GHMC standing committee
-
బీజేపీ కార్పొరేటర్ల నిరసన.. జీహెచ్ఎంసీ మీటింగ్ రసాభాస!
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ మీటింగ్ అసంపూర్తిగానే ముగిసింది. ఇష్టానుసారం స్టాండింగ్ కమిటీలో నిర్ణయాలు తీసుకోవడంపై బీజేపీ కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేయడంతో గందరగోళం నెలకొంది. దీంతో, బడ్జెట్ ప్రతిపాదనలు సవరించి డిసెంబర్ 9 తర్వాత మరోసారి స్టాండింగ్ కమిటీ సమావేశం కానుంది.జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ మీటింగ్ అసంపూర్తిగా ముగిసింది. సమావేశంలో ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్ ప్రతిపాదనలపై స్టాండింగ్ కమిటీ సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వాస్తవాలకు దూరంగా బడ్జెట్ గణాంకాలు ఉన్నాయరని కార్పొరేటర్ల విమర్శలు చేశారు. వివిధ శాఖలకు కేటాయింపులు సరిగా లేవని స్టాండింగ్ కమిటీ సభ్యులు మండిపడ్డారు. దీంతో, చేసేదేమీ లేక.. బడ్జెట్ ప్రతిపాదనలు సవరించి డిసెంబర్ 9 తర్వాత మరోసారి స్టాండింగ్ కమిటీ సమావేశం కావాలని నిర్ణయించారు. ఇక, స్టాండింగ్ కమిటీ సమావేశం ప్రారంభంలోనే బీజేపీ కార్పొరేటర్లు అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు. ఇష్టానుసారం స్టాండింగ్ కమిటీలో నిర్ణయాలు తీసుకోవడంపై కాషాయ పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రతీ డివిజన్లో విజిట్ చేసి సమస్యలపై చర్యలు చేపడతామని మేయర్ గద్వాల విజయలక్ష్మి హామీ ఇవ్వడంతో బీజేనీ కార్పొరేటర్లు నిరసన విరమించుకున్నారు. అంతకుముందు.. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కలిసి బల్దియాను లూటీ చేస్తున్నారంటూ బీజేపీ కార్పొరేటర్లు నినాదాలు చేశారు. -
ఊహించిందే జరిగింది; ఎన్నిక లేదు.. ఏకగ్రీవమే!
సాక్షి, హైదరాబాద్: ఊహించినట్లే జరిగింది. అధికార టీఆర్ఎస్.. దాని మిత్రపక్ష ఎంఐఎం ఒప్పందంలో భాగంగా రెండు పార్టీల నుంచి 15 మంది జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యులు ఎన్నికయ్యారు. మొత్తం 15 మంది స్టాండింగ్ కమిటీ సభ్యులకు టీఆర్ఎస్ నుంచి 11 మంది, ఎంఐఎం నుంచి ఏడుగురు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల ఉపంహరణలకు చివరిరోజైన సోమవారం టీఆర్ఎస్ నుంచి ముగ్గు రు ఉపసంహరించుకోవడంతో, పోటీలో మిగిలిన 15 మంది ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ ప్రకటించారు. ► జీహెచ్ఎంసీలో 47 మంది కార్పొరేటర్లతో బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పటికీ, టీఆర్ఎస్– ఎంఐఎంలకు కలిపి ఉమ్మడిగా వంద మంది కార్పొరేటర్లు ఉండటంతో, ఎలాగూ గెలవలేమని తెలిసి బీజేపీ బరిలోనే దిగలేదు. ► గత పాలకమండలిలో సైతం టీఆర్ఎస్– ఎంఐఎంల పొత్తు ఒప్పందానికనుగుణంగా మొత్తం 15 మంది స్టాండింగ్ కమిటీ సభ్యులు ఆ రెండు పార్టీల వారే ఉన్నారు. ► అప్పట్లో టీఆర్ఎస్ కార్పొరేటర్లు 99 మంది, ఎంఐఎం కార్పొరేటర్లు 44 మంది ఉండటంతో టీఆర్ఎస్నుంచి 9 మందికి, ఎంఐఎం నుంచి ఆరుగురికి స్టాండింగ్ కమిటీలో స్థానం కల్పించా రు. ఈసారి టీఆర్ఎస్ బలం 56 మాత్రమే ఉండటంతో, ఒకడుగు వెనక్కు తగ్గి ఎనిమిది మంది స్టాండింగ్ కమిటీ సభ్యులతో సరిపెట్టుకుంది. ► ఆ మేరకు ఎంఐఎంకు ఒక స్థానం అదనంగా లభించింది. ఎంఐఎంకు గత పాలకమండలిలో, ఇప్పుడు కూడా 44 మంది కార్పొరేటర్ల బలం ఉండటం విశేషం. ఒప్పందానికనుగుణంగా టీఆర్ఎస్ నుంచి 8 మంది,ఎంఐఎంనుంచి ఏడుగురు స్టాండింగ్ కమిటీ సభ్యులయ్యారు. ► ఊహించినట్లుగానే పార్టీ పెద్దలు నచ్చజెప్పడంతో టీఆర్ఎస్ నుంచి నామినేషన్లు వేసిన వారిలో జగదీశ్వర్‌గౌడ్, రాగం నాగేందర్ యాదవ్, వనం సంగీతయాదవ్లు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. స్టాండింగ్ కమిటీ ఏం చేస్తుంది? ► స్టాండింగ్ కమిటీ సభ్యులుగా వీరి పదవీకాలం ఒక సంవత్సరం. ► జీహెచ్ఎంసీలో రూ. 2 కోట్ల నుంచి రూ. 3 కోట్ల మేర విలువైన పనులకు స్టాండింగ్ కమిటీ ఆమోదం తప్పనిసరి. ► సాధారణంగా స్టాండింగ్ కమిటీ వారానికోసారి సమావేశమవుతుంది. అందుకు వారంలో ఏదో ఒక రోజును ఎంపిక చేసుకోవడం ఆనవాయితీ. గత పాలకమండలిలో ప్రతి గురువారం నిర్వహించేవారు. ► కొత్త స్టాండింగ్ కమిటీ సభ్యులు ఎన్నికైనప్పటికీ, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో దాదాపు నెలరోజుల పాటు వీరు ఏ పనులకూ ఆమోదం తెలిపేందుకు అవకాశం ఉండదని సంబంధిత అధికారి తెలిపారు. -
20న జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. ఈ నెల 20వ తేదీన కార్పొరేటర్లలో 15 మందిని స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఎన్నుకోనున్నారు. ఈమేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు. నవంబర్ 2వ తేదీన అధికారికంగా ఎన్నికల నోటీసు వెలువరిస్తారు. నవంబర్ 3 నుంచి 11వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ప్రభుత్వ సెలవుదినాలైన 4వ తేదీ, 7వ తేదీన మాత్రం నామినేషన్ల స్వీకరణ ఉండదు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం మూడో అంతస్తులోని అడిషనల్ కమిషనర్(ఎన్నికలు) కార్యాలయంలో నామినేషన్ పత్రాలు స్వీకరిస్తారు. ఎన్ని నామినేషన్లు దాఖలైంది 11వ తేదీ మధ్యాహ్నం 3 గంటల తర్వాత ప్రకటిస్తారు. 12వ తేదీ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కమిషనర్ నామినేషన్లు స్క్రూటినీ చేస్తారు. (చదవండి: 36 ఏళ్ల తర్వాత ఆమెను, ఆ కుటుంబాన్ని.. ఫేస్బుక్ కలిపింది!) అర్హత కలిగిన నామినేషన్ల వివరాలు అదే రోజు ప్రకటిస్తారు. ఉపసంహరణకు 15వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు గడువుంది. పోటీలో మిగిలిన అభ్యర్థుల వివరాలు అదేరోజు ప్రకటిస్తారు. నవంబర్ 20వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. కమిషనర్ కార్యాలయంలో పోలింగ్ జరుగుతుంది. అదేరోజు పోలింగ్ ముగిశాక 3 గంటల తర్వాత ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు. (Huzurabad ByElection: రౌండ్ల వారీగా హుజూరాబాద్ బైపోల్ ఫలితాలు) -
అయ్యో.. ఐఫోన్ అందకపాయె..!
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుల ఆపిల్ ఐఫోన్ ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లింది. ఐఫోన్ కొనుగోళ్లపై స్టాండింగ్ కమిటీ నిర్ణయాన్ని నిరవధికంగా నిలిపివేసినట్లు మునిసిపల్ పరిపాలనశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్‌కుమార్ ట్విట్టర్ ద్వారా స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ కమిషనర్‌తో మాట్లాడి స్టాండింగ్ కమిటీ నిర్ణయాన్ని నిలిపివేసినట్లు పేర్కొన్నారు. జీహెచ్ంఎసీ స్టాండింగ్ కమిటీ సభ్యులు 15 మందితోపాటు మేయర్, డిప్యూటీ మేయర్లకు, ముగ్గురు అధికారులకు కూడా ఐఫోన్లు (12 ప్రోమాక్స్ మోడల్–512 జీబీ డేటా) కానుకగా అందజేసేందుకు గురువారం జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇది నగరంలోని వివిధ వర్గాల్లో చర్చనీయాంశంగా మారడంతో, ప్రభుత్వం శుక్రవారం ఈనిర్ణయం తీసుకుంది. చదవండి: గూగుల్, ఫేస్‌బుక్‌లతో ఆదాయం పంచుకోవాలి గతంలో జీహెచ్ఎంసీ బడ్జెట్ ఆమోదం పొందిన సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతియేటా స్టాండింగ్ కమిటీ సభ్యులకు ల్యాప్‌టాప్‌లు/ట్యాబ్‌లు తదితరమైనవి బహుమతులుగా అందజేయడం ఆనవాయితీగా ఉండేదని పేర్కొంటూ అదే తరహాలో రాబోయే ఆర్థిక సంవత్సరానికి (2020–21) బడ్జెట్ ఆమోదం పొందిన సందర్భంగా స్టాండింగ్ కమిటీ సభ్యులు, మేయర్, డిప్యూటీ మేయర్లకు అందజేసేందుకు స్టాండింగ్ కమిటీలో ఆమోదం తెలిపారు. దాంతో పాటు మేయర్ ఐదేళ్ల పదవీకాలం విజయవంతంగా పూర్తయిన సందర్భంగా మేయర్ కార్యాలయంలోని ముగ్గురు సీనియర్ అధికారులకు కూడా ఈ ఫోన్లు అందజేసేందుకు ఆమోదం తెలిపారు. ఈ అంశం నగరంలో చర్చనీయాంశంగా మారడంతో కొనుగోళ్ల నిర్ణయాన్ని నిలిపివేశారు. ఈ ఐఫోన్ల విలువ ఒక్కొక్కటి దాదాపు రూ. 1.60 లక్షలు వంతున మొత్తం 20 ఫోన్లకయ్యే వ్యయం దాదాపు రూ. 32 లక్షలు. కార్పొరేటర్లకు కానుకలపై గతంలో ఒకసారి హైకోర్టులో పిల్ దాఖలు కావడంతో అప్పట్లో ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడం తెలిసిందే. చదవండి: ఐటీకి తెలంగాణ బంగారు గని -
బల్దియా బడ్జెట్ రూ. 5,600 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాబోయే ఆర్థిక సంవత్సరానికి (2021–22) సంబంధించి గత నెలలో రూ. 5600 కోట్లతో ప్రవేశపెట్టిన ముసాయిదా బడ్జెట్‌ను జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎలాంటి మార్పుచేర్పుల్లేకుండా యథాతథంగా ఆమోదించింది. ఈ మేరకు జీహెచ్ఎంసీకి వచ్చే ఆదాయంలో అత్యధికంగా 32 శాతం ఆస్తిపన్ను ద్వారా రూ. 1850 కోట్లు వస్తుందని అంచనా. మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన గురువారం జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో ముసాయిదా బడ్జెట్‌ను ఆమోదించారు. వీటిలో కొన్ని ముఖ్యాంశాలను కమిటీ ప్రస్తావించింది. బల్దియా ముసాయిదా బడ్జెట్‌ను స్టాండింగ్ కమిటీ ఆమోదించిన నేపథ్యంలో ప్రధాన అంశాలు ఇలా ఉన్నాయి. ⇔ నాగోల్‌లోని ఫతుల్లాగూడలో 6.20 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్న శ్మశానవాటికల్లో హిందూ, ముస్లిం, క్రిస్టియన్లకు రెండెకరాల చొప్పున శ్మశానవాటికలు. హిందువులకు విద్యుత్ దహనవాటిక. ⇔ జీహెచ్ఎంసీ అధికారుకు పోస్ట్ పెయిడ్ 4జీ జీఎస్ఎం వాయిస్ అండ్ డేటా సిమ్‌లు. ⇔ కాప్రా సర్కిల్లో మూడు వరద కాల్వల నిర్మాణానికి రూ.3.60 కోట్లతో టెండర్లు ⇔ మూడు ప్రాపర్టీ టాక్స్ ఇండెక్స్ నంబర్ల రద్దు. ⇔ వివిధ మార్గాల్లో రహదారుల విస్తరణకు ఆస్తుల సేకరణ ⇔ మొత్తం 18 అంశాలను ఆమోదించినట్లు పేర్కొన్న జీహెచ్ఎంసీ కొన్నింటిని మాత్రం అధికారికంగా వెల్లడించలేదు. ఆపిల్‌పై చావని ఆశ! జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యులకు కానుకలపై ఆశ చావలేదట్లుంది. మరో రెండు నెలల్లోగా కార్పొరేటర్ల పదవీ కాలమే ముగిసిపోనున్న తరుణంలో ఆపిల్ ఐఫోన్లను మళ్లీ తెరపైకి తెచ్చారు. 15 మంది స్టాండింగ్ కమిటీ సభ్యులతోపాటు మేయర్, డిప్యూటీ మేయర్ సహా మొత్తం 17 ఆపిల్ ఐఫోన్ల (ప్రో మాక్స్–512జీబీ) కొనుగోలుకు రూ. 27,23,740 ఖర్చు చేసేందుకు స్టాండింగ్ కమిటీ ఎజెండాలో ఉంచారు. ఆమోద ముద్ర కూడా వేసినప్పటికీ.. అబ్బే ఆమోదం పొందలేదు. ప్రస్తుతం ఫోన్లు మార్కెట్లో అందుబాటులో లేనందున వాయిదా వేశారనే ప్రచారం చేశారు. కానీ విశ్వసనీయ సమాచారం మేరకు ఆమోదం పొందినట్లే. ⇔ 22 శాతం నిధులు రూ. 1224.51 కోట్లు రుణాల ద్వారా తీసుకోనున్నారు. 17 శాతం నిధులు రూ. 1022.70 కోట్లు ఫీజులు, యూజర్ చార్జీల కింద రానున్నాయి ⇔ 14 శాతం నిధులు రూ. 770.51 కోట్లు ప్లాన్ గ్రాంట్ల కింద రానున్నాయి ⇔ 13 శాతం నిధులు రూ. 652.10 కోట్లు అసైన్డ్ రెవెన్యూ కింద రానున్నాయి ⇔ 3 శాతం నిధులు రూ. 189.69 కోట్లు క్రమబద్ధీకరణ ఫీజుల కింద లభించనున్నాయి ⇔ ఒక శాతం నిధులు రూ. 66.20 కోట్లు ఇతర రెవెన్యూ మార్గాల ద్వారా లభించనున్నాయి ⇔ రూ. 22.84 కోట్లు కాంట్రిబూషన్ ద్వారా అందుతాయని అంచనా -
జీహెచ్ఎంసీ బడ్జెట్ రూ.5,643 కోట్లు
- ఆమోదించిన స్టాండింగ్ కమిటీ - డబుల్ బెడ్రూం ఇళ్లకు రూ.400 కోట్లు సాక్షి, హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరం 2017-18కి సంబంధించి రూ.5,643 కోట్ల బడ్జెట్‌కు జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. శుక్రవారం మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన జరిగిన కమిటీ సమావేశంలో విస్తృత చర్చల అనంతరం ముసాయిదా బడ్జెట్‌ను యథాతథంగా ఆమోదిస్తూ, జనరల్బాడీకి పంపించాలని తీర్మానించారు. అనంతరం ప్రభుత్వ ఆమోదం లాంఛనప్రాయమే. ఈసారి ఆదాయం, ఖర్చుల అమలు తీరెలా ఉన్నప్పటికీ భారీ బడ్జెట్‌ను ఆమోదించారు. ప్రస్తుతం నడుస్తున్న ఈ ఆర్థిక సంవత్సర బడ్జెట్ సైతం రూ.5,600 కోట్లతో భారీగా ఉన్నప్పటికీ ఇంతవరకు ఇందులో రూ.1,500 కోట్లు కూడా ఖర్చు చేయలేకపోయారు. ఈ ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం నుంచి రావాల్సిన గ్రాంట్లు తదితరమైనవి రాకున్నా వచ్చే ఆర్థిక సంవత్సరానికి సైతం భారీగానే ప్రతిపాదించారు. వాటి ని బడ్జెట్లో ఉంచడం సాంకేతిక అంశమని, అవి ఎలాగూ రావాల్సిన నిధులేనని, తప్పనిసరిగా వస్తాయని మేయర్ తెలిపారు. రాబోయే బడ్జెట్లోని రెవెన్యూ ఆదాయంలో అత్యధిక భాగం 29 శాతం రూ.1,611.45కోట్లు నగరంలో అధ్వాన్నంగా ఉన్న రోడ్లకు కేటారుుంచారు. రూ.400కోట్లు పేదల డబుల్ బెడ్రూం ఇళ్లకు, డ్రైనేజీలకి రూ.249.8 కోట్లు కేటారుుంచారు. ఆస్తిపన్ను తదితర ట్యాక్సుల ద్వారా ఆదాయం పెంచుకునేందుకు అన్ని మార్గాలనూ వినియోగించుకుంటామని కమిషనర్ జనార్దన్‌రెడ్డి చెప్పారు. -
స్టాండింగ్ కమిటీ తీర్మానం చట్ట విరుద్ధం
తేల్చి చెప్పిన హైకోర్టు ధర్మాసనం సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కార్పొరేటర్లకు ఐపాడ్లు, పత్రికా ప్రతినిధులకు శామ్సంగ్ ట్యాబ్‌లు ఇవ్వాలన్న జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ తీర్మానం చట్ట విరుద్ధమని హైకోర్టు తేల్చి చెప్పింది. చట్ట విరుద్ధమైన ఈ తీర్మానం విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. రూ.72.42 లక్షల వ్యయంతో 150 మంది కార్పొరేటర్లకు, 40 మంది పత్రికా ప్రతినిధులకు ఐపాడ్లు, ట్యాబ్లెట్ల పంపిణీ నిమిత్తం స్టాండింగ్ కమిటీ తీర్మానం చేసిందని, ఈ పంపిణీని అడ్డుకుని, ఈ మొత్తాన్ని పేదల సంక్షేమం కోసం వ్యయం చేసేలా జీహెచ్ఎంసీని ఆదేశించాలంటూ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు మీర్ మహ్మద్ అలీ అలియాస్ ఖలీద్ హైకోర్టులో ఇటీవల ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై వాదనలు విన్న ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చింది. ఈ తీర్మానం విషయంలో రెండు నెలల్లోపు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.