![Hyderabad GHMC Standing committee election 2025 scenario](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/GHMC-Satnding-Committee.jpg.webp?itok=Prl9cqX0)
వలలు విసురుతున్న పార్టీలు
బల్దియా స్టాండింగ్ కమిటీ
ఎన్నికల తరుణంలో కీలక పరిణామాలు
సాక్షి, హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లు పార్టీలు మారనున్నారా? అంటే కాదనలేమనే సమాధానమే వస్తోంది. జీహెచ్‌ఎంసీ (GHMC) స్టాండింగ్ కమిటీ ఎన్నికకు నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో జీహెచ్‌ఎంసీలో ప్రస్తుతమిది చర్చనీయాంశంగా మారింది. స్టాండింగ్ కమిటీలో ఉన్న 15 స్థానాలూ ఇప్పటి వరకు బీఆర్‌ఎస్–ఎంఐఎం పొత్తులో భాగంగా ఆ రెండు పార్టీలకే ఏకగ్రీవమవుతూ వచ్చాయి. స్టాండింగ్ కమిటీ ఎన్నికలో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారు స్టాండింగ్ కమిటీ (standing committee) సభ్యులవుతారు. ఏడాది కాలపరిమితి గల స్టాండింగ్ కమిటీకి గత సంవత్సరం వరకు బీఆర్‌ఎస్–ఎంఐఎం పొత్తు బంధం కొనసాగింది. రెండు పార్టీలూ కలిస్తే.. పోటీలో దిగినా లాభం లేదనే తలంపుతో మిగతా పార్టీల నుంచి ఎవరూ పోటీ చేయలేదు. పొత్తులో భాగంగా ఎంఐఎం తమకు లభించే ఏడు స్థానాల కోసం అధిష్ఠానం ఎవరి పేర్లయితే ఎంపిక చేస్తుందో వారే నామినేషన్లు వేసేవారు. బీఆర్‌ఎస్ (BRS Party) నుంచి సైతం ఉపసంహరణ నాటికి దాని వాటా మేరకు ఎనిమిదిమంది మిగిలేవారు.
జంపింగ్ సమయం..
రాష్ట్రంలో ప్రభుత్వ మార్పిడి, రాజకీయ పరిణామాలతో కొందరు ఎమ్మెల్యేలతోపాటు పలువురు కార్పొరేటర్లు ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరారు. దాంతో మూడు స్థానాల నుంచి కాంగ్రెస్ బలం 24కు పెరగడం తెలిసిందే. ప్రస్తుతం ఎంఐఎం.. కాంగ్రెస్‌తో కలిసి నడుస్తున్నందున ఈసారి అవి రెండూ కలిసి పోటీచేసే అవకాశం ఉన్నప్పటికీ, ఏక్షణం ఎలాంటి మార్పులైనా జరగవచ్చుననే తలంపుతో ఇతర పార్టీల నుంచి సైతం నామినేషన్లు వేసేందుకు పలువురు సిద్ధమవుతున్నారు.
మరోవైపు, తమ పార్టీకి ఎక్కువ మంది సభ్యులుంటే స్టాండింగ్ కమిటీలో ప్రభావం చూపవచ్చుననే తలంపుతో బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న 146 మంది కార్పొరేటర్లలో బీఆర్‌ఎస్‌కు అత్యధికంగా 42 మంది కార్పొరేటర్లున్నారు. ఆతర్వాత వరుసగా ఎంఐఎంకు 41 మంది, బీజేపీకి 39 మంది, కాంగ్రెస్‌కు 24 మంది సభ్యులున్నారు. ఈ నేపథ్యంలో ఏపార్టీ పొత్తు పెట్టుకోకుండా ఉంటే బీఆర్‌ఎస్ నెగ్గుతుంది. కానీ, అది సాధ్యం కాదని పలువురు కార్పొరేటర్లు చెబుతున్నారు.
మేయర్ పీఠంపై దృష్టితో..
మరోవైపు, బల్దియాలో తమ బలం పెంచుకొని వచ్చే సంవత్సరం జరగబోయే పాలకమండలి ఎన్నికల్లో మేయర్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు ఇప్పటి నుంచే బలాన్ని పెంచుకునే చర్యల్లో భాగంగా ఇతర పార్టీల వారిని చేర్చుకునేందుకు ఇదే సరైన సమయమని మూడు పార్టీలూ భావిస్తున్నందున కూడా ప్రస్తుతం పార్టీ మార్పిడులు జరిగేందుకు అవకాశాలున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆపార్టీలో చేరిన వారి సంఖ్య 24కు పెరిగినప్పటికీ, చేరేవారు ఇంకా ఉన్నారని చెబుతున్నారు. గత సంవత్సరం ఆగిపోయిన చేరికలను కాంగ్రెస్ తిరిగి ప్రారంభించవచ్చునని భావిస్తున్నారు. కార్పొరేటర్లకు మిగిలిన ఏడాది పదవీ కాలంలో ఎక్కువ నిధులు పొందేందుకు, తద్వారా ఎక్కువ పనులు చేసి వచ్చే ఎన్నికల్లో నెగ్గేందుకు ఆపార్టీలో చేరేందుకు మొగ్గు చూపుతున్న వారు ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ దీన్ని తనకు అనుకూలంగా మలచుకోవాలని భావిస్తోంది.
చదవండి: ప్రతాప సింగారంలో హెచ్‌ఎండీఏ భారీ వెంచర్
బీజేపీ సైతం కేంద్రంలో తమ పార్టీ అధికారంలో ఉండటంతోపాటు తాజాగా ఢిల్లీ ఎన్నికల్లోనూ గెలుపు జెండా ఎగురవేయడాన్ని ప్రస్తావిస్తూ, ఇతర పార్టీల వారిని తమ పార్టీలో చేర్చుకోవాలనే వ్యూహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఎక్కువమందిని చేర్చుకోవడం ద్వారా వచ్చే ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు బీజేపీ ఇప్పటి నుంచే పావులు కదపనుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఇందుకు స్టాండింగ్ కమిటీ ఎన్నిక తగిన సమయమని చెబుతున్నారు. కొందరు పార్టీలో చేరినంత మాత్రాన ఏ పార్టీ కూడా సొంతబలంతోనే అన్ని స్థానాలూ గెలవలేదని, అందుకు వివిధ కారణాలున్నాయని కొందరు కార్పొరేటర్లే చెబుతున్నారు. ఏవైనా రెండు పార్టీలు కలిస్తేనే 15 స్థానాలు లభిస్తాయంటున్నారు. అయినప్పటికీ తమ పార్టీకి ఎక్కువ బలం కోసం మూడు పార్టీలు ఎలాంటి కార్యాచరణ అమలు చేయనున్నాయో వేచి చూడాల్సిందే!
మొదటి రోజు నామినేషన్లు నిల్..
స్టాండింగ్ కమిటీకి నామినేషన్ల తొలిరోజైన సోమవారం ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. ఇద్దరు సభ్యులు నామినేషన్ పత్రాలు తీసుకెళ్లారు. నామినేషన్ల దాఖలుకు 17వ తేదీ వరకు గడువుంది. ఈలోగా ఎవరు ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తారో, ఎవరు ఎవరితో కలుస్తారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. కేవలం స్టాండింగ్ కమిటీ కోసం ఇతర పార్టీలతో పొత్తు అవసరం లేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి బీజేపీ కార్పొరేటర్లకు సూచించినట్లు సమాచారం. పోటీ చేయాలనుకుంటే బీజేపీ కార్పొరేటర్లు పోటీ చేయవచ్చునని అన్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment