బాండ్లతో జనానికి బ్యాండ్‌ | Amravati bonds violations at every step | Sakshi
Sakshi News home page

బాండ్లతో జనానికి బ్యాండ్‌

Published Fri, Sep 21 2018 3:32 AM | Last Updated on Fri, Sep 21 2018 4:10 AM

Amravati bonds violations at every step - Sakshi

‘‘చూశారా! ఎంత స్పందనో? అమరావతి బ్రాండ్‌ ఇమేజ్‌ను, చంద్రబాబు నాయకత్వాన్ని చూసి పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు పోటీలు పడ్డారు. అందుకే అరగంటలోనే మేం కావాలనుకున్న మొత్తం కంటే ఎక్కువ పెట్టుబడులొచ్చాయి?’’ రూ.2,000 కోట్ల విలువైన అమరావతి బాండ్లను లిస్ట్‌ చేసినప్పుడు ఏపీ ప్రభుత్వం చెప్పిన మాటలివి.  సరే! బాబు నాయకత్వాన్ని, అమరావతి ఇమేజ్‌ని చూసి పెట్టుబడులు పెట్టినపుడు మీరు అరేంజర్‌కు (రన్నింగ్‌ లీడ్‌ మేనేజర్‌) 0.9 శాతం.. అంటే రూ.18 కోట్లు ఎందుకిచ్చారు? జీహెచ్‌ఎంసీ వంటి సంస్థలు తమ బాండ్ల అరేంజర్‌కు ఫీజుగా 0.10 శాతమే ఇచ్చాయి కదా? మీరు కూడా అలా చేస్తే ఓ 2 కోట్లతో పోయేది కదా?...

ఈ ప్రశ్న అడిగిన వారికి బాబు ఇచ్చే సమాధానమేంటో తెలుసా? ‘‘ఈ బాండ్లలో రిస్కు ఎక్కువ. అందుకే అంత ఫీజు చెల్లించాల్సి వచ్చింది’’ అని. అంటే తమ నాయకత్వాన్ని చూసి ఇన్వెస్టర్లు ఎగబడి వచ్చేశారని చెప్పేదీ వారే! రిస్కుంది కాబట్టి ఇన్వెస్టర్లు రారేమోనని భయపడి ఎక్కువ ఫీజులు చెల్లించామని చెప్పేదీ వారే!! ఈ రెండు పొంతన లేని సమాధానాలను పక్కనబెడితే అసలు ప్రశ్న ఒకటుంది. ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చే బాండ్లకు రిస్కుంటుందా? ఉంటే ఆ ప్రభుత్వం పనికిరాని డిఫాల్టరనేగా అర్థం? మరి అలాంటప్పుడు నాయ కత్వం గురించి బోడి గొప్పలెందుకు? అసలు వీళ్ల చర్యల్లోని మతలబులేంటి? తెరవెనుక ఏం జరిగింది? ‘సాక్షి’ పరిశోధనలో వెల్లడైన నిజాలు


సాక్షి, అమరావతి: అమరావతి కథల్లాగే... ఈ బాండ్ల కథలూ అన్నీ ఇన్నీ కావు. ఇంతా చేస్తే ఈ బాండ్లలో ఏకంగా 95 శాతాన్ని కొన్నది ముగ్గురు ఇన్వెస్టర్లే! అందులో ఒక్క ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ సంస్థే ఏకంగా రూ.1,300 కోట్లు పెట్టి 62.5 శాతాన్ని కొనుగోలు చేసింది. అమెరికాకు చెందిన ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌కు చంద్రబాబు ప్రభుత్వం విశాఖపట్నంలోని మధురవాడలో రూ.400 కోట్ల విలువైన 40 ఎకరాలను ఎకరా రూ.32 లక్షలకే కట్టబెట్టింది. పైపెచ్చు మిగతా సంస్థలన్నిటికీ భూములను 33 ఏళ్ల లీజుకిస్తూ... ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌కు మాత్రం ఏకమొత్తంగా విక్రయించేసింది.

అది చాలదన్నట్లు మిగతా వారెవ్వరూ ఇవ్వనంత వడ్డీని ఆఫర్‌ చేస్తూ ప్రభుత్వ బాండ్లనూ జారీ చేసింది. నిజానికి అమెరికాలోని కాలిఫోర్నియాలో ఈ సంస్థ ప్రధాన కార్యాలయం 10 ఎకరాలకు మించి లేదు. దీనికి ప్రపంచవ్యాప్తంగా 9,400 మంది ఉద్యోగులుండగా, సింహభాగం అమెరికాలోనే ఉన్నారు.అలాంటిది అక్కడే పదెకరాల్లో విస్తరించిన ఆ సంస్థకు... విశాఖపట్నంలో 2,500 ఉద్యోగాలిస్తామని చెప్పేసరికి ఏకంగా 40 ఎకరాలు కారుచౌకగా కట్టబెట్టేయడం గమనార్హం. విశాఖలో పదెకరాలకు మించి భూమి కేటాయించొద్దంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్‌ చేసిన సూచనలను బాబు ప్రభుత్వం పక్కనబెట్టేసింది.

ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ సంస్థకు ప్రస్తుతం ఇండియా మొత్తమ్మీద 600 మంది మాత్రమే ఉద్యోగులున్నారు. అలాంటి ఒక్క విశాఖలో 2,500 ఉద్యోగాలివ్వడానికి ఎన్నాళ్లు పడుతుందో తేలిగ్గానే ఊహించుకోవచ్చు.వడ్డీ రేట్ల విషయానికొస్తే అమెరికాలో 4 శాతం మించి లేవు. ఇండియాలో ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ సంస్థ ఇన్వెస్ట్‌ చేసిన బాండ్లపై 7–9 శాతానికి మించి వడ్డీ రావడం లేదు. అలాంటిది బాబు ప్రభుత్వం మూడు నెలలకోసారి 10.32 శాతం చెల్లించేలా బాండ్లను జారీ చేసింది. వార్షికంగా చూస్తే ఈ వడ్డీ ఏకంగా 10.78 శాతం కావడం గమనార్హం. ఇలా అత్యధిక వడ్డీనిచ్చే బాండ్లను, కారుచౌకగా భూములను ఆ కంపెనీకే ఎందుకిచ్చారనేది ఊహలకు అందనిదేమీ కాదు.

సలహాదారు నుంచి ఇన్వెస్టరుగా...
అమరావతి బాండ్లలో పెట్టుబడి పెట్టిన మరో సంస్థ ఏకే క్యాపిటల్‌. మొదట బాండ్ల ఇష్యూకు సలహాదారుగా వ్యవహరించిన ఈ సంస్థ... తరవాత లీడ్‌ మేనేజర్‌గా(అరేంజర్‌) రూపాంతరం చెందింది. అంటే బాండ్లలో ఇన్వెస్ట్‌ చేయడానికి ఇన్వెస్టర్లను తీసుకొచ్చే పని దీనిదన్న మాట. చివరకు ఈ సంస్థ కూడా ఇన్వెస్టరుగా మారిపోయి ఏకంగా 25 శాతం... అంటే రూ.250 కోట్ల మేర పెట్టుబడి పెట్టడం గమనార్హం. ప్రభుత్వం జారీ చేసే బాండ్లలో అరేంజర్‌గా ఉన్న సంస్థ పెట్టుబడి పెట్టకూడదన్నది సెబీ (సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్చేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా) నిబంధన. కానీ.. ఏకే క్యాపిటల్‌ దీన్ని తుంగలో తొక్కిందని, దీనిపై సెబీకి ఫిర్యాదు చేస్తానని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ చెప్పారు.

ఎలక్ట్రానిక్‌ ప్లాట్‌ఫామ్‌ అందుబాటులో ఉన్నా...
నిజానికి అరేంజర్ల పాత్ర తగ్గించడానికి, బాండ్లు జారీ చేసే సంస్థలకు ఖర్చులు తగ్గడానికి ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ‘సెబీ’ ఎలక్ట్రానిక్‌ ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తెచ్చింది. రూ.200 కోట్లకు పైబడి బాండ్లు జారీ చేసే సంస్థలన్నీ ఈ ప్లాట్‌ఫామ్‌ను ఆశ్రయించవచ్చు. అరేంజర్‌ ప్రమేయం లేకుండా నేరుగా ఈ ప్లాట్‌ఫామ్‌ ద్వారా బాండ్లలో ఇన్వెస్ట్‌ చేయొచ్చు. చిన్న, అనామక సంస్థలకు ఇబ్బందిగా ఉన్నా... పేరున్న సంస్థలకిది బాగా కలిసి వస్తోంది.

మరి తన బ్రాండ్‌ ఇమేజ్‌ గురించి ప్రపంచమంతా డప్పు కొట్టే చంద్రబాబు అనామకుడు కాదు కదా! మామూలు కంపెనీలకంటే ఏపీ ప్రభుత్వం మెరుగైనదే కదా? పైగా అందరికంటే ఎక్కువ వడ్డీ ఇస్తున్నందుకు ఇన్వెస్టర్లు క్యూ కట్టి వస్తారు. కానీ, తెలిసిన సంస్థను అరేంజర్‌గా ఎంచుకుని, దానికి భారీ ఫీజులిచ్చి... కావాల్సిన వారు మాత్రమే పెట్టుబడులు పెట్టేలా చేయటం వెనక బాబు పన్నిన కుట్రను సులభంగా అర్థం చేసుకోవచ్చు.

అబద్ధాలతో అక్రమాలను కప్పెట్టేయత్నం
అమరావతి బాండ్లను పారదర్శకంగా జారీ చేస్తున్నామని, పబ్లిక్‌ ఇష్యూ తర్వాత ఈ వివరాలు స్టాక్‌ ఎక్ఛేంజీలో లభిస్తాయని ప్రభుత్వం చేసిన ప్రకటనల్లో వీసమెత్తు వాస్తవం లేదు. బాండ్లను పబ్లిక్‌ ఇష్యూగా కాకుండా ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌ విధానంలో జారీ చేశారు. దీంతో ఈ బాండ్లలో ఇన్వెస్ట్‌ చేసిన వారి వివరాలు సాధారణ ప్రజలకు తెలియవు. ఇన్వెస్టర్ల వివరాలు చెప్పాలని ఒత్తిడి రావడంతో రాష్ట్ర  ప్రణాళికా సంఘం బోర్డు వైస్‌ చైర్మన్‌ చెరుకూరి కుటుంబరావు మాట్లాడుతూ.. 59 మంది పెట్టుబడి పెట్టారంటూ ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్, బిర్లా, ఏకే క్యాపిటల్‌ గ్రూపుల పేర్లు మాత్రమే వెల్లడించారు. నిజానికి ఈ మూడు సంస్థలే వివిధ పథకాల పేర్లతో 95 శాతం పెట్టుబడి పెటినట్లు ‘సాక్షి’ పరిశోధనలో వెల్లడైంది.

జీవోనూ ఉల్లంఘించారు
‘హడ్కో’ లాంటి సంస్థల నుంచి రుణాలు తీసుకుంటే వడ్డీరేటు 8 శాతం లోపు, అదే ఇన్‌ఫ్రా బాండ్‌ హోదా అయితే వడ్డీరేటు 6 శాతంలోపు ఉంటేనే ప్రభుత్వ గ్యారంటీ ఇవ్వాలని ప్రభుత్వ జీవోలో స్పష్టం చేశారు. అదే బాండ్ల రూపంలో నిధులు సేకరిస్తే వడ్డీరేటు వాణిజ్య బ్యాంకుల టర్మ్‌ రుణాల కంటే తక్కువ ఉంటేనే ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వాలి. ప్రస్తుతం ఎస్‌బీఐ బేస్‌రేట్‌ 8.95 శాతం. కానీ, 10.32 శాతానికి అమరావతి బాండ్లను జారీ చేస్తూ కూడా ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వడం జీవో నిబంధనలకు విరుద్ధమని సాక్షాత్తూ ఆర్థిక శాఖ అధికారులే చెబుతున్నారు.  


దీని మర్మమేంటి బాబూ!
అమరావతి బాండ్లలో ఆదిత్య బిర్లా గ్రూపునకు చెందిన సంస్థలు 12.5 శాతం పెట్టుబడి పెట్టాయి. సాధారణంగా ఆదిత్య బిర్లా గ్రూపు పెట్టుబడులను అనుమానించాల్సిన అవసరం లేదు. కాకపోతే ఒకే డైరెక్టర్‌ అటు ఏకే క్యాపిట్‌లో, ఇటు ఆదిత్య బిర్లా గ్రూపులో ఉండటంతో సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఏకే క్యాపిటల్‌లో డైరెక్టర్‌గా ఉన్న సుభాష్‌చంద్ర భార్గవ.. ఏబీ నువో, ఏబీ క్యాపిటల్, ఏబీ సన్‌లైఫ్‌ పెన్షన్, ఏబీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్, ఏబీ మై యూనివర్స్‌ లిమిటెడ్‌లో కూడా డైరెక్టర్‌. ఈ డైరెక్టర్‌కు, ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న వ్యక్తికి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు పలువురు స్టాక్‌ బ్రోకర్లు చెబుతున్నారు. వీటిని పరిశీలిస్తే బాండ్ల జారీకి సలహాదారుగా ఏకే క్యాపిటల్‌ సంస్థను తెరపైకి తీసుకురావడం దగ్గర్నుంచి చివరి వరకూ అంతా బాబు కనుసన్నల్లోనే, అనుకున్నట్టే జరిగినట్లు తెలుస్తోంది.

అంత భారీ ఫీజు ఎందుకు?
అరేంజర్‌గా వ్యవహరించే సంస్థకు చిన్న ఇష్యూల్లో అయితే కాస్త ఎక్కువగా... పెద్ద ఇష్యూల్లో కొంచెం ఎక్కువగా చెల్లిస్తారు. ఉదాహరణకు ఇటీవలే గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ) రూ.200 కోట్ల మేర బాండ్లు జారీ చేసింది. చిన్న ఇష్యూ కనుక ఫీజు ఎక్కువుండాలి. అయితే ఫీజు కింద జీహెచ్‌ఎంసీ రూ.20 లక్షలు అంటే 0.10 శాతం చెల్లించింది.

అమరావతి బాండ్ల సైజు రూ.2,000 కోట్లు.కాబట్టి ఇది ఇంకా తక్కువుండాలి. పోనీ 0.10 శాతం అనుకున్నా రూ.2 కోట్లు మాత్రమే చెల్లించాలి. కానీ బాబు సర్కారు ఏకే క్యాపిటల్‌కు ఏకంగా 0.9 శాతం... అంటే రూ.18 కోట్లు చెల్లించింది. గతంలో స్టాక్‌ బ్రోకర్‌గా పనిచేసి ఇప్పుడు ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న వ్యక్తికి ఏకే క్యాపిటల్‌తో ఉన్న సంబంధాల గురించి పలువురు చెప్పుకుంటున్నారు. ప్రభుత్వ తాజా చర్యలు దీన్ని ధ్రువీకరిస్తున్నాయి.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement