పీఆర్సీ అమలు గతేడాది నుంచే
హైదరాబాద్: పదవ వేతన సవరణ సంఘం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందోననే ఉద్యోగుల ఉత్కంఠకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెరదించింది. ఉద్యోగులకు పదవ వేతన సవరణ సంఘం సిఫార్సులు 2013-14 ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి వస్తున్నట్టు పేర్కొంది. 14వ ఆర్థిక సంఘానికి సమర్పించిన నివేదికలో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఉద్యోగుల డీఏ, మధ్యంతర భృతి(ఐఆర్), పీఆర్సీ అమలుతోనే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారీగా రెవెన్యూ వ్యయం పెరిగిందని నివేదికలో తెలియజేసింది.
2013-14 ఆర్థిక సంవత్సరంలో.. సీమాంధ్రకు సంబంధించి అయిన రెవెన్యూ వ్యయం రూ.50,734 కోట్లు కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ వ్యయం రూ.78,977 కోట్లకు పెరిగిందని నివేదికలో పేర్కొన్నారు. ఉద్యోగుల డీఏ, పీఆర్సీతోపాటు కార్యాలయ ఖర్చులు, అద్దెలు పెరగడమే ఇందుకు కారణమని ప్రభుత్వం పేర్కొంది. భారీ రెవెన్యూ వ్యయానికి కారణంగా ఈ దిగువ అంశాలను రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.
ఉద్యోగుల డీఏ, కార్యాలయ ఖర్చుల పెంపు, అద్దెలకు- రూ.8,117 కోట్లు
అనివార్య ఖర్చులను ప్రణాళికేతరానికి మార్చడం- రూ.6,065 కోట్లు
ఉద్యోగులకు మధ్యంతర భృతి మంజూరు ప్రభావం- రూ.2,569 కోట్లు
2013-14 నుంచి పీఆర్సీ అమలు కారణంగా- రూ.3,111 కోట్లు
మొత్తం- రూ.19,862 కోట్లు