మనం బద్ధకిష్టులమండోయ్!
ఏరా నీకేం ఇష్టం అంటే.. బద్ధకిష్టం.. అన్నాడట ఓ మహా లేజీ ఫెలో.. ఇలాంటోళ్ల సంఖ్య మన దగ్గర కాసింత ఎక్కువేనట. అడుగు తీసి అడుగు వేయమంటే.. కాలు అరిగిపోతుందని చూసేవారి సంఖ్యా అలాగే ఉందట..
ఇటీవల స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ నిర్వహించిన అధ్యయనంలో మనవాళ్ల ‘లేజీనెస్’ బయటపడింది. రోజువారీ జీవితంలో ఒళ్లు వంచి శారీరకశ్రమ చేసే విషయంలో, ఉత్సాహంగా రెండు అడుగులు ముందుకేసి చురుకుదనాన్ని నింపుకోవాల్సిన చోట మనవాళ్లు బద్ధకంతో గడుపుతున్నారట. నడిచి వెళ్లేందుకు అవకాశమున్నపుడు కూడా ఏ వాహనం అందుబాటులో ఉంటే దానిపై కడుపులోని చల్ల కదలకుండా వెళ్లిపోతున్నారట. ప్రపంచవ్యాప్తంగా 46 దేశాల ప్రజల రోజువారి నడక అలవాటు, శారీరకశ్రమపై చేసిన అధ్యయనంలో ఇండియా 39వ స్థానంలో నిలవగా, హాంగ్‌కాంగ్ ప్రథమ స్థానంలో నిలిచింది..
భారతీయులు రోజుకు సగటున కేవలం 4,297 అడుగులు వేస్తున్నట్లు తేలింది. అందులోనూ మగవారు 4,606 అడుగులు, మహిళలు 3,684 అడుగులు మాత్రమే వేస్తున్నారు. సరైన శారీరకశ్రమ, వ్యాయామం లేని కారణంగా ఆడవారిలో ఊబకాయం పెరిగే అవకాశం 232 శాతం, పురుషుల్లో 67 శాతంగా ఉంటోందని స్పష్టమైంది. శారీరకంగా ఆరోగ్యవంతంగా ఉండేందుకు రోజుకు కనీసం వెయ్యి అడుగులైనా వేయాలని వైద్యులు సూచిస్తున్నారు. ఉదయం పూట గంటపాటు వాకింగ్ చేసి వ్యాయామం అయిపోయిందనుకోవడం సరికాదని, రోజంతా శారీరక శ్రమ ఉండాల్సిందేనని చెబుతున్నారు. అయితే మనకంటే అత్యంత బద్ధకస్త దేశంగా ఇండోనేషియా నిలుస్తోంది. వారు రోజుకు 3,513 అడుగులేస్తూ బద్ధకిష్టులకే ట్రేడ్‌మార్క్‌గా అథమస్థానాన్ని (46వ ప్లేస్) సాధించారు. మలేషియా, సౌదీ ఆరేబియా ప్రజలు 3,900 అడుగుల నడకతో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు. ఇక ప్రపంచ సగటు విషయానికొస్తే మాత్రం రోజుకు 4,961 అడుగులుగా ఉండగా, అమెరికన్లు సైతం 4,774 అడుగులతో సగటు కంటె వెనుకబడే ఉన్నారు. మొత్తం 46 దేశాల్లోని 7 లక్షల మంది నడకపై ఈ పరిశోధనను నిర్వహించారు. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్లు, ఫిట్‌బిట్లుæ ఇతర సాధనాల ద్వారా రోజూ తామెంత శారీరకశ్రమ చేస్తున్నారో, ఎన్ని అడుగులు వేస్తున్నారో అంచనా వేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సమాచారం ఆధారంగానే ఈ అధ్యయనం చేశారు.. హాంగ్‌కాంగ్ ప్రజలు రోజుకు 6,880 అడుగులతో అగ్రస్థానంలో నిలవగా. చైనా, ఉక్రెయిన్, జపాన్‌లకు చెందిన వారు సగటున 6 వేలకు పైగానే అడుగులు వేస్తున్నట్లు వెల్లడైంది.
– సాక్షి నాలెడ్జ్ సెంటర్