డీఎం, ఆపై స్థాయి అధికారులకు త్వరలో ఖరారు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగుల వేతన సవరణ లెక్కలు తేలాయి. 2017 వేతన సవరణను అములు చేయాలని వారం క్రితం ప్రభుత్వం నిర్ణయించి 21 శాతం ఫిట్‌మెంట్‌ను ప్రకటించడం తెలిసిందే. 2018 నుంచి 16 శాతం ఇంటెరిమ్ రిలీఫ్ (ఐఆర్)ను కొనసాగిస్తున్నందున దాన్ని తొలగించి ఆ స్థానంలో కొత్త ఫిట్‌మెంట్‌ను చేర్చి ఏ ఉద్యోగికి ఎంత మేర వేతనాన్ని సవరించాలో తాజాగా అధికారులు లెక్కలు సిద్ధం చేశారు. డిపో మేనేజర్, ఆ పైస్థాయి అధికారులకు సంబంధించిన సవరణ లెక్కలను విడిగా ఖరారు చేయనున్నారు. డిపో మేనేజర్ స్థాయి కంటే తక్కువ హోదా ఉన్న ఉద్యోగుల లెక్కలను సిద్ధం చేసి శనివారం ఆయా డిపోలకు పంపారు.
కరువు భత్యంపై సందిగ్ధం..
ప్రస్తుతం ఆర్టీసీ ఉద్యోగులకు 82.6 శాతం కరువు భత్యం (డీఏ) అమలవుతోంది. ఇందులో 31.1 శాతం 2017 వేతన సవరణ గడువుకు పాతది. దీంతో తాజా వేతన సవరణలో ఈ 31.1 శాతాన్ని జోడించారు. 2017 వేతన సవరణ గడువు తర్వాత ఉద్యోగులకు వర్తింపజేసిన మిగతా 51.5 శాతం కరువు భత్యాన్ని మూల వేతనంలో కలిపే వీల్లేదు. దాన్ని ఎంత మేర వర్తింపజేయాలన్న విషయాన్ని ఇంకా ఖరారు చేయలేదు. ఆ వివరాలను తర్వాత వెల్లడించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
గ్రేడ్ పే కొనసాగింపు..
ప్రభుత్వ ఉద్యోగులకు లేని గ్రేడ్ పే వెసులుబాటు ఆర్టీసీలో అమలవుతోంది. ఆయా అధికారుల హోదాను బట్టి జీతం కాకుండా అదనంగా గ్రేడ్ పే పేరుతో కొంత మొత్తాన్ని ప్రతినెలా చెల్లిస్తారు. అది సూపర్‌వైజర్ స్థాయి అధికారుల నుంచి మొదలవుతుంది. ఆ దిగువ హోదాలో ఉండే కండక్టర్లు, డ్రైవర్లు, ఇతర ఉద్యోగులకు ఉండదు. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి రీత్యా ఈ విధానాన్ని తొలగించాలని గతంలో అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ దాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. తాజా వేతన సవరణ తర్వాత కూడా దాన్ని కొనసాగించాలని నిర్ణయించారు.
హెచ్‌ఆర్‌ఏ తగ్గింపుపై ఆందోళన..
వేతన సవరణతో జీతాలు పెరుగుతాయన్న ఆనందం ఉద్యోగుల్లో ఓవైపు ఉన్నప్పటికీ మరోవైపు ఇంటి అద్దె భత్యం తగ్గిపోనుండటంతో అంçతృప్తి వ్యక్తమవుతోంది. కేంద్ర ప్రభుత్వం పలు రకాల సూచీల ఆధారంగా ఇంటి అద్దె భత్యంలో మార్పులు చేసింది. దాన్ని అమలు చేయాల్సి రావడంతో మూడేళ్ల క్రితమే ప్రభుత్వ ఉద్యోగుల పే స్కేల్ సమయంలో అమలులోకి తెచ్చింది.
ఆర్టీసీలో వేతన సవరణ జరగకపోవటంతో అప్పటి నుంచి పాత హెచ్‌ఆర్‌ఏలే కొనసాగుతున్నాయి. తాజా వేతన సవరణ నేపథ్యంలో 2020 నుంచి హెచ్‌ఆర్‌ఏ తగ్గింపును అమలు చేయబోతున్నారు. దీంతో హైదరాబాద్‌లో ఉంటున్న ఉద్యోగులకు ఇక నుంచి 30 శాతం బదులు 24 శాతమే హెచ్‌ఆర్‌ఏ అందుతుంది. దీనిప్రభావంతో చిరుద్యోగుల జీతాల్లో దాదాపు రూ.4 వేల నుంచి రూ.6 వేల వరకు కోత పడబోతోంది. హెచ్‌ఆర్‌ఏ సీలింగ్ పరిమితిని రూ. 43 వేలకు పెంచారు. ఇది ఉన్నతాధికారులకు మేలు చేయనుండగా ఉద్యోగులకు పెద్దగా ఉపయోగపడదు.
Comments
Please login to add a commentAdd a comment