pay revision scale
-
న్యూ ఇయర్ కానుకగా పీఆర్సీ!
సాక్షి, హైదరాబాద్: కొత్త సంవత్సరం కానుకగా ఉద్యోగుల వేతన సవరణ (పీఆర్సీ)పై సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఒకట్రెండు రోజుల్లో కీలక ప్రకటన చేసే అవకాశ ముంది. ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించిన ఫిట్మెంట్ శాతాన్ని ప్రకటించడంతో పాటు పీఆర్సీ కమిటీ గడువు పొడిగింపు విషయంలో సీఎం కేసీఆర్ నెలాఖరులోగా కీలక నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ మేరకు పీఆర్సీకి సంబంధించిన ఫైలు ఆదివారం ప్రగతిభవన్‌కు చేరిందని ముఖ్యమంత్రి సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. మరో 3 నెలలపాటు.. పీఆర్సీ కమిటీ గడువు డిసెంబర్ 31తో ముగియనుండగా, మరో మూడు నెలలపాటు పొడిగించాలని పీఆర్సీ చైర్మన్ సీఆర్ బిస్వాల్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గడువు పొడిగింపునకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రగతిభవన్‌కు చేరినట్టు తెలుస్తోంది. అయితే సీఎం నుంచి పిలుపు అందిన వెంటనే పీఆర్సీ నివేదికను సమర్పించడానికి సీఆర్ బిస్వాల్ కమిటీ సిద్ధమై ఉంది. ఉద్యోగులకు సంబంధించిన కొత్త సర్వీసు నిబంధనల రూపకల్పనపై మరో నివేదిక సమర్పించాల్సి ఉండటంతో మరో మూడు నెలలపాటు గడువు పీఆర్సీ కమిటీ పొడిగించవచ్చని తెలుస్తోంది. గడువు పొడిగింపు ఉత్తర్వులు రాక ముందే సీఎం కేసీఆర్ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశమై ఫిట్మెంట్ శాతాన్ని ఖరారు చేయనున్నారని, ఆ వెంటనే పీఆర్సీ అమలుపై కీలక ప్రకటన చేస్తారని తెలుస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం 2021–22 ప్రారంభం (వచ్చే ఏప్రిల్ 1) నుంచి పెరగనున్న వేతనాలను పంపిణీ చేసే అవకాశాలున్నాయి. పీఆర్సీ బకాయిల చెల్లింపులపై సైతం సీఎం కేసీఆర్ ముఖ్య ప్రకటన చేస్తారని తెలుస్తోంది. 2018 మేలో పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేయగా, ఇప్పటికే నాలుగు పర్యాయాలు గడువు పొడిగించారు. చివరిసారిగా గత ఫిబ్రవరి 18న ప్రభుత్వం గడువు పొడిగించింది. మళ్లీ గడువు పొడిగిస్తే ఉద్యోగ వర్గాల నుంచి అసంతృప్తి వ్యక్తమయ్యే అవకాశాలుండడంతో ఈసారి కచ్చితంగా పీఆర్సీ ప్రకటిస్తారని అధికార వర్గాల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆలస్యం చేస్తే అడ్డంకిగా ‘కోడ్’.. వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు, రెండు పట్టభద్రుల మండలి స్థానాలకు ఎన్నికలు, ఆ తర్వాత వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల రూపంలో ఎన్నికల కోడ్ అడ్డురానుంది. మార్చి వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉండనుండటంతో ఏప్రిల్ 1 నుంచి పీఆర్సీ అమలుకు ఆటంకం ఏర్పడనుంది. దీంతో ఈ ఏడాది చివరిలోపే పీఆర్సీ అమలుపై సీఎం నిర్ణయం ప్రకటించే అవకాశాలున్నాయని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి. -
పీఆర్సీ అమలు గతేడాది నుంచే
హైదరాబాద్: పదవ వేతన సవరణ సంఘం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందోననే ఉద్యోగుల ఉత్కంఠకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెరదించింది. ఉద్యోగులకు పదవ వేతన సవరణ సంఘం సిఫార్సులు 2013-14 ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి వస్తున్నట్టు పేర్కొంది. 14వ ఆర్థిక సంఘానికి సమర్పించిన నివేదికలో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఉద్యోగుల డీఏ, మధ్యంతర భృతి(ఐఆర్), పీఆర్సీ అమలుతోనే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారీగా రెవెన్యూ వ్యయం పెరిగిందని నివేదికలో తెలియజేసింది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో.. సీమాంధ్రకు సంబంధించి అయిన రెవెన్యూ వ్యయం రూ.50,734 కోట్లు కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ వ్యయం రూ.78,977 కోట్లకు పెరిగిందని నివేదికలో పేర్కొన్నారు. ఉద్యోగుల డీఏ, పీఆర్సీతోపాటు కార్యాలయ ఖర్చులు, అద్దెలు పెరగడమే ఇందుకు కారణమని ప్రభుత్వం పేర్కొంది. భారీ రెవెన్యూ వ్యయానికి కారణంగా ఈ దిగువ అంశాలను రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఉద్యోగుల డీఏ, కార్యాలయ ఖర్చుల పెంపు, అద్దెలకు- రూ.8,117 కోట్లు అనివార్య ఖర్చులను ప్రణాళికేతరానికి మార్చడం- రూ.6,065 కోట్లు ఉద్యోగులకు మధ్యంతర భృతి మంజూరు ప్రభావం- రూ.2,569 కోట్లు 2013-14 నుంచి పీఆర్సీ అమలు కారణంగా- రూ.3,111 కోట్లు మొత్తం- రూ.19,862 కోట్లు