వరదయ్యపాళెం: స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్‌మ్యాటిక్స్ (ఎస్‌టీఈఎం) విభాగానికి చెందిన 20 మంది అధ్యాపకులు, విద్యార్థులతో కూడిన ప్రతినిధుల బృందం శుక్రవారం శ్రీసిటీని సందర్శించింది. ప్రొఫెసర్ మైకేల్ కోచెండర్ ఫర్, పీహెచ్‌డీ స్కాలర్ డైలాన్ మిచెల్ ఆస్మార్ నేతృత్వంలోని ఈ బృందానికి శ్రీసిటీ ప్రెసిడెంట్ (ఆపరేషన్స్) సతీష్ కామత్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శ్రీసిటీ చైర్మన్ సి.శ్రీనిరాజు వర్చువల్ విధానంలో వారితో మాట్లాడారు. 1980లలో స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
వర్క్, లివ్, లెర్న్, ప్లే సూత్రం ఆధారంగా పచ్చదనం, పరిశుభ్రత, పారిశ్రామిక అనుకూల వాతావరణంలో శ్రీసిటీ ప్రగతి సాగుతోందని తెలిపారు. ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా సౌర విద్యుత్ ఉత్పత్తి, నీటి నిర్వహణ తదితర కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పారిశ్రామిక విస్తరణ, పర్యావరణ పరిరక్షణ మధ్య సమతుల్యతను కాపాడడంపై తాము ప్రత్యేక దృష్టి సారించామన్నారు. భారతదేశంలో మొట్టమొదటి కార్బన్ న్యూట్రల్ పారిశ్రామికవాడగా శ్రీసిటీ అవతరించాలన్నది తమ ఆకాంక్ష అన్నారు.
శ్రీసిటీలో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, రవాణా అనుసంధానం, ఇతర ప్రత్యేకతల గురించి సతీష్ కామత్ వివరించారు. పెప్సికో, క్యాడ్‌బరీస్, కోల్గేట్ పామోలివ్, వీఆర్‌వీ చాట్ ఇండస్ట్రీస్, బాల్ కార్పొరేషన్, కెల్లాగ్స్, వెస్ట్ ఫార్మాతో సహా 11 ప్రముఖ అమెరికన్ కంపెనీలతో పాటు ప్రపంచంలోని 28 దేశాలకు చెందిన 210 పరిశ్రమలు శ్రీసిటీలో ఏర్పాటైనట్లు తెలిపారు. శ్రీసిటీ అభివృద్ధి పట్ల స్టాన్‌ఫోర్డ్ బృందం సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు. శ్రీసిటీ మోడల్, ఇక్కడ అమలు చేస్తున్న సుస్థిరత కార్యక్రమాలను నేరుగా వీక్షించి అర్థం చేసుకోవడమే తమ పర్యటన ముఖ్య ఉద్దేశంగా వారు తెలిపారు. అనంతరం శ్రీసిటీలోని క్రియా విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment