనకు కుట్టుపని ద్వారా వచ్చే జీతం చాలకపోవడంతో తానే ఒక మిషన్‌ను కొనుక్కొని ఇంట్లో కుట్టడం ప్రారంభించింది. అయినా డబ్బులు సరిపోయేవి కావు. ఎవరో ప్రభుత్వం లోన్లు ఇస్తుంది అని చెప్పడంతో అక్కడి లోకల్‌ పార్టీ నేతను కలిసి తన గోడు వెళ్లబోసుకుంది. అయితే ఆ లోన్‌లో తనకూ వాటా ఇవ్వాలని అడగడంతో నిరాశగా వెనుదిరిగింది.

తనువు చాలించాలని..
ఇంటికి వచ్చిన సరోజ్‌కు అందరూ తిట్టారు. ఆడపిల్లను ఇంట్లో నే ఉంచుకుంటావా? అంటూ నిలదీశారు. అయినా అతను వెనక్కు తగ్గలేదు. అంతలోనే పోలీస్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ పడితే.. కల్పనతో దరఖాస్తు చేయించాడు. అయితే చదువు లేదనే కారణంతో  తిరస్కరించారు. ఇటువంటి పరిస్థితిలో ఖాళీగా ఉన్న ఆమెకు పుట్టింట్లో నూ కష్టాలు మొదలయ్యాయి. దీంతో ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించి, విఫలమైంది.

రెండురూపాయల కూలీ...
జీవితం నాకు మరోక అవకాశాన్ని ఇచ్చిందని గ్రహించిన కల్పనా ఎలాగైనా బతకాలని నిశ్చయించుకుంది. అనుకుందే తడవుగా ముంబైలో ఉండే బాబాయ్‌ ఇంటికి వెళ్లింది. అక్కడ కొన్నిరోజులు కుట్టుపని నేర్చుకుంది. బాబాయ్‌ తనకు తెలిసిన ఓ ట్రైన్‌ డ్రైవర్‌ దగ్గరకు కల్పను తీసుకెళ్లాడు. ఆయన సాయంతో ఓ దర్జీ దుకాణానికి వెళ్లి, అక్కడ పనిలో కుదిరింది. అప్పుడు ఆమె జీతం రోజుకు రెండు రూపాయలే! హెల్పర్‌గా చేరిన కల్పన.. అక్కడి పనివారు భోజనానికి వెళ్లినప్పుడు మిషన్‌పై డ్రెస్‌లను వేగంగా కుట్టడాన్ని గమనించిన యజమాని ఆమెకు కుడా కుట్టే పనిని అప్పగించాడు. దీంతో ఆమె జీతం నెలకు రూ.102కు పెరిగింది.

స్వచ్ఛంద సంస్థ సాయంతో : చివరకు ఓ స్వచ్ఛంద సంస్థ సాయంతో తాను లోన్‌ పొందడమే కాకుండా.. తనలాంటి మహిళలెందరిలోనో చైతన్యం తీసు కొచ్చి, వారందరికీ ఉపాధి మార్గాన్ని చూపించింది. ఆ తర్వాత లోన్‌గా వచ్చిన డబ్బుతో ఫర్నిచర్‌ వ్యాపారాన్ని మొదలుపెట్టింది. మరోవైపు ఎన్జీవోను సమర్థవంతంగా నిర్వహించింది.

కమని సీఈవోగా...
ఎన్జీవో సేవల ద్వారా కల్పనకు ఎంతో పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. అప్పటికే 20 ఏళ్లుగా నడుస్తున్న కమని ట్యూబ్స్‌ అనే సంస్థ పీకల్లోతూ నష్టాలో కూరుకుపోయింది. అప్పుడు కంపెనీ వారసులు ఆధిపత్య పోరులో కంపెనీ మరింత దిగజారి కార్మికులంతా రోడ్డున పడ్డారు. కోర్టు తీర్పు ప్రకారం కంపెనీ యాజమాన్యహక్కులను కార్మికులకు అప్పచెప్పింది. అప్పుడు వారంతా కల్పన దగ్గరకు వచ్చి తమ కంపెనీనీ నిలబెట్టాని కోరారు. దీంతో కల్పన వెంటనే ప్రభుత్వం, అప్పు ఇచ్చిన బ్యాంకులతో మాట్లాడి జరిమానాలు, వడ్డీలు తగ్గించమని కోరింది. అవి తగ్గిస్తే మొత్తం బకాయిలు తాను చెల్లిస్తానని చెప్పడంతో అందుకు వారు ఒప్పుకున్నారు. ఏడేళ్లలో అప్పులు, మూడేళ్లలో కార్మికుల జీతాలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. 2000లో కమనిట్యూబ్స్‌ ఇండస్ట్రీకి బోర్డు ప్రెసిడెంట్‌ అయిన ఆమే మూడు నెలల్లో జీతాలు మొత్తం చెల్లించి, తరువాత బకాలయిలన్నింటినీ తీర్చింది. కంపెనీని లాభాల్లోకి తీసుకొచ్చింది. రూ.168 కోట్ల నష్టాల్లో ఉన్న కంపెనీనీ రూ.700 కోట్ల లాభాల్లోకి తీసుకు, ఆ సంస్థకే అధిపతిగా కొనసాగుతోంది కల్పన.

అవార్డులు..
ఆమె చేసిన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 2013లో పద్మశ్రీతో సత్కరించింది. అంతేగాక భార తీయ మహిళా బ్యాంకుకు బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టరుగా కూడా నియమించింది.  

– సాక్షి స్కూల్‌ ఎడిషన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement