న్యూఢిల్లీ: ఫ్రాంక్లిన్ టెంపుల్‌టన్ మ్యూచువల్ ఫండ్ నిలిపివేసిన ఆరు మ్యూచువల్ ఫండ్ పథకాలకు సంబంధించి ఇన్వెస్టర్లకు రూ.27,000 కోట్లను చెల్లించింది. 2020 ఆరంభంలో కరోనా వైరస్ రాకతో మార్కెట్లలో తీవ్ర అస్థిరతలు పెరిగిపోవడం తెలిసిందే. దీంతో 2020 ఏప్రిల్ 23న ఆరు డెట్ ఆధారిత మ్యూచువల్ ఫండ్ పథకాలను నిలిపివేస్తూ ఫ్రాంక్లిన్ టెంపుల్‌టన్ మ్యూచువల్ ఫండ్ ఏకపక్ష నిర్ణయాన్ని తీసుకుంది.
ఇన్వెస్టర్ల నుంచి తీవ్ర అమ్మకాల ఒత్తిడి నెలకొనగా, అదే సమయంలో మార్కెట్లో డెట్ సెక్యూరిటీల అమ్మకాలకు కావాల్సినంత లిక్విడిటీ (కొనుగోలుదారులు) లేనట్టు అప్పుడు సంస్థ ప్రకటించింది. ఆరు పథకాలను నిలిపివేసే నాటికి వాటి పరిధిలోని పెట్టుబడుల విలువ రూ.25,125 కోట్ల మేర ఉండగా, దీంతో పోలిస్తే తాము ఇన్వెస్టర్లకు 107 శాతం మేర చెల్లించినట్టు ఫ్రాంక్లిన్ టెంపుల్‌టన్ మ్యూచువల్ ఫండ్ తాజాగా తెలిపింది.
ఫ్రాంక్లిన్ ఇండియా లో డ్యురేషన్ ఫండ్, ఫ్రాంక్లిన్ ఇండియా క్రెడిట్ రిస్క్ ఫండ్, ఫ్రాంక్లిన్ ఇండియా షార్ట్ టర్మ్ ఇన్‌కమ్ ప్లాన్, ఫ్రాంక్లిన్ ఇండియా అల్ట్రా షార్ట్ బాండ్ ఫండ్, ఫ్రాంక్లిన్ ఇండియా ఇన్‌కమ్ అపార్చునిటీస్ ఫండ్, ఫ్రాంక్లిన్ ఇండియా డైనమిక్ అక్రూయల్ ఫండ్ నిలిపివేసిన వాటిల్లో ఉన్నాయి. మరోవైపు ఫ్రాంక్లిన్ మ్యూచువల్ ఫండ్ తన ఫిక్స్‌డ్ ఇన్‌కమ్, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ వ్యాపారాలకు కొత్త నియామకాలను ప్రకటించింది. రాహుల్ గోస్వామి ఫ్రాంక్లిన్ టెంపుల్‌టన్ ఇండియా ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ విభాగానికి చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్, ఎండీగా వ్యవహరించనున్నారు. ఇప్పటి వరకు చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్‌గా ఉన్న సంతోష్ కామత్ ఇకపై ఫ్రాంక్లిన్ ఇండియా ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఇండియాకి ప్రెసిడెంట్, చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్‌గా పనిచేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment