సాక్షి, న్యూఢిల్లీ : ఐఎన్‌ఎక్స్ మీడియా మనీల్యాండరింగ్ కేసులో సీనియర్ కాంగ్రెస్ నేత పీ చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరానికి ఢిల్లీ హైకోర్టు శుక్రవారం మధ్యంతర ఊరట కల్పించింది. ఈడీ అరెస్ట్ చేయకుండా ఆయనకు ఊరట ఇచ్చింది. మరోవైపు కార్తీ చిదంబరం దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి సునీల్ రాణా నేడు విచారించనున్నారు. అవినీతి కేసులో కార్తీని ఢిల్లీ కోర్టులో హాజరుపరిచిన సీబీఐ మరో ఆరు రోజులు కస్టడీని కోరింది. మూడు రోజుల పాటు కార్తీ కస్టడీకి కోర్టు అనుమతించిన గడువు నేటితో ముగిసింది. ఇదే కేసులో ఈడీ అరెస్ట్ చేసిన కార్తీ సీఏ ఎస్ భాస్కరరామన్ జ్యుడిషియల్ కస్టడీని కోర్టు ఈనెల 22 వరకూ పొడిగించింది.
కాగా ఫిబ్రవరి 28న చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో కార్తీ చిదంబరంను సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఐఎన్‌ఎక్స్ కేసులో సీబీఐ చెబుతున్నట్టు తాను సాక్ష్యాలను ఎన్నడూ ప్రభావితం చేయలేదని, డాక్యుమెంటరీ ఆధారాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించలేదని బెయిల్ పిటిషన్‌లో కార్తీ పేర్కొన్నారు.రాజకీయంగా తన తండ్రి ప్రతిష్టను దెబ్బతీసేందుకే తనపై కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తన తండ్రి పీ చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో ఐఎన్‌ఎక్స్ మీడియాలో విదేశీ పెట్టుబడులకు ఆమోదం లభించేలా వ్యవహరించినందుకు కార్తీ చిదంబరంకు భారీగా ముడుపులు ముట్టాయని దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ ఆరోపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment