ఐఆర్ 27 శాతం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతి (ఇంటెరిమ్ రిలీఫ్-ఐఆర్) ఎట్టకేలకు ఖరారరుు్యంది. 27 శాతం ఐఆర్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన గురువారం ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల్లో ఈ మేరకు అంగీకారం కుదిరింది. దీంతో ప్రభుత్వ ఖజానాపై ఏటా రూ. 7,681 కోట్ల భారం పడనుంది. 45-50 శాతం ఐఆర్ కోసం ఉద్యోగ సంఘాలు తొలినుంచీ డిమాండ్ చేస్తూ వచ్చారుు. బుధవారం ఆర్థికమంత్రి వద్ద జరిగిన చర్చల్లో 32 శాతం కంటే తక్కువకు అంగీకరించే ప్రశ్నే లేదని తేల్చి చెప్పాయి. 22% ఇస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రతిపాదించింది.
ఈ నేపథ్యంలో గురువారం సీఎం వద్ద జరిగిన చర్చల్లో చివరకు 27% ఐఆర్‌కు ఉద్యోగ సంఘాలు, ప్రభుత్వం మధ్య అంగీకారం కుదిరింది. 27 శాతానికి మించి ఇవ్వలేమని సర్కారు తేల్చి చెప్పడంతో.. ఉద్యోగ సంఘాలు కూడా అంగీకరించాయి. 2014 జనవరి నుంచి ఐఆర్ వర్తింపజేయనున్నారు. ఫిబ్రవరిలో అందుకొనే జనవరి జీతంలో ఈ మధ్యంతర భృతిని కలపనున్నారు. 2013 జూలై 1 నుంచి పదో పీఆర్సీ అమలు కావాల్సి ఉంది. అప్పటి నుంచే ఐఆర్ అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు చేసిన డిమాండ్‌ను ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పటివరకు రెండున్నర పీఆర్సీల కాలాన్ని (12 సంవత్సరాలు) ఉద్యోగులు కోల్పోయారని, పదో పీఆర్సీ అమల్లో జాప్యం వల్ల మరోసారి అర్ధ సంవత్సరాన్ని కోల్పోవాల్సి వస్తోందని ఉద్యోగ సంఘాలు పేర్కొన్నప్పటికీ ఫలితం లేకపోయింది.
రూ.7,681 కోట్ల భారం: సీఎం
ఐఆర్ 27 శాతం ఇవ్వడం వల్ల రాష్ట్ర ఖాజానాపై ఏటా రూ.7,681 కోట్ల భారం పడుతుందని సీఎం తెలిపారు. చర్చల అనంతరం మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, పితాని సత్యనారాయణ, పార్థసారథి, ఎమ్మెల్యే జగ్గారెడ్డితో కలిసి క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూడు నెలలకు దీనివల్ల రూ.1,920 కోట్ల భారం పడుతుందన్నారు. 9.5 లక్షల మంది ఉద్యోగులు, 5.5 లక్షల మంది పెన్షనర్లకు ఐఆర్ వల్ల లబ్ధి చేకూరుతుందని చెప్పారు. హెల్త్‌కార్డుల పథకంలో లోపాలు సవరించడానికి చర్యలు తీసుకోనున్నామని, త్వరలో స్టీరింగ్ కమిటీ కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ఉద్యోగుల విషయాలపై తప్ప మిగతా అంశాలకు సంబంధించి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి ఆయన నిరాకరించారు. తనకు కేటాయించిన వాణిజ్య పన్నుల శాఖ స్వీకరించబోనని శ్రీధర్‌బాబు ప్రకటించిన విషయాన్ని గుర్తు చేయగా.. పత్రికా కథనాలపై స్పందించనని సీఎం సమాధానం ఇచ్చారు. శాసనసభ ఎలా జరుగుతుందో రేపు (శుక్రవారం) చూడండి అని మరో ప్రశ్నకు జవాబిచ్చారు. టీ బిల్లు టేబుల్ అయిందా? అని అడిగిన ప్రశ్నకు.. ‘టీ టైం అయింది’ అంటూ ముఖ్యమంత్రి విలేకరుల సమావేశాన్ని ముగించారు. చర్చల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఠక్కర్, ముఖ్య కార్యదర్శి పి.వి.రమేష్, ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి, టీఎన్జీవో సంఘం అధ్యక్షుడు దేవీప్రసాద్, ప్రధాన కార్యదర్శి రవీందర్‌రెడ్డి, ఎస్టీయూ ప్రధాన కార్యదర్శి కత్తి నరసింహారెడ్డి, పీఆర్టీయూ అధ్యక్షుడు వెంకటరెడ్డి, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసగౌడ్, యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి ఐ.వెంకటేశ్వరరావు, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ, సచివాలయ తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నరేందర్‌రావు, సీమాంధ్ర గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు కృష్ణయ్య, డైవర్ల సంఘం అధ్యక్షుడు అప్పారావు తదితరులు పాల్గొన్నారు. 27% ఐఆర్‌పై ఉద్యోగ సంఘాలు హర్షం ప్రకటించాయి.
10న ‘ఆర్టీసీ ఆర్జిత సెలవుల’ వేతనం చెల్లింపు
ఆర్టీసీ కార్మికులు ఆర్జిత సెలవులను ఎన్‌క్యాష్ చేసుకోడానికి యాజమాన్యం అవకాశం కల్పించింది. 2011కి సంబంధించిన ఆర్జిత సెలవులకు ఈ నెల 10న నగదు చెల్లించాలని గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులపై కార్మిక సంఘం ఎన్‌ఎంయూ హర్షం వ్యక్తం చేసింది.
ఐఆర్‌పై ఉద్యోగ సంఘాల హర్షం
ఐఆర్ 27 శాతం ఇవ్వడం సంతోషమే. వెంటనే పదో పీఆర్సీని అమలు చేయడానికి చర్యలు చేపట్టాలి. 6 నెలల బకాయిలు రాకపోవడం అసంతృప్తి కలిగించింది.
- ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి
ఐఆర్‌పై హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఆకాశాన్నంటుతున్న ధరలను తట్టుకోవడానికి ఐఆర్ సరిపోదు. వెంటనే పీఆర్సీ అమలు చేసి వేతనాలు సవరించాలి.
- టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్, ప్రధాన కార్యదర్శి రవీందర్‌రెడ్డి
ఐఆర్ ప్రకటించి చేతులు దులిపేసుకుంటే సరిపోదు. పీఆర్సీ అమలుకైనా చొరవ తీసుకోవాలి. కనీసం 55 శాతం ఫిట్‌మెంట్ వచ్చే విధంగా చర్యలు చేపట్టాలి.
- వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ నేతలు ఓబుళపతి, జాలిరెడ్డి, రమణారెడ్డి, రియాజ్ హుస్సేన్, అశోక్‌రెడ్డి, రామసుబ్బారావు, ప్రకాశ్.
ఐఆర్ కొంత ఊరట కలిగిస్తుంది కానీ పూర్తిగా పరిష్కారం లభించదు. పదో పీఆర్సీ 2013 జూలై నుంచి అమలయ్యే విధంగా తక్షణం చర్యలు తీసుకోవాలి.
- తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సి.విఠల్
ఐఆర్ 27 శాతం ప్రకటించినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు. పదో పీఆర్సీ నివేదిక తెప్పించుకొని ఫిబ్రవరి నుంచి అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలి.
- పీఆర్టీయూ అధ్యక్షుడు వెంకటరెడ్డి, ప్రధాన కార్యదర్శి సరోత్తంరెడ్డి
పీఆర్సీ కూడా సకాలంలో అమలు చేస్తే పూర్తి సంతోషం.
- తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసగౌడ్, ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు
ఫిబ్రవరి నెలాఖరులోగా పదో పీఆర్సీని అమలు చేయాలి. 2013 జూలై నుంచి ఐఆర్ అమలు చేసి ఉంటే ఉద్యోగులకు మరింత ప్రయోజనం కలిగేది.
- ఎస్టీయూ అధ్యక్షుడు భుజంగరావు, ప్రధాన కార్యదర్శి కత్తి నరసింహారెడ్డి
2013 జూలై నుంచి ఐఆర్ వర్తింపజేయకపోవడం తీవ్ర అసంతృప్తిని కలిగించింది. కనీసం రెండు నెలల బకారుులైనా చెల్లిస్తే బాగుండేది.
- యూటీఎఫ్ అధ్యక్షుడు నర్సిరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఐ.వెంకటేశ్వరరావు
ఐఆర్ ప్రకటనతో సరిపెట్టకుండా వెంటనే పీఆర్సీ అమలు కోసం చర్యలు చేపట్టాలి.
- మార్కెటింగ్ శాఖ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ కె.రాజశేఖరరెడ్డి
ఐఆర్‌పై హర్షం వ్యక్తం చేస్తున్నాం.
- మున్సిపల్ ఉద్యోగుల జేఏసీ నేతలు వర్మ, కృష్ణమోహన్